- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విశ్వబంధువు ఖురాన్
'నా ప్రభువుతో మాట్లాడాలనుకుంటే నమాజు కోసం నిలబడతాను. అల్లాహ్ మాటలు వినాలనుకుంటే ఖురాన్ గ్రంథాన్ని తెరచి కూర్చుంటాను. చదువుతాను' అంటారు సహెల్ బిన్ అబ్దుల్లాహ్. ముస్లిములు ఖురాన్ గ్రంథాన్ని అల్లాహ్ వాక్కుగా విశ్వసిస్తారు. స్వయంగా ఖురాన్ రెండో అధ్యాయం మొదటి వాక్యంలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. 'ఇది అల్లాహ్ గ్రంథం' అని ఆ అధ్యాయం మొదలవుతుంది. ఇందులో ముఖ్యంగా దైవాజ్ఞలు, దైవానుగ్రహాల ప్రస్తావన, తోటివారి పట్ల వ్యవహారం, పరలోక జీవితం, మరణ ప్రస్తావన, పూర్వ జాతుల దృష్ట్యాంతాలు, ఉదాహరణలతోపాటుగా హెచ్చరికలు కూడా ఉన్నాయి. శుభవార్తలూ ఉంటాయి. ఆధారాలు, నిదర్శనాలతోపాటు శాసనాలూ ఉంటాయి. మృధుభాష్యంతోపాటు ఆగ్రహావేశాలతో కూడిన గర్జన కూడా ఉంటుంది.
ఖురాన్ సురక్షిత గ్రంథం. నాడు ఖురాన్ పదాలు, వచనాలు అవతరించినప్పుడు ఎలా ఉన్నాయో, ఇప్పుడూ అలానే ఉన్నాయి. ఖురాన్ వ్యాసరూపంలో ఉండదు. ఉపన్యాస ఒరవడిలో ఉంటుంది. అందులోని ప్రవచనాలన్నీ ఉపన్యాసాల మాదిరిగానే ఉంటాయి. సకల లోకాల ప్రభువు తన భూలోకవాసులను ఉద్దేశించి చేసే ప్రసంగాల సమాహారమే ఖురాన్. దీనిని కంఠస్థం చేసుకోవడం, ఇతరులకు నేర్పడం గురించి ప్రవక్త (స) తన సహచరులను ప్రోత్సహించేవారు. ఖురాన్ చదవండి. ప్రళయదినాన తనను పఠించేవారికి అనుకూలంగా సిఫారసు చేస్తుంది అని చెప్పేవారు.
సులువుగా పఠనం
ఖురాన్ 114 భాగాలలో విభజితమై ఉంది. ఈ భాగాలను సూరాలు అంటారు. ప్రతి సూరాలో ఓ ప్రధానాంశం ఉంటుంది. సూరాలోని ప్రత్యేక పరిమాణంలో ఉన్న వచనాలను ఆయత్‌లు అంటారు. వాటి హద్దులను నిర్ధారించింది కూడా అల్లాహ్‌యే. కొన్ని ఆయతులు ఒకట్రెండు పదాలతో ముగిస్తే మరికొన్ని ఆయతులు పది పదిహేను పదాలతో ముగుస్తాయి. కొన్ని ఆయత్‌లు కలిస్తేనేగానీ ఒక వాక్యం పూర్తికాదు. ఇందులో వాక్యాలన్నీ అంత్యప్రాసతో ముగుస్తాయి. ఆనాటి అరబ్బులు ప్రాసను మరీ ఇష్టపడేవారు. ఖురాన్ కంఠస్థం చేసుకోవడానికి ఎంతో సులువుగా ఉంటుంది. ఖురాన్ పరిరక్షణ కోసం అల్లాహ్ చేసిన ఇదొక వెసులుబాటు. ఖురాన్ అవతరణలను మక్కీ సూరాలు, మదనీ సూరాలుగా విభజించారు. హిజ్రత్ వలసకు పూర్వం అవతరించిన సూరాలను మక్కీ (మక్కా) సూరాలుగా అభివర్ణించారు. హిజ్రత్ (వలస) తరువాత అవతరించిన సూరాలను మదనీ సూరాలుగా పేర్కొన్నారు.
ముఖ్యమైన పారిభాషిక పదాలు
ఖురాన్‌లో ముఖ్య పారిభాషిక పదం 'అల్లాహ్' అద్వితీయుడు, మానవాతీత గుణాలు కలవాడు అన్నది దీని అర్థం. నబీ, రసూల్ (ప్రవక్త, సందేశహరుడు), మానవుల నుంచే ప్రవక్తలు ఎంపికవుతారు. ప్రపంచం ఉనికిలోకి వచ్చినప్పటినుంచి లక్షా పాతికవేల మంది ప్రవక్తలు వచ్చారని అంతి ప్రవక్త చెప్పారు. ఖురాన్‌లో మూడవ ముఖ్య పారిభాషిక పదం 'వహీ' అల్లాహ్ తరపున అవతరించే మార్గదర్శక సూచనలను వహీ అంటారు. ఖురాన్‌లో మలాయిక (దైవదూతల ప్రస్తావన) మాటిమాటికీ వస్తుంది. దైవవాణిని ప్రవక్తలకు చేరవేయడంలో వారు వారధిగా ఉన్నారు.
సామాన్య ప్రజలకు అగోచరంగా ఉంటారు. ఖురాన్ పరిచయం చేసిన జీవన విధానమే 'ఇస్లామ్' నిఘంటువు ప్రకారం ఇస్లామ్ అంటే విధేయతా భావంతో దైవం ముందు తలవంచడమని అర్థం. శాంతి అనేది మరో అర్థం. ఖురాన్ పారిభాషికాలలో 'మోమిన్' కూడా ప్రధానమైనది. దైవవిధేయతకు కట్టుబడినవాడే మోమిన్. అల్లాహ్‌ను, అంతిమ దినాన్ని, దైవదూతలను, దైవ గ్రంథాన్ని, ప్రవక్తలనూ విశ్వసించినవారిని మోమిన్ అంటోంది ఖురాన్.
ఖురాన్ సిఫారసు చేస్తుంది
తనను విస్తృతంగా పఠించేవారికి అనుకూలంగా ప్రళయదినాన ఖురాన్ అల్లాహ్‌కు సిఫారసు చేస్తుందని ప్రవక్త (స) చెప్పారు. ఖురాన్ గ్రంథాన్ని అవగాహన చేసుకుంటే ఎన్నో జీవన నైపుణ్యాలు అలవడతాయి. 'ఎవరైతే ఖురాన్ చదవడం రాకపోయినప్పటికీ తడబడుతూ, బహుకష్టంగా పఠిస్తాడో ఇలాంటి వారికి రెండింతల పుణ్యం లభిస్తుందని ప్రవక్త (స) చెప్పారు. ఖురాన్ చదివేవారిపై ప్రశాంతత ఆవరిస్తుంది. ఇంటిలో ఖురాన్ చదవడం వల్ల సైతాన్ పారిపోతాడు అన్నది ప్రవక్త బోధన. ఖురాన్‌లోని ఒక్క వాక్యమయినా చదివి వేడుకునే విన్నపం అల్లాహ్ ఆమోదిస్తాడు. ఒక్కో అక్షరానికి బదులు పది పుణ్యాలు లభిస్తాయి. ఖురాన్ చదివి, ఆచరణలో పెట్టిన తల్లిదండ్రులకు ప్రళయదినాన కిరీటం తొడిగించబడుతుందని ప్రవక్త (స) చెప్పారు.
ఖురాన్ బోధనలు
భువిలో అలజడిని రేపుతూ తిరగకండి. ఇచ్చిన మాటపై నిలబడండి. లంచగొండితనానికి పాల్పడకండి. ధర్మం విషయంలో బలవంతం ఏమీ లేదు. తమ ఉపకారాన్ని చాటుకుని చేసిన దానాన్ని వృధా చేసుకోకండి. వడ్డీ సొమ్ము తినకండి. రుణగ్రస్తుడు ఇబ్బందులలో ఉంటే అతని పరిస్థితి మెరుగుపడేవరకూ అతనికి గడువు ఇవ్వండి. నమ్మకాన్ని వమ్ము చేయకండి. ఇతరుల మాటలు గోడచాటుగా వినకండి. చాడీలు చెప్పకండి. కోపాన్ని అణచుకోండి. మొరటుగా మాట్లాడకండి.
ఆస్తిలో మహిళలకు కూడా భాగం ఉంది.అనాథల సొమ్మును కాజేయకండి. ఇతరుల ధనాన్ని అన్యాయంగా కాజేయకండి. అందరితో ఆప్యాయంగా మెలగండి. పిసినారితనం చూపకండి. ఇతరులపై అసూయ చెందకండి. ప్రజల మధ్య తీర్పులు చేసేటప్పుడు న్యాయంగా వ్యవహరించండి. సారాయి, మత్తుపదార్థాల జోలికి వెళ్లకండి. ఇతరులు ఆరాధించేవాటిని దూషించకండి. కొలతలు తూనికలలో న్యాయంగా వ్యవహరించండి. అహంకారం చూపకండి. ఇతరుల తప్పులను మన్నించండి. పరిశుద్ధతను పాటించండి. తల్లిదండ్రులతో ఉత్తమంగా వ్యవహరించండి. దారిద్య్ర భయంతో సంతానాన్ని చంపేయకండి. వ్యభిచారం దరిదాపులకు కూడా పోకండి. ప్రజలతో మృదువుగా మాట్లాడండి. ఇతరులను ఎగతాళి చేయకండి. అతిగా అనుమానించకండి.
(నేడు లైలతుల్ ఖదర్, ఖురాన్ అవతరణ దినోత్సవం)
ముహమ్మద్ ముజాహిద్
96406 22076