- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రిటిష్ ఇంజనీర్లను అబ్బురపరచిన విశ్వేశ్వరయ్య గురించి తెలుసా!
విశాఖపట్నం ఓడరేవును సముద్రపు కోత నుంచి కాపాడారు. తిరుమల ఘాట్ రోడ్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. హైదరాబాద్‌ను వరదలు ముంచెత్తుతున్న సమయంలో నిజాం ఆహ్వానం మేరకు నగరానికి వచ్చారు. మూసీ, ఈసీ నదుల మీద ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలను నిర్మించారు. ఫత్తర్‌గట్టి నిర్మాణానికి కృషి చేశారు. ఏథెన్, కొల్హాపూర్, ధార్వాడ్, బీజాపూర్ మొదలగు పట్టణాలకు మంచినీటి పథకాలను రూపొందించారు. బొంబాయిలో ప్రభుత్వ ఉద్యోగం వదులుకొని, రెండు సంస్థానాల చీఫ్ ఇంజనీర్ ఆహ్వానాలను కాదనుకుని ఇటలీ, రష్యా, జర్మనీ వంటి దేశాలలో పర్యటించారు. అక్కడి బృహత్ నిర్మాణాలను పరిశీలించి 1909లో స్వదేశానికి తిరిగి వచ్చారు.
ఒకరి పుట్టిన రోజును ఒక వృత్తికి గుర్తుగా, చిహ్నంగా పెట్టుకున్నారంటే ఆయన ఎంత గొప్పవారో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన కట్టిన ఆనకట్టలు, భవనాలు, ఓడరేవులు, వంతెనలు, ఘాట్ రోడ్లు నేటికీ సజీవంగా ఉన్నాయి. ఆయనే భారతదేశ అత్యున్నత ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఆయన జయంతినే మనం దేశవ్యాప్తంగా 'ఇంజనీర్స్ డే'గా జరుపుకొంటున్నాం. 'ప్రజల సంపాదన శక్తిని, కార్యదక్షతను, నైపుణ్యాన్ని రకరకాల చేతి పనులతోనే పెంపొందించి, వారందరూ కష్టించి పనిచేసే వీలు కల్పించాలి.
అప్పుడే యాంత్రిక శక్తిని ఉపయోగించి దేశ పారిశ్రామిక ప్రగతిలో ముందంజ వేయగలం' అన్నారు విశ్వేశ్వరయ్య. 30 యేండ్ల పాటు నవభారత నిర్మాణానికి ఎనలేని కృషి చేసి, దేశ ప్రగతి సాధన కృషిలో భాగస్వాములై చరిత్రలో కలికితురాయిగా నిలిచారు. విశ్వేశ్వరయ్య ఇంజనీర్, పాలనాదక్షుడు, రాజనీతిజ్ఞుడు, నిష్కామ దేశభక్తుడు, తెలుగు సంతతికి చెందిన బిడ్డ, భారతరత్న అవార్డు గ్రహీత.
కార్యదీక్షతో పనిచేసి
మోక్షగుండం పూర్వీకులు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా మోక్షగుండం గ్రామానికి చెందినవారు. రెండు శతాబ్దాల క్రితం కర్ణాటకలోని ముద్దెనహళ్లి లో స్థిరపడ్డారు. అక్కడే విశ్వేశ్వరయ్య 1861 సెప్టెంబర్ 15వ తేదీన జన్మించారు. తండ్రి శ్రీనివాస శాస్త్రి, తల్లి వెంకటలక్ష్మమ్మ. పేద కుటుంబం. చిన్నప్పుడే తండ్రి చనిపోయారు. దీంతో విశ్వేశ్వరయ్యను మేనమామ రామయ్య చేరదీసి బెంగుళూరులోని సెంట్రల్ కాలేజీలో చదివించారు. కాలేజీ ఫీజు కోసం ప్రైవేట్ ట్యూషన్ చెబుతూ విశ్వేశ్వరయ్య 1881లో పట్టభద్రులయ్యారు. గణితంలో అసామాన్య ప్రతిభ సాధించి అధ్యాపకులకే గణిత సమస్యలు పరిష్కరించే స్థాయికి ఎదిగారు. శిష్యుడి బుద్ధికి ముగ్ధుడైన ప్రిన్సిపాల్ తాను ఉపయోగించుకునే వెబ్‌స్టర్ డిక్షనరీని, తన కోటుకున్న బంగారు బొత్తాములను విశ్వేశ్వరయ్యకు బహుమానంగా ఇచ్చారు. విశ్వేశ్వరయ్య ప్రతిభను గుర్తించిన మైసూరు సంస్థానం దివాన్ రంగాచార్యులు ఆయన ఇంజనీరింగ్ చదివేందుకు స్కాలర్‌షిప్ మంజూరు చేయించి పుణేకు పంపారు.
విశ్వేశ్వరయ్య బొంబాయిలో ఇంజనీరింగ్ పరీక్ష రాసి దేశంలోనే ప్రథముడుగా ఉత్తీర్ణులయ్యారు. తర్వాత ఆయనను బొంబాయి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా అసిస్టెంట్ ఇంజనీర్‌గా నియమించింది. యేడాదిలోనే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పదోన్నతిని అందుకున్నారు. ఆంగ్లేయుల పాలనలో అంత త్వరగా పదోన్నతి పొందడం గొప్ప విషయం. ఆయన కార్యదీక్షను ఆంగ్లేయులు గుర్తించి సింధు వంతెన నిర్మాణానికి ప్రత్యేక ఇంజనీర్‌గా నియమించారు. దీనిని నాలుగేళ్లలో పూర్తి చేసి ప్రశంసలు పొందారు. 1901లో భారత ప్రతినిధిగా జపాన్‌లో పర్యటించి దేశంలో కుటీర పరిశ్రమల కోసం ఒక పథకాన్ని రూపొందించి ప్రభుత్వానికి నివేదిక అందించారు. తర్వాత పుణే నగర నీటి సరఫరా పథకాన్ని రూపొందించారు. అందులో ఆటోమేటిక్ స్లూయిస్ గేట్‌ను రూపొందించి ప్రపంచ ఇంజనీర్ల మన్నలందుకున్నారు. దీనికి పేటెంట్ తీసుకొమ్మని మిత్రులు సూచించగా నిరాకరించారు.
నవభారత నిర్మాణంలో
విశాఖపట్నం ఓడరేవును సముద్రపు కోత నుంచి కాపాడారు. తిరుమల ఘాట్ రోడ్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. హైదరాబాద్‌ను వరదలు ముంచెత్తుతున్న సమయంలో నిజాం ఆహ్వానం మేరకు నగరానికి వచ్చారు. మూసీ, ఈసీ నదుల మీద ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలను నిర్మించారు. ఫత్తర్‌గట్టి నిర్మాణానికి కృషి చేశారు. ఏథెన్, కొల్హాపూర్, ధార్వాడ్, బీజాపూర్ మొదలగు పట్టణాలకు మంచినీటి పథకాలను రూపొందించారు. బొంబాయిలో ప్రభుత్వ ఉద్యోగం వదులుకొని, రెండు సంస్థానాల చీఫ్ ఇంజనీర్ ఆహ్వానాలను కాదనుకుని ఇటలీ, రష్యా, జర్మనీ వంటి దేశాలలో పర్యటించారు. అక్కడి బృహత్ నిర్మాణాలను పరిశీలించి 1909లో స్వదేశానికి తిరిగి వచ్చారు. మైసూర్‌ను ఆదర్శ సంస్థానంగా తీర్చిదిద్దారు. చీఫ్ ఇంజనీర్‌గా, దివాన్‌గా సేవలందించారు.
ఆయన కాలంలోనే మైసూరులో కృష్ణరాజసాగర్ నిర్మించారు. దేశంలోనే తొలి ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేశారు. 1921లో భారత ఉత్పత్తిదారుల సమాఖ్యకు అధ్యక్షులుగా పనిచేశారు. 1922లో అఖిలపక్ష రాజకీయ సమ్మేళనానికి, 1923లో ఇండియన్ సైన్స్ కాంగ్రెసుకు అధ్యక్షత వహించారు. భారీ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తూనే, కుటీర పరిశ్రమలను ప్రోత్సహించారు. తుంగ్రభద్ర ప్రాజెక్టుకు పథకం రచించారు. భారత ప్రభుత్వం విశ్వేశ్వరయ్యను 1955లో 'భారతరత్న' బిరుదుతో సత్కరించింది. 'గంధపు చెక్క వలె సేవలో అరిగిపో, ఇనుములా తుప్పు పట్టవద్దు' అనేది వారి జీవన ధ్యేయం. ఆయనను ఎన్నో విశ్వవిద్యాలయాలు సత్కరించాయి. 1962లో తుది శ్వాస విడిచారు. ఆయన జయంతి, వర్ధంతిని దేశవ్యాప్తంగా ఘనంగా జరపాలి. జీవిత చరితను పాఠ్య పుస్తకాలలో పెట్టాలి.
(నేడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి)
పీలి కృష్ణ, జర్నలిస్ట్
78010 04100