- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సామాజిక చైతన్యం అవశ్యం
ప్రజల ఆకాంక్షలకు పాలకులు చరమగీతం పాడిన రోజున ప్రజలు తమ తిరుగుబాటు ద్వారా తమకు అనువైన రాజకీయ వ్యవస్థను నిర్మించుకుంటారని హెచ్చరించడాన్ని బట్టి ప్రత్యామ్నాయ ప్రభుత్వాల ఆవశ్యకతను అర్థం చేసుకోవచ్చు. అదే సందర్భంలో విద్య, వైద్యం, సామాజిక న్యాయము ప్రజలందరికీ ఉచితంగా అందిన రోజున వ్యక్తి ఎదుగుదల ఉన్నతంగా ఉంటుందని, మెరుగైన సమాజ నిర్మాణంలో వారు చురుగ్గా పాల్గొంటారని అంబేద్కర్ దిశానిర్దేశం చేశారు. రాజనీతిజ్ఞతతో దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించవలసిన పాలకులు అవకాశవాదులుగా మారుతున్న సందర్భంలో ప్రభుత్వాల కుట్రలను ఛేదించడానికి అంబేద్కర్ చేసిన ప్రయత్నాలు, హెచ్చరికలు ప్రజల చైతన్యాన్ని మరింతగా పెంచవలసిన అవసరాన్ని నొక్కి చెబుతున్నవి.
ప్రశ్నించేతత్వాన్ని పెంచి పోషించే విద్యను మాత్రం ఉచితంగా అందివ్వరు' అని చురకలు అంటించారు. డా. బీఆర్ అంబేడ్కర్. విద్య, వైద్యం, న్యాయం ఉచితంగా అందితే ప్రజలు చైతన్యవంతులై శాసించే స్థాయికి వస్తారనేది ఇందులోని అంతరార్థం. ప్రశ్నించేతత్వాన్ని పెంచి పోషించే అత్యంత చురుకైన సాధనం 'విద్య' అని ప్రపంచవ్యాప్తంగా ఏకాభిప్రాయం ఉన్నది. ఇందుకు ఎలాంటి మినహాయింపులు లేవు కానీ, ఈ ప్రశ్నించేతత్వాన్ని నీరుగార్చే ప్రయత్నాలు కూడా సమాంతరంగా జరుగుతున్న మాట వాస్తవం కాదా? మతం, మూఢ విశ్వాసాలు, అతివినయం, మనకు సంబంధం లేదని గిరి తీసుకునేతత్వం, సామాజిక స్పృహ లేకపోవడం, పరిధి దాటి రాకపోవడం, ప్రభుత్వాల కుట్ర వంటి అనేక అంశాలు కూడా ప్రశ్నించే తత్వాన్ని సమాజంలో ఎదగకుండా చేస్తున్నవని చెప్పుకోవచ్చు. ఇన్ని అవరోధాలను అధిగమించి, అసాంఘిక శక్తుల కబంధహస్తాల నుంచి విముక్తి చెంది, సానుకూల దృక్పథాన్ని పెంచి పోషించడానికి, లక్ష్యాలను చేరుకోవడానికి, ఆత్మ విశ్వాసం నింపడానికి, సామాజిక రుగ్మతలను చీల్చి చెండాడి మెరుగైన సమాజ నిర్మాణానికి దోహదపడే ప్రయాణంలో 'ప్రశ్నించడం' అనివార్యమైంది.
ఏయే అంశాలలో
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు జన జీవితాలను విచ్ఛిన్నం చేస్తున్నప్పుడు, అసాంఘిక శక్తులు ప్రశాంతతను కొల్లగొడుతున్నప్పుడు, అసమానతలు, అంతరాలు, వివక్షత సమాజములో ఎల్లెడలా వ్యాపించినప్పుడు, జాతి సంపదను సంపన్నులు, పెట్టుబడిదారులకు ధారాదత్తం చేసి సామాన్య జనాలను నిర్లక్ష్యం చేసినప్పుడు ప్రశ్నించడమే పరిష్కారంగా పనిచేస్తుంది. ప్రభుత్వాలు ప్రజా జీవితంలో చొరబడి, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను హరించి వేసి, బానిసలుగా తయారు చేసుకొని, అధికారాన్ని శాశ్వతం చేసుకునే క్రమంలో 'ప్రశ్నించి యజమానులుగా మారుతారా? లేక లొంగిపోయి బానిసలుగా జీవిస్తారా?' తేల్చుకొమ్మన్నారు అంబేద్కర్. ఈ హెచ్చరిక వెనుక ఉన్న నేపథ్యం విద్యను ఆయుధంగా చేసుకుని సమాజాన్ని శాసించాలని ఆశించడమే. అందుకే అంబేద్కర్ 'ప్రభుత్వాలు అంత సులభంగా విద్యను ప్రజలకు ఉచితంగా అందించడానికి సిద్ధపడవు' అని జ్ఞానోదయం కలిగించిన సందర్భాన్ని మనం సమయస్ఫూర్తితో సద్వినియోగం చేసుకోవలసిన అవసరం ఉన్నది.
అంబేద్కర్ సూచనల మేరకు ప్రశ్నింప నేర్పే నాణ్యమైన విద్యను ఉచితంగా అందుకోవడానికి మరో పోరాటం చేయక తప్పడం లేదని తేలిపోతున్నది కదా! కేరళ, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా రంగంలో నువ్వా? నేనా? అనే స్థాయిలో పోటీ పడుతున్నాయి. విద్యకు 24, 25 శాతం నిధులను కేటాయించి అంతర్జాతీయ స్థాయి విద్యను ఉచితంగా అందిస్తున్న సందర్భాలను మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు ఆకలింపు చేసుకుంటే మంచిది. ఢిల్లీ ప్రభుత్వం వేలాది తరగతి గదులను సర్వాంగ సుందరంగా, విశాలంగా తీర్చిదిద్ది విద్యను ఉచితంగా అందిస్తూ, కార్పొరేటు పాఠశాలలను పరోక్షంగా మూసివేయడానికి తీసుకుంటున్న చర్యలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం కావాలి. ఢిల్లీలాంటి రాష్ట్రాలలో నిబంధనలను తుంగలో తొక్కిన ప్రైవేటు పాఠశాలలను ప్రభుత్వాలే మూసివేసి జరిమానా విధించిన సంఘటనలు చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వంటి రాష్ట్రాలలో విద్య అంగడి సరుకుగా మారిందని భావించక తప్పదు.
ఉచితంగా అందాలి
రాజ్యాంగ రచన సందర్భంలోనూ, స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలోనూ జరిగిన అనేక సభలు, సమావేశాల సందర్భంగా అంబేద్కర్ చేసిన అనేక సూచనలు లేదా హెచ్చరికలు నేటి పాలకులకు కనువిప్పు కావాలి. ప్రజల ఆకాంక్షలకు పాలకులు చరమగీతం పాడిన రోజున ప్రజలు తమ తిరుగుబాటు ద్వారా తమకు అనువైన రాజకీయ వ్యవస్థను నిర్మించుకుంటారని హెచ్చరించడాన్ని బట్టి ప్రత్యామ్నాయ ప్రభుత్వాల ఆవశ్యకతను అర్థం చేసుకోవచ్చు. అదే సందర్భంలో విద్య, వైద్యం, సామాజిక న్యాయము ప్రజలందరికీ ఉచితంగా అందిన రోజున వ్యక్తి ఎదుగుదల ఉన్నతంగా ఉంటుందని, మెరుగైన సమాజ నిర్మాణంలో వారు చురుగ్గా పాల్గొంటారని అంబేద్కర్ దిశానిర్దేశం చేశారు. రాజనీతిజ్ఞతతో దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించవలసిన పాలకులు అవకాశవాదులుగా మారుతున్న సందర్భంలో ప్రభుత్వాల కుట్రలను ఛేదించడానికి అంబేద్కర్ చేసిన ప్రయత్నాలు, హెచ్చరికలు ప్రజల చైతన్యాన్ని మరింతగా పెంచవలసిన అవసరాన్ని నొక్కి చెబుతున్నవి.
పాలకులు ఎప్పుడు కూడా సంపన్నవర్గాల పక్షాన నిలిచి పని చేస్తారనే ముందుచూపు, ప్రజల ఐక్య ఉద్యమాలు, పోరాటాల ద్వారా ఏర్పడే నిజమైన చట్టాల ముందు పాలకులు తలవంచక తప్పదనే హెచ్చరిక వారి మాటలలో కనపడుతున్నది. కేంద్ర ప్రభుత్వము విద్య, వైద్యానికి నామమాత్రపు నిధులను కేటాయిస్తూ ప్రైవేటుపరం చేయడానికి ఉత్సాహపడుతున్నది. రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఆయా రంగాలను గాలికి వదిలి, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడంలో పోటీ పడుతున్న తరుణంలో ఐక్య ఉద్యమాలే పరిష్కారమనే సూచన కూడా మన ముందు చర్చనీయాంశంగా నిలిచింది. దేశ గౌరవాన్ని, జాతి ప్రతిష్టను, ప్రజల ఆకాంక్షలను, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడానికి పిడికిలి బిగించి నినదించడమే మన ముందున్న ఏకైక పరిష్కారం. ఎన్నికల వేళ అలాంటి పార్టీలకే తమ ఓటు అనే డిమాండ్ తెర మీదకు రావాలి.
వడ్డేపల్లి మల్లేశము
సామాజిక రచయిత
90142 06412