- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్నేహితుల దినోత్సవం సందర్భంగా స్పెషల్ ఆర్టికల్
స్నేహం ఎంతో అందమైనది. అపురూపమైనది. విలువైనది. వెలకట్టలేనిది. దానికి మించిన సంపద లేదు. స్నేహానికి మించిన అదృష్టం లేదు. స్నేహానికి సరిహద్దులు లేవు. పరిమితులూ లేవు. స్నేహానికి వయోబేధం లేదు. హోదా, అధికారమూ అడ్డు కావు. మంచి స్నేహితుడు తోడుగా ఉంటే ఆ ధీమా, భరోసాయే వేరు. ఇద్దరు వ్యక్తులకు, రెండు మనసులకు సంబంధించిన ఈ స్నేహం తరతరాలకు తరగని తీపి జ్ఞాపకం పంచుతుంది. కాలమాన పరిస్థితులకు అతీతమైన ఈ మైత్రీ మధురిమ అంతులేని ఆనందాన్ని పంచుతుంది.
కన్నవారితో, కట్టుకున్నవారితో, తోబుట్టినవారితో సైతం చెప్పుకోలేని విషయాలను స్నేహితులతో చెప్పుకోవడం స్నేహ గొప్పదనం. కష్టసుఖాలలో, కలిమిలేమిలో తోడుగా అండగా ఉండేవారు, నిస్వార్థంగా సహాయం అందించేవారే నిజమైన స్నేహితులు. మానవ సమాజంలో పరస్పర ప్రేమానురాగాలు వెల్లివిరియాలంటే ప్రతి ఒక్కరూ స్నేహ ధర్మాన్ని నిర్వర్తించాలి. స్నేహ సౌభ్రాతృత్వాలే మంచి సమాజానికి పునాదిరాళ్లు.
భరోసా కల్పించాలి
'శరీరంలో ఎక్కడ గాయమైనా మిగతా అవయవాలన్నీ వేదన పంచుకుంటాయి. అది శరీర ధర్మం. అలాగే, ఒక స్నేహితుడికి కష్టమొచ్చినా, జబ్బు చేసినా వెంటనే స్పందించి వారిని పరామర్శించాలి. వారి కష్టసుఖాలలో పాలు పంచుకోవాలి. వారి దుఃఖాన్ని, బాధను, కష్టనష్టాలను దూరం చేయడానికి చేయగలిగినంత సహాయం చేయాలి. ఇది స్నేహ ధర్మం' అన్నారు మహమ్మద్ ప్రవక్త. 'శత్రువు ఒక్కడైనా ఎక్కువే, స్నేహితులు వంద మందయినా తక్కువే' అన్నారు స్వామి వివేకానంద. 'మనిషిని అవసరంలో ఆదుకున్న మిత్రుని కన్నా ప్రియమైనది ఏదీ ఉండదు' అంటారు గురునానక్. 'నిజమైన స్నేహితుడు ఎవరో తెలిసేది కష్టకాలంలోనే' అంటారు గాంధీజీ.
మంచి స్థితిలో ఉన్న సమయంలో స్నేహ సంబంధాలు కొనసాగించి, కాస్త ఇబ్బంది పడగానే స్నేహ సంబంధాలకు చరమగీతం పాడడం మంచి మానవీయత అనిపించుకోదు. కష్టాలలో ఉన్నప్పుడు అండగా నిలిచినవాడు, తానున్నానని భరోసా కల్పించగలిగినవాడే నిజమైన స్నేహితుడు. ఒకమిత్రుడు మరొక మిత్రుడితో చిత్తశుద్ధితో, వాత్సల్యంతో, విశ్వసనీయతతో, సానుభూతితో మెలగాలి. స్నేహితుడు కష్టాలలో ఉంటే ఆదుకోవడమే కాదు. అతనిలో ఉన్న లోపాలను సైతం సంస్కరించడానికి ప్రయత్నించాలి. ఇది స్నేహ ధర్మంలోని భాగమే.
స్నేహన్ని కవచంగా వాడుకొని
స్నేహితుడి పట్ల విజ్ఞతతో వ్యవహరించడం చాలా అవసరం. సమయ సందర్భాలను బట్టి మాత్రమే స్పందించాలి. స్నేహితుని లోపాలను ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా, అతని మేలుకోరి సున్నితంగా తెలియజెప్పాలి. నేడు స్నేహం కూడా కృత్రిమమై పోయింది. మొహమాటపు స్నేహాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనసు లోతుల నుంచి పెల్లుబికే స్నేహ సంబంధాలు చాలా అరుదు. స్నేహం ముసుగులో మోసం, దగా, వంచన కొనసాగుతున్నాయంటే అతిశయోక్తి కాదు.
స్వార్థం, స్వలాభం కోసం స్నేహాన్ని కవచంగా వాడుకునే నీచ స్వభావులకూ కొరత లేదు. అవసరం మేరకు స్నేహం, ప్రేమ నటిస్తూ, అవసరం తీరాక ముఖం చాటేసే మహానుభావులూ ఉన్నారు. నిజానికి, స్నేహానికి మించిన సంపదగానీ, సత్కార్యంగానీ మరొకటి లేదు. ఇతరులను ప్రేమించలేనివారికి, స్నేహితులు లేనివారికి జీవితంలో ఎన్ని ఉన్నా నిరుపయోగమే. స్నేహ ధర్మాన్ని పాటిస్తేనే ఇహమైనా, పరమైనా దైవం మనందరికీ మంచి స్నేహితులను, సద్బుద్ధిని ప్రసాదించాలని, పరస్పర స్నేహ సంబంధాలలో వృద్ధిని, శుభాన్ని కలుగజేయాలని కోరుకుందాం.
(నేడు స్నేహితుల దినోత్సవం)
ఎండీ. ఉస్మాన్ ఖాన్
సీనియర్ జర్నలిస్ట్
99125 80645
- Tags
- friendship day