‘స్మార్ట్ సేద్యం’ ప్రోత్సహించాలి!

by Ravi |   ( Updated:2024-08-17 01:15:55.0  )
‘స్మార్ట్ సేద్యం’ ప్రోత్సహించాలి!
X

వ్యవసాయంలో యాంత్రీకరణకు తోడుగా, సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ (ఏఐ) ఉపయోగించి సాగును 'స్మార్ట్'గా, లాభసాటిగా మార్చుతున్నాయి. సంప్రదాయ విధానాలకు ఈ ఆధునిక విధానాలకు మధ్య అంతరాన్ని పూడుస్తూ మొత్తంగా సాగులో విప్లవాత్మక మార్పులు తేవడానికి రంగం సిద్ధమౌతోంది.

స్మార్ట్ వ్యవసాయానికి సమాచార వ్యవస్థ (ఇన్ఫర్మేషన్ సిస్టమ్) పునాది వంటిది. వివిధ రకాల నేలల లక్షణాలు, ఆయా నేలల్లో పండే పంటలు, వాతావరణ పరిస్థితులు, పంటలను ఆశించే చీడపీడలు, దిగుబడులు వగైరా సమస్త సమాచారాన్ని సేక రించి భద్రపరుస్తారు. ఎటువంటి సాంకేతిక ఆవిష్కరణలకైనా ఈ డేటానే కీలకం కాబట్టి, ఈ విభాగంలో సాధ్యమైనంత ఎక్కువ సమాచారం సేకరించడం ప్రధానం. ఇలా సేకరించిన సమా చారం ఆధారంగానే ప్రస్తుతం రైతులు వినియోగిస్తున్న అనేక యాప్‌లు పనిచేస్తున్నాయి, పలు ఆగ్రి-టెక్ ఉత్పత్తులు అందుబాటులోకి వస్తున్నాయి.

సాంకేతికత పరిచయం చేయడంతో..

వ్యవసాయం ఆరుగాలం శ్రమతో కూడుకున్న అత్యంత పురాతనమైన వృత్తి. అయితే పట్టణీకరణ, ఉపాధి రంగాలలో మార్పుల కారణంగా సాగుభూమిలో తగ్గుదలతో పాటు, మానవ వనరుల లభ్యత తగ్గుతోంది. కూలీలకు అయ్యే ఖర్చు భారీగా పెరగడమే కాకుండా, వారి లభ్యతను బట్టి వంతుల వారీగా పనులు చేపట్టాల్సిన పరిస్థితుల వల్ల వ్యవసాయ పనులు ఆలస్యం అవుతున్నాయి. ఈ సమస్యల నేపథ్యంలో యాంత్రీకరణ రైతుకు ప్రత్యామ్న్యాయంగా మారింది. ఆధునిక యంత్ర పరికరాలు రైతుకు ఖర్చును, శ్రమను తగ్గిస్తూ సాగును లాభసాటిగా, సులభతరంగా మారుస్తున్నాయి. చిన్న చిన్న భూకమతాలు, సారహీనమైన నేల, పెరుగుతున్న చీడపీడలు, వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు వ్యవసాయ భవిష్యత్తుకు పరీక్షగా మారాయి. కాబట్టి కొత్త కొత్త సాంకేతికలను రైతులకు పరిచయం చేయడం ద్వారా తక్కువ వనరులతో ఎక్కువ ఉత్పాదకత సాధించడం నేటి అవసరం.

సంప్రదాయ సేద్యంలో అన్నీ వృథా!

పంటల నిరంతర పర్యవేక్షణ వ్యవసాయంలో అత్యంత ప్రధానమైన అంశం. రైతు అనునిత్యం పంటలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ అవసరమైనప్పుడు నీరు, ఎరువులు, తెగులు సోకినప్పుడు క్రిమిసంహారక మందులు వాడి పంటలను కాపాడుకుంటాడు. కానీ సాంప్రదాయ వ్యవసాయంలో పంటను సూక్ష్మంగా పరిశీలించే అవకాశం లేక సాధారణంగా ఎరువులను, క్రిమిసంహారక మందులను అవసరాన్ని బట్టి కాకుండా, ఒక నిర్ణీత సమయం ప్రకారం పొలం అంతా చల్లేస్తుంటారు. అలాగే ఖచ్చితంగా పంటకు అవసరమైనప్పుడు కాకుండా, నీటి లభ్యతను బట్టి కాస్త అటూ ఇటుగా నీరు పెట్టడం కూడా తరచుగా జరుగుతుంది. అవసరానికి మించి రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడటం వల్ల వృథా ఖర్చుకు తోడు భూమి కూడా కలుషితం అవుతోంది. కృత్రిమ మేధతో పనిచేసే క్రాప్ మానిటరింగ్ పరికరాలు, పొలంలో మొక్కలన్నింటిని నిశితంగా స్కాన్ చేసి ఏ ఒక్క మొక్కకి తెగులు సోకినా సమాచారం అందించే ఏఐ కెమెరాల వంటి ఆధునిక సాంకేతిక పరికరాలను వినియోగించి సాగును స్మార్ట్‌గా మార్చే ఈ విధానాన్నే "ప్రిషిషన్ అగ్రికల్చర్" అంటున్నారు.

ఏఐ కెమెరాలతో మొక్కల సర్వే..

ఒకప్పుడు వ్యవసాయంలో ప్రతి పనీ పూర్తిగా మనుషులే చేయాల్సి వచ్చేది. ఇప్పుడు దాదాపు మానవరహితంగా పనులన్నీ చేసేందుకు యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషిన్ లెర్నింగ్ లాంటి సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయం "స్మార్ట్"గా మారుతోంది. ఏఐ తోడ్పాటుతో వర్షాలు ఎప్పుడు పడతాయో ముందుగానే తెలుసుకుని తదనుగుణంగా పంట వేసుకోవచ్చు, అలాగే నేలలో ఏయే పోషకాలు లోపించాయో తెలుసుకుని వాటిని మాత్రమే భర్తీ చేసేలా ఎరువులు వాడి అనవసర ఖర్చు నివారించవచ్చు. డ్రోన్లకు కెమెరాలు అమర్చి ఫోటోలు, వీడియోలు తీస్తూ శాటిలైట్ సాయంతో మొత్తం క్షేత్రాన్ని సర్వే చేయవచ్చు. పొలంలో మొక్కలన్నిటిని నిశితంగా స్కాన్ చేసిన తాజా సమాచారన్ని ఏఐ కెమెరాలు అందించడం వలన అవసరమైన చోట మాత్రమే క్రిమి సంహారకాలను వాడి వృధాను అరికట్టవచ్చు. అలాగే ఏఐ సెన్సార్లతో పనిచేసే క్రాప్ మానిటరింగ్ పరికరాల సమాచారాన్ని అనుసరించి ఏ సమయంలో ఎంతనీరు అవసరమో.. అంతే నీటిని వాడి గరిష్ట ఫలితాలు పొందుతున్నారు.

డిజిటల్‌తో సేద్యం ముందడుగు..

ప్రపంచమంతా డిజిటలైజేషన్ మార్గం పట్టినప్పుడు ప్రధానరంగమైన వ్యవసాయం కూడా అదే మార్గం అనుసరించక తప్పదు. మన దేశంలో ఉన్న సుమారు 1500 అగ్రి-టెక్‌కు సంబంధించిన అంకుర పరిశ్రమలు ఎన్నో రకాల యంత్రాలను తయారు చేస్తున్నాయి. వ్యవసాయ మార్కెట్లో ఏఐ వాటా 2023 నుంచి 2028 వరకు ఏటా 23.1 శాతం చొప్పున పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. సాంకేతికతను ఎంతగా ఉపయోగించుకుంటే అంతగా శ్రమ, సమయం కలిసి రావడంతో పాటు, వనరులు పూర్తిస్థాయిలో ఉపయోగపడి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించే అవకాశం ఉంది. అయితే వ్యవసాయమే ప్రధాన జీవనాధారమైన మన దేశంలో, అభివృద్ధి చెందిన ఇతర దేశాలతో పోలిస్తే.. యాంత్రీకరణ ఆశించిన స్థాయిలో లేదు. ప్రధానంగా యంత్ర పరికరాలు అందుబాటులో లేకపోవడం, అన్నదాతలు సొంతంగా కొనుగోలు చేయలేని స్థాయిలో ధరలు ఉండడం దీనికి కారణం. సాగులో ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి పెద్ద మొత్తంలో అవసరమయ్యే పెట్టుబడి సమకూర్చుకోవడం రైతులకు భారంగా మారుతోంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రభుత్వాలు రాయితీపై అగ్రి-టెక్ ఉత్పత్తులను రైతులకు అందించాలి.

స్మార్ట్ అగ్రికల్చర్ బాటలో యువత..

భారత్‌లో సుమారు 13 కోట్ల మంది సభ్యులతో లక్షకు పైగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పిఎసిఎస్) ఉన్నాయి. వచ్చే ఐదేళ్లల్లో అదనంగా మరో రెండు లక్షల పిఎసిఎస్‌లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్షిస్తోంది. దేశంలో పదివేల వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలను (ఎఫ్‌పి‌ఓ) నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటికే 8,500 ఎఫ్‌పి‌ఓ‌లను ప్రారంభించారు. జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డ్) ఒక శాతం సబ్సిడీ రేట్లపై పిఎసిఎస్‌లకు రీఫైనాన్సింగ్ సౌకర్యం కల్పిస్తుంది. కాబట్టి రైతు ఉత్పత్తి సంఘాలు, సహకార సంఘాలు రైతులకు అవసరమైన సాంకేతిక పరికరాల కొనుగోలుకు తక్కువ వడ్డీపై రుణాలు ఇవ్వాలి. అలాగే వాటి నుండి ట్రాక్టర్లు, పంటకోత యంత్రాలు, డ్రోన్లు తదితర వ్యవసాయ సాధనాలు, పనిముట్లను అద్దెకు తీసుకునే సౌకర్యం కల్పించాలి. వ్యవసాయంలో యాంత్రీకరణకు, కృత్రిమ మేధకు ప్రాధాన్యత ఇచ్చి ఆయా రంగాలలో నిరంతరం పరిశోధన, అభి వృద్ధికి పెద్దపీట వేయాలి. ఈ సాంకేతికత విద్యావంతులైన యువతరాన్ని కూడా "స్మార్ట్ అగ్రికల్చర్" పట్ల ఆకర్షితులను చేసి పొలం బాట పట్టిస్తోంది. వ్యవసాయం లాభసాటిగా మారాలన్నా, పెరిగే జనాభాకి సరిపడా ఆహార ఉత్పత్తి సాధించాలన్నా ఏకైక మార్గం ఏఐ ఆధారిత "స్మార్ట్ సేద్యమే". ఆ దిశగా భారత్ నిర్విరామ కృషి కొనసాగించాలి.

లింగమనేని శివరామ ప్రసాద్

79813 20543

Advertisement

Next Story