రాష్ట్ర భవిష్యత్తును..ప్రజలే కాపాడాలి!

by Ravi |   ( Updated:2023-11-22 00:15:35.0  )
రాష్ట్ర భవిష్యత్తును..ప్రజలే కాపాడాలి!
X

ముగ్గురు దురాశ పరుల కుట్రలు, కుతంత్రాలు ఆంధ్రప్రదేశ్‌కు పెను ప్రమాదంగా పరిణమించాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే గుజరాత్, తెలంగాణా అభివృద్ధిలో వెనకబడిపోతాయని, అందుకే జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండాలని మోదీ, కేసీఆర్ అభిలాష. ప్రధాని నరేంద్ర మోడీ- కేసీఆర్- జగన్ ముగ్గురూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సైంధవులే. ఆంధ్రప్రదేశ్ కోలుకోలేకుండా చేయడం కోసం మరోసారి కుట్రలు, కుయుక్తులు, కుమ్మక్కుల రాజకీయం మొదలైంది. ఆంధ్రప్రదేశ్ ఎదుగుదలపై హైదరాబాద్, ఢిల్లీ కేంద్రంగా కుతంత్రాలకు మూడు రాజకీయ పక్షాలు పధక రచన చేస్తున్నాయి. ఈ దుష్ట రాజకీయాన్ని ప్రజలు అర్థం చేసుకోకపోతే ఆంధ్రప్రదేశ్ మరోసారి అగాధంలోకి నెట్టబడే ప్రమాదం లేకపోలేదు.

మితి మీరిన అత్యాశ అధికార యావ ఉన్న వ్యక్తులు దేనికైనా ఎంతకైనా సిద్ధపడతారు అనడానికి జగన్, మోడీ, కేసీఆర్ ఈ ముగ్గురు వ్యక్తుల మనస్తత్వం ఒక్కటే. ఆంధ్రా విద్వేషి అయిన కేసీఆర్ నాయకత్వంపై ఆధారపడి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేందుకు మరోసారి ప్రయత్నిస్తున్నారు. మరోసారి చంద్రబాబును అధికారానికి దూరంచేస్తే అటు శ్రీశైలం, ఇటు నాగార్జునసాగర్‌లో నీటి దోపిడీకి పాల్పడవచ్చునని, రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకం జరగకుండా అడ్డుకోవచ్చని, ఆంధ్రప్రదేశ్‌కి ఇవ్వాల్సిన విద్యుత్ బకాయిల్ని ఎగవేయచ్చునని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకుండా అడ్డుపడవచ్చునని కేసీఆర్ వ్యూహం. కేసీఆర్, మోదీ సహకారంతో మరోసారి తాను అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్న జగన్ రెడ్డి ఐదు కోట్ల ప్రజలను మరోసారి బకరాలను చేయడానికి సిద్దపడ్డారు.

జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే…

తెలంగాణ లోనూ, దేశంలోను కాంగ్రెస్ గెలవకూడదు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు కూడా అధికారంలోకి రాకూడదని కమలనాధుల ఆలోచన. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే బీజేపీకి పెద్ద ప్రమాదం అనే ఆలోచనతో తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు లోపాయికారిగా కలిసి పనిచేస్తున్నాయి. మోదీ, షా ద్వయం తెలంగాణలో ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడకూడదని సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అందుకే అవసరాన్ని బట్టి ఎన్నికల తర్వాత బీజేపీతో కలుస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చారని సమాచారం. కాంగ్రెస్‌ పార్టీని అధికారానికి దూరంగా ఉంచడానికే ఈ రెండు పార్టీలూ రాజీపడి ఎన్నికల్లో లాలూచి పోరాటం చేస్తున్నాయి. తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రాకపోయినా పర్వాలేదు, తెలంగాణాలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌‌లో జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి రావాలనే పథకంలో భాగంగానే జగన్ రెడ్డికి అన్నీ విషయాల్లో పూర్తిగా సహకరిస్తున్నారు.

తెలంగాణలో జరగబోతున్న ఎన్నికల్లో ఓటర్ల ఆలోచనల్లో మార్పు కనిపిస్తుంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ వ్యవహార శైలి పట్ల అన్ని వర్గాలలో వ్యతిరేకత ఉంది. సీమాంధ్రులు మొదటి నుంచి కేసీఆర్‌కు అండగా ఉంటున్నారు. అయితే, ఇప్పుడు వారి ఆలోచనల్లో కూడా మార్పు కనిపిస్తున్నది. కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి అయితే ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ఎన్నికల్లో మరోసారి జగన్‌కు మేలు చేస్తారని, జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ గురించి మర్చిపోవాల్సి వస్తుందని సీమాంధ్రుల్లో మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణలో అభివృద్ధి పరుగులు తీయాలంటే జగన్ రెడ్డే అధికారంలో వుండాలని, అమరావతి నిర్మాణ పురోగతి కుంటుపడాలని కేసీఆర్ కోరుకోవడంలో తప్పులేదు. మరి విభజనతో ఆగమైన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల సంగతి ఏమిటి? ఏపీలో జగన్ రెడ్డి అధికారంలోకి వస్తే అణిగిమణిగి పడి ఉంటారని కేసీఆర్ భావన. హైదారాబాద్లో జగన్‌కు సంబంధించి బోలెడు ఆస్తులున్నాయి. జగన్‌పై విచారణలో వున్న కేసుల మూలాలన్నీ హైదరాబాద్ లోనే వున్నాయి. దీంతో జగన్ రెడ్డిని లొంగదీసుకోవడం సులువు అవుతుందని భావిస్తున్నారు.

కుప్పగూలిన రియల్ ఎస్టేట్

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఓడించడానికి కేసీఆర్ ఎనలేని కృషి చేసిన విషయం అందరికి తెలిసిందే. అతి కొద్ది సమయంలో అంతర్జాతీయ స్థాయిలో అమరావతికి వచ్చిన బ్రాండ్ ఇమేజ్‌ను, అంతర్జాతీయ వేదికలపై అమరావతిపై జరుగుతున్న చర్చను, అక్కడికి వస్తున్న పెట్టుబడులు చూసి ఓర్చుకోలేక పోయిన కేసీఆర్ కుట్రలకు తెరతీశారు. తెరవెనుక మంత్రాంగం నడిపి అమరావతిని పురిటిలోనే చంపేయాలని కంకణం కట్టుకొని జగన్‌కి మూడు రాజధానుల సలహా ఇచ్చి అమరావతి రెక్కలు విరిసి ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని కూడా లేకుండా చేశారు. అద్భుత రాజధాని నిర్మాణం జరిగితే చంద్రబాబుకి పేరు వస్తుందన్న దుష్ట బుద్దితో కేసీఆర్‌లో ద్వేషం, ఈర్ష్యా, అక్కసు ఉగ్రరూపం దాల్చాయి. తన మనుషులను ఏపీకి పంపి జగన్‌కి అనుకూలంగా ప్రచారం చేయించడంతో పాటు జగన్‌కి వందల కోట్ల రూపాయల ధన సహాయం చేసి జగన్ అధికారంలోకి రావడానికి ఎంత చెయ్యాలో అంత చేసి నేడు ఆంధ్రప్రదేశ్‌ను బలిపీఠం పైకి నెట్టారు కేసీఆర్.

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్ ఒక వెలుగు వెలిగింది. పెద్ద ఎత్తున హైదరాబాద్ నుండి రియల్టర్లు అమరావతికి బారులు తీరారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ కుప్పకూలింది. ప్రపంచం అంతా అమరావతి వైపు చూసింది. ఎప్పుడైతే మూడు రాజధానుల ప్రకటన వచ్చినదో అప్పుడే అభివృద్ధి బాట పట్టిన ఆంధ్రప్రదేశ్ తిరోగమన బాటపట్టింది. చంద్రబాబు సీఎంగా వున్నప్పుడు కంపెనీలు, పెట్టుబడులు అన్నీ ఆంధ్రప్రదేశ్‌కి తరలించుకు పోయారని, ఇప్పుడు ఆ బాధలేదని రియల్ ఎస్టేట్ రంగం బాగా కోలుకొన్నదని కేటీఆర్ కూడా అన్నారు. పక్క రాష్ట్రంలో రాజధాని పనులు ఆపేయడం, ఇసుక ఆపేయడం మూలంగా మన రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగానికి కలిసొచ్చిన అదృష్టం అని బిల్డర్ అసోసియేషన్ మీటింగ్‌లో హరీష్ రావు కూడా అన్నారు.

ఇక్కడ ఫట్.. అక్కడ హిట్

2019 ఎన్నికలకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ ముఖ్యులతో మాట్లాడుతూ, ఆంధ్రాలో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితే హైదరాబాద్‌ రియల్‌ ఎస్టెట్‌ రంగం దెబ్బతినే ప్రమాదముందని, జగన్‌రెడ్డి అధికారంలోకి రావడం తమకు మంచిదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆయన ఊహించినట్టుగానే జరిగింది. ఫలానా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆ రాష్ట్ర ప్రజల అదృష్టం అని పొరుగు రాష్ట్రాల వారు చెప్పుకొంటారు. ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా జగన్‌రెడ్డి ఉండటం తమ అదృష్టమని తెలంగాణ వాసులు సంబరపడ్డారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతూనే ఉంది. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్‌లో అధోగతి పాలు అయింది. తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేసినా ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. ప్రభుత్వ ఆస్తులు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితి ఇందుకు పూర్తీ విరుద్ధంగా ఉంది.

నాయకులు కాదు.. రాష్ట్రం గెలవాలి

గత నాలుగున్నరేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరిగినా తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించింది బీజేపీ. ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వే జోన్, కడప ఉక్కు పరిశ్రమ వంటి అనేక విభజన హామీలు, విశాఖ ఉక్కు అమ్మకం వంటి అనేక విషయాల్లో ఆంధ్రప్రదేశ్ ద్రోహిగా నిలిచింది బీజేపీ. రాజధాని అమరావతి మూలన పడడానికి, పోలవరానికి అతీగతీ లేకపోవడానికి, రాష్ట్రం దివాలా అంచుకు చేరడానికి, ప్రతిపక్ష నాయకుడు పై అక్రమ కేసులు పెట్టి వేధించడానికి కారణమైన జగన్మోహన్‌ రెడ్డికి బీజేపీ ఆశీస్సులు అందించడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజలు కూడా రాష్ట్రాన్ని ఒడ్డున వేయడం ఎలా, ఒడ్డున వెయ్యగల నాయకుడు ఎవరు అని ప్రజలు ఆలోచించాలి. పార్టీలు గెలవడం కాదు రాష్ట్రం గెలవాలి. అధోగతి పాలైన రాష్ట్రం తిరిగి అభివృద్ధి పట్టాలపైకి ఎక్కాలి అంటే ఎవరి వల్ల సాధ్యమో వారే గెలవాలి. ఎవరికీ అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని బాగుచేస్తారో ప్రజలు తెలుసుకోవాలి. నాయకులు గెలిచి రాష్ట్రం, ప్రజలు ఓడిపోకూడదు. దేశంలో అంతర్భాగమైన ఆంధ్రప్రదేశ్‌ను కాపాడుకొనే బాధ్యత ప్రజల ఉంది. ఎవరి వైఖరి ఎలా ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో మాత్రం రాష్ట్రం గెలవాలి. అప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్‌ తల ఎత్తుకొని నిలబడుతుంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత ఆంధ్రుల పైన ఉంది. బీఆర్ఎస్, బీజేపీ, కుట్రలను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్- బీజేపీ- వైసీపీల ఆట ప్రమాదకరమైనది. ఓటు అనే ఆయుధంతో కుట్రలకు అడ్డుకట్ట వేయాలి. కుట్రదారుల ఓటమే మన ఆంధ్రప్రదేశ్‌కి శ్రీరామరక్ష అనే విషయాన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తించాలి. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ గెలవాలన్నదే ప్రజల ప్రధాన ఎజెండా కావాలి. కేసీఆర్‌-మోదీ వంటి వారు జగన్మోహన్‌ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా గెలవాలని కోరుకుంటారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో తమను పాలించేవారు ఎవరు కావాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలే నిర్ణయించుకోవాలి. రాజకీయ నాయకులకు వారి ఎజెండాలు వారికి ఉంటాయి. ప్రజలకు మాత్రం తమ భవిష్యత్తు మాత్రమే ఎజెండాగా పెట్టుకోవాలి.

నీరుకొండ ప్రసాద్

9849625610

Advertisement

Next Story

Most Viewed