రైతు 'పంట' పండించిన బడ్జెట్!

by Ravi |
రైతు పంట పండించిన బడ్జెట్!
X

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తన తొలి బడ్జెట్‌లో రైతుకు, వ్యవసాయానికి పట్టం కట్టింది. కొత్త సంక్షేమ పథకాలు ఏవీ లేవని బడ్జెట్‌పై చర్చలో కేసీఆర్ విమర్శలు గుప్పించినప్పటికీ ఇది రైతు పంట పండించనున్న బడ్జెట్‌గా చెప్పాలి. వ్యవసాయశాఖకు భారీగా రూ.72,659 కోట్లు కేటాయించగా, రూ.2లక్షల రుణమాఫీ కోసం రూ.31వేల కోట్లను అదనంగా కేటాయించారు.

తొలిసారిగా రైతు కూలీలకు కూడా పట్టాలతో సంబంధం లేకుండా ఏడాదికి 12 వేల రూపాయలు ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పడం ముదావహం. అలాగే రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగర అభివృద్ధికి రూ.10 వేల కోట్లను కేటాయించి మంత్రి నివ్వెరపరిచారు. సంక్షేమానికి రూ.40 వేల కోట్లు కేటాయించారు. దీంతో అప్పుల చెల్లింపుతో పాటు ప్రజా ప్రయోజనాలకు కూడా భారీగా వ్యయం చేయనున్నట్లు రాష్ట్ర బడ్జెట్ పేర్కొంది.

ప్రధాన కేటాయింపులు..

2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. మొత్తం బడ్జెట్ వాల్యూ 2,91,159 లక్షల కోట్లు కాగా, అందులో రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు, మూలధనం వ్యయం రూ.33,487 కోట్లుగా ఉంది. ఈ క్రమంలో వ్యవసాయశాఖకు భారీగా రూ.72,659 కోట్లు, సంక్షేమానికి రూ.40 వేల కోట్లు, సాగునీటి రంగానికి రూ.26 వేల కోట్లు కేటాయించారు. ఇవే కాకుండా పంచాయతీరాజ్‌ శాఖకు రూ.29, 816 కోట్లు, విద్యాశాఖకు రూ.21,292 కోట్లు, వైద్యారోగ్య శాఖకు రూ.11, 468 కోట్లు. ఎ‌స్టీ సంక్షేమానికి రూ.17,056 కోట్లు. ఎస్సీ సంక్షేమానికి రూ. 33,124 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.9200 కోట్లు, ట్రాన్స్‌కో, డిస్కంలకు రూ.16,410 కోట్లు, మొత్తం హైదరాబాద్‌ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్ట్‌కు రూ.1500 కోట్లు కేటాయించారు.

ఫక్తు వ్యవసాయ బడ్జెట్

బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసింది. మొత్తం రూ.72,659 కోట్లను రైతాంగానికి కేటాయించింది. రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాలకు ఆ నిధులను వినియోగించనుంది. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యానవన పంటలు, ఆధునిక వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే రుణమాఫీ తొలివిడతలో లక్ష వరకు రుణాలు ఉన్న అన్నదాతల అకౌంట్లలో నగదు జమ చేసిన ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15లోపు 2 లక్షల మేర రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేస్తామని స్పష్టం చేసింది. అలాగే తాము ఇస్తానన్న 15 వేల రైతు భరోసా పథకాన్ని అమలు చేసే విధంగా ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది. ఈ పథకానికి మార్గదర్శకాలు ఎలా ఉండాలనేది ఈ బడ్జెట్ సమావేశాల్లోనే.. చర్చించి తుది నిర్ణయం తీసుకుని అమలు చేస్తామని ప్రభుత్వం పేర్కొంది.

భూమి లేని రైతు కూలీలకు నజరానా..

రాష్ట్రంలో చివరి రైతు వరకు సంక్షేమ ఫలాలు అందలనేదే సర్కార్ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఆర్థిక భద్రత కరువై పని దొరకని రోజుల్లో రైతు కూలీలు పస్తులుండాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పట్టాలు ఉన్న రైతులకే భరోసా నిచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టాలు లేని పేద రైతులను గాలికొదిలేసింది. వారందరినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. రైతు కూలీల ఆర్థిక, జీవన స్థితిగతులు మెరుగుపరిచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా భూమిలేని రైతు కూలీలకు సంవత్సరానికి రూ.12 వేలు అందిచనున్నట్లు పేర్కొంది. ఈ పథకానికి కూడా ఈ సంవత్సరంలోనే శ్రీకారం చుట్టుబోతున్నట్లుగా మంత్రి ప్రకటించారు. అయితే దేశ చరిత్రలో భూమి లేని పేద రైతులకు నగదు పంపిణీ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఎలా గట్టెక్కిస్తారు?

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అప్పులు పది రెట్లు పెరిగాయి తప్ప తెలంగాణ ఆకాంక్షలు తీరలేదని బడ్జెట్ సమర్పణ సందర్భంగా ఆర్థికమంత్రి ప్రకటించారు. బంగారు తెలంగాణ చేస్తామని అప్పుల తెలంగాణను మిగిల్చారని ఆరోపించారు. కోట్లాది ప్రజల ఆశల మేరకు ఉద్యోగాలు, నీళ్లు దక్కకపోగా ఒంటెద్దు పోకడలతో ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేశారని, అప్పుల పెరగడంతో పాటు బిల్లుల బకాయిలు భారీగా పెరిగాయని మంత్రి తెలిపారు. కొత్త ఉద్యోగాలు సృష్టించడానికి బదులు ఉన్న ఉద్యోగాలను కూడా ఇవ్వలేదని, జీతాలు పెన్షన్ చెల్లింపులు సైతం చేయలేని దుస్థితి ఏర్పడిందని ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ పరిస్థితుల్లో పదేళ్ల తర్వాత వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టామని మంత్రి చెప్పుకొచ్చారు. అయితే ఆరు గ్యారెంటీల అమలు విషయంలోనే మల్లగుల్లాలు పడుతున్న ప్రభుత్వం వాటితోపాటు ప్రకటించిన భారీ స్థాయి నజరాలను ఎలా చెల్లిస్తుందనేదే అసలు సమస్య. కేంద్ర సహాయంపై ఆశలు కూడా ఆవిరవుతున్న వేళ.. కాంగ్రెస్ ప్రభుత్వ తొలి బడ్జెట్ సాహసోపేతమైన ప్రకటన అనే చెప్పాల్సి ఉంటుంది. కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఆసరా పెన్షన్ల పెంపు, విద్యా భరోసా కార్డు, జాబ్ క్యాలెండర్ వంటి గుదిబండలను దాటుకుని రాష్ట్ర ప్రభుత్వం తన హామీలన్నింటినీ క్రమంగా నెరవేరుస్తుందని ఆశిద్దాం.

Read More..

ప్రజావాణి - మా పరిపాలనా బాణీ

ప్రత్యూష

79893 74301



Next Story