వివిధ దేశాల్లో పొగాకు నియంత్రణ చట్టాల గురించి తెలుసా?

by Ravi |   ( Updated:2023-05-30 22:30:32.0  )
వివిధ దేశాల్లో పొగాకు నియంత్రణ చట్టాల గురించి తెలుసా?
X

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం ధూమపానం వల్ల కలిగే హానిని గుర్తుచేస్తుంది. కాబట్టి ధూమపానం చేసేవారికి అవగాహన కల్పించడంలో సహాయపడటానికి అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. పొగాకు పరిశ్రమ ఏ దేశానికైనా భారీ పన్ను ఆదాయాన్ని సృష్టిస్తుంది. అయినప్పటికీ కొన్ని దేశాలు ధూమపానాన్ని సమూలంగా రూపుమాపడానికి ప్రణాళికలు రచిస్తున్నాయి. 1987లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన సమావేశంలో 1988 ఏప్రిల్ 7న ధూమపాన రహిత దినోత్సవంగా పిలుపునిచ్చింది. ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా పొగాకు వినియోగదారులను 24 గంటలపాటు పొగాకు ఉత్పత్తులను వాడకుండా ఉండమని కోరింది. దానిని అనుసరించే 1988లో జరిగిన సమావేశంలో ప్రతి సంవత్సరం మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుకోవాలని ప్రకటించింది.

నియంత్రణ చట్టాలు!

నిజానికి పొగాకు ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పొగాకులో ఉండే నికోటిన్ వలన ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె వ్యాధులు వస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం భారతదేశంలో 267 మిలియన్ ప్రజలు పొగాకు వినియోగిస్తున్నారు. పొగాకును అధికంగా వినియోగిస్తున్న రెండవ దేశం మనదే. పైగా దీనిని ఎక్కువగా సేవించడం వలన నంపుసకత్వం వస్తుందని తాజా పరిశోధనలు వెల్లడించాయి. అందుకే వివిధ దేశాల్లో పొగాకును నిషేధించడానికి నిబంధనలు, చట్టాలు అమలు చేస్తున్నాయి.

మలేషియాలో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయడం చట్టం ప్రకారం నిషేధించబడింది. అలాగే సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్‌తో ఉన్న ప్రైవేట్ ఆఫీసు స్థలాలలో మూడు మీటర్ల దూరంలో కాల్చుకోవాలనే నిబంధన ఉంది. అలాగే కోస్టారికా దేశంలో ధూమపాన చట్టం టాక్సీలు, బస్సులు, పబ్లిక్ భవనాలు, బార్‌లు, కార్యాలయాలలో, క్యాసినోలలో పొగాకును ఉపయోగించడాన్ని నిషేధిస్తుంది. న్యూజిలాండ్‌లో సిగరెట్ల విక్రయంపై ఇప్పటికే 18 ఏళ్ల నిబంధన ఉండగా, అదనంగా చట్టం ప్రకారం పొగాకు ప్యాక్‌లపై గ్రాఫిక్ హెల్త్ వార్నింగ్‌లు మొదలైనవి ఉండాలి. అలాగే, న్యూజిలాండ్‌ను పొగ రహితంగా మార్చడానికి ఆ దేశం సిగరెట్‌లపై భారీస్థాయిలో పన్ను పెంపుదల విధించింది. అలాగే మన పొరుగున ఉన్న భూటాన్ దేశంలోనూ 2010లో పొగాకు అమ్మకాలను నిషేధించింది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయడాన్ని నిషేధించింది. ఇక్కడ ధూమపానం చట్టం కింద మీరు పట్టుబడితే మూడు నుండి ఐదు సంవత్సరాల జైలు శిక్షను ఎదుర్కొంటారు. అయితే, ప్రభుత్వం స్మోకింగ్ జోన్‌ను కేటాయించింది. మనదేశంలోని సిక్కిం రాష్ట్రంలో బహిరంగ ధూమపానం నిషేధం. ఇందులో పట్టుబడితే రూ. 200, రూ. 500 జరిమానా విధిస్తారు. అయితే పొగాకు, ధూమపానం తగ్గించడానికి ఎన్ని నియంత్రణ చట్టాలు చేసినా పొగతాగే వారి సంఖ్య మాత్రం పెరిగిపోయిందని అధ్యయనాలు చెబుతున్నాయి.

కఠినంగా చట్టాలు అమలు చేయాలి!

కానీ ఎన్ని నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పొగ తాగే వారి సంఖ్య మాత్రం పెరిగిపోయిందని అధ్యయనాలు చెబుతున్నాయి. పొగాకు వినియోగంలో రష్యా మొదటి స్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉంది. 15 ఏళ్ళు పైబడిన మగవాళ్లలో 60 శాతం మంది, 23 శాతం మహిళలకు పొగ తాగుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానంపై నిషేధం ఉన్నప్పటికీ పొగాకు సంస్థలు ప్రకటనల కోసం అక్కడ కూడా భారీగా ఖర్చు చేస్తున్నాయి. రష్యా సిగరెట్ మార్కెట్ విలువ 1.4లక్షల కోట్ల పైమాటే. కిరిబాటి అనే చిన్న దీవి లో అత్యధిక శాతం పొగరాయుళ్లు ఉన్నారు. ఇక్కడి జనాభాలో మూడొంతుల శాతం మందికి ఈ అలవాటుంది. అలాగే ఇక్కడ సిగరెట్లపై పన్నులతో పాటు నివారణ చర్యలు తక్కువే. అలాగే మాంటెనెగ్రో దేశంలో 46 శాతం మంది ప్రజలకు పొగతాగే అలవాటుంది. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని నిషేధించినప్పటికీ అక్కడ పరిస్థితి మాత్రం మారట్లేదు. గ్రీస్ లోనూ 2008 నుంచి అక్కడ బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని నిషేధించినా, ఇప్పటికీ చాలామంది బహిరంగంగానే పొగ తాగుతూ కనిపిస్తారు.

ఈస్ట్ తైమూర్‌‌లో ప్రపంచంలోనే అత్యధికంగా 80శాతం మంది మగవాళ్లు పొగతాగుతారు. అందుకే జాబితాలో ఆ దేశానిది 4వ స్థానం. అక్కడ నిరక్షరాస్యత కారణంగా ధూమపాన హెచ్చరికలు 50 శాతం మంది చదవలేరు. పొగాకు వినియోగం పట్ల కలిగే దుష్ఫలితాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. పాఠశాల స్థాయి నుండే విద్యార్థులకు పొగాకు వినియోగం నష్టాలపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు సెమినార్లు నిర్వహించాలి. చట్టాలను కఠినంగా అమలు చేయాలి. బహిరంగ ప్రదేశాల్లో, నిషిద్ధ ప్రాంతాలలో ధూమపానం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకున్ననాడే భారత్ పొగాకు రహిత దేశంగా మారుతుందనడంలో అతిశయోక్తి లేదు.

- సుధాకర్.ఏ.వి

అసోసియేట్ అధ్యక్షులు, STUTS

90006 74747

Advertisement

Next Story

Most Viewed