సెప్టెంబర్ 17 విలీనం కాదు.. విమోచనమే..!

by Ravi |   ( Updated:2024-09-17 00:30:20.0  )
సెప్టెంబర్ 17 విలీనం కాదు.. విమోచనమే..!
X

అధికార మదంతో పొగరెక్కిన నిజాం నవాబుకు దడపుట్టించారు. దోపిడికి కాలం చెల్లిపోతుందనే భయంతో.. అరాచకాలు సృష్టించిన గడీల పాలనకు చరమగీతం పాడారు. బారు ఫిరంగులు మోగినా, తుపాకీ తూటాల వర్షం కురిసినా ఎత్తిన జెండా దించలేదు. రవ్వంత స్ఫూర్తిని కూడా తగ్గనివ్వలేదు. బలిదానాలు చేసి మరీ సాయుధ పోరాటానికి ఊపిరిలూదారు. రజాకార్ల ఆకృత్యాలను మూకుమ్మడిగా ఎదుర్కొన్నారు.

1947 ఆగస్టు 15 బ్రిటిష్ పాలన అంతమై.. భారతదేశం స్వాతంత్య్ర సంబరాలు జరుపుకుంది. అయితే దేశం నడి మధ్యలో ఉన్న హైదరాబాద్ మాత్రం నిజాం పాలనలోనే ఉంది. హైదరాబాద్ సంస్థానం స్వేచ్ఛవాయువు పీల్చుకోవడానికి.. ఏడాదికి పైగా సమయం పట్టింది. వెళ్తూ.. వెళ్తూ.. బ్రిటిష్ వారు పెట్టిన మెలికే ఇందుకు కారణమైంది. సంస్థానాలు.. భారత యూనియన్‌లో ఇష్టమైతే కలవొచ్చు అని వారు చెప్పిన మాటే.. నిజాం రాజుకు అవకాశంగా మారింది. హైదరాబాద్ స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించుకున్నాడు ఏడో నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్. ఈ సమయంలోనే తన రాజ్యం చేయి జారిపోతుందనే ఆలోచనతో పాకిస్తాన్ సాయం కోరాడు. ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించాడు. దీనిని సహించని.. భారత ప్రభుత్వం హైదరాబాద్‌ను భారత యూనియన్‌లో కలుపుకోవాలనుకుంది. అప్పటి కేంద్రం హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయి పటేల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రాజ్యంపై పోలీస్ చర్యకు దిగాలని నిర్ణయించారు.

జాతీయ జెండా ఎగురవేయాలని..

1947 ఆగస్టు 15న బ్రిటీష్ పాలన నుంచి భారత్‌కు స్వాతంత్య్రం వచ్చింది. అప్పటికీ స్వేచ్ఛ వాయువు అందని.. నిజాం రాజ్యంలోని ప్రజలు.. కొన్ని గ్రామాల్లో జాతీయ జెండా ఎగరవేయాలని నిర్ణయించారు. వాటిని అణగదొక్కేందుకు నిజాం ప్రత్యేక సైన్యమైన ఖాసీం రజ్వి నేతృత్వంలోని రజాకార్లు ఎన్నో అకృత్యాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా వందల మంది వీరులు ప్రాణాలు కోల్పోయారు. 1947 సెప్టెంబర్ 2న వరంగల్ జిల్లాలోని పరకాలలో జాతీయ పతాకం ఎగురవేయలని నిర్ణయించారు. కానీ, వారిపై రజా కార్లు కాల్పులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో అక్కడ 22 మంది అమరులయ్యారు. ప్రస్తుత సిద్ధిపేట జిల్లాలోని వీర బైరాన్‌పల్లి యోధులు.. రజాకార్ల దురగతాలకు వ్యతిరేకంగా పోరు చేశారు. బైరాన్‌పల్లి గ్రామ రక్షకదళం.. రజాకార్లపై ఎదురొడ్డి ప్రతిదాడులు చేశారు. దీంతో వారిపై ప్రతికారం తీర్చుకునేందుకు సుమారు 12 వందల మంది రజాకార్లు గ్రామాన్ని చుట్టుముట్టారు. ఈ దాడిలో 25 మంది రజాకార్లు 118 మంది గ్రామస్తులు మృతి చెందారు. ఇలా స్వాతంత్య్ర భారతంలో కలిసి స్వేచ్ఛా వాయువు పీల్చుకోవాలనుకున్న గ్రామాల్లో రజాకార్లు దాడులు చేసి హింసించేవారు.

నిరంకుశానికి వ్యతిరేకంగా పోరాడి..

నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆదిలాబాద్ అడవుల్లో ఆదివాసీల ఆత్మగౌరవం కోసం పోరాడిన కొమరం భీంను మట్టుబెట్టారు. అడవి బిడ్డలకు అండగా నిలిచి రజాకార్ల ఆగడాలను ఎదురొడ్డి పోరాడిన రాంజీ గోండును ఉరితీసారు. మహిళలపై జరుగుతున్న దాడులను ఎదిరించి రజాకార్లను తరిమి కొట్టిన వీర వనిత చాకలి ఐలమ్మ కుటుంబాన్ని కిరాతకంగా హింసించారు. తన పత్రికతో నిజాం నవాబుకు ముచ్చెమటలు పట్టించిన షోయబుల్లా ఖాన్‌ను పట్టపగలు హైదరాబాద్‌లో చేతులు నరికి చంపారు. ప్రజలను హింసిస్తున్న నిజాంపై బాంబు వేసిన విద్యార్థి నారాయణ పవార్‌కి ఉరిశిక్ష వేశారు. వరంగల్లో జాతీయ జెండా ఎగురవేసినందుకు మొగిలయ్యగౌడ్‌ను నరికి చంపారు. తమ కవిత్వం, పాటలతో ప్రజా ఉద్యమానికి ఊపిరిలూదిన దాశరథి, కాళోజీ లాంటి వాళ్లని జైలుపాలు చేశారు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ఈ వీరుల గాథలు నేటి తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ఈ పాలకులకు లేదా?

సాయుధ పోరాటం ఎవరికోసమంటే?

అయితే కమ్యూనిస్టులలో కొందరు నిజాంకు వ్యతిరేకంగా కొంత ప్రయత్నించినా చివరకు నిజాంతో కుమ్మక్కై ప్రజలందరూ స్వాగతం పలికినా 'ఆపరేషన్ పోలో'కు వ్యతిరేకంగా పనిచేసి చరిత్రహీనులుగా మిగిలిపోయారు. ఇక్కడ పెద్ద ప్రశ్న ఏంటంటే తెలంగాణ సాయుధ పోరాటం (1946-1951) వరకు జరిగితే 1948లో భారత్ 'పోలీసు చర్య'కు నిజాం లొంగిపోయిన తర్వాత కూడా 1951 వరకు సాయుధ పోరాటం కొనసాగిందంటే కమ్యూనిస్టులు చెప్పుకునే సాయుధ పోరాటం నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కానే కాదని స్పష్టమవుతుంది. భూస్వాముల పేరుతో ప్రజలను దోచుకోవడానికే కమ్యూనిస్టుల పోరాటం సాగిందన్నది చారిత్రక సత్యం.

వివిధ సమాధానాలు ఉన్నప్పటికీ..

సెప్టెంబర్ 17ను ఏ విధంగా పరిగణించాలనే చర్చ మలిదశ తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న కాలంలో ప్రారంభమైంది. అంతముందు ఈ చర్చ అంతగా లేదు. అతివాద వామపక్ష భావవాదులు సెప్టెంబరు 17ను విద్రోహ దినంగా పరిగణించాలని వ్యాఖ్యానిస్తే, మితవాదులు దాన్ని విమోచన దినంగా పాటించాలనడం, మధ్యేయవాదులు దాన్ని విలీన దినంగా పరిగణించాలనడం జరుగుతుంది. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సెప్టెంబర్ 17కు సమాధానాలు చెబుతున్నారు. కానీ నూటికి నూరు శాతం ఇది మనకు నిజాం నవాబ్ నుంచి వచ్చిన విమోచనమే. కాబట్టి మనం దీనిని విమోచన దినంగా పరిగణించాలి.

- సభావట్ కళ్యాణ్

90143 22572

Advertisement

Next Story