- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వృద్ధులను.. చేరదీయండి
సమాజ సంక్షేమానికి, అభివృద్ధికి, మానవీయతకు సత్సంబంధాలు పునాదులు అవుతాయి. అవి కొరవడినప్పుడే బంధాలు బలహీనపడతాయి. దానితో స్వార్థం పెచ్చరిల్లి అమానుష, అమానవీయ ఘటనలతో సమాజంలో సామాజిక స్పృహ కొరవడుతుంది. ఇది వ్యక్తుల మధ్య, కుటుంబాల మధ్య, రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య కావచ్చు.. కలిస్తేనే ప్రగతి, పరిణతి. లేదంటే? అగాధాలు పెరిగిపోయి, విడిపోయి పడిపోతాయి.
మనిషి పేగు బంధాలతో పుట్టి, ఆ తర్వాత వివిధ సంబంధాలతో జీవితం కొనసాగుతుంది. ఈ బంధాలు కలుస్తుంటాయి, విడిపోతుంటాయి. ఇంకొన్ని రుణానుబంధాలు రుణం తీరగానే ముగిసిపోతాయి.. మళ్లీ కొత్తవి సంతరించుకుంటాయి. ఇదే జీవిత సత్యం. ఏ బంధమైనా ‘మనం-మనది’ అనే భావన ఉన్నంతవరకు సాఫీగా జీవితం సాగుతుంది. అలా కాకుండా ‘నేను-నాది’ అనే అహంభావం పెరిగితే బంధాలు విచ్ఛిన్నం అవుతాయి.. ఇది నేటి సమాజానికి, భావితరాలకు క్షేమం కాదు. నేటి ఉరుకులు పరుగుల జీవితంలో సంపాదనపై ఉన్న మక్కువ, మనకు జీవితాన్నిచ్చిన వృద్ధులపై లేకపోవడం కడు శోచనీయం. యుక్త వయసులో శక్తి యుక్తులను, సుఖసంతోషాలను త్యాగం చేసి, జీవితమంతా బంధాల కోసం ధారపోసి అలసి వయసు పెరిగిపోవడంతో అనారోగ్య సమస్యలు.. ఆస్తులు కూడగట్టినా ఆలనాపాలనా చూసుకునేవారు లేని ఒంటరి జీవితమే నేరగాళ్లకు అవకాశంగా మారుతున్నాయి. ఒంటరిగా ఉండే వృద్ధులపై దాడులు, వేధింపులు పెరిగిపోతున్నాయి. కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఈ తరహా నేరాలు వరుసగా పెరుగుతున్నాయి. అయితే నిందితుల్లో ఎక్కువమంది సొంత కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, సన్నిహితులుగా మెలిగేవారే ఉండటం గమనార్హం.
జాతీయ నేర గణాంకాల సంస్థ 2022 ప్రకారం.. గత ఏడాది తెలంగాణలో వృద్ధులు బాధితులుగా 2,181 నేరాలు నమోదయ్యాయి. ఈ మొత్తంలో 1,001 కేసులు ఫోర్జరీ, నమ్మకద్రోహం, మోసం బలవంతంగా ఆస్తులు స్వాధీనం చేసుకోవడం వంటి ఘటనలే ఉన్నాయి. దాదాపు 45.8% కేసులు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన నేరాలే అని తెలుస్తుంది. బలవంతంగా ఆస్తుల స్వాధీనం, ఫోర్జరీ మోసాల్లో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో నిలుస్తుంది. 941 నేరాలతో మహారాష్ట్ర రెండవ స్థానంలో ఉంది. మరే ఇతర రాష్ట్రాల్లో ఈ స్థాయిలో నమోదు కావడం లేదు. మొత్తంగా వృద్ధులపై జరిగే నేరాల్లో దేశంలోనే తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్ 6,187, మహారాష్ట్ర 5,059, తమిళనాడు 2,376 వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి . గత మూడేళ్లుగా రాష్ట్రంలో 10-20% నేరాలు పెరుగుతుండటం ఆందోళనకరం. అయితే ఈ తరహా మెజారిటీ కేసుల్లో బాధితులు ఫిర్యాదు చేసేందుకు వెనకాడుతున్నారని, ప్రస్తుతం నమోదయ్యే కేసుల్లో నేరాలు సగానికంటే తక్కువేనని ఇదే అవకాశంగా నిందితులు తప్పించుకుంటున్నారు. అందుకే గత ఏడాది వృద్ధులపై జరిగిన 389 నేరాలలో ఒక్క ఆధారం లభించలేదని ఒక ఉన్నత పోలీసు అధికారి తెలిపారు.
అన్నీ ఇచ్చేవాళ్ళు దేవుళ్ళు కాదు? అమ్మానాన్నలే అన్న యదార్థాన్ని మరువకండి. ఆధునిక టెక్నాలజీ మనుషుల్లో బంధాలను, మానవత్వాన్ని పెంపొందించడం లేదు. మహనీయులుగా కాకపోయినా.. కనీసం మనుషులుగా బతకండి. వృద్ధులు అనుభవాల ఆస్తి. ఏదో రోజు మనమందరం ఆ దశ దాటాల్సిందే. మనిషి సంపదపై దురాశను వీడి మానవత్వంతో వృద్ధులను చేరదీస్తూ, వారిని కాపాడాల్సిన బాధ్యత కుటుంబాలపై, బంధువులపై ఉంది. వారు గౌరవంగా బతికే హక్కును ఎవరు హరించినా.. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా శిక్షించాలి. అవసాన దశలో వృద్ధులను చేరదీసుకోవాల్సిన స్పృహతో మెదలండి. భావితరాలకు మార్గదర్శకులుగా నిలవండి.
-మేకిరి దామోదర్,
సామాజిక విశ్లేషకులు,
95736 66650