- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ సాహితీ స్రష్ఠ దాశరథి రంగాచార్య..
తెలంగాణ సాయుధ పోరాటం ఒక మహోజ్వల ఘట్టం తెలంగాణ అనగానే అనేక పోరాటాలు, ఉద్యమాలు గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటం గురించి ప్రస్తావించకుండా తెలంగాణ చరిత్ర సమగ్రం కాదు తెలంగాణ చరిత్రలో ఇక్కడి కవులు సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని జైలు శిక్షలను అనుభవించారు. రచనలలో ఏదైతే నాడు రాశారో దాని ప్రకారమే జీవితం గడిపి నిబద్ధతను చాటుకున్నారు. ప్రజాకవి కాళోజీ, హిరాలాల్ మోరియా, వట్టికోట ఆళ్వార్ స్వామి, మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు ఇలా అనేక మంది నిర్బంధాలను ఎదుర్కొన్నారు. అదే కోవకు చెందిన వారు దాశరథి రంగాచార్య.
విద్యార్థి దశ నుండే అన్యాయాలను ఎదిరించే తత్వం ఆయనకు అలవడింది. రంగాచార్య 6వ తరగతి చదువుతున్నప్పటి నుండి స్కూలు విద్యార్థులను కూడగట్టి సమ్మెకు దిగారు. దీనికి నాయకత్వం వహించినందుకు ఆయనను పాఠశాల నుండి బహిష్కరించారు. అంతే కాకుండా నిజాం రాష్ట్రంలోని ఏ పాఠశాలలోను, విద్యా సంస్థల్లోనూ చేర్చుకోకూడదని ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి కాలంలో జరిగిన, అనేకానేక నిజాం వ్యతిరేక పోరాటాలలో రంగాచార్య పాల్గొన్నారు. దీంతో పోలీసులు ఆయనకు 16 సంవత్సరాల జైలు శిక్ష విధించారు అయితే ఆయన మైనారిటీ తీరనందు వల్ల జైలు శిక్ష నుంచి తప్పించారు.
తెలంగాణ పోరాటం నాటి పరిస్థితులను గురించి, నిజాం ఆకృత్యాల గురించి, నాటి బానిస పద్ధతుల గురించి, ఆయన నాడు చూసినవి అనుభవించినవి అన్నీ దాశరధి రంగాచార్య నవలల్లో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి. రంగాచార్య జీవితానుభవం బహు విస్తారమైనది. ఆ అనుభవ సారమే ఆయన నవలలు. ఆళ్వార్ స్వామి 'ప్రజల మనిషి' తర్వాత తెలంగాణకు సంబంధించిన రచనలు ఎక్కువగా రాలేదు. ఈ లోటును భర్తీ చేసే క్రమంలో తెలంగాణ వెతల్ని రంగాచార్య తన నవలల్లో చిత్రించారు. రంగాచార్య 1964 అక్టోబర్ 13న ప్రారంభించిన రచన 1964 నవంబర్ 10న ముగించారు. నవలకు రాతి మనుషులు అని పేరు పెట్టారు. ఒక వార పత్రికకు నవలల పోటీకి పంపాడు కానీ 'రాతి మనుషులు' టపాలో తిరిగి వచ్చింది. కనీసం సాధారణ ప్రచురణకూ నోచుకోలేదు.
అలా ఉండగా రంగాచార్యకు నార్ల చిరంజీవితో పరిచయం అయింది.1966లో ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రికలో భాగ్యనగరం అనే నాటకం సీరియల్‌గా వచ్చింది. ఆ పరిచయంతో మరుసటి రోజు రాతి మనుషులు నవల రాశానని అది చూడాలని రంగాచార్య, నార్ల చిరంజీవికి అందించారు. గొప్ప నవల రాశాడు రంగాచార్య అని వచ్చిన వాళ్లందరికీ వివరించి చెప్పారు నార్ల. అదే విధంగా దేవులపల్లి రామానుజ రావుకు నవలను చూపించారు రంగాచార్య. తరువాత 'నీవు నిస్సందేహంగా గొప్ప నవల వ్రాసినావు. ఇది తెలంగాణమునకే కాదు, ఆంధ్రజాతికే తలమానికమ'ని అత్యంత ఉత్సాహం కనబరిచారు రామానుజారావు. ఆ ఊపులో చిరంజీవి చిన్న చిన్న రాళ్లు వంటి అనేక పేర్లు సూచించారు. చివరకు 'చిల్లర దేవుళ్లు' పేరును దేవులపల్లి సహితంగా ఆమోదించారు.
'చిల్లర దేవుళ్లు' రెండు కాపీలు విశాలాంధ్ర ప్రచురణలకు పంపించారు దాశరధి. 1969లో వారి ఇద్దరి నుంచి ఉ త్తరాలు వచ్చాయి. విశాలాంధ్ర విజ్ఞాన సమితి 'ప్రగతి' అనే ప్రగతిశీల వారపత్రిక ప్రచురించ తలపెట్టారు. 'చిల్లర దేవుళ్లు' ప్రగతి వారపత్రికలో 21-3-1969 నుంచి 13-6-1969వరకు వరుసగా పదమూడు వారాలు సీరియల్‌గా వచ్చింది. 'చిల్లర దేవుళ్లు' నవలను నిజాం నిరంకుశ పాలనలో ఊరు పేరూ మాసిన ఆంధ్ర జాతికి ఒక తీరూ తెన్నూ కల్పించిన ఆంధ్ర పితామహ, పద్మభూషణ మాడపాటి హనుమంతరావు పంతులుకు అంకితంగా సమర్పించారు. దాశరథి అప్పటికి మాడపాటి జీవించి ఉన్నారు.
1938కి పూర్వపు తెలంగాణ ప్రజా జీవిత చిత్రణ 'చిల్లర దేవుళ్లు' ప్రేమ కథ కాదు. పెళ్లి 'చిల్లర దేవుళ్లు' నవల ప్రధానాంశం కాదు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం హింది శాఖ నుంచి యూసుఫ్ పాషా చిల్లర దేవుళ్లు-మైలాఅంచల్ పేరిట తులనాత్మక పరిశీలన చేసి M.Phil పొందారు. శ్రీ వెంకటేశ్వర, కాకతీయ, ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో 'చిల్లర దేవుళ్లు'పై పరిశోధనలు జరిగాయి. డిగ్రీలు లభించాయి. కాకతీయ విశ్వవిద్యాలయం M.A.కు, బెంగళూరు విశ్వవిద్యాలయం B.A.కు కొంత కాలం 'చిల్లర దేవుళ్లు' పాఠ్యాంశంగా ఉండింది. ఉస్మానియా విద్యార్థులు ఉద్యమం నిర్వహించి 'చిల్లర దేవుళ్లు' నవలను M.A.కు పాఠ్యాంశంగా పెట్టించుకున్నారు. దాశరథి రంగాచార్య అర్థశతాబ్దంగా సాహిత్యంలో కృషి చేసి 1998 వరకు ఎనిమిది వేల పేజీలపైగా ముప్పయి పుస్తకాలు ప్రచురించారు. కానీ ప్రభుత్వం నుంచి ఇసుమంత సాయం కాని, ఆదరణ కాని లభించలేదు. అందుకు దాశరథి రంగాచార్య ఆవగింజంత బాధపడలేదు. ప్రభుత్వం ప్రతిభను కాక పైరవీని మాత్రమే గుర్తిస్తుందని దాశరథి అభిప్రాయం.
జయన్తి తే సుకృతి నోర ససిద్ధాః కవీశ్వరాః
నాస్తి తేషాంయశః కాయే జరామరణజం భయం
- భర్తృహరి
కవులు పుణ్య పురుషులు. వారు మంచి రచనలు చేస్తారు. వారు రసములను పండించగలరు. కవుల కీర్తికాయానికి జరామరణ భయం లేనే లేదు.
దాశరథిది తెలంగాణాలోని వరంగల్ జిల్లా, మహబూబాబాద్ తాలూకా చిన్న గూడురు గ్రామం. 1928 ఆగస్టు 24న దాశరథి రంగాచార్య జన్మించారు. దాశరథి సోదరులు ఖమ్మం హైస్కూల్లో చదివారు. ఈ సమస్త సృష్టి సకల ప్రకృతి సొంతం సత్యం శివం సుందరం. సమస్త ప్రాణి జాలం లెక్కలేనన్ని జీవరాసుల్లో మానవుడు ఉత్తముడు. మహెూత్తముడు, మహిమాన్వితుడు. మానవుని మించిన మరో ప్రాణి ఈ విశ్వంలో విశ్వాంతరాళంలో ఎక్కడా లేడు అని దాశరథి తన జీవన యానంలో పొందు పరిచారు. ఆయన 87ఏళ్ల వయసులో ఇక సెలవంటూ.. 2015 జూన్ 8న దివికేగారు. (1928-2015).
(నేడు దాశరథి రంగాచార్య జయంతి)
కొలనుపాక కుమారస్వామి
99637 20669