- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గాడి తప్పిన నియంత్రణ
రాష్ట్రంలో కరోనా కట్టడి విషయంలో వైద్యారోగ్య శాఖ నియంత్రణ కోల్పోయింది. తొలి వేవ్‌లో జాతీయ స్థాయితో పోలిస్తే తెలంగాణలో మెరుగైన ఫలితాలు ఉన్నట్లు ప్రభుత్వం గొప్పగా ప్రకటించుకుంది. సెకండ్ వేవ్‌లో మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది. నిస్సహాయంగా మిగిలిపోయింది. పాజిటివ్ కేసులు పెరిగాయి. మృతుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ప్రజల కష్టాలు, ఆర్తనాదాలు ప్రభుత్వం చెవికెక్కడంలేదు. ప్రజలకు భరోసా కల్పించలేకపోయింది. 'ఛస్తే చావండి' అనే తీరులో నిమ్మకు నీరెత్తినట్లుగానే ఉంది. కరోనా టెస్టుల మొదలు ట్రేసింగ్, ట్రీట్‌మెంట్, కంటైన్‌మెంట్, ఆక్సిజన్, రెమిడెసివిర్, చివరకు వ్యాక్సిన్ దాకా ఎక్కడా ప్రభుత్వానికి సరైన నియంత్రణ లేకుండా పోయింది. జీవోలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది. వాటి అమలును గాలికొదిలేసింది. కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులలో జరుగుతున్న దోపిడీని పట్టించుకోలేదు. ఏ వార్డులో ట్రీట్‌మెంట్‌కు ఎంత వసూలు చేయాలో జీవో జారీ చేసినా అది కాగితాలకే పరిమితమైంది. బాధితులు స్వయంగా మంత్రులకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా మొరపెట్టుకున్నా ఫలితం లేదు. ప్రజారోగ్య వ్యవస్థపై ప్రభుత్వం పట్టు కోల్పోయింది. జరుగుతున్న లోపాలకు జవాబుదారీతనం లేదు. ఆక్సిజన్, రెమిడెసివిర్, టోసిలిజుమాబ్ లాంటివి బ్లాక్ మార్కెట్‌లో విచ్చలవిడిగా ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నా దాన్ని నివారించలేకపోతోంది.
ప్రకటనలకు, ఆచరణకు పొంతనలేదు
ప్రజలను ఎప్పటికప్పుడు గైడ్ చేయాల్సిన వైద్యారోగ్య శాఖ ఆ బాధ్యత నుంచి తప్పుకుంది. ప్రకటనలకు, కార్యాచరణకు పొంతన లేదు. ప్రజలను గందరగోళంలోకి నెట్టింది. రాష్ట్రంలో అందరికీ ఉచిత వ్యాక్సిన్ అని ముఖ్యమంత్రే స్వయంగా చెప్పారు. ఇప్పుడు ప్రైవేటు ఆస్పత్రులు వ్యాక్సిన్‌ను నేరుగా సంస్థల నుంచి కొనుగోలు చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు. ప్రాథమిక స్థాయిలోనే టెస్టులు చేయడం ద్వారా ట్రేసింగ్ చేసి ప్రైమరీ, సెకండరీ వ్యక్తులను గుర్తించాలని చెప్పారు. ఇప్పుడు 'టెస్టులే అవసరం లేదు.. లక్షణాలు బైటపడిన రెండు రోజులకు కూడా తగ్గకపోతే అప్పుడు టెస్టు చేయించుకుంటే చాలు'అంటున్నారు. పాజిటివ్ వచ్చినవారిలో దాదాపు 90 శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేవని చెప్తోంది. లక్షణాలేవీ లేకపోతే టెస్టులే చేయొద్దని సిబ్బందికి సర్క్యులర్ జారీ చేసింది. మే ఒకటి నుంచి 18-44 ఏజ్ గ్రూపువారికి వ్యాక్సిన్ ఇవ్వడంపైనా స్పష్టత లేదు. ఇప్పటికీ అది అమలులోకి రాలేదు. వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా థర్డ్ వేవ్‌ను నివారించవచ్చని అధికారులు చెబుతున్నారు. వ్యాక్సిన్ తగినంత నిల్వ లేక ఆ ప్రక్రియను నిలిపివేశారు. టీకా తీసుకోవాలనుకునేవారు 'కొవిన్'పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సిందేనని ప్రభుత్వం చెప్పింది. సాంకేతిక పరిజ్ఞానం లేనివారికి స్పాట్ రిజిస్ట్రేషన్ ద్వారా వైద్య సిబ్బంది టీకాలు ఇస్తారని చెప్పింది. తాజాగా స్పాట్ రిజిస్ట్రేషన్లు ఉండవని, వెబ్‌సైట్‌లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాత్రమే టీకాలు ఇవ్వడం సాధ్యమవుతుందని ప్రకటించింది. ఇప్పటికీ టీకాల విషయంలో ప్రభుత్వ విధానంపై స్పష్టత లేదు.
కంట్రోల్‌లో లేని 'కార్పొరేట్' వ్యవస్థ
కార్పొరేట్ ఆస్పత్రులపై ప్రభుత్వానికి పూర్తిగా నియంత్రణ కరువైంది. ఏ ఆస్పత్రి ఎన్ని రెమెడెసివిర్ ఇంజెక్షన్లను సమకూర్చుకుంటోంది? ఎంత మంది పేషెంట్లకు ఇస్తోంది? ఎంత చార్జీ వసూలు చేస్తోంది? ఎన్ని టీకాలను ఇస్తోంది? నేరుగా తయారీ కంపెనీల నుంచి ఎంత సమకూర్చుకుంటోంది? ఎంతకు అమ్ముకుంటోంది? ఇలాంటి అనేక అంశాలలో ప్రభుత్వం దగ్గర లెక్కలూ లేవు. తనిఖీ మెకానిజం అంతకన్నా లేదు. ఫిర్యాదులకు తగినట్లు చర్యలూ లేవు. నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తున్న ఆరోపణలపై కనీస పరిశీలన లేదు. మంత్రిగా ఉన్న సమయంలో ఈటల రాజేందర్ సైతం తన ఆవేదనను వ్యక్తం చేశారు తప్ప చర్యలు తీసుకోలేకపోయారు. కరోనా నిర్ధారణ పరీక్ష మొదలు ట్రీట్‌మెంట్, ఇంజెక్షన్లు, టీకాల వరకు విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉంది. హైకోర్టు ఉత్తర్వులను స్వయంగా ఉల్లంఘిస్తున్న ప్రభుత్వం కార్పొరేట్ ఆస్పత్రులతో అమలు చేయించడంలేదు. ఎన్ని బెడ్‌లు ఖాళీగా ఉన్నాయో డిస్‌ప్లే బోర్డుల వ్యవస్థ అమలుకావడంలేదు. ఏ ట్రీట్‌మెంట్‌కు ఎంత ఖర్చవుతుందో పట్టిక ప్రదర్శించాలన్న నిబంధనా అమలుకావడంలేదు. అమలుచేయించాల్సిన వైద్యారోగ్య శాఖ కూడా నిర్లక్ష్యంగానే ఉంది.
హైకోర్టు అక్షింతలు వేసినా
పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలలో కేసులు పెరుగుతున్నా తెలంగాణలో మాత్రం గణనీయంగా తగ్గుతున్నట్లు బులెటిన్లు రిలీజ్ అవుతున్నాయి. లక్ష టెస్టులు చేయాలని హైకోర్టు చెప్పినా అమలులోకి రాలేదు. ప్రభుత్వ ఆస్పత్రులలో డిస్‌ప్లే బోర్డులో చూపిస్తున్న బెడ్‌లకు, వాస్తవ పరిస్థితికి పొంతనే లేదు. చాలా ఆస్పత్రుల్లో ఐసీయూ, ఆక్సిజన్ బెడ్‌లు ఖాళీగా ఉన్నాయని చెబుతున్నా అడ్మిషన్ కోసం గంటలుగంటలు వెయిట్ చేయాల్సి వస్తోంది. ఫలితం లేక మెట్ల దగ్గరే చనిపోతున్నారు. గణాంకాలకు వాస్తవ పరిస్థితికి తేడా ఉండడంతో చివరకు డీజీపీ, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ లాంటి ఉన్నతాధికారులు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. కోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత మాత్రమే ప్రభుత్వం స్పందిస్తోంది. రోజురోజుకూ పెరిగిపోతున్న పాజిటివ్‌ల సంఖ్య. శ్మశానాలలో శవ దహనాలే అందుకు నిదర్శనం. చివరకు కట్టెల కొరత ఏర్పడింది. స్వయంగా అటవీ శాఖే వెయ్యి టన్నులను సమకూరుస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారింది. ఇన్ని గందరగోళాల నడుమ వైద్య మంత్రి బాధ్యతలు తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇకపైన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటార్నది ఆసక్తికరం.
ఎన్. విశ్వనాథ్
9971482403