- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సకల జనుల ఆక్రోశమే ఈ మా(తీ)ర్పు
రైతు బంధు ద్వారా ‘ఎక్కువ ఎకరాలు ఉన్నోళ్ళకు ఎక్కువ పైసలిస్తే, బక్క రైతుకు ఎందుకు అంత కడుపు మంట’ అని కేటిఆర్ అన్నప్పుడు రాష్ట్ర జనం అంతా ముక్కున వేలేసుకున్నారు. ఎందుకంటే ప్రభుత్వ సొమ్మును పెద్ద రైతుకు ఇత్తరా లేక పేద రైతుకు ఇయ్యాల్నా అనే ఇంగిత జ్ఞానం కూడా లేనందుకు. ప్రభుత్వ సొమ్మంటే ప్రజల సొమ్ము. రైతు బంధుకు పైసలు ప్రభుత్వం ఇస్తుంది, అంతేకానీ కల్వకుంట్ల వారి ఇంట్లోకెళ్ళి ఇచ్చేవి కాదు కదా, వారికి నచ్చినట్టుగా భూస్వాములకు కూడా పంచడానికి. వారు పెట్టుబడి లేక ప్రభుత్వ సాయం కోసం పరితపించే దీన స్థితిలో లేరు సుమా!
కేసీఆర్ హామీలు నీటి మూటలు
సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం దళితున్ని ముఖ్యమంత్రి చేయలేదు సరికదా.. కనీసం ఎస్‌సీ వర్గీకరణకు పూనుకోలేదు. ఎస్‌సీ వర్గీకరణ కోసం ఎన్నో ఏళ్ళుగా శాంతియుతంగా పనిచేస్తున్న మందకృష్ణ మాదిగను అసెంబ్లీ సాక్షిగా అవహేళన చేశాడు. స్వయంగా సీఎం కేసిఆర్ తనకు తానే చొరవ తీసుకొని వాసాలమర్రి గ్రామాన్ని ‘బంగారు వాసాలమర్రి’ చేస్తానన్నాడు. రెండేళ్లయినా అదివాసాలను కోల్పోయి ‘బోడ మర్రి’ గానే మిగిలిపోయింది. ఇది కేసిఆర్ ఎంత గొప్పగా పనిచేస్తాడో అనడానికి ఓ మచ్చుతునక మాత్రమే. ఇది ఆ ఒక్క గ్రామం సమస్య కాదు. తను ఇచ్చిన ఈ ఒక్క హామీని కూడా నెరవేర్చని కేసిఆర్, ఆయనలో ‘తుపాకీ రాముడి’ లెక్క గప్పాలు కొట్టే ‘మరో మనిషి’ ఉన్నాడని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. లేటుగానైనా ఏ ఎల్లయ్య, మల్లయ్య మాటలు విని మోసపోక రాష్ట్ర ప్రజానీకమే జర సోయి తెచ్చుకొని ఈ ఎన్నికల్లో స్పష్టమైన తీర్పునిచ్చారు.
సాగదీతే..... సర్కారు సావుమీదికచ్చే
‘ప్రభుత్వ ఉద్యోగులు ద్వారానే ప్రజలకు ప్రభుత్వం నుండి మెరుగైన సేవలు నిష్పక్షపాతంగా, అవినీతికి ఆస్కారం లేకుండా అందుతాయి. జనాభా లెక్కలు చేయడం, పంచాయితీ ఎన్నికల నుండి పార్లమెంట్ ఎలక్షన్లు నిర్వహించడం దాకా కూడా ప్రభుత్వాలకు సహాయపడేది ఈ ఉద్యోగులే. కానీ, కేసీఆర్ వీరిని, దేశంలోనే ఎక్కువ జీతాలిస్తున్నా పని సరిగ్గా చేస్తలేరని వారిని బద్‌నాం చేశాడు. పైగా ప్రభుత్వ ఉద్యోగులకిచ్చే డీఏ బకాయిలు ఏళ్ళకు ఏళ్ళుగా పెండింగ్లో పెట్టాడు. ప్రభుత్వ ఉద్యోగం అంటేనే ఒకటో తారీఖు జీతం వస్తుంది. అటువంటిది వారికి ముందు నెలనెలా జీతం వస్తే చాలు అనేంతగా విసిగివేసారి పోయారు. దేశంలోనే సుసంపన్నమైన రాష్ట్రమని డాంభికాలు కొట్టిన సర్కారు పెద్దలు నెలలో మొదటి వారం తర్వాత కూడా జీతాలు చెల్లించకపాయే. ఇక రెవెన్యూ ఉద్యోగులనైతే లంచగొండులని ముద్రవేసి వారిని దోషులుగా చిత్రీకరించారు. ఇంకా, గ్రామాల్లో పనిచేసే పంచాయితీ సెక్రెటరీ/జేపిఎస్‌లకు వారి ఉద్యోగరీత్యా నిర్వర్తించే విధులకు తోడుగా హరితహారం, పల్లె ప్రకృతి వనం, స్వచ్చత కార్యక్రమాలు, పల్లె ప్రగతి, వంటి ఎన్నో అదనపు పనులు అప్పజెప్పి వారిలో మానసిక ప్రశాంతతను దూరం చేశాడు. ఆర్‌టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండని సమ్మెకు దిగిన కార్మికులను, వారి డిమాండ్ అసాధ్యమని భయపెట్టి వారి న్యాయమైన ఉద్యమాన్ని నీరుగార్చాడు.
అధికారం నెత్తికెక్కడంతో..
సకాలంలో జీతాలు అందక, డిఏ-ఐఆర్ బకాయిల చెల్లింపుల్లో సంవత్సరాల తరబడి ఆలస్యం, రిటైర్మెంట్ వయస్సు పెంపు, గడువుకు ముందే పీఆర్‌సీ వేయకపోవడం, పారదర్శకంగా బదిలీలు చేపట్టకపోవడం, ప్రమోషన్‌లు ఇవ్వకపోవడం, సీపీఎస్ రద్దు చేయకపోవడం, ప్రభుత్వ టీచర్లు ఏ మాత్రం అంగీకరించని 317 జిఓ, సీఎం కేసిఆర్ వారిని తక్కువచేసి అవమానించినట్టుగా మాట్లాడటం తదితర ఉద్యోగ వ్యతిరేక విధానాల వల్ల రాష్ట్రంలోని సుమారు 4 లక్షల 40 వేల ప్రభుత్వ ఉద్యోగులు, 3 లక్షల పెన్షనర్లు తెలంగాణ సర్కారుపై గుర్రుగా ఉన్నారు. ఇక నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు లేవని, ఉన్నా అవి లీకేజీకి గురికావడం పరీక్షలు రద్దు కావడంతో వల్ల రాష్ట్రంలోని దాదాపు 30 లక్షలకు పైగా ఉన్న నిరుద్యోగులు, వారి తల్లిదండ్రుల నుండి బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను చవిచూసింది. ‘కర్ణుని చావుకు వెయ్యి కారణాలన్నట్టు’గా అధికారంతో కళ్ళు నెత్తికెక్కి, తన భజనపరుల పొగడ్తలతో ‘మూర్ఖ్ రాజా’ వలే వ్యవహరించిన సీఎం కేసీఆర్ అండ్ టీమ్‌కి ఇదో ఘోర పరాభవం- చెంపపెట్టు. ఉద్యమాల గడ్డైన తెలంగాణలో సకల జనులు ఇచ్చే ఇటువంటి చారిత్రక తీర్పుల నుండి నేర్చుకున్న వారికి నేర్చుకున్నంత. ఇలా ప్రభుత్వంపై సకల జనుల తీర్పును తమ ఓట్ల రూపంలో చూపించారు ఓటర్లు.
- శ్రీ జనార్దన్