- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మన్ కీ బాత్‌లో దేశ సమస్యలు మాట్లాడరా!?
మే 3 నుంచి మణిపూర్ అక్షరాలా మండిపోతున్నది! రెండు వర్గాల మధ్య జరుగుతున్న గొడవల్లో 100 మందికి పైగా మరణించారు! ఒక కేంద్ర మంత్రి, ఒక రాష్ట్ర మంత్రి ఇండ్లను మూకలు దహనం చేశాయి! కేవలం 35 లక్షల జనాభా ఉన్న చిన్న రాష్ట్రంలో బాంబుల, తుపాకుల మోతలూ, ఎడతెరిపి లేని పరస్పర దాడులు, 65 వేల కేంద్ర బలగాలు ఉన్నా పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చే పరిస్థితి లేదు! హోమ్ మంత్రి అమిత్ షా మణిపూర్ వెళ్లి శాంతి కమిటీ వేసి వచ్చారు! అయినా ప్రయోజనం లేదు! హిల్స్ ప్రాంతంలో వందలాది గ్రామాలు ధ్వంసం అయ్యాయి! విద్య, వైద్య సంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థల మీద కూడా దాడులు జరుగుతున్నాయి! ఢిల్లీలో కుకీలు హోమ్ మంత్రి అమిత్ షా ఇంటి ముందు సైతం ధర్నా చేశారు. రెండు వర్గాల నేతలు ప్రధాని నరేంద్ర మోడీని కలిసే ప్రయత్నం చేశారు. మోడీ వారిని కలవలేదు! కలవడానికి అనుమతి ఇవ్వలేదు! కనీసం ఇప్పటి దాకా మణిపూర్ గురించి ఒక్క మాట కూడా ప్రధాని మాట్లాడలేదు!
దేశ సమస్యలను గాలికి వదిలి....
అటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అమెరికా నుంచి వచ్చారో లేదో, మోడీ అంతకు ముందే షెడ్యూల్‌లో ఉన్న అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లిపోయారు! ఒక వైపు మణిపూర్ సమస్య, మరోవైపు కర్ణాటకలో కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ బియ్యం ఇవ్వనని చెప్పడం పెద్ద సమస్య అయ్యింది! అంతర్జాతీయ కుస్తీ బిడ్డలు తమ మీద లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ మీద చర్యలు తీసుకోవాలని చేస్తున్న ఆందోళన, పలు మూలలు తిరుగుతూ ఇంకా ఏదో ఒక రూపంలో కొనసాగుతున్న పరిస్థితి, అటు మహారాష్ట్ర,ఉత్తర ఖండ్‌లలో బీజేపీ, హిందూవాద సంఘాల విద్వేష ఉపన్యాసాలు, చర్యలు, ఒక వర్గం ప్రజలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు,పెరిగిన నిరుద్యోగం, దేశంలోని 140 కోట్ల జనాభాలో 23 కోట్ల మంది నిరుద్యోగులు, సగం మంది ఉపాధి కూలీలకు లభించని కూలి, అధిక ధరలు, ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబాలు, 80 కోట్ల మంది నిరుపేదలు ప్రభుత్వం ఇస్తున్న రేషన్ మీద ఆధార పడే పరిస్థితి వచ్చింది! సమస్యలన్నీ హోమ్ మంత్రి అమిత్ షాకు వదిలిపెట్టి ప్రధాని నరేంద్రమోడీ అమెరికన్ కాంగ్రెస్‌లో ఉపన్యాసం ఇవ్వడానికి, దాంతోపాటు పలు వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి పయనం అయ్యారు!
పాలకపక్షంపై కన్నెత్తని ఈడీ...
దేశ సమాఖ్య వ్యవస్థ సంగతి కనిపించని ఆ దేవుడెరుగు. దేశం అప్పులు మాత్రం రూ.155 లక్షల కోట్లు అయ్యింది! దీనికి వడ్డీ 11.5 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంది! టాక్స్ పేయర్ల డబ్బుతో పాలకులు టూర్లు కొడుతూ, జీతాలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు! జవాబుదారితనం లేదు! ప్రశ్నించే గొంతుకలను చెరసాలల్లో బంధించడం, దేశ ద్రోహులు అనడం సామాన్య విషయం అయిపోయింది! విపక్షాల పైన,వారి మద్దతు దారుల మీద ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు, కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం జరిగింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంత్రి వర్గంలోని ఇద్దరు మంత్రులు, అటు బెంగాల్‌లో ఇద్దరు మంత్రులతోపాటు, మహారాష్ట్రలో ఇద్దరు మంత్రులుగా ఉన్నపుడే జైలుకు వెళ్లారు! ఇంకా జైలులోనే ఉన్నారు. బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, అతని కుటుంబ సభ్యుల ఇండ్ల మీద రైడ్స్ జరిగాయి. తెలంగాణ సీఎం కూతురు కవితపై మద్యం స్కాం కేసు పెట్టి విచారణకు పిలిచారు. తమిళనాడులో సీఎం స్టాలిన్ మంత్రుల పైనా విచారణలే... అటు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మీద బొగ్గు బ్లాక్ కుంభకోణం కేసు ఉంది! మొత్తంగా విపక్షాలను పార్లమెంట్ ఎన్నికల నాటికి జైల్లో పెట్టేస్తారా అనే పరిస్థితి కనిపిస్తోంది అంటే అతిశయోక్తి కాదు.
మణిపూర్ మారణ హోమంపై సౌండ్ లేదు
దేశంలో సమస్యలను ఎవరూ అడగొద్దు! అడుగుతున్న, ప్రతీ విషయాన్ని స్వదేశంలోనూ, విదేశం లోనూ చాలా స్ట్రాంగ్‌గా ప్రశ్నిస్తూ, ఎండగడుతున్న రాహుల్ గాంధీ పైన బీజేపీ శ్రేణులు,పీఎం మోడీ సహా, ఆయన మంత్రి వర్గం సహచరులు విమర్శలు, ప్రతి విమర్శలు చేస్తూనే ఉన్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా, కర్ణాటక విజయం తర్వాత రాహుల్ క్రేజ్ ఒక భారత్ లోనే కాదు విదేశాల్లోనూ పెరిగి పోయింది! దీనిని బీజేపీ, ఆర్ఎస్ఎస్ జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది! తాజాగా మణిపూర్ పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ ఏమీ మాట్లాడక పోవడం, విదేశాలకు వెళ్లి పోవడంపై విపక్షాలు సీరియస్‌గా ఉన్నాయి! ఈ నెల 23న పాట్నా లోని బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇంట్లో కాంగ్రెస్ సహా 15 రాజకీయ పార్టీల నేతలు, మహా మహులు సమావేశం కానుండటం, దేశ రాజకీయాల్లో ఒక నూతన ఐక్య కార్యాచరణకు శ్రీకారం అవుతుందనే చర్చ ఉంది! ఈ విషయాలు అన్నీ ఒక ఎత్తు కాగా అమెరికా పర్యటన కారణంగా ప్రిపోన్ చేసుకుని మరీ ప్రధాని మాట్లాడిన 102వ మన్ కి బాత్‌లో మోడీ మణిపూర్‌లో జరుగుతున్న మారణ హోమం మీద, కుస్తీ బిడ్డల ఆందోళన మీద ఒక్క మాట మాట్లాడక పోవడం అన్యాయం అనక తప్పదు!
ఎండి.మునీర్
సీనియర్ జర్నలిస్ట్
99518 65223