బెంగాల్ దివ్య సింహం.. స్వామి 'శ్రీ యుక్తేశ్వర్ గిరి' జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం..

by Vinod kumar |
బెంగాల్ దివ్య సింహం.. స్వామి శ్రీ యుక్తేశ్వర్ గిరి జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం..
X

“భయం ముఖంలోకి చూడండి, అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మానేస్తుంది” బెంగాల్ దివ్య సింహం జ్ఞానావతారులు స్వామి శ్రీ యుక్తేశ్వర్ గిరి వ్యాఖ్యలివి. ఈయన పడమర దేశాలలో యోగపితామహుడిగా పిలిచే పరమహంస యోగానంద దివ్య గురువులు. ఆధ్యాత్మిక కళాఖండమైన ‘ఒక యోగి ఆత్మ కథ’ లో యోగానంద తమ గురువు లోతు కనిపెట్టలేని స్వభావం గురించి పరిశోధిస్తూ, ఒక దివ్య పురుషుని గురించి వేదాలు ఇచ్చిన నిర్వచనానికి తమ గురువు సరిగా సరిపోతారని చెప్పారు: కరుణ చూపించడంలో పుష్పం కన్నా మృదువుగా, సిద్ధాంతాలు ప్రమాదంలో ఉన్నప్పుడు పిడుగు కన్నా బలంగా ఉంటారు.

బెంగా‌ల్‌లోని శ్రీరాంపూర్‌లో 1855, మే 10వ తేదీన ప్రియానాధ్ కరా‌ర్‌గా జన్మించిన ఈయన బెనారస్‌లోని మహోన్నత యోగి అయిన లాహిరీ మహాశయుల శిష్యులయారు. తర్వాత స్వామి సంప్రదాయంలో చేరి శ్రీయుక్తేశ్వర్ గిరి అనే నూతన నామధేయాన్ని స్వీకరించారు. మేధాపరమైన, ఆధ్యాత్మిక పరమైన విద్యలో ఆయన ఆజన్మాంతం ఆసక్తి కలిగి ఉండడం వలన, తన పూర్వీకుల భవనాన్ని విద్య నేర్పే ఆశ్రమంగా మార్చారు. ఆయన సంరక్షణలో ఉన్న శిష్యులందరూ ప్రాచ్య, పాశ్చాత్య దేశాలలోని ఉత్తమ లక్షణాలకు అనుసంధాన కర్తలుగా సునిశితంగా శిక్షణ పొందారు.

పరిపూర్ణతను కోరుకునే వ్యక్తి కావడం వలన శ్రీ యుక్తేశ్వర్ గిరి పద్ధతులు తరచుగా తీవ్రంగా ఉండేవని పరమహంస యోగానంద చెప్పేవారు. ఆయన క్రమశిక్షణా సుత్తి బరువుకు తాను చాలాసార్లు కంపించినట్లుగా యోగానంద గుర్తు చేసుకునేవారు. మిడి మిడి విద్యార్థులు సహేతుకంగానే గురువుగారిని కోరుకునే వారు కాదని అయితే తెలివైనవారు సంఖ్యలో చాలా తక్కువైనప్పటికీ ఆయన్ని గాఢంగా ఆరాధించేవారని యోగానంద చెప్పేవారు.

సులువైన మార్గం కోసం లేక ‘అహంకార లేపనాన్ని’ కోరుకునే విద్యార్థులు తీవ్ర స్వభావం గల గురువు గారి ఆశ్రమం నుంచి పారిపోయినప్పుడు ఆయన ఇలా పొడిగా వ్యాఖ్యానించే వారు; క్రమశిక్షణ యొక్క మృదుస్పర్శకే ఎదురు తిరిగే సుళువుగా దెబ్బతినే ఆంతరిక బలహీనతలు, సున్నితంగా ముట్టుకున్నప్పటికీ ముడుచుకుపోయే వ్యాధిగ్రస్త శరీరావయవాల వంటివి.”

“ఎన్నడూ ఆగ్రహంతో నిండినవిగా కాక, జ్ఞానంతో కూడి, వ్యక్తిని ఉద్దేశించకుండా ఉన్న” ఆయన మాటల దాడులు తమను క్రమశిక్షణలో పెట్టమని అభ్యర్థించిన శిష్యులపై మాత్రమే ప్రయోగించబడేవి. ఆయన వారిని తరచుగా ఈ పదాలతో ప్రోత్సహించేవారు; “ఇప్పుడు మీరు ఆధ్యాత్మిక పరమైన కృషి చేస్తూ ఉంటే భవిష్యత్తులో అన్నీ మెరుగుపడతాయి.” క్రమశిక్షణను సరిగ్గా అర్థం చేసుకున్న శిష్యులు, తీవ్రమైన కఠినత్వ ముసుగు కిందనున్న గాఢంగా ప్రేమించే హృదయాన్ని గుర్తించేవారు.

“ప్రపంచంలో ఆత్మనిగ్రహంగల సింహంలా తిరగండి; ఇంద్రియ దౌర్బల్యాలనే కప్పలు మిమ్మల్ని అటూ యిటూ తన్ననివ్వకండి!” అన్నది ఆయన తన శిష్యులకు ఇచ్చిన బలమైన పిలుపు. ఒక వ్యక్తి యొక్క క్రమబద్ధమైన రోజువారీ ఆధ్యాత్మిక పురోగతి తప్ప బాహ్యంగా చూపించే ఏవిధమైన గౌరవాలూ ముఖ్యమైనవి కావని ఆయన తన శిష్యులకు గట్టిగా సూచించేవారు. క్రియాయోగమనే అత్యంత ఉన్నత స్థాయికి చెందిన ఆధ్యాత్మిక ప్రక్రియను సాధన చేయమని ఆయన వారికి గుర్తుచేసేవారు.

ఒక కుంభమేళాలో మహావతార్ బాబాజీ శ్రీయుక్తేశ్వర్ జీని క్రైస్తవ, హిందూ పవిత్ర గ్రంథాలలో అంతర్లీనంగా ఉన్న సామరస్యంపై ‘కైవల్య దర్శనం’ అనే పేరుతో ఒక చిన్న పుస్తకాన్ని రాయమని అడిగారు. ‘ప్రాచ్య పాశ్చాత్యాల నడుమ జరుగబోయే సామరస్యపూర్వక మార్పిడి’లో ఆయన నిర్వహించబోయే గొప్ప పాత్రను మరింత ముందుకు తీసుకెళ్తూ బాబాజీ పాశ్చాత్యదేశాలలో యోగాన్ని వ్యాపింప జేయడానికి ఒక శిష్యుడికి శిక్షణ నివ్వడానికి ఆయన వద్దకు పంపుతానని వాగ్ధానం చేశారు. ఆ విశిష్ట శిష్యుడే పరమహంస యోగానంద. తర్వాత ఆయన రాంచీలో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాను, కాలిఫోర్నియాలో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్‌ను స్థాపించారు. అవి ఒక శతాబ్దం క్రిందట ప్రారంభమైనప్పటి నుంచి క్రియాయోగం యొక్క అనిర్వచనీయమైన వెలుగుతో తూర్పు, పడమర దేశాలు రెండిటినీ ప్రకాశింపజేస్తూ ఉన్నాయి.

ఈ నివాళితో యోగానంద తమ ప్రియతమ గురుదేవులపై తమకు గల గొప్ప గౌరవాన్ని వ్యక్తం చేశారు; “ఆయన మనస్సు కీర్తి లేదా ప్రాపంచిక ఘనకార్యాలపై లగ్నమై ఉంటే, రాచఠీవి కలిగిన నా గురువు సులువుగా ఒక చక్రవర్తో లేక లోకాన్ని గడగడ లాడించే యోధుడిగానో అయి ఉండేవారని నేను తరచుగా ఆలోచించే వాడిని. దానికి బదులు కోపం, అహంకారమనే ఆంతరిక దుర్గాలపై తుఫానులా విరుచుకుపడాలని ఆయన ఎంచుకున్నారు. వీటి పతనమే మనిషి యొక్క ఔన్నత్యం. మరింత సమాచారం కోసం: Yssofindia.org వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని, క్రియాయోగం గురించి మరిన్ని వివరాలకు రాంచీ హెల్ప్ డెస్క్ నెంబర్‌‌కు 06516655555 ఫోన్ చేయాలని యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రతినిధులు సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed