- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
శతాబ్దాలుగా అభివృద్ధికి ఆమడదూరంలో మునుగోడు!సీనియర్ జర్నలిస్టు విశ్లేషణ
ఇదేం ఈ ఎనిమిదేండ్ల తెలంగాణ పాపమేం కాదు. దశాబ్దాల చరిత్రనే. కాస్తో కూస్తో ఈ ఎనిమిదేండ్లల్లో రోడ్లు వేశారు. మిగతా నియోజకవర్గాలతో పోల్చుకుంటే అంతంతే. ఎమ్మెల్యే రాజగోపాల రెడ్డి రాజీనామాను ప్రజలు కోరుకున్నారు. ఆయన కూడా ప్రజాభీష్టం అంటూ జనంలోకి వచ్చారు. రాజీనామా, ఉప ఎన్నిక వెనుక హక్కుల సాధనే నాకు కనబడుతుంది. ఏనాడూ ఏదీ సాధించుకోలేకపోయాం. ఈ పేరుతోనైనా మరో హుజురాబాద్, మరో నాగార్జున్‌సాగర్‌లా హామీలను పొందొచ్చునన్న ధీమా ఉంది. సిటీకి దగ్గరగా ఉండడంతో భూముల ధరలు పెరిగి కొందరికి మేలు జరిగి ఉండొచ్చు. యువతకు ఉపాధి కల్పించే దిశగా అడుగు పడలేదు. పారిశ్రామిక, వ్యవసాయ రంగాలలో విప్లవాత్మక మార్పులేమీ లేవు. సాగునీటి రంగం జీరో. ఇప్పుడైనా సమస్యలపై ఓ చర్చ జరుగుతుండడం ఆనందంగా ఉన్నది.
మునుగోడు' చాలా మందికి తెలియని ప్రాంతమే. మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే ఎక్కువగా వినని పేరే. 119 నియోజకవర్గాలలో అన్నింటా కింది నుంచి నంబర్ వన్. చెప్పుకోవడానికి, పొగడ్తలతో ముంచెత్తడానికి ఇక్కడ ఏమీ లేదు. రాష్ట్ర, జాతీయస్థాయిలలో చక్రం తిప్పిన నాయకులెవరూ ఇక్కడ గెలవలేదు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మినహా మంత్రిగా పని చేసినవారెవరూ లేరు. రాష్ట్రంలో అధికారంలో ఉండే పార్టీ గెలిచిన సందర్భాలూ తక్కువే. ఎప్పుడూ ప్రతిపక్షమే. 2014లో మినహా అధికార పార్టీ గెలిచిన సందర్భాలు ఒకటీ రెండు మాత్రమే. అప్పుడూ పెద్దగా సాధించిందేమీ లేదు. అభివృద్ధి నామమాత్రమే. 2018 లోనూ ప్రతిపక్షమే. మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి రాజీనామా చేయడంతోనే ఓ గుర్తింపు లభించింది. ఇప్పుడు ఎవరి నోట విన్నా 'మునుగోడు' పేరే వినిపిస్తున్నది. ఆయన గెలిచి సాధించింది ఆశించిన స్థాయిలో లేకపోవచ్చు. ఉప ఎన్నిక అనివార్యంగా మార్చడం ద్వారా ఢిల్లీ దాకా నియోజకవర్గం గురించి మాట్లాడేలా చేశారు.
సమస్యల పరిష్కారం, అభివృద్ధికి బాటలు పడకపోయినా ఫర్వాలేదు. దశాబ్దాలుగా రాని గుర్తింపు మాత్రం ఈ నెల రోజులలో వచ్చింది. ప్రతిపక్ష నియోజకవర్గంగానే ఉన్నందుకో, అధికార పక్షాన్ని ఒప్పించి, మెప్పించి నిధులు సాధించగల నాయకత్వం లేనందుకో కానీ, మును'గోడు' ఎవరికీ పట్టలేదు. ఒక్క మండలాన్ని సాధించుకునేందుకు ఆరేండ్లు పట్టిందంటే ఇక్కడి నాయకత్వం సామర్ధ్యం ఏ మేరకు ఉందో అంచనా వేయొచ్చు. ఫ్లోరైడ్ సమస్యను పాలకులు గుర్తించేలా చేసేందుకు దశాబ్దాలే పట్టింది. ఒక పార్టీ వైఫల్యమో, ఒక ఎమ్మెల్యే చిత్తశుద్ధి లోపమో కాదు. అందరి సమష్టి లోపమే. అన్నింటికీ మించి ఆర్థిక శక్తిమంతం కాదు. పేదరికం. దానికి తోడు వ్యవసాయ ఆధారిత ప్రాంతమే. అది వర్షాధారిత దిగుబడితోనే బతుకు వెళ్లదీయాల్సిన ప్రాంతం. అందుకేనేమో పోరాటం, ఉద్యమం, అన్న పదాలలో భాగస్వామ్యం తక్కువే. అందుకే పాలకులను ఎదిరించగల శక్తియుక్తులు 'మునుగోడు'కు లేవు. ఏదేమైనా నెల రోజులుగా రాష్ట్ర, జాతీయస్థాయిలో మునుగోడు ట్రెండింగ్ లో ఉంది. ఇదే ఇప్పటి వరకు జనం సాధించిన అతి పెద్ద విజయం.
నగరానికి చేరువగా ఉన్నా
మునుగోడు బాగానే ఉండొచ్చు. సిటీకి దగ్గరగా ఉన్న నియోజకవర్గమే కదా అని అనుకోవచ్చు. మిగతా నియోజకవర్గాల అభివృద్ధి నమూనాను చూడని ఈ ప్రాంత లీడర్ల నుంచి సామాన్యుల వరకు, సర్పంచ్ నుంచి ఎంపీపీ వరకు బాగా అభివృద్ధి పనులు జరిగాయి కదా అని అంచనా వేసుకోవచ్చు. నేను వృత్తిపరంగా రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలలో పర్యటించాను. ప్రతి ప్రాంతం ఏదో ఒక అంశం పట్ల ప్రత్యేకంగా నిలుస్తున్నది. పరిశ్రమలు, పౌల్ట్రీ, ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు కనిపించాయి. వ్యవసాయంలోనూ కొత్తదనం కనిపించింది. వాటితో పోలిస్తే మునుగోడుకు వందకు పది మార్కులు కూడా వేయలేం. హైదరాబాద్‌నుంచి 170 కి.మీ. నిజామాబాద్, 100 కి.మీ. ఉన్న సిద్ధిపేట, 140 కి.మీ. దూరంగా ఉన్న సిరిసిల్ల ఇలా ఏ నియోజకవర్గంతో పోల్చి చూసినా మునుగోడు పాస్ మార్కులు కూడా పొందడం కష్టమే.
సిటీకి 40 కి.మీ. నుంచి నియోజకవర్గ పరిధి మొదలవుతుంది.రామోజీ ఫిల్మ్ సిటీ దాటిందంటే మునుగోడు నియోజకవర్గం స్టార్ట్. సిటీకి దూరంగా ఉన్న ప్రతి పల్లె ఓ ప్రత్యేక ఆర్థిక వ్యవస్థకు మూలంగా కనిపిస్తున్నది. నేను పుట్టి పెరిగిన నియోజకవర్గం గురించి ఎలా చెప్పాలి? నా తోటి జర్నలిస్టులతో జరిగే సమావేశాలలోనూ నేను ఇదే అంశాన్ని ప్రస్తావించాను. 'మా ప్రాంతానికి, మీ ప్రాంతానికి మధ్య అంతులేని వ్యత్యాసం ఉన్నది. ఇక్కడి అభివృద్ధి, ఆర్థిక వనరులు, ఉత్పాదక శక్తి, జీవన ప్రమాణాలు ఎన్నో రెట్లు అధికం. ఒక్క చౌటుప్పల్ మండలంలో కాలుష్యాన్ని వెదజల్లి జనం ప్రాణాలను హరిస్తూ, పచ్చటి పొలాలలో విధ్వంసం సృష్టిస్తున్న కొన్ని ఫార్మా పరిశ్రమలు మినహా మరే ఇతర కంపెనీలు మచ్చుకైనా కనిపించవు. రాజధానికి అత్యంత సమీపంలో ఉన్నప్పటికీ ఈ ప్రాంతం వెనుకబాటుతనానికి కారణాలేమిటి? ఇక్కడి యువతకు ఉపాధి కల్పన, ప్రజల జీవన ప్రమాణాలు పెంచే అభివృద్ధి అమలు కాకపోవడం వెనుక ఔచిత్యం ఏమిటి? దశాబ్దాలుగా సాగిన వివక్షనా? ప్రజాప్రతినిధుల వైఫల్యమా?
ఏమున్నది గర్వకారణం
నా చిన్నతనం నుంచి గమనిస్తున్నా. ఏ సంచలనం లేదు. అభివృద్ధి లేదు. ప్రజాప్రతినిధులు పరితపించి, పోరాడి సాధించిన ఘనతలేవీ లేవు. అంతర్జాతీయంగా ఫ్లోరైడ్ స్థాయి అధికంగా ఉన్న ప్రాంతం ఇది. దాని నిర్మూలనకూ పాలకులు చేసిందేమీ లేదు. ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి చేసిన దశాబ్దాల ఉద్యమం మాత్రమే నాకు గుర్తున్నది. ఇదే అతి పెద్ద ఉద్యమం. ఈ సమస్య తీవ్రత, అది సృష్టించిన విఘాతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పల్లెలను వలసబాట పట్టించింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఒరిగిందేమీ లేదు. ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి కన్వీనర్ కంచుకట్ల సుభాష్‌గారితో కలిసి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనే సంస్థకు మూడు సార్లు వెళ్లాను. సీనియర్ సైంటిస్ట్ అర్జున్ ఎల్కందారే సర్‌ని కలిశాం. గంటలకొద్దీ డిస్కస్ చేశాం. తాగునీటితో పాటు సాగునీరు అందిననాడే, భూగర్భజలాలు పుష్కలంగా లభించిన నాడే శాశ్వత విముక్తి లభిస్తుందన్నారు.
కందారే సర్ మహారాష్ట్రకు చెందినవారు. నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగారు. ఫ్లోరైడ్‌తో ఓ కుటుంబం ఎంత ఛిన్నాభిన్నం అవుతుందో ఆయనకు బాగా తెలుసు. పేదలను శారీరక, ఆర్ధికంగా ఎంత ఇబ్బంది పెడుతుందో చెప్పారు. ఆయన కంటే ముందు కూడా అనేక మంది పరిశోధనలు చేసి ప్రభుత్వాలకు నివేదికలు ఇచ్చారు. రెండు దశాబ్దాలుగా సాగు నీటి ప్రాజెక్టులేమైనా డిజైన్ చేస్తారేమోనన్న ఆతృతతో, ఆసక్తిగా ఎదురుచూశాను. సరైన ప్లానింగ్ లేదు. రెండు రిజర్వాయర్ల ప్రతిపాదన అమలుకు ఆపసోపాలు పడుతున్నది. తెలంగాణ రాష్ట్రావిర్భావం తర్వాత మంచినీటి సదుపాయం కలిగింది.
ఎంతటి వైరుధ్యం
రాష్ట్ర, జాతీయ స్థాయి అభివృద్ధి నమూనాకు, మునుగోడు ప్రాంత దుస్థితికి సాక్ష్యం గూగుల్ మ్యాప్. ఎక్కడెక్కడ ఎలాంటి ప్రాజెక్టులు, ఎన్నేసి నిర్మాణాలు, సాగునీటి వనరులు దర్శనమిస్తాయి? ఒక్కసారి పరిశీలించండి. మునుగోడులోని ఏడు మండలాలలో కనిపించేవేమిటో లెక్కించండి. ప్రత్యేక నిర్మాణాలో, ప్రాజెక్టులో ఉన్నాయేమో వెతకండి. కరీంనగర్, మెదక్, వరంగల్, నిజామాబాద్ఇలా ఏ ఉమ్మడి జిల్లాలోని ఆఖరి లేదా దూరంగా ఉండే నియోజకవర్గంతో సరిపోల్చినా మునుగోడు వెనుకబాటుతనం కనిపిస్తున్నది. మునుగోడు పట్ల ఏ పార్టీకీ ప్రేమ లేదు. ఏ ఎమ్మెల్యే చిత్తశుద్ధితో పని చేసిన దాఖలాలు లేవు. ఇదేం ఈ ఎనిమిదేండ్ల తెలంగాణ పాపమేం కాదు. దశాబ్దాల చరిత్రనే. కాస్తో కూస్తో ఈ ఎనిమిదేండ్లల్లో రోడ్లు వేశారు. మిగతా నియోజకవర్గాలతో పోల్చుకుంటే అంతంతే. ఎమ్మెల్యే రాజగోపాల రెడ్డి రాజీనామాను ప్రజలు కోరుకున్నారు. ఆయన కూడా ప్రజాభీష్టం అంటూ జనంలోకి వచ్చారు.
రాజీనామా, ఉప ఎన్నిక వెనుక హక్కుల సాధనే నాకు కనబడుతుంది. ఏనాడూ ఏదీ సాధించుకోలేకపోయాం. ఈ పేరుతోనైనా మరో హుజురాబాద్, మరో నాగార్జున్‌సాగర్‌లా హామీలను పొందొచ్చునన్న ధీమా ఉంది. సిటీకి దగ్గరగా ఉండడంతో భూముల ధరలు పెరిగి కొందరికి మేలు జరిగి ఉండొచ్చు. యువతకు ఉపాధి కల్పించే దిశగా అడుగు పడలేదు. పారిశ్రామిక, వ్యవసాయ రంగాలలో విప్లవాత్మక మార్పులేమీ లేవు. సాగునీటి రంగం జీరో. ఇప్పుడైనా సమస్యలపై ఓ చర్చ జరుగుతుండడం ఆనందంగా ఉన్నది. వెనుకబాటుతనానికి గల కారణాలేమిటో అన్వేషించి, అన్ని పార్టీల నాయకత్వం లోపాలను సరిదిద్దుకుంటుందన్న ఆశ ఉంది. ఉప ఎన్నికల వరకు మా మునుగోడు మీడియాలోనూ ట్రెండింగ్ లో ఉంటుంది.
శిరందాస్ ప్రవీణ్ కుమార్
సీనియర్ జర్నలిస్టు
8096677450