రాష్ట్ర అవతరణ వేడుకలు ఎవరి కోసం?

by srinivas |   ( Updated:2024-06-02 00:15:53.0  )
రాష్ట్ర అవతరణ వేడుకలు ఎవరి కోసం?
X

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం మరో మారు సిద్ధమవుతోంది. రాష్ట్రాన్ని తెచ్చామని కొందరు చెప్పుకుంటుంటే, ఇచ్చామని కొందరు ప్రచారం చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం సాధ్యమైనది ఎవరితోనన్నది మాత్రం చెప్పేవారు కరువయ్యారు. ఐదు దశాబ్దాల కాలంలో, నాలుగున్నర కోట్ల ప్రజలు అనేక రూపాలలో సాగించిన అసమాన పోరాటాల చరిత్ర మరుగున పడిపోతున్నది. వందలాది ఉద్యమకారుల త్యాగాలు, జరిగిన బలిదానాలకు గుర్తింపు కరువైంది. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితులలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, బుద్ధిజీవులు, విద్యార్థులు, యువకులు కలిసికట్టుగా మరోమారు హక్కుల సాధనా పోరాటానికి సమాయత్తం కావాలి. అమరుల త్యాగఫలమైన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులను ఆహ్వానించకుండా, వారి సంక్షేమం, అభివృద్ధి ఊసే లేకుండా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పూనుకోవడమన్నది అత్యంత శోచనీయం.

భౌతిక తెలంగాణ సాధ్యమైంది

మా నీళ్లు, మా నిధులు, మా ఉద్యోగాలు, మా భూములు మాకే కావాలంటూ మమ్మల్ని మేమే పాలించుకుంటామని సాగించిన ఆత్మగౌరవ పోరాటం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం. నీళ్లు, నిధులు, నియామకాలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే స్వపాలకుల ద్వారా సాధ్యమవుతుందని ఆశపడ్డారు. ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే పొలిమేరల దాకా తన్ని తరుముదాం.., ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాతర వేద్దాం... అన్న కాళోజి మాటలు యువతరాన్ని ఉర్రూతలూగించాయి. తెలంగాణ జన సభ, తెలంగాణ మహాసభ, తెలంగాణ ఐక్య వేదిక, తెలంగాణ ఐక్యకార్యాచరణకమిటీ, తెలంగాణా ప్రజా ఫ్రంట్ వంటి ప్రజా సంఘాలు ప్రజలను కదిలించాయి. అంబేద్కర్ రాజ్యాంగంలో పేర్కొన్న మూడవ అధికరణ ఆసరాగా పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టి, రాజకీయ పార్టీలన్నీ తప్పనిసరై ఆమోదించారు. దానితో కేవలం భౌగోళిక తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఏర్పడిందన్నది నిర్వివాదాంశం.

తంతుగా సాగిన ఆవిర్భావ దినోత్సవాలు

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమ సమస్యలన్నీ తీరుతాయని ప్రజలు కలలుగన్నారు. కానీ, ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియా, మట్టి మాఫియా, గ్రానైట్ మాఫియా... ఇలా అన్ని రంగాలలో మాఫియా కోరలు సాచింది. తెలంగాణ వనరులన్నీ దోపిడికి గురయ్యాయి. పాలకుల హామీలన్నీ ఎండమావులయ్యాయి. ఉత్తర తెలంగాణ అంతటా విస్తరించిన సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్ల సమస్యపై ఎలాంటి హామీ లేదు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ, సిర్పూర్ కాగజ్ నగర్ కాగిత పరిశ్రమ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, నిజామాబాద్ పసుపు బోర్డు ఏర్పాటు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉండిపోయాయి. ఫార్మాసిటీ రద్దు హామీ నెరవేరలేదు. మహబూబ్ నగర్‌లో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతూనే ఉంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందన్న ఆశ ఆచరణకు నోచుకోలేదు. స్వరాష్ట్రంకై తెగించి పోరాడిన ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులు తెలంగాణ ప్రభుత్వం ఇంకా తొలగించనే లేదు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగడం ఇంకెంత మాత్రం సబబు కాదని తెలంగాణ ప్రభుత్వం గుర్తించాలి. ప్రజల స్థితిగతుల్లో పెద్దగామార్పు లేకుండానే, ఇంతకాలం తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఒక తంతుగా మాత్రమే జరుగుతూ వచ్చాయి

ఆశలు నెరవేరేదెన్నడు?

ప్రియమైన ప్రజలారా! పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆశలు అడియాశలు అయ్యాయి. అందరికీ ఉచిత విద్యా - వైద్యం అందుబాటులోకి రాలేదు. పౌర ప్రజాస్వామిక హక్కులు దోబూచులాడుతున్నాయి. కొత్త రాష్ట్రంలో ఆకాంక్షలు అడుగంటడంతో నిరాశా నిస్సృహాలు ఆవరించాయి. ఎవరిపై పోరాటం చేయాలో స్పష్టత లేక అయోమయంలో పడ్డారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎవరికోసం అన్న ప్రశ్న? వివిధ వర్గాల ప్రజలలో తలెత్తింది. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పాలకులు ఒక ప్రహసనంలా మార్చడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజల కలలు కల్లలవడమే ఇందుకు ప్రధాన కారణం. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితులలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, బుద్ధిజీవులు, విద్యార్థులు, యువకులు కలిసికట్టుగా మరోమారు హక్కుల సాధనా పోరాటానికి సమాయత్తం కావాలి. తెలంగాణ ప్రజల డిమాండ్లు అన్ని ఎన్నికల వాగ్దానాలు గానే మిగిలిపోతున్నాయి. ప్రజాస్వామిక తెలంగాణ రాష్ట్ర సాధనకై ఉద్యమించడం ద్వారానే ప్రజల ఆశలు నెరవేరుతాయి. అందుకు ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణనే పరిష్కారం. ఇప్పటికైనా పాలకులు ప్రజల ఆకాంక్షలను గౌరవించి, ఆశయాలను నెరవేర్చలేకపోతే, దేశంలోనే అత్యంత చైతన్యవంతమైన తెలంగాణ ప్రజలు పాలకుల అనుచిత ధోరణులను సహించరు, క్షమించరు. ఇది త్యాగాల, గాయల తెలంగాణ చరిత్ర చాటిన సత్యం.

రమణా చారి, 99898 63039

సీనియర్ తెలంగాణా ఉద్యమకారుడు

Advertisement

Next Story

Most Viewed