- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అటవీ చట్ట సవరణ..ఎవరి ప్రయోజనాల కోసం?
కేంద్రం అటవీ (సంరక్షణ) చట్టం 1980కి చేసిన సవరణలను ఎటువంటి చర్చ లేకుండానే 20 నిమిషాల్లో పార్లమెంట్ ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటించటం చూస్తే, మోడీ ప్రభుత్వం చర్చకు ఎంతగా భయపడిందో అర్థమౌతుంది. అసలు సవరణలు ఎందుకు చేయాల్సి వచ్చింది, సవరించిన చట్టం వలన ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? అటవీ భూములను పరిరక్షించటానికా లేక అన్యాక్రాంతం చేయటానికా? అన్న అంశాలను పరిశీలిస్తే చట్ట సవరణల ఉద్దేశం వెల్లడవుతుంది.
అడవులపై పట్టును పెంచుకొని..
దేశ మూల వాసులైన గిరిజనులు అటవీ, అటవీ సంపదల మీద పూర్తి హక్కుల స్వతంత్ర జీవనం సాగించారు. ఎవరి అధికారాన్ని ఆమోదించలేదు. బ్రిటిష్ వలస పాలనలో కూడా చాలా కాలం ఆ హక్కును నిలబెట్టుకునే పోరాటాలు చేశారు. కానీ వలస పాలకులు దేశంలోని సంపదలతో పాటు అటవీ సంపదలను కొల్లగొట్టేందుకు ఆదివాసీ ప్రజలపై అణచివేత సాగించి, అడవులపై నియంత్రణ సాగించారు. 1805 నుంచి బ్రిటన్ అవసరాలకు పెద్ద ఎత్తున అటవీ కలపను తరలించుకు పోవటమే కాకుండా, భారతదేశంలో నిర్మించే రైల్యే లైన్లకు కూడా విచ్చలవిడిగా అటవీ కలపను ఉపయోగించారు. అనేక నిరంకుశ చట్టాలు చేశారు.
1855లో భారత గవర్నర్‌గా ఉన్న డల్హౌసీ మొదటి సారిగా అటవీ విధానాన్ని ప్రకటించి, అటవీ సంపదలన్నీ ప్రభుత్వ ఆస్తిగా పేర్కొన్నాడు. 1864లో అటవీ ఇన్‌స్పెక్టర్ జనరల్ నియామకంతో ఆదివాసీలపై బ్రిటిష్ ప్రభుత్వ పెత్తనం ప్రారంభమైంది. 1865 మొట్టమొదటి అటవీ చట్టం చేయటం ద్వారా అడవులను పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకునే అవకాశం వలస పాలకులకు ఏర్పడింది. 1878 అడవులపై గిరిజన గ్రామాలకు గల హక్కులపై ఆంక్షలు విధిస్తూ చట్టంలో మార్పులు చేయటం ద్వారా బ్రిటిష్ పాలకులు అధికారాన్ని విస్తృతపర్చుకున్నారు. 1894లో చేసిన అటవీ విధాన ప్రకటన బ్రిటిష్ ప్రభుత్వ పట్టును మరింత పెంచింది. అలాగే 1927లో భారత అటవీ చట్టాన్ని చేసి ఇందులో అడవులను రిజర్వ్, సంరక్షిత, సామాజిక అడవులుగా విభజించి, వాటిల్లోకి ఎవరూ వెళ్లరాదని నిషేధించింది.
1947లో అధికారాన్ని చేతులు మార్చుకున్నా, పాలకులు వలస పాలకుల అటవీ చట్టాలనే అనుసరించారు. ఓ రకంగా వలస పాలకుల కన్నా కఠినమైన అటవీ విధానాలు ప్రకటించారు. 1952, 1980లలో ప్రకటించిన అటవీ విధానాలు అడవుల వర్గీకరణతో పాటు గిరిజనులను అడవుల నుండి ఖాళీ చేయించేందుకు పూనుకున్నాయి. 2014లో ఎన్‌డీఏ నాయకత్వాన ఏర్పడిన మోడీ ప్రభుత్వం సైతం గత పాలకుల కన్నా దూకుడుగా వ్యవహరిస్తూ, ప్రవేటీకరణ బాట పట్టి అందుకు అనుగుణంగా అటవీ చట్టాలను సవరిస్తున్నది. అందులో భాగంగానే 1980 అటవీ (సంరక్షణ)చట్ట సవరణ.
2021 అక్టోబర్ 2 పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ 1980 అటవీ సంరక్షణ చట్టంలో మార్పులు చేస్తూ ఒక ముసాయిదాను విడుదల చేసింది. దీనిపై 15 రోజుల్లో అభిప్రాయాలను, వ్యాఖ్యలను పంపాలని కోరింది. ఎందరో బాధ్యత గల వ్యక్తులు, ప్రజా సంఘాలు తమ వ్యతిరేకతను, విమర్శలను పంపటం జరిగింది. కానీ కేంద్రం ఈ అభిప్రాయాలను అసలు పరిగణనలోకి తీసుకోకుండా మొదటి ముసాయిదానే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. పైగా ఏదైనా బిల్లును పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ముందుగా పరిశీలిస్తుంది. కానీ ఈ బిల్లును స్టాండిగ్ కమిటీకి పంపకుండా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపంది. ఈ కమిటీలో ప్రతిపక్ష సభ్యులు కొద్ది మందే ఉండటం వలన మెజారిటీ అభిప్రాయం బిల్లుకు అనుకూలంగా ఉంటుంది.
అటవీ సంరక్షణ చట్టానికి తూట్లు
1980లో ఏర్పడిన అటవీ సంరక్షణ చట్టం అటవీ నిర్మూలనను నిషేధించడానికి రూపొందించబడింది. ఈ రెండు చట్టాలు గిరిజనులను నియంత్రించే విధంగా ఉన్నప్పటికీ అడవి రక్షణ గురించి పేర్కొన్నాయి. కానీ ప్రస్తుతం మోడీ ప్రభుత్వ చట్ట సవరణలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. సవరించిన చట్టం ప్రకారం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అడవి నిర్వచనాన్ని ఈ సవరణ ద్వారా మార్చారు. దీని ప్రకారం 1927 భారత అటవీ చట్ట నిబంధనల ప్రకారం నోటిపై కానీ, ప్రకటించని అటవీ భూములను, అదే విధంగా 1996 డిసెంబర్ 12 నాటికి అటవీ యేతర భూములుగా గుర్తించబడని అటవీ భూములకు ఇక నుండి అటవీ భూములుగా గుర్తింపు ఉండదు. ఆ ప్రాంతాలకు అటవి హక్కుల చట్టం వర్తించదు. ఈ సవరణ వలన విస్తృత అటవీ ప్రాంతం అన్యాక్రాంత మౌతుంది.
1927 భారత అటవీ చట్టంలో జమీందారీ, ఏస్టేట్ ప్రాంతంలోని అడవులను నోటిపై చేయలేదు. ఇవన్నీ ఎక్కువ భాగం పర్యావరణానికి పేరు పొందిన ఆరావళి పర్వతాలు, పశ్చిమ కనుమల్లోని పర్వత ప్రాంతాలు. 2021 నాటి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క నివేదిక పరిశీలస్తే భారత దేశం మొత్తంమీద 7,13,789 చదరపు కిలో మీటర్ల అటవీ భూమి విస్తీర్ణత నమోదు చేయబడగా అందులో లక్షా 79 వేల కిలోమీటర్ల భూమి అటవీ ప్రాంతం వెలుపల ఉంది. దాని ఫలితంగా అడవులలో నివసించే ఆదివాసి, ఆదివాసీయేతర ప్రజలు అటవీ భూములపై హక్కులను, జీవనోపాధిని కోల్పోతారు.
చట్టం నుండి మినహాయింపులు..
సవరించిన చట్టం ద్వారా కొన్ని రకాల అటవీ భూములను చట్టం ద్వారా కల్పించబడిన రక్షణ నుండి మినహాయిస్తుంది. చట్టం కింద ఇప్పటి వరకు రక్షించబడుతున్న భూముల వాణిజ్య దోపిడీకి ద్వారాలు తెరుస్తుంది. దేశంలో సగం అటవీ భూములు రక్షణ లేని పరిస్థితుల్లో ఉన్నాయి. చట్టలోని నిబంధన పరిధిలోకి రాని అటవీ భూమి, సవరణ తర్వాత చట్టం నుంచి తొలగిస్తుంది. రైలు ట్రాక్ లేదా పబ్లిక్ రోడ్డు 0.10 హెక్టార్ల వరకు అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి 100 కిలోమీటర్ల పొడవున అటవీ భూమి కలిగి ఉంటాయి. భద్రతకు సంబంధించిన మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం 10హెక్టార్ల అటవీ భూమిని అందుకు కేటాయించవచ్చు. సరిహద్దు ప్రాంతాల్లో వ్యూహాత్మక ప్రయోజనాల కోసం 100 కిలోమీటర్ల అటవీ భూమి వినియోగించడమంటే భారతదేశంలోని మొత్తం ఈశాన్య ప్రాంతం, హిమాలయ ప్రాంతంలోని మెజారిటీ భూమికి సమానం. ఈ భూములన్నీ ఆచరణలో ప్రైవేట్ సంస్థల పరమౌతాయి. దీనివల్ల ఆ ప్రాంతాల్లోని గిరిజన ప్రజలు భూములు కోల్పోయి వారి జీవనం చిన్నాభిన్నమౌతుంది. ఈ మినహాయింపులు పర్యావరణంపై ప్రభావిత అంచనా సూచికలతో సంబంధం లేకుండా ఏ ప్రాంతంలోనైనా , ఏ ప్రాంచైజీ కైనా గ్రామ సభ అనుమతి తప్పనిసరి చేసే 2006 అటవీ హక్కుల చట్టం, షెడ్యూల్ ఏరియాకు వర్తింప చేసే పంచాయతీ రాజ్ విస్తరణ, పీసా తదితర చట్టాల అనుమతి నుండి సవరణలో మినహాయింపులు ఇవ్వటం వలన అటవీ భూమి అధిక భాగం అన్యాక్రాంత మౌతుంది. 1980 అటవీ సంరక్షణ చట్టానికి ముందే 40 లక్షల 30 వేల హెక్టార్ల అటవీ భూమి అన్యాక్రాంతమైతే చట్ట సవరణ మూలంగా ఏ విధంగా అటవీ భూమి అన్యాక్రాంతమయ్యేది ఊహించగలం.
అధికార మార్పిడి జరిగిన దగ్గర నుండి నేటి వరకు దేశీయ పాలకులు సామ్రాజ్యవాద, కార్పొరేట్ల ప్రయోజనాలకు అనుకూలమైన అటవీ విధానాలు అమలు జరుపుతూ వస్తున్నారు. మోడీ ప్రభుత్వం ఇందులో మరింత దూకుడుగా ప్రదర్శిస్తుంది. అటవీ సంరక్షణ పేరుతో, అటవీ సంరక్షణ చట్టంలో మార్పులు చేసి అనేక భూములను చట్టం నుండి మినహాయించింది. ఆదివాసీల హక్కులను ఊడబెరకటమే విధానంగా పెట్టుకుంది. కార్పొరేట్ల, సామ్రాజ్యవాదుల, బహుళజాతి కంపెనీల ప్రయోజనాల కోసం ఆదివాసీల హక్కులను హరించి, అడవులను నాశనం చేసే అటవీ సంరక్షణ చట్ట సవరణలను వ్యతిరేకిద్దాం!
బొల్లిముంత సాంబశివరావు
రైతు కూలీ సంఘం, కార్యవర్గ సభ్యులు, ఏపీ
98859 83526