ఈ ప్రయాణం జీవితాన్ని మారుస్తుంది!

by Ravi |   ( Updated:2024-08-01 01:16:15.0  )
ఈ ప్రయాణం జీవితాన్ని మారుస్తుంది!
X

నాకు జీవితంలో ఏమి చెయ్యాలో అర్థం కావట్లేదు. అలాగే దేనిమీదా ఇంట్రెస్ట్ ఉండట్లేదు. ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి? అనే ప్రశ్న వయసు ఉడిగిన తర్వాత చాలా మందికి ఎదురవుతూనే ఉంటుంది. దీనికి పరిష్కారం ఒకటే.. ఏదో ఒక పని కల్పించుకోవడం. ఇలా చేయడం వల్ల ఏం ఉపయోగం అని మీకు అనిపించవచ్చు. కానీ జీవితంలో వారం రోజులు మీ అన్ని పనులు పక్కన పెట్టి మన చుట్టూ ఉన్న పరిసరాల్లో వ్యక్తుల జీవన స్థితిగతులను, ఆరోగ్య పరిస్థితులను గమనిస్తూ పోండి.

మొదటి రోజు.. ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓపి వార్డ్‌కి వెళ్లి ఓపి రాయించుకుని కూర్చోండి. ఏమీ చెయ్యొద్దు. అక్కడ ఉన్నవారిని గమనించండి. రోగాలతో బాధపడేవారూ, వారి ఆర్థిక స్థితిగతులు, అక్కడి చుట్టూ పరిసరాలు చూడండి. మాట కలిపే మనసు మీకు ఉంటే వారి వ్యధనంతా మీ ముందు ఉంచుతారు. అన్నీ విని ఏం చేయకుండా వెళ్లిపొండి.

రెండో రోజు... ఒక పూట అనాధ శరణాలయానికి మరో పూట వృద్ధాశ్రమానికి వెళ్లండి. ఒకరు ఎవరికి పుట్టామో తెలియని వారు మరొకరు ఎవరి కోసం ఇంతకాలం బతికారో తెలియని వారు. జీవితానికి మొదటి పుటలో ఒకరుంటే చివరి మజిలీ దగ్గరలో మరొకరు ఉన్నారు. వాళ్ల అవసరాలు తెలుసుకోండి, సాధకబాధకాలు వినండి. ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కో కథ!! కళ్ల నీళ్లు పెట్టకుండా ఇంటికి వెళ్లగలరేమో వెళ్లండి.

మూడో రోజు... డబ్బులు, మొబైల్ లేకుండా ఒక కొత్త చోటుకు వెళ్లి ఒక రోజంతా మొత్తం తిరగండి, తినండి!! డబ్బు లేకుండా ఎలా అన్న అనుమానం వచ్చింది కదా... సహాయం అడగండి ఆకలి వేస్తుంది. తినడానికి ఏదైనా పెట్టండి అని ప్రాంక్ వీడియోలు చూస్తూ ఉంటాం కదా అలా ఏ అరటి పళ్ల బండివాడినో, టిఫిన్ బండివాడినో అడిగి తినండి. మీ జీవితంలో అంత రుచికరమైన భోజనం ఎప్పుడూ చేసి ఉండరు. ఉచితంగా వచ్చినందుకు కాదు.. మంచి మనసుతో పెట్టినందుకు!!.

నాలుగవ రోజు... స్మశానం దగ్గరకు వెళ్లండి. భారంగా చేరుకున్న ఒక(రి) అంతిమయాత్ర ఎదురవుతుంది. మాట కలపాలన్నా గొంతు నుండి బయిటికి ఏమీ రాదు. అప్పటికే ఒకలాంటి స్మశాన వైరాగ్యం మిమ్మల్ని చుట్టుకొని ఉంటుంది కనుక మౌనంగా ఇంటికి వెళ్లిపొండి.

ఐదవ రోజు ఎక్కడికైనా ఒక ప్రశాంతమైన వాతావరణం ఉన్న చోటుకి వెళ్లండి. మనుషులు, కాలుష్యానికి దూరంగా ప్రకృతికి దగ్గరగా ఉండే చోటుకు వెళ్లి మౌనంగా మీతో మీరు ఉండండి.

ఆరవ రోజు... మొదటి ఐదు రోజులు మీకు కలిగిన అనుభవాన్ని ఒక పుస్తకంలో రోజుల వారీగా రాయండి. వీలైతే రోజు మొత్తం మౌనంగా ఉండండి. మీ మనసులో ఉన్న సందేహాలు, బాధ, సంశయం ఏదైనా మొత్తం అక్షర రూపంలో పెట్టండి.

ఏడవ రోజు... గుడికి వెళ్లండి..108 ప్రదక్షిణలు చేసి దైవ దర్శనం చేసుకోండి, ఆ గుడి ప్రాంగణంలో మౌనంగా కూర్చుని ధ్యానం చేయండి. మీరు బతుకుతున్న సౌకర్యవంతమైన జీవితాన్ని ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞత తెలపండి.

ఇలా చేయడం వల్ల ఏం ఉపయోగం అని మీకు అనిపించవచ్చు. కానీ ఈ ఏడు రోజుల ప్రయాణంలో మీరు తెలుసుకున్న, చూసిన ప్రపంచానికి..మీరు బతుకుతున్న ప్రపంచానికి మధ్య తేడా ఏమిటో తెలుస్తుంది. అప్పటివరకూ మీరు చూసిన ప్రపంచంలో మీరు చూడలేకపోయిన మరో కొత్త, అందమైన ప్రపంచం ఉందని తెలుసుకుంటారు. ఏది విలువైనదో ఏదికాదో తెలుస్తుంది. మీ దగ్గర ఉన్నది ఏమిటో అర్థమవుతుంది. మీ వంతుగా లేని వారికి ఏం చేయాలో అర్థం అవుతుంది. జీవితం మిమ్మల్ని మీకు కొత్తగా పరిచయం చేస్తుంది. మీ అస్తిత్వానికి అర్థం తెలుసుకుని అది ప్రపంచానికి తెలిసేలా చేయాలన్న సంకల్పం పుడుతుంది. మీలో ఇటువంటి ఆలోచన పుట్టినప్పటి నుండీ మీ జీవితం మీద మీకు శ్రద్ధ, ఆసక్తి పెరుగుతుంది. ఏం చేయాలో తెలియని అయోమ య స్థితి నుండి ఇది చెయ్యాల్సింది అన్న ఆశయం పుడుతుంది. చేసే పని నచ్చుతుంది. నిజానికి మీ పనినీ, జీవితాన్ని, మీ చుట్టూ ఉన్న వారిని కూడా ప్రేమించడం మొదలు పెడతారు.

( వాట్సాప్ నుంచి సేకర్త )

- అరిగే బాలసుబ్రహ్మణ్యం

Advertisement

Next Story

Most Viewed