జపాన్‌ భూకంపానికి కారణమిదే!

by Ravi |   ( Updated:2024-01-04 10:33:43.0  )
జపాన్‌ భూకంపానికి కారణమిదే!
X

తాజాగా జపాన్‌లో వచ్చిన వరుస భూకంపాలు యావత్ ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేశాయి. భూకంపాల కారణంగా అగ్ని ప్రమాదాలు సంభవించాయి. 45 వేల ఇండ్లకు పైగా కరెంటు సరఫరా నిలిపివేశారు. భూకంపాల కారణంగా భారీ సంఖ్యలో ప్రజలు చనిపోయారు. మృతుల సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది.

ప్రపంచమంతా కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆనందిస్తున్న వేళ జపాన్‌లో తీవ్ర భూకంపం సంభవించింది. ఒకటి కాదు..రెండు కాదు...ఒకే రోజు వరుసగా 155 సార్లకు పైగా భూకంపాలు వచ్చాయి. వీటి కారణంగా వరుస అగ్ని ప్రమాదాలు సంభవించాయి. దీంతో జనం భారీ సంఖ్యలో చనిపోయారు. మృతుల సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది. జపాన్‌ వ్యాప్తంగా 45 వేల ఇండ్లకు పైగా కరెంటు సరఫరా నిలిపివేశారు. అనేక చోట్ల పెద్ద పెద్ద భవనాలు కూలిపోయాయి. జపాన్‌లోని పర్యాటక కేంద్రమైన వాజిమా నగరం భూకంపాల కారణంగా స్మశానంలా మారింది. అయితే భూకంపాలు వచ్చిన వెంటనే జపాన్ ప్రభుత్వం అప్రమత్తమై యుద్ధ ప్రాతిపదికన సహాయక బృందాలను రంగంలోకి దింపడంతో అనేక నగరాల్లో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం తప్పింది. అయితే కొంతమంది నిద్రలోనే చనిపోయారు. బతికిన వాళ్ళు హాహాకారాలు చేస్తూ బయటకు పరుగులు తీశారు. ఎటుచూసినా గుండెలు పిండే దృశ్యాలే. హాహాకారాలు... ఆర్తానాదాలతో జపాన్‌ దేశంలోని అనేక నగరాలు హోరెత్తాయి.

ఫలకాల కదలిక వలన

గతేడాది ఫిబ్రవరి నెలలో టర్కీలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం ఫలితంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచమంతా నిద్రపోతున్న వేళ టర్కీలో భారీ ఎత్తున భూకంపం సంభవించింది. ఇది భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైంది. ఈ భూకంపం దాటికి టర్కీ దాదాపు ఐదారు మీటర్ల మేర పక్కకు కదిలినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ సమయంలోనే సిరియాలోనూ భూకంపం సంభవించింది. అయితే ఈ భూకంపాలకు ప్రధాన కారణం టెక్టోనిక్ ఫలకాల కదలికలే కారణం అంటున్నారు శాస్త్రవేత్తలు. భూమిలోపల 12 పొరల్లో ఉండే ఈ ఫలకాలు ఒకదానికొకటి నెట్టుకుంటూ ఉంటాయి. వీటి తీవ్రత ఎక్కువగా ఉంటే భూప్రకంపనలు వస్తాయి. కిందటేడాది టర్కీలో సంభవించిన ఘోర విపత్తుకు ఈ ఫలకాల కదలికలే కారణమన్నారు సైంటిస్టులు. భూకంపం అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు జపాన్. అక్కడి భూమి లోపల ఫలకాల కదలికలు విపరీతంగా ఉంటాయి. అందువల్లనే జపాన్‌లో తరచూ భూకంపాలు వస్తుంటాయి.

ఇక్కడి పాలకులు దృష్టి పెట్టాలి

అయితే భూకంపాల చరిత్ర భారతదేశానికి కూడా ఉంది. మహారాష్ట్రలోని లాతూర్, గుజరాత్‌లోని భుజ్‌ ప్రాంతాల్లో సంభవించిన భూకంపాలు అంతులేని విషాదాన్ని మిగిల్చాయి. పెద్ద ఎత్తున ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించాయి. గ్రామాలకు గ్రామాలు నామరూపాలు లేకుండా పోయాయి. అయితే మనదేశంలో గుజరాత్‌లోని భుజ్ భూకంపం వలన పెద్దఎత్తున ప్రాణ నష్టం జరిగింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైంది. ఈ భూకంపంలో 20 వేలమందికిపైగా చనిపోయారు. లక్షా 67 వేల మంది గాయపడ్డారు. దాదాపు నాలుగు లక్షల ఇళ్లు నేలమట్టమయ్యాయి. భుజ్ స్థాయిలో వచ్చిన మరో భూకంపం.. లాతూర్. మహారాష్ట్రలోని లాతూర్‌లో 1993 సెప్టెంబరు 30న మరికొన్ని గంటల్లో తెల్లవారుతుందనగా భూమి కంపించింది. ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది. ఈ భూకంపం ఫలితంగా పదివేల మందికి పైగా ప్రజలు చనిపోయారు. ముప్ఫయి వేల మందికి పైగా గాయపడ్డారు. ఏది ఏమైనా జపాన్ విపత్తు చూసి భారత్ అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. మనదేశంలోనూ భూకంపాలు సంభవించే ప్రాంతాలున్నాయి. వీటిమీద పాలకులు వెంటనే దృష్టి పెట్టాలి. నిబంధనలను గాలికొదిలేసి ఆకాశాన్ని తాకే భవనాలను నిర్మించడం మానుకోవాలి. పర్యావరణవేత్తల సూచనలు పాటించాలి. లేదంటే, పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

- ఎస్. అబ్దుల్ ఖాలిక్,

సీనియర్ జర్నలిస్ట్‌,

63001 74320

Advertisement

Next Story

Most Viewed