లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి!

by Ravi |   ( Updated:2024-12-28 00:31:06.0  )
లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి!
X

గత ప్రభుత్వం 'డబుల్ బెడ్ రూం' ఇండ్లు నిర్మిస్తామని ప్రకటించినా, అవి చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలకు 'అందని ద్రాక్ష గానే ' మిగిలిపోయాయి. దీంతో నిరాశ చెందిన ప్రజలు నూతనంగా ఏర్పాటు అయిన కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అయినా తమ సొంత ఇంటి కల నెరవేరాలని కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. అందుకే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి. మరీ ముఖ్యంగా దళిత వాడల్లో అర్హులను గుర్తించే క్రమంలో సొంత ఇంటి స్థలం ఉన్నప్పటికీ సంబంధిత పత్రాలు ఇంటి పన్ను, కరెంటు బిల్లు రశీదులు కావాలని వాటిని సిస్టమ్‌లో అప్లోడ్ చేయాలని వివరాలు నమోదు చేసే అధికారులు అర్హులను ఆందోళనలకు గురి చేస్తున్నారు.

కరెంట్ బిల్లు రశీదులు దళిత కుటుంబాలకు లేవు. కాగా ఇంటి పన్ను బిల్లు కడితే ఆ రశీదులు అప్లోడ్ చేయాలంటూ తక్షణం ఇంటి పన్నులు కట్టించుకోవడం గమనార్హం. ఏ ప్రభుత్వ హయాంలో నైనా ఇంటి పన్ను వసూలు క్రమం తప్పకుండా వసూలు చేసిన దాఖలాలు లేవు. అసలు ఇంటి పన్నులు ఎన్నిసార్లకు ఒకసారి వసూలు చేస్తారో ప్రజలకు కచ్చితంగా తెలీదు. ఇంటి మీద ఆశతో తక్షణమే వేయి, రెండు వేలు కడుతూ రశీదులు తీసుకోవడం 'కత్తి మీద సాము ' అన్న చందాన ఉంది. ఇలాంటి పన్నుల పట్ల గ్రామ ప్రజా ప్రతినిధులు ప్రజలకు కచ్చితంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

లబ్ధిదారుల ఎంపికలో అర్హులైన నిరుపేదలు, సొంత ఇంటి స్థలం ఉన్నటువంటి వారికి వివిధ కారణాలతో వారికి లబ్ధి చేరకుండా జరిగే ఘటనలు నియంత్రణ చర్యలు చేపడితే పేదలకు న్యాయం చేయవచ్చు. అనవసర కారణాలతో అర్హులకు అందకపోతే ప్రభుత్వ లక్ష్యం నెరవేరనట్లే.. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగి అర్హులైన పేదల సొంతింటి కల నెరవేరాలని, అందుకు ప్రభుత్వం తగిన విధంగా పేదల పక్షాన నిలబడాలని కోరుకుందాం.

- ఎం. ధనంజీ

96661 09616

Advertisement

Next Story

Most Viewed