జగిత్యాల సిటీ అభివృద్ధి కోసం...

by Ravi |   ( Updated:2023-01-26 18:31:29.0  )
జగిత్యాల సిటీ అభివృద్ధి కోసం...
X

కేటీఆర్ గారికి

జగిత్యాలలో పుట్టి పెరిగిన వాడిగా, చుట్టూ పల్లెలు పరిసరాలు నగర స్వరూపం అన్ని తెలిసినవాడిగా ఈ నగర అభివృద్ధికి కొన్ని సూచనలు చేస్తున్నాను. అవి కొత్త బస్టాండు, పాత బస్టాండ్ నుంచి 8 కిలోమీటర్ల విస్తీర్ణాన్ని నగర పరిధిలోకి తీసుకురావాలి. పడమరన మేడిపల్లి, తాటిపెల్లి మధ్య నుండి కిష్టంపేట దాటి దుబ్బరాజన్న దాటి గుల్లపేట రోడ్ నేషనల్ హైవే దాటించాలి. తూర్పున శీరాముల పల్లె సమీపం నుండి 42 డబుల్ బెడ్ రూములకు తూర్పు దిక్కు నుండి సాగి మల్యాల రోడ్‌ సమీపంలో కలపాలి. మల్యాల రోడ్ నుండి రామన్నపేట తాటిపల్లి దాటి సాగించాలి. తారకరామనగర్‌తో పాటు ఇప్పుడు కడుతున్న 4200 డబుల్ బెడ్ రూంల ఇళ్ళ వారికి ఉపాధి కల్పన ఆ ప్రాంతంలో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయాలి. అలాగే మల్యాల రోడ్ రామన్నపేట నుంచి తాటిపెల్లి, మేడిపల్లి తెనాలికి కుడిపక్కన ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయవచ్చు.

అలాగే చల్‌గల్ వ్యవసాయ క్షేత్రం 200 ఎకరాలను పార్కులకు పారిశ్రామిక వాడలకు కేటాయించవచ్చు. ఇటు తాటిపెల్లి నుంచి నేషనల్ హైవే బైపాస్ దుబ్బ రాజన్న దాటి గుల్లపేట రోడ్ డాం అవతలికి మళ్ళించాలి. అలా దూరంగా తరలించినప్పుడు జిల్లా కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది. అలాగే మెడికల్ కాలేజీని సైతం లక్ష్మిదేవిపల్లి పెంబట్ల వైపు లేదా జాప్తాపురం వైపు స్థిరపరచాలి. పాత బస్టాండ్ నుంచి 8 కిలోమీటర్ల అవతల రింగు రోడ్లు, పారిశ్రామిక వాణిజ్య కేంద్రాలు, అటు కొత్త బస్టాండ్ నుంచి 8 కిలోమీటర్ల అవతల మల్యాల రోడ్ ఇవతలి నుండి రింగ్ రోడ్ బైపాస్లు వేసినప్పుడు జగిత్యాల సిటీ వేగంగా అభివృద్ధి చెందుతుంది. మూడు లక్షల జనాభా దాటి 5 లక్షల జనాభా నగరంగా ఎదగడానికి ఆలోచించగలరు. లింగంపేట మల్యాల రైల్వే స్టేషన్లు వాటి సమీపంలో జనసాంద్రత పెరగడానికి ప్రణాళికలు అవసరం.

జగిత్యాల విస్తీర్ణం పెరిగినపుడు అభివృద్ధి జరుగుతుంది. చుట్టుపక్కల దగ్గరి పల్లెలు జగిత్యాలలో కలిసిపోయి అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఒత్తిడి తగ్గి నగరం విస్తరిస్తుంది. ఇప్పుడు నగరం చిన్నగా ఉండడం వల్ల రేట్లు హైదరాబాద్ కన్నా ఎక్కువ ఉన్నాయి. అదే సిద్దిపేట చూడండి. అన్ని వైపులా రోడ్లు అభివృద్ధి చేయడంతో కరీంనగర్‌కు అన్నివైపులా రింగురోడ్‌లా కవర్ అయి విస్తరించింది.

అలాగే జగిత్యాలను విస్తరిస్తే ఇది జిల్లా కేంద్రం కనుక, దూరపు పల్లెల వారు నగర అంచులలోకి వచ్చి స్థిరపడే అవకాశం ఉంది. మెడికల్ కాలేజీ అనుబంధ హాస్పిటల్ వల్ల జనసాంద్రత పెరుగుతుంది. డబుల్ బెడ్‌రూం వచ్చిన వారికి ఉపాధి చూపాల్సిన బాధ్యత మనదే. అందువల్ల పారిశ్రామికవాడలు వారికి సమీపంలో ఏర్పాటు చేస్తే వారితో పాటు తారక రామ్‌నగర్ వాసులకు కూడా ఉపాధి పెరుగుతుంది. లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద జనసాంద్రత పెరిగి జగిత్యాల విస్తరిస్తూ అంతర్గామరాఫూర్, ఓగులాపూర్, గొర్రె గుండం దాకా రాక పోకలు పెరిగినపుడు నగర విస్తీర్ణం జరుగుతుంది. గాంధీనగర్ తర్వాత దెమ్మరిల్లులు. తూర్పున శ్మశాన వాటిక, మోతె చెరువు, ఎరుకల ఇండ్లు, ఒర్రె వల్ల జనసాంద్రత విస్తరణ కొంచెం కష్టం. హాల్ తాటిపెల్లి మీదుగా దుబ్బ రాజన్న నేషనల్ హైవే వైపు బైపాస్ వేస్తే కండ్లపెల్లి ఇవతలి నుండి విస్తరణ పెరుగుతుంది. కాలక్రమంలో కండ్లపెల్లి చెరువు టాంక్‌బండ్ గా ఎదుగుతుంది. అలాగే ముప్పావల చెరువు కూడా టాంక్‌బండ్‌గా ఎదుతుంది. ఇవి పదేళ్లకు సరిపోయే అభివృద్ధి పనులు. ఒకసారి వీటిగురించి ఆలోచించగలరు.

బి ఎస్ రాములు.

బీసీ కమిషన్ మాజీ చైర్మన్

83319 66987

Advertisement

Next Story

Most Viewed