వైసీపీ నుంచి విముక్తి కోసమే పొత్తులు..

by Ravi |
వైసీపీ నుంచి విముక్తి కోసమే పొత్తులు..
X

ప్రజాస్వామ్యాన్ని హననం చేస్తూ, వ్యక్తి స్వేచ్ఛను హరిస్తూ, జగన్ రెడ్డి పౌర హక్కులను కాలరాస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర శ్రేయస్సును కోరి భావ సారూప్యత కలిగిన వ్యక్తులు, పార్టీలు ఒక తాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తించారు. పొత్తులు ఖరారు కావడంతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారబోతోంది. రాష్ట్ర శ్రేయస్సు కోసం తెలుగుదేశం, జనసేన పొత్తు అనివార్యమైంది. వైసీపీ అరాచక పాలన, జగన్ రెడ్డి అణచివేత ధోరణులతో ప్రజలు విసిగిపోయారు. గతంలో ఈ పొత్తులపై పరోక్ష సంకేతాలే తప్ప స్పష్టత లేదు. కానీ జగన్ రెడ్డి కబంధ హస్తాల నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించడమే లక్ష్యంగా, ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలకుండా పావులు కదిపి సరైన సమయంలో వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. పొత్తు విషయంలో చక్కటి రాజకీయ పరిణితి ప్రదర్శించారు పవన్ కళ్యాణ్. దీంతో సరికొత్త రాజకీయ పునరేకీకరణకు పునాది పడింది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపవుతుంది.

పొత్తుతో రాష్ట్రంలో నూతనోత్సాహం..

రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. తెలుగుదేశం, జనసేన కలిసి పనిచేయాలని ప్రజలు కోరుకున్నారు. దానికి తగ్గట్లే అడుగులు ముందుకు పడుతున్నాయి. అయితే ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రెండు పార్టీల కలయిక రాష్ట్ర ప్రజల్లో ఉన్న అభద్రతాభావం, భయం పోగొట్టి నైతిక స్థైర్యం నింపుతుంది. ఈ పరిణామం ప్రజల్లో, ఉభయ పార్టీల శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీలు చాలా కాలంగా ఎదురుచూస్తున్నాయి. ఎన్నికల్లో కలిసి పనిచేయడం కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చొరవ చూపారు. తన వంతుగా అనేక సందర్భాల్లో బీజేపీతో సంప్రదింపులు జరిపారు. దీనికోసం రోడ్ మ్యాప్ అడిగారు. పొత్తులపై బీజేపీ అధినాయకత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ వాళ్లు సక్రమంగా స్పందించలేదు. బీజేపీ నుంచి సరైన స్పందన రానప్పటికీ ఆయన ఎక్కడా తన వంతు ప్రయత్నం ఆపలేదు. ఇప్పుడు తనే బీజేపీకి రోడ్ మ్యాప్ ఇచ్చారు. ఒకవైపు బీజేపీ కలిసిరావాలని కోరుకుంటూనే మరోవైపు తెలుగుదేశం, జనసేన కలిసి పనిచేస్తాయని స్పష్టం చేశారు. ఈ పొత్తు పెట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి నిరంకుశ వైఖరే ప్రధాన కారణమని తేల్చిచెప్పారు. అయితే పొత్తులు కుదిరితే తమకు అధికారం ఎక్కడ దూరమవుతుందోనని జగన్ రెడ్డి ఆందోళన చెందుతున్నారు. పొత్తులు పాలకపక్షాన్ని అభద్రతా భావంలోకి నెట్టేశాయి. వైసీపీ నేతలకు నిద్రపట్టకుండా చేశాయి. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారే కానీ లోలోపల ఓటమి భయం వెంటాడుతోంది.

పొత్తులు చెడగొట్టాలని.. విఫలయత్నం

పొత్తులు కుదరకూడదని తమవంతుగా వైసీపీ చేయని ప్రయత్నం లేదు. జనసేనపై, తెలుగుదేశంపై అనేక రూపాల్లో దాడులు చేశారు. దమ్ముంటే సింగిల్‌గా పోటీచేయాలని వైసీపీ నేతలు పలు సందర్భాల్లో సవాళ్లు చేశారు. ప్యాకేజీ స్టార్ అని, మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని, దత్తపుత్రుడని సాక్షాత్తూ ముఖ్యమంత్రి అనేక వేదికలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును సీఎంను చేయడానికి పవన్ కల్యాణ్ పార్టీని, తమ సామాజికవర్గాన్ని తాకట్టుపెడుతున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కాకుండా చంద్రబాబును చేయడం ఏంటని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం, జనసేన విడివిడిగా పోటీ చేస్తే ఓట్లు చీలి తమకు లబ్ధి చేకూరుతుందని ఉబలాటపడ్డారు. ఎంత రెచ్చగొట్టినా ఒంటరిగా పోటీచేయకూడదనే ధృఢ నిశ్చయంతో ఉన్నారు పవన్ కల్యాన్.

అయితే పొత్తులు ఆయా రాజకీయ పార్టీల అంతర్గత వ్యవహారం. వారి ఇష్టాఇష్టాలపై ఎన్నికల్లో కలిసి పోటీచేస్తారు. పైగా పొత్తులేమీ కొత్తకాదు. అన్ని పార్టీలు తమకు నచ్చిన వారితో పొత్తులు పెట్టుకుంటాయి. పొత్తులు నేరమేమీ కాదు.. రాజకీయాల్లో అత్యంత సహజం. ఓటమి భయంతో పొత్తులు విచ్ఛిన్నం చేసేందుకు వైసీపీ ఢిల్లీ నుంచి గల్లీ వరకు పావులు కదిపింది. పొత్తు చెడగొట్టడానికి కేంద్ర బీజేపీ ద్వారా కూడా అనేక ప్రయత్నాలు చేశారు. ఏదేమైనా పవన్ కల్యాణ్ పట్టుదలతో పొత్తును విచ్ఛిన్నం కాకుండా నిలువరించారు. క్షేత్రస్థాయిలో ఉభయ పార్టీల శ్రేణులు మానసికంగా సిద్ధమయ్యారు. ఇది ఓటు బదిలీకి మార్గం సుగమం చేస్తుంది.

అతివిశ్వాసంతో బీజేపీ..

ఒకవైపు జగన్ అధికారంలోకి రావాలని బీజేపీ కోరుకుంటోంది. మరోవైపు టీడీపీని బలహీనపరిచేందుకు బీజేపీ వ్యూహ రచన చేస్తున్నట్లుగా అనుమానం ఉంది. పొత్తులపై బీజేపీ రాష్ట్ర, కేంద్ర నాయకత్వాలు వ్యూహాత్మక మౌనం పాటించడం దేనికి సంకేతం? వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశం బలహీనపడుతుంది.. ఆ స్థానాన్ని బీజేపీ ఆక్రమించుకోవచ్చనే దురాలోచనతో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీతో పొత్తుకు తెలుగుదేశంలో ఏ ఒక్కరూ సుముఖంగా లేరు. చంద్రబాబు అరెస్ట్, జైలుకు వెళ్లడంలో కేంద్రం పాత్ర కూడా ఉందని టీడీపీ శ్రేణులు అనుమానిస్తున్నాయి. కేంద్రానికి తెలియకుండా ఈ తతంగమంతా జరిగిందా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వివేకానంద రెడ్డి హత్యకేసులో అవినాష్ రెడ్డి కీలకమైన ముద్దాయి అయినప్పటికీ ఆయనకు కేంద్రం బాసటగా నిలిచింది. జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు విచారణకు రాకుండా ఈడీ, సీబీఐని కేంద్ర పెద్దలు నియంత్రిస్తున్నాయనే అనుమానం కూడా ఉంది. చంద్రబాబు అరెస్ట్ పట్ల మోడీ, అమిత్ షా స్పందించకపోవడంలో ఆంతర్యం ఏమిటి? అంటే అక్రమ అరెస్ట్‌లను బీజేపీ పరోక్షంగా సమర్ధిస్తున్నట్లుగా ఉంది. బీజేపీ నేతల ప్రకటనలు చూస్తే డబుల్ గేమ్ ఆడుతున్నట్లు ఉంది. రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచినా 25 మంది పార్లమెంట్ సభ్యులు కేంద్రంలో తమకే మద్దతిస్తారని బీజేపీ అతివిశ్వాసం ప్రదర్శిస్తోంది. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువనే భావన టీడీపీ శ్రేణుల్లో ఉంది. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందనే కసి రాష్ట్ర ప్రజానీకంలో చాలా బలంగా ఉంది. గత నాలుగేళ్లకు పైగా జగన్ రెడ్డి అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, అధికార దుర్వినియోగానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం సహకరించిందనేది కూడా ఉంది.

ఇక్కడి స్కామ్‌లు కనపడవా?

రాష్ట్ర బీజేపీలో ఒక వర్గం ఇప్పటికీ వైసీపీ ప్రభుత్వ తప్పిదాలను సమర్ధిస్తూనే ఉంది. గత నాలుగున్నరేళ్లలో వైసీపీ పుణ్యమాని బీజేపీ రాష్ట్రంలో కొంత లాభపడింది. పొరుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి జగన్ రెడ్డి ఆర్థిక సహకారం అందించారనే అనుమానాలు కూడా ఉన్నాయి. బీజేపీ సహకారంతో అదానీలకు, అంబానీలకు ఏపీ అడ్డాగా మారింది. రాజధాని లేని రాష్ట్రంగా చేశారని మాట్లాడటం తప్ప చేతల్లో బీజేపీ ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అలాగే రుణపరపతిపై ఎలాంటి ఆంక్షలు విధించకుండా ఆంధ్రప్రదేశ్‌ను రుణాల ఊబిలో నెట్టేందుకు తన వంతు సహకారాన్ని అందించారు. ఆంధ్రాలో లిక్కర్ స్కామ్‌తో పోలిస్తే ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చాలా చిన్నది. రూ.42 వేల కోట్ల భారీ కుంభకోణం లిక్కర్ స్కామ్‌లో జరిగింది. కానీ దానిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి దృష్టి పెట్టలేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి మొదలు ఉపముఖ్యమంత్రి సహా అనేక మందిపై కేసులు పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో భారీ స్కామ్‌లపై స్పందించకపోవడంలో ఆంతర్యం ఏమిటి? ఇలాంటి ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు. దీనిని బట్టి బీజేపీతో కలవకపోవడమే మంచిదనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన దానికంటే బీజేపీ ఓటమి పట్ల పార్టీలకతీతంగా రాష్ట్రంలో ఎక్కువ మంది సంతోషించారు.

ఓటమి భయం మొదలైనట్లేనా?

రాష్ట్రంలో అవినీతి విలయతాండవం చేస్తోంది. కనుచూపుమేరలో అభివృద్ధి కనిపించడం లేదు. జగన్ రెడ్డి పగ, ప్రతీకారాలతో రగిలిపోతూ అభివృద్ధిని గాలికి వదిలేశారు. ప్రతిపక్షాలను ఏకం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. జగన్ మోడీ దత్తపుత్రుడని స్వయంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన మాటలు గుర్తు చేసుకోవాలి. అందుకే కేంద్రం జగన్ రెడ్డిని వెనకేసుకొస్తోందని అంటున్నారు. ఇక తెలుగుదేశం, జనసేన సీట్ల సర్దుబాటు కూడా ఓ కొలిక్కి వచ్చినట్లుగా కనిపిస్తోంది. జనసేనకు కేటాయించే సీట్లలో ఇప్పటివరకు తెలుగుదేశాన్ని నడిపించిన నాయకుల పరిస్థితి ఏంటి? వారిని ఎలా బుజ్జగిస్తారు? మరోవైపు బీజేపీ ఎత్తుగడల్లో తెలుగుదేశం, జనసేన పావులుగా మారకుండా జాగ్రత్తగా మసలుకోవాలి.

జగన్ రెడ్డికి ఇప్పటికే ఓటమి భయం మొదలైంది. దీంతో అభద్రతాభావానికి లోనవుతున్నారు. మారిన రాజకీయ పరిస్థితులకు ఇవన్నీ అద్దం పడుతున్నాయి. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. జగన్ రెడ్డిని, వైసీపీని బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం, జనసేనపై ఉంది. సీట్ల సర్దుబాటులో కానీ, ఓట్ల బదిలీల్లో కానీ ఎలాంటి పొరపొచ్చాలకు తావులేకుండా చూడాలి. లేకపోతే అరాచక, అభివృద్ధి నిరోధక శక్తులకు అవకాశం కల్పించిన వారవుతారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరే విధంగా తెలుగుదేశం, జనసేన సమాయత్తం కావాలి. వారి మనోభావాలకు అనుగుణంగా నడుచుకుని వైసీపీ దుష్ట పాలనకు చరమగీతం పాడాలి.

మన్నవ సుబ్బారావు

గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్

99497 77727

Advertisement

Next Story