- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కీలకంగా సింగరేణి గుర్తింపు ఎన్నికలు
తెలంగాణలో 2023 ఎన్నికల సంవత్సరంగా మారింది. అందుకే రాజకీయ పార్టీల హడావిడి పెరిగింది. ఇప్పటికే ఒకరి మీద, మరొకరు, దుమ్మెత్తి పోసుకునే విధంగా విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. అయితే రాష్ట్రానికి గుండెకాయగా ఉన్న సింగరేణి కాలరీస్‌లోనూ యూనియన్ గుర్తింపు ఎన్నికల షెడ్యూల్ ఏప్రిల్ మూడో వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నెల 13న సింగరేణిలోని మొత్తం 32 కార్మిక సంఘాల ప్రతినిధులను, సింగరేణి యాజమాన్యాన్ని రీజినల్ లేబర్ కమిషనర్ పిలిచి ఎన్నికల అధికారి నియామకం చేపట్టారు. జాతీయ, ప్రాంతీయ సంఘాలన్నింటిని పిలిచారు. దీంతో సింగరేణిలో యూనియన్‌ల హడావిడి అప్పుడే మొదలు అయిపోయింది.
కోర్టు ఆదేశించడంతో
సింగరేణి ఎన్నికలకు సహజంగా ప్రాధాన్యత ఉంటుంది. యూనియన్ నేతలు ఈ ఎన్నికల్లో పాల్గొని గెలువాలనే ఆసక్తితో ఉన్నారు. దీంతో ఒకరి మీద ఒకరి ఆరోపణలు పెరిగిపోయాయి. యూనియన్ గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని, గత రెండేళ్ళుగా వీటిని నిర్వహించడం లేదని ఏఐటీయూసీ సింగరేణి విభాగం ప్రధాన కార్యదర్శి, జేబీసీసీఐ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో కోర్టు గత ఏడాది ఎన్నికలు నిర్వహించాలని సింగరేణి యాజమాన్యంను, రీజినల్ లేబర్ కమిషనర్‌ను ఆదేశించింది. సింగరేణిలో 2017లో 6వ సారి గుర్తింపు యూనియన్ల ఎన్నికలు జరిగాయి. అందులో టీఆర్ఎస్ అనుబంధ సంస్థ అయిన టీబీజీకేఎస్ విజయం సాధించింది. దీని కాల పరిమితి ముగిసినా, కార్మిక శాఖ రెండేండ్లు పెంచింది. అయినా దాని ప్రకారం 2019 చివరన లేదా 2020లో ఎన్నికలు జరగాలి. కానీ కరోనా సమస్య వలన ఈ ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే గత ఎడాది కోర్టు ఎన్నికలు జరపమని ఆదేశించడంతో గత ఎడాది కార్మిక శాఖ యూనియన్‌ల సభ్యత్వం వివరాలు సేకరించే ప్రక్రియ కొనసాగినా ఎన్నికలు జరపలేదు. ఇప్పుడు కోర్టు ఆదేశాలతో రెండు నెలల లోపు ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. అయితే ఈ ఎన్నికలు 2023లో ఆర్థిక సంవత్సరం పూర్తి అయ్యాక ఏప్రిల్‌లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉండవచ్చు.
సింగరేణిలో 1998 నుంచి యూనియన్ గుర్తింపు ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి రెండుసార్లు ఏఐటీయూసీ, మూడోసారి ఐఎన్‌టియూసీ, నాలుగోసారి మళ్ళీ ఏఐటీయూసీ, ఐదోసారి టీబీజీకేఎస్, ఆరోసారి టీబీజీకేఎస్ గెలుపొందాయి. ఇప్పుడు ఏడోసారి ఎన్నికలు జరుగనున్నాయి. 1998కి ముందు సింగరేణిలో 72 కార్మిక సంఘాలు ఉండగా, ప్రస్తుతం 32 రిజిస్టర్ సంఘాలు మాత్రమే ఉన్నాయి. అందులో కూడా 15 సంఘాలు మాత్రమే అస్తిత్వంలో ఉన్నాయి. ప్రస్తుతం 2017 అక్టోబర్ 5న 6వ సారి జరిగిన యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో ఏఐటీయూసీ రిప్రజెంటేటివ్ హోదాను మందమర్రి, భూపాలపల్లిలలో గెలవగా, మిగిలిన అన్ని ఏరియాల్లో గెలిచి టీబీజీకేఎస్ గుర్తింపు హోదాను సాధించింది. హైకోర్టు మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని గత ఏడాది మధ్యంతర ఉత్తర్వు ఇవ్వడంతో ఇప్పుడు కార్మిక శాఖ 13న యూనియన్‌ల మీటింగ్ పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో సింగరేణిలో మళ్ళీ ఎన్నికల జోరు ఊపందుకోనుంది.
అందుకే సింగరేణిలోకి లీడర్లు
ఈ ఎన్నికలు ఆరు జిల్లాల్లో, 16 అసెంబ్లీ, 4 పార్లమెంట్ నియోజకవర్గాలలోని ఓటర్లను ప్రభావితం చేస్తాయి అంటే అతిశయోక్తి కాదు. మంచిర్యాల, కుమరంభీమ్ ఆసిఫాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల పరిధిలో సింగరేణి ఉంది. అందుకే సింగరేణి యూనియన్ ఎన్నికలను మినీ అసెంబ్లీ ఎన్నికలుగా పిలుస్తారు. ఇంకో తొమ్మిది నెలల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం మిగిలి ఉన్న తరుణంలో గతంలో మాదిరి 2017లో సింగరేణి, 2018 లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినట్టుగానే ఈసారి సింగరేణి, అసెంబ్లీ ఎన్నికలు కూడా వరుసగా ఉండే పరిస్థితి ఏర్పడింది. సింగరేణిలో సుమారు 43 వేల మంది కార్మికులు ఉన్నారు. అందరూ యూనియన్‌లో ఓటర్లుగా ఉంటారు. అయితే 26 వేలకు పైగా కాంట్రాక్టు కార్మికులు ఉంటారు. వీరికి యూనియన్ ఎన్నికల్లో ఓటు హక్కు ఉండదు. అయితే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వీరు ఓటర్లుగా ఉంటారు. మొత్తంగా వీరందరి కుటుంబ సభ్యుల ఓట్లు, ఇక్కడ జీవనాధారంగా ఉండే వారి ఓట్లు, మొత్తంగా కోల్ బెల్ట్‌లో 13 నుంచి 15 లక్షల మంది అసెంబ్లీ, పార్లమెంట్‌లలో ఓటర్లు ఉంటారు. ఇంతమంది ఓటర్లు నివసిస్తున్న ఈ సింగరేణిలో ఏ ఎన్నికలు జరిగినా అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా కీలకంగానే భావిస్తున్నాయి పార్టీలు అందులో సింగరేణి ఎన్నికలు అంటే మీని అసెంబ్లీ ఎన్నికల వంటివి. అందుకే సింగరేణిలోకి పొలిటికల్ లీడర్ల రాకా పెరిగింది.
ఇప్పటికే భూపాలపల్లికి రాష్ట్ర మంత్రి కేటీఆర్ వచ్చి వెళ్ళారు, అంతకుముందు ఎమ్మెల్సీ టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కవిత పర్యటించారు. త్వరలో రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావ్ మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ తదితర ప్రాంతాలకు రానున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం ఇల్లందు, రామగుండం, భూపాలపల్లిలలో హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా వచ్చి వెళ్ళారు. మరోవైపు బీజేపీ నేతలు కూడా ఈ ప్రాంతంలో పర్యటిస్తూనే ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటనలు కొనసాగుతున్నాయి. సింగరేణి యూనియన్ ఎన్నికల్లో గెలవాలని తీవ్ర ప్రయత్నాలు బిఎమ్మెస్ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు ఏఐటీయూసీ నేతలు ఈసారి గుర్తింపును సాధిస్తామని నమ్మకంతో ఉన్నాయి. హెచ్ఎమ్మెస్ రాష్ట్ర అధ్యక్షులు, సింగరేణి విభాగం ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ యూనియన్ ఎన్నికలలో విజయం కోసం సింగరేణిలో తిరుగుతూనే ఉన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కూడా ఈ ఎన్నికల మీద దృష్టి కేంద్రీకరించారు. టీబీజీకేఎస్ ఈ సారి కూడా గెలుపు తమదే అనే నమ్మకంతో ఉంది. సీఐటీయూ, ఐఎఫ్టీయూ, టీఎన్టీయూసీ, సింగరేణి ఉద్యోగుల సంఘం తదితర యూనియన్లు కూడా ఈ పోటీలో ఉంటున్నాయి. అందుకే పోటీ రసవత్తరంగా సాగనుంది. మొత్తం రాజకీయ ఎన్నికల వాతావరణం నెలకొనే పరిస్థితి ఉంది. కొన్ని యూనియన్‌ల నేతలు బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్, బీఎస్పీ, వైఎస్సార్ తెలంగాణ పార్టీల టిక్కెట్లు ఆశిస్తున్నారు. వారి జాబితా చాలానే ఉంది. అందుకే యూనియన్ ఎన్నికలు ఇప్పుడు ప్రధానం అయ్యాయి!..
ఎండి.మునీర్
99518 65223