సంతానోత్పత్తికి పెను ముప్పు

by Ravi |   ( Updated:2022-09-03 17:59:37.0  )
సంతానోత్పత్తికి పెను ముప్పు
X

హార్డ్ ప్లాస్టిక్, ఆహార నిల్వ పాత్రలు, ఏటీఎంలలో వాడే నగదు రసీదుల నుంచి వెలువడే 'బిస్‌ఫినాల్‌-ఎ' రసాయనం వలన పురుషులలో శుక్ర కణాల గణన తగ్గడం, జననేంద్రియ కాన్సర్‌ రావడం లాంటివి జరుతాయని వివరించారు. ఈ రసాయనం వలన పురుషులలో అంగస్తంభన సమస్య, శుక్ర కణ నాణ్యత తగ్గడం, కామేచ్ఛ పడిపోవడం జరుగుతుంది. ఇదే రకమైన దుప్షలితాలను ప్లేమ్‌ రిటార్డెంట్లు, మరి కొన్ని పెస్టిసైడ్లు (అట్రాజిన్‌ లాంటివి) కూడా కలిగిస్తాయని గమనించాలి. బాల్యం, కౌమార దశ, యుక్త వయసులో ఇలాంటి ప్రమాదకర రసాయనాలకు మనం లోనైనపుడు పునరుత్పత్తి అవయవాలు ప్రతికూలంగా ప్రభావితం అవుతాయి.

'విశ్వ మానవాళి సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కోనబోతున్నది. పురుషులలో శుక్ర కణాల గణన రేటు తగ్గిపోతున్నది. మహిళలతో పాటు పురుషులలోనూ పునరుత్పత్తి వ్యవస్థ దుష్ప్రభావానికి గురి కావడం లాంటి లాంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. దీంతో మానవ జాతి భవిష్యత్తు ఉనికి ప్రమాదంలో పడనుంది' అంటున్నారు అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన ప్రొఫెసర్‌ షన్నా హెచ్‌. స్వాన్, స్టాసీ కొలీనో. వీరిద్దరూ కలిసి అనేక పరిశోధనలు, పరిశీలనల తరువాత సంయుక్తంగా రచించిన పుస్తకం 'కౌంట్‌డౌన్‌'లో అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఎన్విరాన్‌మెంటల్‌ మెడిసిన్‌, పబ్లిక్‌ హెల్త్ విభాగంలో ప్రొఫెసర్‌గా అపార అనుభవం ఉన్న షన్నా హెచ్‌. స్వాన్‌ పరిశోధన ఫలితాల ఆధారంగా పలు సూచనలు చేశారు.

నవ్య మానవ జాతి జీవన శైలి లో వచ్చిన మార్పుల కారణంగా, ప్రమాదకర రసాయనాలు కొన్ని శరీరంలోని హార్మోన్లకు అంతరాయము కలిగిస్తూ పునరుత్పత్తి సామర్థ్యాన్ని తగ్గిస్తున్నాయనే భయానక వాస్తవాన్ని వెల్లడించారు. పర్యావరణ కాలుష్యం, ప్రమాదకర రసాయనాలు, వాతావరణ ప్రతికూల మార్పుల ఫలితంగా మహిళలు, పురుష పునరుత్పత్తి అవయవాలు అసాధారణ మార్పులకు గురి కావడం జరుగుతుందని తెలియజేశారు. 2045 నాటికి జంటలు ప్రత్యామ్నాయ పునరుత్పత్తి మార్గాలను (సంతాన సాఫల్య కేంద్రాలు) లాంటి వాటిని అన్వేషిస్తారని వివరించారు. గత 40 ఏండ్లలో పురుషుల స్పెర్మ్ కౌంట్‌ సగానికి పైగా తగ్గడాన్ని వారు గమనించారు. 35 సంవత్సరాలు దాటిన మహిళలలో సంతానోత్పత్తి క్షీణత గమనించామని, గర్భస్రావ రేటు పెరుగుతోందని హెచ్చరించారు.

ప్రమాదకర రసాయనాల వలన

ఆధునిక మానవ జీవన శైలిలో మనం వాడే వస్తువుల ద్వారా వెలువడే రసాయనాలు, శరీరంలోని పునరుత్పత్తికి దోహదం చేసే టెస్టోస్టెరాన్‌, ఈస్ట్రోజెన్ లాంటి‌ హార్మోన్లకు ఇబ్బందికరంగా మారడంతో సంతానోత్పత్తి మందగించడాన్ని వారు గమనించారు. ఆహార పదార్థాల ప్యాకింగ్‌, తయారీ, ప్రాసెసింగ్‌లలో వాడే సాఫ్ట్‌ ప్లాస్టిక్‌లలో వెలువడే 'థాలేట్' రసాయనాలు అతి ప్రమాదకరంగా మారుతూ తొందరగా యుక్త వయస్సుకు రావడం, గర్భస్రావాలు పెరగడం, అండాశయ వైఫల్యం, అకాల ప్రసవాలు లాంటి దుష్పరిణామాలు కనిపిస్తాయని వెల్లడించారు. హార్డ్ ప్లాస్టిక్, ఆహార నిల్వ పాత్రలు, ఏటీఎంలలో వాడే నగదు రసీదుల నుంచి వెలువడే 'బిస్‌ఫినాల్‌-ఎ' రసాయనం వలన పురుషులలో శుక్ర కణాల గణన తగ్గడం, జననేంద్రియ కాన్సర్‌ రావడం లాంటివి జరుతాయని వివరించారు.

ఈ రసాయనం వలన పురుషులలో అంగస్తంభన సమస్య, శుక్ర కణ నాణ్యత తగ్గడం, కామేచ్ఛ పడిపోవడం జరుగుతుంది. ఇదే రకమైన దుప్షలితాలను ప్లేమ్‌ రిటార్డెంట్లు, మరి కొన్ని పెస్టిసైడ్లు (అట్రాజిన్‌ లాంటివి) కూడా కలిగిస్తాయని గమనించాలి. బాల్యం, కౌమార దశ, యుక్త వయసులో ఇలాంటి ప్రమాదకర రసాయనాలకు మనం లోనైనపుడు పునరుత్పత్తి అవయవాలు ప్రతికూలంగా ప్రభావితం అవుతాయి. హార్మోన్లకు అంతరాయం కలిగించే ఇలాంటి రసాయనాలతో 1960 నుంచి 2018 వరకు ఏడాదికి ఒక శాతం చొప్పున సంతానోత్పత్తి రేటు తగ్గుతుందని గుర్తించారు. 2000 నుంచి 2016 మధ్య కాలంలో పిల్లలలో ఏడాదికి 1.1 శాతం మూగవ్యధి (ఆటిజమ్‌ స్పెక్రమ్‌ డిసార్డర్‌) పెరుగుతున్న విషయాన్ని కూడా వారు గమనించారు.

వాటి వాడకం తగ్గించాలి

మానవాళి తరుచుగా వాడే సాఫ్ట్‌, హార్డ్ ప్లాస్టిక్ వస్తువులలో ఇలాంటి హార్మోన్లను ప్రభావితం చేసే ప్రమాదకర రసాయనాలు లేకుండా చూసుకోవాలి. ప్రాసెస్‌డ్ ఆహారానికి దూరంగా ఉండాలి. క్యారెట్‌/ పొటాటోలాంటి ముడి కూరగాయలను వాడకూడదు. ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలి. ఆహారాన్ని ప్లాస్టిక్‌లో నిలువ ఉంచకూడదు. థాలేట్లు / బిస్‌ఫినాల్‌కు బదులుగా సురక్షిత ప్రత్యామ్నాయ రసాయనాలు వాడాలి. టెఫ్లాన్‌ కోటింగ్‌ లేని పాత్రలలో వండడం, ప్లాస్టిక్‌ పాత్రలను ఓవెన్‌లో పెట్టకపోవడం, ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్ వినియోగాన్ని నిషేధించడం, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల వాడకాన్ని తగ్గించడం లాంటి చర్యలు ఆరోగ్య సమస్యల తీవ్రతను తగ్గిస్తాయి. గర్భిణులు ఇలాంటి రసాయనాలకు మాత్రమే కాకుండా గాలి కాలుష్యానికి, ప్లాస్టిక్‌ పాక్డ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఆధునికత పేరుతో నవ్య మానవుడు తన గోతిని తానే తవ్వుకోవడం జరుగుతోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే భావనను మేల్కొలిపి, సుందర సుమధుర భవిష్యత్తుకు పునాదులు వేసుకుందాం. ఆరోగ్య పరిరక్షణ వైపునకు నవ్య యువ అడుగులు పడాలని ఆశిద్దాం. మన అస్థిత్వానికి మనమే పట్టం కడదాం.

డా. బుర్ర మధుసూదన్ రెడ్డి

కాన్‌బెరా, ఆస్ట్రేలియా

99497 0003

Advertisement

Next Story

Most Viewed