- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గోదావరి లోయలో అపూర్వ రాతి చిత్రాలు..
ఆదివాసీలకు లిపి లేదు అని ఈ దేశంలో నానుడి. కానీ భాషా శాస్త్రవేత్తలు, చరిత్రకారులు వీటిని వెలికి తీసి వీటిపై సూక్ష్మ స్థాయి పరిశోధనలు జరిపితే ఈ దేశం లో రాతి చిత్రాలకు కూడా ఒక భాష ఉంది దాని నుండే సింధు నాగరికత లిపి ఆవిర్భావం చెందింది అని అర్థం అవుతుంది. ఆ మూల భాష కోయ గోండు భాష అనేది కూడా స్పష్టం అవుతుంది.
భారతదేశ నైసర్గిక స్వరూపంలో దక్కన్ పీఠభూమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉత్తరాన ఉన్న హిమాలయ పీఠభూమి మొదలు మధ్య భాగంలో మాల్వా పీఠభూమి, తూర్పున చోట నాగపూర్ పీఠభూమి కంటే ఎక్కువగా ప్రాచీన యుగం, మధ్య శిలాయుగం ఆనవాళ్లు దక్కన్ పీఠభూమిలో చూడవచ్చు. ఈ పీఠభూమిలో అతి ముఖ్యమైన మూల బిందువు గోదావరి నది, దీని పరీవాహక ప్రాంతంలో దట్టమైన అడవులు కొండలలో అనేక చారిత్రక ఆనవాళ్లు, పురావస్తు కట్టడాలు, ఆదిమానవులు నివసించిన కొండ గుహలు అవశేషాలను తన గర్భంలో దాచుకుంది. అందులో ప్రధానంగా భవిష్యత్ తరాలకు నాటి జీవన విధానాన్ని తెలియచేయడానికి చేసిన తొలి ప్రయత్నంలో భాగంగా ఆకు పసర్లతో ముదురు ఎరుపు రంగు, లేత పసుపు రంగు, తెలుపు రంగుతో, ఇసుక రాయి గుణం కలిగిన రాతి చిత్రాలను మనం చూడవచ్చు. అటువంటి అనేక చారిత్రక మూలాలను ఈ తెలంగాణ గడ్డపై అన్వేషణలో భాగంగా సమ్మక్క సారలమ్మ ఆర్కియాలజీ ఇండిజినస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ బృందం ఇటీవల కాలంలో క్షేత్ర పరిశోధన చేసి కొత్తగా కనుగొన్న రాక్ షెల్టర్ల వివరాలను ఈ వ్యాసంలో వివరిస్తాను.
శిలాయుగం నాటి రాతి చిత్రాలు..
1600 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఏటూరు నాగరం వన్యప్రాణి పులుల సంరక్షణ కేంద్రంలోని, ములుగు జిల్లా తాడ్వాయి మండలం బంధాల కోయ గ్రామం పక్కన అటవీ ప్రాంతంలో దామర్ల గుట్ట పై మధ్య శిలాయుగం నాటి రాతి చిత్రాల సైటును 12 మంది సభ్యులు గల పరిశోధన బృందం ఛేదించింది. కొన్ని వేల సంవత్సరాల నాటి రాక్ షెల్టర్‌లను బయటికి తీసి 7 గంటల పాటు అధ్యయనం జరిపాం. అందులో ప్రధానంగా ఇది పూర్వం కోయ ఆదివాసీలు వేసిన లిపిగా నిర్ధారించాం. ఇందులో మొత్తం 3 రాక్ షెల్టర్‌లను గుర్తించాం. అందులో మొదటి షెల్టర్‌లో 12 రాతి చిత్రాలు ఉన్నవి. ఈ రాక్ 20 మీటర్ల పొడవు, 15 మీటర్ల నిలువు ఎత్తులో ఉంది. ఇందులో కోయ సమాజంలోని 5వ గొట్టు నుదిటి బొట్టు లిపి త్రిశూలం, అఖండ భారతదేశం 18 దిక్కులను చూపించే సింబల్, ఆదివాసీ సమాజ గొట్లను తెలియచేసే చేతి గుర్తులు గుర్తించడం జరిగింది. రెండవ షెల్టర్లో 5 నాగుపాముల పడగ ఇచ్చిన బొమ్మ ఉంది దీనిని శివ నాగులమ్మగా గుర్తించటం జరిగింది. మూడవ షెల్టర్ 16 మీటర్ల పొడవు 6 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. ఇందులో ఉన్న లిపిలో కోయ సమాజంలోని మూడవ గొట్టు వంశంలో కాక అడమ రాజు కళ్లకు గంతలు కట్టుకొని, పగిడిద్దరాజు సమ్మక్కల కూతురు సార లమ్మని పెళ్లి చేసుకోవడం కోసం పెట్టిన స్వయం వరంలో బాణంతో కాకిని కొట్టిన సందర్భం తెలుపుతుంది. ఇందులో బాణం బొమ్మ స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే బొమ్మ సింధు నాగరికత లిపి మొహంజోదారో 413లో స్పష్టంగా కనిపిస్తుంది.
ప్రాచీన నిలువు, అడ్డగీతల్లో చరిత్ర
ఆదివాసీలు పూర్వం నూనెలను తయారు చేయడానికి ఉపయోగించిన గానుగ మొద్దు సింబల్ కనిపిస్తుంది. ఇది ఒక నిలువు గీతకు ఇరు వైపులా పైన క్రింద రెండు గీతలు ఉన్నాయి. ఒక తల్లికి నలుగురు కొడుకులను తెలియజేసే బండిగిరికలో నాలుగు గీతలు స్పష్టంగా ఉన్నవి. నిలువు గీతలు మూడు మూడవ గొట్టు సింబల్‌ను తెలియచేస్తాయి. ఒక నిలువు గీతపై అడ్డ గీత దానిపై మళ్లీ నాలుగు నిలువు గీతలు నాల్గవ గొట్టు నీ తెలియజేస్తాయి. తల భాగంపై నెమలి పించం వలె ఉన్న బొమ్మ నృత్య సందర్భాన్ని తెలుపుతుంది. ఒక బొమ్మలో నెలవంక గుర్తు ఆరవ గొట్టు బేరం బోయిన వంశంలో బంధం ఇంటి పేరు గల వాడు బంధం వేస్కొని నివాసం ఉన్న సందర్భం తెలుపుతుంది. ఇవి ముదురు ఎరుపు రంగులో ఇసుకరాయి గుణం కలిగిన ఏటవాలుగా ఉన్న నిలువు బండలపై అధిక వర్షాలు నమోదు అయిన జల్లు పడని ప్రాంతంలో వేయటం జరిగింది.
రంగులు మార్చుకునే బొమ్మలు..
ఈ చిత్రాలకు ఇంకొక ప్రత్యేకత ఉంది. ఈ బొమ్మలు ప్రతి రోహిణి కార్తె కాలంలో భూమి లోపల భాగం అయి ఉన్న ఈ బండరాయి 10 గజాలు మెత్త పడుతుంది. ఈ సమయంలో బొమ్మలు తన రంగును మార్చుకుంటాయి అంటే కోయ పూర్వీకులు ప్రకృతి అనుసంధానంగా ఈ లిపి నిర్మాణం చేశారు అని అర్థం, ప్రకృతిపై ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు అనడానికి సంకేతం ఇది. అందుకే ఇసుక రాయి గుణం కలిగిన ఈ రాతిపై అకు పసర్లతో బొమ్మలు వేయడం మూలంగా మే నెలలో వచ్చే రుతుపవనాలు ముందు భూగర్భ జలం భూమి పైకి వచ్చే క్రమంలో ఈ రాయి ఆ జలాన్ని పీల్చుకొని తన పై ఉన్న బొమ్మలకు నీటిని అందిస్తుంది. అప్పుడు ఆ బొమ్మలు మెరుస్తాయి అలా వర్షాలు అధికంగా కురుస్తాయి అనే అంచనా వేస్తారు. ఒకవేళ భూగర్భ జలం తక్కువగా ఆ రాయికి అందితే ఆ బొమ్మలు తక్కువగా కనిపిస్తాయి. అప్పుడు వర్షాలు తక్కువ పడుతాయని ప్రకృతినీ అంచనా వేసిన శాస్త్రీయ జ్ఞానం నాటి అదివాసీలది. పైగా ఈ బొమ్మలు ప్రతి ఏడాది ప్రస్తుతం ఉన్న బండ పొర ఊడిపోయి మళ్లీ కొత్తగా బండ పొరపై వాటంతట అవే ముదురు ఎరుపు రంగులో బొమ్మలు వస్తాయి. ఇలా ప్రతి ఏడాది మారటం జరుగుతుంది. దీన్ని బట్టి స్థానిక ఆదివాసీలు ఈ బొమ్మల మార్పుని నిర్ధారించుకొని ప్రకృతినీ, కాలాన్ని అంచనా వేసి మెట్ట పంటలు లేదా వర్షాధార పంటలు వేయాలనేది నిర్ధారణ అయి పంటలు వేసుకుంటారు.
బొమ్మలు కాదు.. పూర్వ లిపి ఆనవాళ్లు
ఇటువంటి రాతి చిత్రాలు భారతదేశంలో అత్యధికంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భీమ్ బెట్కా కొండ గృహాల్లో చూడవచ్చు వాటిని పురవాస్తు శాఖ కూడా అనేక కోణాల్లో అధ్యయనం చేసింది. వాటిని తొలి అదిమానవులు వారి వేట జీవనం తెలుపటానికి వేసిన ప్రాధాన్యత లేని బొమ్మలుగా కొట్టి వేస్తున్నారు. కానీ వింధ్య సాత్పురా పర్వతాల నుండి గోదావరి లోయ గుండా బాదామి కొండ గృహాలు కర్ణాటక, తమిళనాడు వరకు వందలాది సైట్‌లు దక్షిణ భారత దేశంలో విస్తరించి ఉన్నాయి. కానీ అవి అర్థం లేని బొమ్మలు కాదు. ఆ రాతి చిత్రాలలో పూర్వ లిపి ఉంది ఈ దేశ మూల చరిత్ర ఉంది అనేది గుర్తించాలి.
- కాక నవ్య
ఎం.ఏ ఆర్కియాలజీ
93922 83453