- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేదల ‛సెంపలపై కన్నీటి కాల్వ
‛నీళ్లు, నిధులు, నియామకాలు' తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన నినాదం! తెలంగాణ కోసం వివిధ రూపాలలో పోరాడిన అందరి గొంతులలోనూ ప్రతిధ్వనించిన అంశాలు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉపాధి వస్తుందన్న ఆలోచనతో లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తమకు అవకాశాలు రావడం లేదని రాష్ట్రం వస్తే సమస్యలు తీరిపోతాయని చాలా మంది భావించారు. భావోద్వేగాలు అదుపుతప్పి కొందరు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగిల్చారు. ప్రత్యేక రాష్ట్రంతో అన్ని సమస్యలు పరిష్కారమైపోతాయనే రీతిలో ప్రచారం కూడా సాగింది. అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి. మరి ఏమైంది?
ఎనిమిదేండ్లు గడిచినా
తెలంగాణ రాష్ట్రం ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2014 జూన్ రెండున 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. సుదీర్ఘ కాలంగా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం సాగింది. ప్రజల మధ్య చారిత్రక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక అసమానతలు, విభేదాలు, వివిధ ప్రాంతాల మధ్య నెలకొన్న భావోద్వేగాలు ఉద్యమానికి ఊపిరిలూదుతూ వచ్చాయి. 'మేమంతా తెలుగువాళ్లం' అంటూ దాదాపు అర్ధ శతాబ్దం పాటు కలిసి ఉన్నప్పటికీ, తెలుగు మాట్లాడే ప్రజల మధ్య సామాజికంగా, సాంస్కృతికంగా, భావోద్వేగాల పరంగా ఐక్యత ఏర్పడలేదు. ఒక్క తెలంగాణలోనే కాదు. రాయలసీమ ప్రాంతంలో కూడా ఈ పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమంలో మూడు దశలు కనిపిస్తాయి.
1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడే సమయంలోనే వ్యతిరేకత వినిపించడం మొదటి దశ. 1960లలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం రెండోది. 1990ల తర్వాత కనిపించిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మూడవ దశగా చెప్పుకోవచ్చు. ముల్కీ నిబంధనల ఉల్లంఘనతో 1960లలో ఉద్యమం ఊపందుకుంది. మూడో దశ తెలంగాణ ఉద్యమం చాలా కీలకమైంది. అధికారంలో సరైన వాటా ఇవ్వకపోవడం, నిధుల కేటాయింపులో వివక్ష, ప్రాంతీయ వెనుకబాటుతనం ఈ మూడు అంశాలు తెలంగాణ ఉద్యమానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం ఏర్పాటు సమయంలోనే దీనిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.
సరిగ్గా ఆ భయంతోనే
'తెలంగాణ ప్రజల భయం ఏంటంటే, ఆంధ్రాలో కలిసిపోయినా, ఆంధ్రులతో సరిసమానంగా హక్కులను అనుభవించలేరు. ఈ ఒప్పందంలో ఆంధ్రులు తమ ప్రయోజనాలను సత్వరమే అందిపుచ్చుకుంటారు. చివరకు తెలంగాణ కోస్తాంధ్రులకు కాలనీగా మారిపోతుంది' అని (పేజీ 105) ఎస్ఆర్‌సీ పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, తర్వాత జరిగిన రాజకీయార్థిక అభివృద్ధిని ప్రాంతీయ గుర్తింపు, అభివృద్ధి ఆకాంక్షలు, వ్యవసాయం, నీటిపారుదల రంగాల అభివృద్ధి, ఉద్యోగ కల్పన, ప్రజాసాధికారత, ప్రజాస్వామ్యం ఆధారంగా విశ్లేషించాలి. తెలంగాణ ఉద్యమం అనేది ప్రజా చైతన్యం, రాజకీయ చైతన్యం అనే రెండు మూలస్తంభాల మీద నిలబడింది. ఉద్యమ నేపథ్యంతో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ప్రధాన రాజకీయ పార్టీగా ఆవిర్భవించగా, తెలంగాణ ప్రజలను చైతన్యపరచడంలో ప్రజాసంఘాలు కీలక పాత్ర పోషించాయి. రాష్ట్రం ఏర్పడి ఎనిమిది వత్సరాలు పూర్తి అయిన సందర్భంగా, టీఆర్‌ఎస్ పాలన ఎలా ఉంది? ఉద్యమ ప్రాథమిక లక్ష్యాల సాధన ఎంత వరకు జరిగింది? అన్నది విశ్లేషించుకోవాలి.
అందని సాగునీరు
తెలంగాణ ప్రధానంగా వర్షాధారిత వ్యవసాయ ప్రాంతం. ఉద్యమంలో సాగునీరు ఒక ప్రధాన ఎజెండాగా సాగింది. రాష్ట్రంలో సాగునీటి సౌకర్యాలను పెంపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం 'మిషన్ కాకతీయ'లాంటి స్కీమ్‌లను ప్రారంభించింది. చెరువుల పూడిక తీయించడం, బాగు చేయించడంలాంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టింది. సమైక్యాంధ్రలో పాలకులు వీటిని అసలు పట్టించుకోలేదని, చిన్నచూపు చూశారన్న ఆరోపణలున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదలలో ఆ పథకం ఎంతవరకు దోహదం చేసిందో తెలియదు గానీ టీఆర్ఎస్ నాయకులకు ‛కమిషన్ కాకతీయ'గా మారిందన్న అపవాదును ‛మూటగట్టుకుంది.
కాళేశ్వరం ప్రాజెక్టు కూడా తెల్ల ఏనుగులా మారింది. ఆ ప్రాజెక్టు నీళ్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కు, ధనిక రైతుల మడులనే తడుపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంకా కొన్ని మెట్ట ప్రాంతాలలో ప్రాజెక్టులు పూర్తి కాక నీళ్లు అందడంలేదు. రైతుబంధు పథకం రైతులకు కోట్లాది రూపాయలను తెచ్చిపెడుతోంది. ఆర్థిక ప్రగతిని సాధించడం కోసం మౌలిక సదుపాయాల విస్తరణపై ప్రభుత్వం దృష్టి పెడుతున్నట్టు కనిపిస్తున్నా, ఉద్యమ సమయంలో ఉపాధి అవకాశాలపై యువత పెట్టుకున్న అంచనాలకు, ఇప్పుడున్న అవకాశాలకు పొంతన కుదరడం లేదు.
ఉద్యోగాలు పెరగాలి
ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల కల్పన తగ్గిపోయినా, ప్రైవేటు రంగంలో పెరగాల్సి ఉంది. సేవారంగం అనుకున్నంతగా విస్తరించలేదన్నది గమనించాలి. తెలంగాణను నిరుద్యోగ సమస్య ఇంకా వెంటాడుతూనే ఉంది. పాలనను వికేంద్రీకరించడంలో భాగంగా గతంలో ఉన్న 10 జిల్లాలను తెలంగాణ ప్రభుత్వం 33 జిల్లాలుగా విభజించింది 1987లో అప్పటి ఎన్టీ రామారావు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం పంచాయతీ సమితులను మండలాలుగా మార్చింది. దీంతో రాజకీయ వికేంద్రీకరణ జరిగి, ప్రజాప్రాతినిధ్యం పెరిగిందన్న విషయాన్ని మరువకూడదు. ఇప్పుడు అదే జరిగింది.
ప్రస్తుతం ప్రజాసంఘాలను పక్కనబెట్టడం అనేది తెలంగాణ రాజకీయాలలో ఒక వైరుధ్యమైన కోణం. కుల, మత, వర్గ విభేదాలను రూపుమాపి అందరినీ ఉద్యమం అనే గొడుగు కిందికి తీసుకురావడంలో ప్రజాసంఘాల పాత్ర ఎనలేనిది. ప్రజాస్వామ్యయుతంగా ఉద్యమాన్ని ముందుకు నడిపించడం, ఎజెండాను సైతం రూపొందించడంలో ప్రజాసంఘాలు కీలక పాత్ర పోషించాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ ప్రజాసంఘాలు చిన్నచూపుకు గురయ్యాయి. ఆదర్శ ప్రజాస్వామిక రాజ్యంగా అవతరించాలని కన్న కలలు ఎన్నికల రాజకీయాలలో కొట్టుకుపోయాయి.
విపక్షాలు ఉంటే మేలు
ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే ప్రతిపక్షం అనేది తప్పకుండా ఉండాలి. తెలంగాణలో మాత్రం ఏక పార్టీ ఆధిపత్యం కొనసాగుతోంది. టీడీపీ తన వైభవాన్ని కోల్పోగా, కాంగ్రెస్ పూర్తిగా వెనకబడిపోయి, ఇంకా కాలూ చేయీ కూడదీసుకునే ప్రయత్నంలోనే ఉంది. పోటీ అనేది ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తుంది. కాంగ్రెస్, ఇంకా ఇతర ప్రతిపక్ష పార్టీలను పోటీ ఇవ్వకుండా కేసీఆర్ కోవర్టులను పంపించి రాజకీయ మేనేజ్ చేస్తున్నారు. ప్రజా వ్యతిరేకతను కనిపించకుండా మీడియా మేనేజ్‌మెంట్ చేస్తున్నారు. ఇది తెలంగాణ భావనకు పూర్తిగా విరుద్ధం. విద్యావకాశాలు మెరుగుపరచడం ద్వారా అణగారిన వర్గాలను పైకి తీసుకు రావడానికి అవకాశం ఉంటుంది. విద్యారంగంలో ఇప్పుడు తెలంగాణ ప్రాంతం వెనకబడి ఉంది. విద్యపై దృష్టి సారించి దీర్ఘకాలిక ప్రణాళికలు రచించకపోతే తిరోగమనం తప్పదు. ఉన్నత విద్యపై నిర్లక్ష్యం సమీప భవిష్యత్తులో అభివృద్ధికి పెద్ద అవరోధంగా మారే ప్రమాదం ఉంది. బంగారు తెలంగాణ లక్ష్యం దెబ్బతింటుంది. ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు ప్రోత్సాహం తెలంగాణకు దిశానిర్దేశం లేకుండా చేస్తుంది. ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు, చేసిన పనులు, ప్రజల ఆకాంక్షలు, లక్ష్యాలను మరోసారి అవలోకనం చేసుకోవడం అత్యంత ఆవశ్యకం.
మేకల ఎల్లయ్య
9912 178129