- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కార్మిక హక్కుల సంరక్షణా స్ఫూర్తి
మేడే ఉద్యమం అనేక ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చింది. ఉద్యమ స్వరూప స్వభావాలను తెలుపుతూ భావితర పోరాట యోధులకు ఒక సందేశాన్ని కూడా అందించింది. కార్మికోద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయి, భవిష్యత్తు తరాలకు ప్రేరణ కలిగించే మే 1వ తేదీని ప్రపంచ కార్మిక దినోత్సవంగా శ్రమ జీవులందరూ ఘనంగా జరుపుకుంటున్నారు. ఏ రంగంలో పనిచేసే వారైనా మేడే ఉద్యమ ప్రస్థానాన్ని ప్రస్తావించుకోకుండా ఉండరనేది సత్యం.
కార్మిక లోకాన్ని కమ్ముకున్న సమస్యల కారు మబ్బులను చీల్చుకుంటూ వారి జీవితాలలో వెలుగును ప్రసరింపజేస్తూ ఉద్యమ భానుడు ఉదయించిన తరుణం, హక్కుల సాధనకై జరిగిన పోరాటంలో అమరులైన ఉద్యమ వీరుల త్యాగాలను, పోరాట పటిమను సాధించిన విజయాలను స్మరించే సమయం, ఉద్యమ స్ఫూర్తితో కర్తవ్య నిర్వహణకు ప్రపంచ కార్మికులంతా ఏకమయ్యే చారిత్రాత్మక దినం అదే మేడే కార్మిక దినోత్సవం. కార్మిక సోదరులంతా ఘనంగా నిర్వహించుకునే మేడే ఒక్క కార్మికులకే గాక కార్మిక, కర్షక, శ్రామిక, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి మొదలైన ఏ రంగంలోని వారికైనా హక్కుల పరిరక్షణకై, సమస్యల సాధనకై ఉద్యమించే వారందరికీ స్ఫూర్తిదాయకమైన రోజు అంటే అతిశయోక్తి కాదు.
నాడు పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలలో కార్మికులు సుమారు 16 నుండి 20 గంటలు వరకు పని చేయాల్సిన పరిస్థితి ఉండేది. తమ కష్టంతో ఆయా పారిశ్రామిక రంగాలకు లాభాలను సముపార్జించి పెట్టారు. కానీ యాజమాన్యం కార్మికుల శ్రమను దోచుకుంటూ వారికి సరైన వేతనాలు ఇవ్వకుండా వారి హక్కులను కాలరాసేది. యాజమాన్య నిరంకుశ ధోరణిని నిరసిస్తూ కార్మికొద్యమం మొదలై క్రమంగా ప్రపంచమంతా వ్యాపించింది. ఆ క్రమంలోనే 1886 సంవత్సరం మే 1వ తేదీన అమెరికాలోని చికాగో పట్టణంలో లక్షల మంది కార్మికులు కార్మిక లోకపు కళ్యాణానికై, శ్రామిక లోకపు సౌభాగ్యానికై, న్యాయపరమైన తమ హక్కుల సాధనకై పిడికిలి బిగించి కదం తొక్కుతూ, పదం పాడుతూ ప్రపంచ కార్మికులారా! ఏకం కండి అని నినదిస్తూ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఉద్యమించారు.స్వలాభం తప్ప కార్మికుల సంక్షేమం పట్టని యాజమాన్యం పోలీసుల సహాయంతో ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేసింది. అయితే, ఉద్యమం అణిచిన కొద్ది అంతకంతకు ఎగిసిపడుతూ తీవ్ర రూపం దాల్చింది.
ఈ ఉద్యమాన్ని ఆపడానికి పోలీసులు ఉద్యమకారులపై లాఠీలను ఝుళిపించారు. కాల్పులను కూడా జరిపారు. ఎంతోమంది ఉద్యమకారులకు గాయాలయ్యాయి. కొందరు ప్రాణాలు వదిలారు. ఉద్యమకారుల రక్తంతో తడిసిన నేల ఎరుపెక్కి దౌర్జన్యకారులను హెచ్చరించింది. ఆత్మస్థైర్యం కోల్పోని ఉద్యమకారులు మరింతగా ఉద్యమించారు. ఆ ఉద్యమం ఝంఝా మారుత ప్రభంజనం వలె హోరెత్తుతూ కొనసాగింది. యాజమాన్యం మెడలు వంచింది. ఉద్యమ శక్తి ప్రభావంతో దిగివచ్చిన యాజమాన్యం కార్మికుల డిమాండ్లకు తలవొగ్గింది. తత్ఫలితంగా నాటినుండి 8 గంటలు మాత్రమే పని గంటలుగా నిర్ణయించబడింది. సమాన పనికి సరైన వేతనాలు అమలు చేయబడ్డాయి.
ఏ ఉద్యమం అయినా సఫలం కావాలంటే.. ఆ ఉద్యమ లక్ష్యం, ఉద్యమ నిర్మాణం, పోరాట పటిమ, నాయకత్వం కారణాలవుతాయి. మేడే ఉద్యమం ద్వారా అది స్పష్టమవుతుంది. సహజంగా ఏ ఉద్యమం జరిగినా పాలక పక్షాలు ఉద్యమ నాయకులను ప్రలోభాలతో లేదా భయపెట్టో లొంగదీసుకునే ప్రయత్నం చేస్తాయి. దానికి లొంగిపోయిన నాయకులు ప్రభుత్వంతో రాజీపడి తమ స్వలాభాల కొరకు వారితో చేతులు కలుపుతారు. తమను నమ్మిన సంఘ సభ్యులను భ్రమలో ముంచుతూ ఏమారుస్తారు. చివరకు ఉద్యమాలను భ్రష్టు పట్టిస్తారు. దానివల్ల ఉద్యమ సమూహానికి చెందిన సమస్యలు పరిష్కారం కాకుండా కాకుండా దీర్ఘకాలికంగా కొనసాగుతూ ఉంటాయని గుర్తించి, సమస్యల సాధనకు పోరాటాలే శరణ్యమనే ఉద్యమ స్ఫూర్తితో ముందడుగు వేద్దాం.
( మేడే సందర్భంగా)
- సుధాకర్.ఏ.వి
రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి, STUTS
90006 74747
- Tags
- May day