- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో ఎడతెగని పొత్తుల పంచాయితీ!
అవసరమే అన్నింటికీ ప్రాతిపదిక రాజకీయం అంటే అదే, ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఏం లాభం, ఏం నష్టం, అనే లెక్కల మీదే ప్రణాళికలుంటాయి. దీనికి అనుగుణంగా విధానాలు మారుతుంటాయి. పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీకి చేరువయ్యేందుకు, టీడీపీ చేసిన, చేస్తున్న ప్రయత్నాలు ఆశాజనకంగా లేవు. టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని బీజేపీ తెగేసి చెప్పడంతో వ్యూహం మార్చేసింది టీడీపీ. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినా, లేదా జనసేనతో కలిసి పోటీ చేసినా గెలుస్తామనే గ్యారెంటీ వచ్చేసినట్లుంది. పైగా బీజేపీపై ఏపీ జనంలో వ్యతిరేకత ఉందని పసిగట్టి టీడీపీ వ్యూహం మార్చేసింది. కానీ, దీర్ఘకాలిక వ్యూహాల్లో భాగంగా టీడీపీకి దూరంగా ఉండాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించుకుంది. దీంతో బీజేపీతో ఇక లాభం లేదనుకున్న చంద్రబాబు వ్యూహం మార్చినట్లు కనిపిస్తోంది.
చంద్రబాబు అంచనా ప్రకారం ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తే ఈ కూటమి అధికారంలోకి రావడం పక్కా. టీడీపీతో కలిసేందుకు జనసేన సిద్ధంగానే ఉంది. మరోవైపు ఇప్పటికే జనసేన-బీజేపీ కూటమిగా ఉన్నాయి. కానీ, టీడీపీతో కలిసేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. పైగా జనసేనను కూడా దూరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. దీని ద్వారా అంతిమంగా లబ్ధి పొందేది వైసీపీ. ఆ పార్టీని అధికారంలోకి తేవడానికి ఇదంతా బీజేపీ అమలు చేస్తున్న వ్యూహం. ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. పవన్ నేరుగా బీజేపీ ముఖ్యులతో ఇదే ప్రతిపాదన పైన చర్చలు చేసారు. ఇప్పుడు కర్ణాటక ఎన్నికల ఫలితాలు వ్యతిరేకంగా రావటంతో పవన్ ప్రతిపాదన పైన బీజేపీ సానుకూలంగా స్పందిస్తుందనే అంచనాలు పెరిగాయి. ఏ నిర్ణయం తీసుకోబోతున్నారనేది అస్పష్టంగానే ఉంది. పొత్తుల వ్యవహారం పైన బీజేపీ నుంచి ఇప్పటి వరకు స్పష్టత లేదు కానీ, తాము కోరుకున్న దానికి భిన్నంగా కేంద్రం నుంచి సీఎం జగన్‌కు మద్దతు కనిపిస్తోంది.
ఆ లోపాయికారీ ఒప్పందం నిజమేనా?
ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ వ్యతిరేకతతో ఉన్నట్లు కనిపిస్తున్నా.. లోపాయికారిగా ఆ పార్టీకి బీజేపీ సహకరిస్తోంది. ఇది నిజమే అనిపించకమానదు. కొన్ని అంశాల్ని పరిశీలిస్తే. అధికారికంగా రెండు పార్టీల మధ్య ఎలాంటి పొత్తూ లేదు. కానీ, కేంద్రంలో బీజేపీకి ఎలాంటి మద్దతు అవసరమైనా సరే వైసీపీ ముందుంటుంది. దేశంలో ఎన్ని పార్టీలు బీజేపీపై ఎన్ని విమర్శలు చేస్తున్నా వైసీపీ మాత్రం మోదీని కానీ.. బీజేపీని కానీ ఒక్క మాట కూడా అనలేదు. పోనీ ఇంత మద్దతు ఇస్తున్నప్పటికీ ఏపీకి బీజేపీ ఏమైనా ఒరగబెట్టిందా అంటే అదీ లేదు. బీజేపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వదు. ఏపీకి గర్వకారణమైన విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేస్తోంది. అయినా వైసీపీ మౌనంగానే ఉంటుంది. ఏపీకి ఏ ప్రయోజనం కలగకపోయినా వైసీపీ నేతలు అడగరు. 25 మంది ఎంపీలను ఇస్తే అవన్నీ ఎందుకు రావు అంటూ చెప్పుకొచ్చాడు. తీరా జగన్ అధికారంలోకి రాగానే వాటి ఊసే మర్చిపోయాడు. కేంద్రాన్ని ఈ విషయంలో ప్రశ్నించకపోగా పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాడు జగన్. దీంతో ఇరుపార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందనే ప్రచారం ఊపందుకుంది.
వారి బంధం ఎలా సాధ్యమైంది?
జగన్ ఇక్కడే తన రాజకీయ చతురత ప్రయోగించాడు. ప్రత్యేక హోదా రానందుకు చంద్రబాబును విమర్శించాడే తప్ప బీజేపీని జగన్ ఏమీ అనలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు బీజేపీపై తిరుగుబాటు చేసి ఆ పార్టీకి దూరమయ్యారు. దీంతో మోదీతో, బీజేపీతో చంద్రబాబుకు ఉన్న బంధం తెగిపోయింది. దీనిలో నష్టపోయింది చంద్రబాబు. లబ్ధి పొందింది జగన్. ఎన్నికలకు సిద్ధం అవుతున్న వేళ సీఎం జగన్ ఆర్థిక కష్టాలతో పథకాల అమలు కష్టంగా మారుతుందని ప్రతిపక్షాలు అంచనా వేసాయి. ఉద్యోగుల బకాయిలు..కాంట్రాక్టర్లకు విడుదల చేయాల్సిన పెండింగ్ బిల్లులు.. నిర్వహణ ఖర్చుల భారం సమస్యగా మారుతుందని లెక్కలు వేసారు. ఇదే సమయంలో ప్రభుత్వం పైన రాజకీయంగా దాడిని పెంచారు. ముఖ్యమంత్రి జగన్‌కు పాలనా పరంగా ఆర్దిక నిర్వహణ ప్రధాన సమస్యగా మారుతోంది. ఎన్నికల ఏడాది కావటంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే పెండింగ్ హామీలు..బిల్లుల విడుదల చేయాల్సి ఉంది . ఏపీకి రావాల్సిన రెవెన్యూ లోటు నిధుల కోసం ఎంతగా ప్రయత్నించినా ఆమోదం చెప్పని కేంద్రం.. ఇప్పుడు విడుదలకు ఆదేశాలు ఇచ్చింది.
ప్రభుత్వ వ్యతిరేకతను చల్లార్చితే!
ఎన్నికల సమయంలో జగన్ సర్కార్‌కు ఈ మధ్య కేంద్రం భారీ రుణాలు ఇస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 32 వేల కోట్లకు పైగా రుణాలకు ఏపీకి కేంద్రం ఇప్పటికే అనుమతిచ్చింది. ఏపీలో ఉన్న ఆర్థిక కష్టాల నేపథ్యంలో కేంద్రం ఇస్తోన్నఈ రుణం నిర్ణయం భారీ ఉపశమనంగా మారనుంది. నిజానికి భారతీయ జనతాపార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 0.5శాతం ఓట్లు కూడా లేవు. దీంతో ఏపీకి ఆర్థికంగా అండగా ఉంటూ లోపాయికారీ ఒప్పందం ద్వారా భారతీయ జనతా పార్టీ 5-6 పార్లమెంట్ స్దానాలని దక్కించుకోవాలన్నది వ్యూహం. అయితే ఈ కొత్త పొత్తుల వార్తల నేపథ్యంలో చంద్రబాబు-పవన్ తమ పార్టీలతోనే పొత్తు ప్రకటిస్తాయా అనేది తేలాల్సి ఉంది.
ఇక సీఎం జగన్ విషయానికి వస్తే... ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి, పార్టీలో ఉన్న సంస్థాగత లోపాలు సరిదిద్ది, అసమ్మతిని చల్లార్చాల్సి ఉంది. కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చి చౌకబారు విమర్శలు చేస్తున్న పార్టీ నాయకులను మంత్రులను అదుపు చేసి పార్టీపై నియంత్రణ సాధించి, క్షేత్ర స్థాయి పరిస్థితులను కార్యకర్తలతో సమీక్షించి. పార్టీ పరంగా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. అభివృద్ధి, సంక్షేమం గురించి అధికారులతో చర్చించి వారిని భాగస్వాములను చేసి లోపాలు సరిదిద్దాలి. రాజధానిపై పునరాలోచన జరిపి పట్టుదల వీడి ప్రజాభిప్రాయాన్ని గౌరవించి దీర్ఘ కాలిక రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి దార్శనికత, దక్షత గల నాయకుడిగా ప్రజల మన్నన చూరగొంటే మళ్ళీ అధికారం నీకే జగనన్నా... కాస్త ఆలోచించు. ఇవి పాటిస్తే సంక్షేమం, అభివృద్ధి, సాధికారత అనే మూడు అంశాలు మూడు రెక్కలై ఫ్యాన్ గాలి విజయ ప్రభంజనాన్ని సృష్టిస్తుంది.
వి. సుధాకర్
99898 55445