- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నవయుగ వైతాళికుడు శ్రీశ్రీ
మొదటి నుంచి సమ సమాజ స్థాపనకు, శ్రామిక, కర్షక, కార్మిక లోకం బాగు కోసం రచనలతో ముందుకు సాగారు. 1962 చైనా యుద్ధం సమయంలో కమ్యూనిస్టు నాయకులను నిర్భంధించారు. ఆ సమయంలో ఖమ్మం జిల్లాకు చెందిన వై. రాధాకృష్ణమూర్తి, బి.రాధ, కేవీ సుబ్బారావు, కడియాల గోపాలరావు వంటి నాయకులు ఏర్పాటు చేసిన ఏపీసీఎల్‌సీకి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కర్నూలు, అనంతపురం, నల్గొండలో భారీ సభలు నిర్వహించి, ప్రజలను చైతన్యపరచి, పౌర హక్కుల సాధనకు, నిర్భందాలకు వ్యతిరేకంగా నిలిచారు. అందుకేనేమో 'పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర పుల్లారెడ్డి వంటి కమ్యూనిస్టులకంటే ఈ పౌరహక్కుల నేతలే ప్రమాదకరం' అని అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి వ్యాఖ్యానించారు.
20వ శతాబ్దంలో తెలుగు సాహిత్యాన్ని శాసించి, విప్లవ భావాలు రగిలించి, సామాజిక వాస్తవికతను తన కలంతో, గళంతో ప్రజా చైతన్య పతాక ఎగురవేసిన మహాకవి శ్రీశ్రీ. 1910 ఏప్రిల్ 30న విశాఖపట్నంలో పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు జన్మించారు. శ్రీరంగం సూర్యనారాయణకు దత్తుడు అగుటచే ఇంటిపేరు మారి, శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ)గా ప్రసిద్ధులయ్యారు. ఆరు దశాబ్దాల పాటు తెలుగు సాహిత్యానికి 'అభ్యుదయం' అద్ది, సమసమాజ స్థాపనకు కృషి చేసిన శ్రీశ్రీ చిరస్మరణీయుడు. విశాఖపట్నంలో ఎస్‌ఎస్ఎల్‌సీ పూర్తి అయిన వెంటనే వివాహం చేసుకున్నారు. 1931 లో మద్రాసు యూనివర్సిటీ నుంచి బీఏ పట్టా అందుకున్నారు. విశాఖ ఎస్‌వీఎస్ కాలేజిలో డిమాన్‌స్ట్రేటర్‌గా చేరారు.
పద్దెనిమిది యేండ్ల వయస్సులోనే కవితలు, పద్యాలు రాయడం మొదలుపెట్టి, 1928లో 'ప్రభవ' కావ్య సంపుటిని వెలువరించారు. తదుపరి ఛందస్సు, గ్రాంథిక శైలిని విడిచి, గురజాడ, గిడుగు దారిలో పయనించి అనేక రచనలు చేశారు. 1938లో మద్రాసు చేరుకుని ఆంధ్రప్రభ దిన పత్రికలో సబ్-ఎడిటర్ పని చేశారు. ఆకాశవాణి, ఆంధ్రావాణిలోనూ పనిచేశారు. ఈ సమయంలోనే జగన్నాథ రథచక్రాలు, గర్జించు రష్యా, బాటసారి, భిక్షు వర్షీయసి సంకలనాలను వెలువరించారు. 1950లో మహాప్రస్థానం వంటి రచనలతో తెలుగు సాహిత్యాన్ని ఒక మలుపు తిప్పి తనకంటూ ఒక తిరుగులేని స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. చరమరాత్రి కథల సంపుటి, రేడియో నాటికలు రచించారు. వరం వరం, సంపంగి తోట, అమ్మ, మేమే, మరో ప్రపంచం, త్రీ చీర్స్ ఫర్ మాన్, మానవుడి పాట్లు, సౌదామిని, రెక్క విప్పిన రెవల్యూషన్, లెనిన్, ప్రజారాజ్యం, ఉక్కు పిడికిలి, అగ్నిజ్వాల వంటి రచనలు చేశారు. 1966లో సంచలన కావ్యం 'ఖడ్గసృష్టి'ని వెలువరించారు. 'ప్రగతి' వార పత్రికలో ప్రశ్నలు-జవాబులు (ప్రజ) శీర్షికను నిర్వహించారు. ప్రాసకు, శ్లేషకు శ్రీశ్రీ పెట్టింది పేరు.
సినిమా రంగంలోనూ
1950లో సినీ రంగ ప్రవేశం చేసి, అనువాద చిత్రం 'ఆహుతి'కి మాటలు పాటలు రాశారు. రోహిణి సంస్థ అధినేత హెచ్ఎం రెడ్డి నెలకు మూడు వందల రూపాయలు వేతనంతో శ్రీశ్రీని ఆస్థాన రచయితగా చేసుకున్నారు. మునాన్ కూడా రెండు వందల ఇచ్చి పాటలు, మాటలు రాయమని కోరారు. అలా నెలకు ఐదు వందల వేతనం సంపాదించేవారు. తదుపరి బి.విఠలాచార్య ఆయనతో సినిమాలకు మాటలు పాటలు రాయించారు. ఒక్కరోజులోనే పన్నెండు (12) పాటలు రాసి వరల్డ్ రికార్డ్ సృష్టించిన ఘనత శ్రీశ్రీదే. ఉద్రేకం, ఉత్తేజం పొందుపరిచేవారు. అంతేకాదు శృంగార, భక్తి గీతాలు ఎంతో మధురంగా రాసారు. డాక్టర్ చక్రవర్తిలో 'మనసున మనసై' ఆరాధనలో 'నా హృదయంలో నిదురించే చెలి' అల్లూరి సీతారామరాజులో 'తెలుగు వీర లేవరా'( జాతీయ అవార్డు లభించింది), వెలుగు నీడలులో 'పాడవోయి భారతీయుడా' ఇలా వెయ్యికి పైగా గీతాలు రాశారు.
మరో ప్రపంచానికి దారి
'మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది- పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పైపైకి' అని ఉవ్వెత్తున గర్జించిన శ్రీశ్రీ రచన నేటికీ రోమాలను నిక్కబొడుచుకునేదే. విశ్వనాథకి, శ్రీశ్రీకి ప్రారంభ సమయం ఒక్కటిగానే ఐక్యంగా ఉన్నా, ఇద్దరి రచనల భావస్వారూప్యం వేరగుటచే సంబంధాలు సన్నగిల్లాయి. అయినప్పటికీ విశ్వనాథ సత్యనారాయణను తెలుగువాడి 'గోల్డ్ నిబ్బు' అని ప్రశంసించారు శ్రీశ్రీ. తెలుగు భాషకు జాతీయ హోదా కావాలన్న జేబీఎస్ హోల్డన్ ప్రతిపాదను శ్రీశ్రీ సమర్థించారు. మొదటి నుంచి సమ సమాజ స్థాపనకు, శ్రామిక, కర్షక, కార్మిక లోకం బాగు కోసం రచనలతో ముందుకు సాగారు. 1962 చైనా యుద్ధం సమయంలో కమ్యూనిస్టు నాయకులను నిర్భంధించారు. ఆ సమయంలో ఖమ్మం జిల్లాకు చెందిన వై. రాధాకృష్ణమూర్తి, బి.రాధ, కేవీ సుబ్బారావు, కడియాల గోపాలరావు వంటి నాయకులు ఏర్పాటు చేసిన ఏపీసీఎల్‌సీకి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కర్నూలు, అనంతపురం, నల్గొండలో భారీ సభలు నిర్వహించి, ప్రజలను చైతన్యపరచి, పౌర హక్కుల సాధనకు, నిర్భందాలకు వ్యతిరేకంగా నిలిచారు.
అందుకేనేమో 'పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర పుల్లారెడ్డి వంటి కమ్యూనిస్టులకంటే ఈ పౌరహక్కుల నేతలే ప్రమాదకరం' అని అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి వ్యాఖ్యానించారు. అంటే, శ్రీశ్రీ, కడియాల వంటి నాయకులు ఎంత స్ఫూర్తితో పనిచేసారో అర్థం చేసుకోవచ్చు. వీరి ప్రయత్నాల మూలంగానే కేంద్ర, రాష్ట్ర స్థాయిలో 'మానవ హక్కుల కమిషన్' ఏర్పాటు చేశారు.శ్రీశ్రీ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) అధ్యక్షుడిగానూ పనిచేశారు. 1970 దశకంలో విప్లవ రచయితల సంఘం ( విరసం) వ్యవస్థాపక అధ్యక్షుడిగా సేవలు అందించాడు. ఈయన రచనలకు నంది అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు లభించాయి. శ్రీశ్రీ జీవితమంతా సామాన్య ప్రజల సర్వతోముఖాభివృద్ధికే వెచ్చించారు. కొన్ని సందర్భాలలో విమర్శలు ఎదుర్కొన్నారు. అపుడు గుడిపాటి వెంకటాచలం బాసటగా నిలిచారు. ఒక హేతువాదిగా, యదార్థవాదిగా తన జీవితాన్ని సాగించి, 1983 జూన్ 15వ తేదీన భౌతికంగా మనకు దూరమయ్యారు. సమసమాజ స్థాపన, ప్రజాస్వామ్య విలువల ఆచరణే ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళి.
(నేడు శ్రీశ్రీ వర్ధంతి)
ఐ.ప్రసాదరావు
99482 72919