పాలకుల పాశుపతాస్త్రం 'ఉపా'!

by Ravi |   ( Updated:2023-06-21 00:30:19.0  )
పాలకుల పాశుపతాస్త్రం ఉపా!
X

రాజుల కాలంలో బలమున్నవాడిదే రాజ్యం. అందుకే రాజ్యం వీరభోజ్యం అన్నారు. అదే ప్రజాస్వామ్య కాలంలోకి వస్తే అధికారంలో ఉన్న పాలకులకే అధికారభోజ్యంగా మారింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియ ద్వారా ఒక రాజకీయ పార్టీకి సంక్రమించే అధికారం ఎంత బలంగా ఉంటే.. రాజ్యాన్ని ఎదురించేవారిని అంతలా అణచిపెట్టి ఉంచొచ్చు. అందుకే పాలకులకు అధికారమే పరమావధి. అధికార ఏలుబడిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటం చాలా సులువైన పని. ఒక్కమాటలో చెప్పాలంటే.. రాజ్యానికి ఎదురొచ్చేవారిపై రాజద్రోహ దండనాధికారంతో ఎలాంటి శిక్షనైనా విధించవచ్చు. జీవితాంతం జైలులోనూ నిర్బంధించవచ్చు.

రాష్ట్రంలోనే ఇటీవల ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో 152 మందిపై నమోదైన ‘ఉపా’ (Unlawful Activities Prevention Act) కేసుతో ప్రజాస్వామ్యవాదులను ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసి, రాష్ట్రమంతటా కలకలం రేకెత్తించింది. సర్వత్రా చర్చనీయాంశమైంది. కేసు గతేడాది నమోదైతే.. దశాబ్ది ఉత్సవాల వేళ వెలుగులోకి రావడంతో రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇది మరింత వేడిని రాజేసింది. ఈ కేసులో తెలంగాణ ఉద్యమకారులు, పౌర హక్కుల నేత ప్రొఫెసర్‌ హరగోపాల్‌, గడ్డం లక్ష్మన్, ప్రజా సంఘాల నేత విమలక్కతో పాటు, మేధావులు, విద్యార్థి నేతల పేర్లు ఉండడంతో సంచలనమైంది. అయితే దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్ ఆ కేసు నుంచి కొందరికి మినహాయింపునిస్తూ కేసును ఎత్తేయాలని డీజీపీకి ఆదేశాలిచ్చారు.

ఏమిటీ చట్టం

అయితే ఉపా చట్టంపై దేశవ్యాప్తంగా విస్త్రృతంగా చర్చోపచర్చలు నడుస్తున్నాయి. చట్టం రద్దుకు తీవ్రస్థాయిలోనూ వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను తప్పుబడుతూ..ముక్తకంఠంతో ఖండిస్తూనే ఉన్నారు. ఈ చట్టం ఏమిటంటే, దేశ స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్ పాలకులు తెచ్చిందే ‘రౌలత్’ చట్టం. ఎవరైనా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడినట్టు అనుమానిస్తే అరెస్ట్ చేయడం, ఎలాంటి విచారణ లేకుండా జైలులో నిర్భంధించడం ఈ చట్టానికి ఉన్న అధికారాలు. ఈ చట్టంతో ఆ కాలంలో దేశ స్వాతంత్రోద్యమంలో నాయకులు, ప్రజలు పాల్గొనకుండా.. గొంతెత్తకుండా అణచివేయడానికే ఇలా చట్టం అమలు పరిచారు. దీన్ని బ్రిటిష్‌ పాలకులు దేశద్రోహంగా పరిగణించేవారు. అందుకే ఎంతో మంది స్వాతంత్య్ర పోరాట నాయకులు, ప్రజలు ఈ చట్టం కింద ఎన్నోసార్లు జైళ్లకు వెళ్లి, శిక్షలు అనుభవించారు. ఆ చట్టాన్ని నేటి పాలకులు ప్రజాస్వామ్యానికి చేటు తెచ్చే విధంగా ప్రయోగిస్తున్నారు. ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్న వారిని అరెస్ట్‌లు చేయిస్తూ ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గబెట్టి, దేశద్రోహులుగానూ ముద్ర వేస్తున్నారు. ఇది ప్రస్తుతం ప్రజాస్వామ్యానికి కళంకంలా మారింది. చివరకు కోర్టుల విచారణలో అరెస్టైన వ్యక్తి నిరపరాధి అని నిర్ధారణ అయితే అతను కోల్పోయిన జీవితానికి ప్రభుత్వం ఎలాంటి పూచీకత్తు ఇవ్వదు. నష్టపరిహారాన్ని చెల్లించదు. ఈ చట్టం నేటి ప్రభుత్వాల పాశవిక చర్యలకు దర్పణం.

స్వాతంత్య్రానంతరం ఇలా..

దేశంలో ఈ చట్టాన్ని 1967లో తెచ్చినా, అప్పటి ప్రభుత్వాలు దీన్ని అంత‌గా వాడ‌లేదు. ఎమర్జెన్సీ సమయంలోనూ పెద్దగా ప్రయోగించలేదు. కానీ గత రెండు దశాబ్దాలకు పైగా కాలంగా ఈ చట్టం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాలక్రమేణా TADA (టెర్రరిస్ట్ అండ్ డిస్ట్రప్టివ్ యాక్టివిటీస్ (నివారణ) చట్టం)ను 1995లో రద్దు చేశారు. దీని స్థానంలో POTA (ప్రివెంటివ్ ఆఫ్ టెర్రరిజం చట్టం)ను తెచ్చి 2004, 2008లో సవరణలు చేశారు. దాన్ని UAPAగా మార్పు చేస్తూ, దీనికింద నమోదయ్యే నేరాల దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించాయి. 2013లో ఆర్థిక నేరాలను నియంత్రణ పేరుతో మరోసారి ఈ చట్టానికి పదును పెట్టి సవరించింది. అయితే, ఈ చట్టాన్ని పౌర హక్కులకు గొడ్డలిపెట్టుగా భావించిన చాలా దేశాలు ఇలాంటి అప్రజాస్వామికమైన చట్టాన్ని ఏనాడో రద్దు చేశాయి. కానీ మనదేశంలో మాత్రం రద్దు చేయకపోగా.. మరింత బలంగా ప్రయోగిస్తూ విస్తరిస్తున్నారు. ఎంతలా అంటే పాలకులు మారినప్పటికీ.. చట్ట ప్రయోగం మాత్రం ఆగడం లేదు. ప్రస్తుతకాలంలో అది మరింత తారాస్థాయికి చేరింది.

రాజ్యాన్ని ప్రశ్నిస్తే...

‘ఉపా’ కింద కేసులు పెట్టే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకూ ఉంది. ప్రస్తుతం దేశంలో ఎంతోమంది మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, రచయితలు, మానవ హక్కుల కార్యకర్తలు, ప్రజా సంఘాల నేతలు, విద్యార్థి సంఘాల నేతలు, రైతు సంఘాల నేతలు ఈ చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టై జైళ్లలో మగ్గుతున్నారు. ఈ చట్టం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించే వారి నోర్లు మూయించేందుకు ఉపయోగిస్తున్నారనే విమర్శలు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొని జైళ్ళపాలైన వారు పెరుగుతున్నారు కానీ విచారణలో మాత్రం 90 శాతం కేసులు వీగిపోతున్నాయి. ఇంతటి దుర్మార్గమైన చట్టాన్ని.. పాలకులు ఎందుకు రద్దు చేయడానికి చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వాలను ప్రశ్నించేవారు, పేదల పక్షాన, మానవ హక్కుల పరిరక్షకులు ఇలాంటి నిర్బంధాలు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. ఉపా చట్టం కింద అరెస్టయ్యే వారిలో 80 ఏళ్లకు పైబడిన వారే కాకుండా.. 30 ఏళ్ల లోపు వారు కూడా బాధితులుగా ఉంటున్నారు. నేరం మోపబడిన వారు నిరపరాధిగా తిరిగొచ్చే సరికి కాలంతో పాటు జీవితమూ కరిగిపోతుంది. చనిపోవడమూ జరుగుతుంది. ఇందుకు ఉదాహరణ.. ఆదివాసీ హక్కుల కార్యకర్త స్టాన్ స్వామినే. ఇక కోబడ్ గాంధీ, ప్రొఫెసర్ సాయిబాబా, రచయిత వరవరరావు, జర్నలిస్టు సిద్దిక్ కప్పన్ లాంటి వాళ్లూ ఉపా బాధితులే. పాలకులు ఎవరైనా కానీ.. రాజ్యాన్ని ప్రశ్నించే వారిపై ఉపాను పాశుపతాస్త్రంగా వాడుతుండడం నిష్టూర సత్యమే.!

వేల్పుల సురేష్

91001 44990

Advertisement

Next Story