- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పంతుళ్లు ప్రభుత్వంపై గొంతెత్తకూడదా?
ఉపాధ్యాయులు సమాజాన్ని పట్టించుకోకూడదని ఎక్కడా లేదు. కాలుష్య కారకమైన పరిశ్రమను వ్యవసాయ భూముల్లో జనావాస ప్రాంతాల్లో ఏర్పాటు చేయకూడదు అంటూ ఉద్యమించిన ప్రజల గొంతుకతో శ్రుతి కలిపిన ఇద్దరు ఉపాధ్యాయులపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక ఉపాధ్యాయునిపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో నిరసన బాటలో నడుస్తున్న ఆందోళనకారులపై నిర్బంధాలు పునరావృతమవుతున్నాయన్న ఆందోళన ప్రజాస్వామిక వాదుల్లో వ్యక్తమవుతున్నది.
బాధ్యత గల పౌరులుగా ఉపాధ్యాయులు సామాజిక సమస్యల పట్ల స్పందించడం ప్రజల పక్షాన నిలబడడం కొత్త కాదు. అందుకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జీవితమే ఉదాహరణ. ఆయన కూడా తెలంగాణ కోసం నిర్బంధాలను ఎదుర్కొన్న వారే. 70 దశకంలో కూడా ఇదే విధంగా ప్రజల పక్షం వహించిన ఉపాధ్యాయులపై నాటి ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపాయి. అధికారంలో ఉన్న పార్టీలు ఏవైనా ప్రజాభిప్రాయాన్ని గౌరవించకుండా "మేమేం చేసినా నోరెత్తకూడదు అంతే" అనే ధోరణి చూ స్తుంటే స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో సిపాయిల తిరుగుబాటును అణచడానికి బ్రిటిష్ ప్రభుత్వం తెచ్చిన "గాగింగ్ యాక్ట్" గుర్తుకొస్తున్నది. అప్రకటిత ఎమర్జెన్సీ మళ్లీ అమలవుతుందేమోనన్న అనుమానం బలపడుతున్నది. ఇప్పటికే ప్రజల ప్రజాస్వామ్య హక్కులను హరించే అనేక సందర్భాలను చూస్తున్నాం. ప్రజాస్వామిక ఉద్యమాలకు మద్దతుగా నిలిచిన ఎందరో ఉపాధ్యాయులు ఎన్నో నిర్బంధాలను కష్టనష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఉపాధ్యాయుల భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తూ ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను న్యాయస్థానాలు కొట్టివేశాయి.
బలవంతంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తారా?
ఇక్కడ విషయం ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం ఓ ఏడాది క్రితం కొత్తగా ఇథనాల్ పాలసీ ప్రవేశపెట్టింది. ఇది ఒక రకమైన ఇంధనం. చెరకు, వరి, జొన్న, మొక్కజొన్నల నుంచి రసాయనిక ప్రక్రియ ద్వారా ఇథనాల్ తయారు చేస్తారు. రాష్ట్రంలో 30 ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. అంతవరకు బాగానే ఉంది. పరిశ్రమలు దేశ ప్రగతికి అవసరమే. కానీ పరిశ్రమల ఏర్పాటు ఏ ప్రాంతంలో? పరిశ్రమల కాలుష్య ప్రభా వం ఎంత? కాలుష్య నివారణ చర్యలు, నష్టపరిహారాలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ మేరకు? అన్నది ప్రధానం. ప్రజల ప్రధాన ఆహార పదార్థాలను ఈ పరిశ్రమలకు ముడి పదార్థంగా వాడడంలో సందేహం. ఈ విషయాల్లో స్థానిక ప్రజలు అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి, నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనూరులో ఇప్పటికే ఇథనాల్ పరిశ్రమ నిరసనల మధ్య ఉత్పత్తిని ప్రారంభించాయి. నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలం గుండంపల్లి వద్ద ఏర్పాటు అవుతున్న ఇథనాల్ పరిశ్రమలను స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రోగ కారక కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు పచ్చని పొలాల మధ్య ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్య నివా రణ చర్యలు ఏవని నిలదీస్తున్నారు. ఏడాదిగా వివిధ రూపాల్లో ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి.
ప్రజలపక్షం వహిస్తే సస్పెన్షన్, అరెస్టు..
ఈ నేపథ్యంలో నిర్మల్‌కు చెందిన ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆరేపల్లి విజయకుమార్ యధావిధిగా తన విధులను సక్రమంగా నిర్వర్తిస్తూనే మిగతా సమ యాల్లో ప్రజలతో గొంతు కలిపారు. ఉపాధ్యాయునిగా 30 ఏళ్ల అనుభవం ఉన్న విజయ్ కుమార్ నిర్మల్ ప్రాంత ప్రజల తలలో నాలుకలాగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆదిలాబాద్ జిల్లా విద్యావంతుల వేదిక, కోదండరామ్‌తో కలిసి టీజేఏసీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన టీపీటీఎఫ్ ఉపా ధ్యాయ సంఘానికి జిల్లా అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. రిటైర్మెంట్‌కు దగ్గర్లో ఉన్న విజయ్ కుమార్‌ను ఈనెల రెండవ తేదీన ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వివిధ అభియోగాలు మోపింది. నిర్మల్ పట్టణం దాటకుండా ఆంక్షలు విధించింది. ప్రభుత్వం దృష్టిలో ఆయన చేసిన నేరమేమిటంటే ప్రజలతో కలిసి నడవడమే. అలాగే నారాయణపేట జిల్లాకు చెందిన జూనియర్ లెక్చరర్ బండారి లక్ష్మయ్యపై ప్రభుత్వం సుదీర్ఘకాలం సస్పెన్షన్ వేటు వేసి దానిని తర్వాత ఉపసంహరించుకుని దూరంగా బదిలీ చేసింది. మధ్యలో రిమాండు, జైలుతో సహా నిర్దాక్షిణ్యంగా రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసింది. వాస్తవానికి లక్ష్మయ్య కులవివక్షకు వ్యతిరేకంగా సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తున్నారు. పేద దళిత కుటుంబం నుంచి ఎదిగి వచ్చిన విద్యాధికుడు. చిత్తనూరులో ఇథనాల్ పరి శ్రమ ఏర్పా టును వ్యతిరేకించిన ప్రజలతో స్థానికుడైన లక్ష్మయ్య మమేకం కావడమే ఆయన నేరమట. ఎంత దారుణం!
ఉపాధ్యాయులు ప్రజల్లో భాగమే..!
పరిశ్రమ ఏర్పాటు వల్ల పరిసరాలు కాలుష్యం బారిన పడినా, పచ్చని పంట పొలాలు విచ్చుకుపోయి బీడుగా మారినా సమాజానికి తీరని దీర్ఘకాలిక నష్టం జరుగుతుంది. పైగా ఒక పరిశ్రమ వస్తుందంటే సహజంగానే ఆ ప్రాంత ప్రజలకు రకరకాల అనుమానాలు భయాలు కలిగే అవకాశం ఉంది. అభ్యంతరం వ్యక్తం చేసే హక్కు కూడా ప్రజలకు ఉంది. ఉపాధ్యాయులు కూడా ప్రజల్లో భాగమే. వారికీ హక్కులుంటాయి. పరిశ్రమ ఏర్పాటు వల్ల కలిగే సాధక బాధకాలకు, కష్టనష్టాలకు ఉపాధ్యాయులు మినహాయింపు కాదు. ప్రభుత్వ ఉద్యోగి అయినంత మాత్రాన భావ ప్రకటన స్వేచ్ఛను వదులుకోవాల్సిన ఆగత్యం లేదు. వివిధ సందర్భాల్లో న్యాయస్థానాలు అదే చెప్పాయి. భావ ప్రకటన వల్ల దేశానికి తక్షణ ప్రమాదం ఏర్పడినప్పుడు మాత్రమే ప్రభుత్వం చర్యలు తీసుకునే ఆస్కారం ఉంటుందన్నాయి.
పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఏల?
కాలుష్యం పంటల విధ్వంసం ప్రాతిపదికగా పరిశ్రమ ఏర్పాటు వ్యతిరేకిస్తే అది తక్షణ ప్రమాదమూ కాదు. తీవ్ర మైన నేరం కాదు. ఇద్దరూ బాధ్యత గల ప్రభుత్వ ఉద్యో గులు ఆయా ప్రాంత వాసులుగా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఏర్పాటు చేస్తున్న పరిశ్రమలు కూడా ప్రభుత్వానివి కావు. ప్రైవేటు యాజమాన్యాలవి. దానికే ప్రభు త్వం పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అన్నట్లు తీవ్రమైన చర్యలు తీసుకోవడం సమంజసం కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యమకారులపై మోపిన కేసులు ఎత్తివేసి, సస్పెన్షన్లను, బదిలీలను రద్దు చేసి సుహృద్భావ వాతావరణంలో పర్యావరణవేత్తలు మేధావుల సమక్షంలో చర్చలు జరిపి ఉభయతారకమైన పరిష్కారాన్ని కనుగొనడం మంచిది. కాంగ్రెస్ పార్టీ చేసిన ఎన్నికల వాగ్దానం అధినేతలు మరిచిపోతారేమో కాని ప్రజలు గుర్తుంచుకుంటారు.
-కె. వేణుగోపాల్,
పూర్వ అధ్యక్షులు, ఏపిటిఎఫ్
98665 14577