చేదు లేని ఉగాది

by Ravi |

మేఘంలా విస్తరించే కొమ్మలతో

చల్లని గాలులను కురిపిస్తుంది,

తన విశాలమైన హృదయం తో

గాయాలను ప్రేమగా తుడుస్తుంది,

నీడ కొంగును పరిచి ఓదారుస్తుంది!

రెక్కలొచ్చిన పక్షులు

గుండెగూటిని వదిలి పోతే

జ్ఞాపకాలను తవ్వుకుంటూ

ఆ చెట్టే సాక్ష్యంగా ఎదురుచూస్తారు,

రెక్కలు రాని పక్షులు

ఆ చెట్టు నీడలో బాల్యాన్ని వెదజల్లుతారు!

పల్లె పల్లెకు పెద్ద దిక్కైన ఆ వేపచెట్టు

నేడు దిక్కులేక వాడిపోతుంది,

పిట్టలకు గూడు నిచ్చిన ఆ చెట్టు గూడు

ఇప్పుడిలా చెల్లాచెదురై పోతుంది!

వేపచెట్టంటే వెయ్యేనుగుల బలం

రచ్చబండకే రక్షణ గా నిలిచే గుణం

దాని అండలో నిలబడని జీవం లేదు!

వేపపళ్లను ఏరుకున్న క్షణాలు

వేపాకును ఒళ్ళంతా చుట్టుకున్న గుర్తులు

వేప పుల్లలను నమిలిన జ్ఞాపకాలు

నాటి తీపి నిజాలన్నీ చేదైపోతున్నాయి!

తరతరాల కొండలాంటి చెట్టు

కళ్ళముందే కూలిపోతుందా,

అమ్మకొంగులా హత్తుకున్న చెట్టు

నేడు జాడ లేక వెలవెలబోతోందా,

ఔషధంలా నిలిచిన వేపమ్మ

వెన్ను విరిగి ఆయుష్షును కోల్పోతోందా!

సూర్యునిలా వెలిగే చెట్టుకు

"డై బ్యాక్" చీకటిలా చుట్టేస్తోంది,

రోగమొస్తే నిలువెత్తు ప్రాణాన్ని

చేజేతులా నరుక్కుంటామా!

వేప జీవితానికి చేదును మిగల్చకుండా

కన్నబిడ్డలా కాపాడుకుందాం,

మనం బతకడమొక్కటే కాదు

మనకు బతుకునిచ్చే వాటిని బతికిద్దాం

మళ్లీ ఉగాదికి కొత్తగా పూత పూయనిద్దాం,

చేదును కలుపుకొని షడ్రుచులతో

సంపూర్ణ ఉగాదికి స్వాగతం పలుకుదాం!

పుట్టి గిరిధర్

9491493170

Next Story