ఈ వర్గీకరణ చట్టబద్ధమే!

by Ravi |   ( Updated:2024-08-03 01:15:29.0  )
ఈ వర్గీకరణ చట్టబద్ధమే!
X

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన తాజా తీర్పు వర్గీకరణకు తిరుగులేని సమర్థన కలిగించింది. షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చిన కులాలు సామాజికంగా విభిన్న తరగతులకు చెందినవి. వారందరికీ సరైన అవకాశాలను అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టికల్ 15 (4) మరియు 16 (4) అధికరణ కింద అధికారాలను వినియోగించుకోవడం రాజ్యాంగ బద్ధమే అంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వానికి వర్గీకరణ చేసే అవకాశం లేదని ‘E.V. చిన్నయ్య vs స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ కేసులో ఇచ్చిన తీర్పును ప్రస్తుతం కొట్టివేసింది. సమాన అవకాశాల కోసం వర్గీకరణ చట్టబద్ధమే అని కోర్టు ఆమోదముద్ర వేయడం విశేషం.

1994లోనే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లు.. ఆ జాబితాలోని అన్ని కులాలకు సమానంగా అందుతున్నాయా, లేక ఆయా కులాలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు అందించాల్సిన అవసరం ఉన్నదా? అనే అంశాన్ని పరిశీలించడానికి జస్టిస్ రామచంద్రన్ రాజు నాయకత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ సమాన అవకాశాలు కలగడం లేదని తేల్చడంతో ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల (రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్) చట్టం -2000ను నాటి అసెంబ్లీలో ఆమోదించడం జరిగింది. ఆ చట్టం ప్రకారం షెడ్యూల్డ్ కులాలలో A వర్గంలోకి వచ్చేవారికి 1% రిజర్వేషన్లు, B వర్గంలోకి వచ్చే వారికి 7%, C వర్గంలోకి వచ్చేవారికి 6%, చివరగా D వర్గంలో చేరేవారికి 1% రిజర్వేషన్లను వర్గీకరించారు.

ఈ తీర్పును ఆధారం చేసుకుని..

ఈ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం అంటూ నాటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తే న్యాయస్థానం ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ బెంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. షెడ్యూల్-7 ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా పొందుపరచిన షెడ్యూల్డ్ కులాల జాబితాలోని వర్గాలకు వర్గీకరణ ప్రాతిపదికన రిజర్వేషన్లు అందించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తీర్పు వెలువడింది. ఈ కేసు అన్ని రాష్ట్రాల చట్టబద్ధతను నిర్ణయించే ప్రధాన కేంద్రంగా మారింది. ఈ కేసు తీర్పును ఆధారం చేసుకొని పంజాబ్ & హర్యానా హైకోర్టులు ''E.V. చిన్నయ్య vs స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్'' కేసులో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆధారం చేసుకునే వర్గీకరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం అని ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలోనే 2009లో నాటి తమిళనాడు ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలలోని కొన్ని వర్గాలకు వర్గీకరణ ద్వారా ప్రత్యేక రిజర్వేషన్లను అందిస్తూ అసెంబ్లీలో ఆమోదించిన చట్టాన్ని కూడా నాటి మద్రాస్ హైకోర్టు రాజ్యాంగ విరుద్దంగా ప్రకటించడం జరిగింది. 2006 సంవత్సరంలో నాటి పంజాబ్ ప్రభుత్వం,“ పంజాబ్ SC, BC (రిజర్వేషన్స్ ఇన్ సర్వీసెస్) చట్టం- 2006” ను అసెంబ్లీలో ఆమోదించింది. ఆ చట్టంలోని సెక్షన్ 4(5) ప్రకారం షెడ్యూల్డ్ కులాలకు కేటాయించిన రిజర్వేషన్లలో 50% జాబితాలో ఉన్న బాల్మీకి, మజాబీ సిక్కులకు ముందు వరుసలో అందించబడతాయి. అయితే ఇట్టి కేటాయింపులు రాజ్యాంగ విరుద్దం, రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా విభజన చేసే అధికారం లేదు అంటూ పంజాబ్ & హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. 2010 మార్చి 29న పంజాబ్ & హర్యానా హైకోర్టు సెక్షన్ 4(5) ఈ వర్గీకరణను రాజ్యాంగ విరుద్ధం అంటూ తీర్పు ఇవ్వడంతో సమస్య సుప్రీం తలుపు తట్టింది.

ఆ తీర్పు పునః పరిశీలించడానికి కారణాలు..

కోర్టు అన్ని రాష్ట్రాల నుండి వచ్చిన కేసులను పరిశీలించిన తరువాత, 2020 ఆగస్టు 27న స్టేట్ ఆఫ్ పంజాబ్ vs దేవేందర్ సింగ్ కేసును విచారిస్తున్న 7గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనంను ఏర్పాటు చేసి “ చిన్నయ్య” కేసులో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించవలసిందిగా నిర్ణయించడం జరిగింది. అందుకు సుప్రీంకోర్టు ప్రధానంగా సూచించిన కారణాలు నాలుగు అవి..

1. “ఇంద్రా సహానీ” కేసులో వెనుకబడిన తరగతులలో వర్గీకరణ సహేతుకమే అంటూ ఇచ్చిన తీర్పు షెడ్యూల్డ్ కులాల వర్గీకరణకు ఎందుకు వర్తించదో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చిన్నయ్య కేసులో సహేతుకంగా వివరించలేకపోయింది.

2. షెడ్యూల్డ్ కులాలలో చేరినవారందరూ సజాతీయ సమూహానికి చెందినవారు కారన్నది సత్యం. వారిలో అత్యంత వెనుకబడిన జాతులకు సహేతుకమైన ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడం, సమాన అవకాశాలు కల్పించాలన్న రాజ్యాంగ స్ఫూర్తికి లోబడే ఉంటుందన్న అంశాన్ని చర్చించలేకపోయింది.

3. ఆర్టికల్ -16(4)ను అనుసరించి షెడ్యూల్డ్ కులాలలో సమాన ప్రాతినిధ్యం పొందలేకపోతున్న వర్గాలకు వర్గీకరణ ద్వారా ప్రత్యేక రిజర్వేషన్లు రూపొందించే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందన్న అంశాన్ని విస్మరించింది.

4. షెడ్యూల్- 7లో ఉన్న కొన్ని కులాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం ఆర్టికల్- 341లో చేర్చబడిన మిగతా కులాలను విస్మరించడంగా పరిగణించరాదు.

రిజర్వేషన్ ప్రస్తానంలో కొత్త అధ్యాయం!

ఈ కేసు చర్చల సందర్భంగా హేమాహేమీలైన న్యాయవాదులు అనేక వాదనలు వినిపిస్తూ, షెడ్యుల్- 7 లోని కులాల మధ్య ప్రాధాన్య క్రమాన్ని వర్గీకరణ ద్వారా మార్చే అధికారం రాష్ట్రాలకు ఉందన్నారు. అన్ని వర్గాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం తుది తీర్పును ఇస్తూ “ఇంద్రా సహానీ” కేసులో సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పు కేవలం బలహీన వర్గాల వర్గీకరణకే పరిమితం కాదు, అది షెడ్యూల్డ్ కులాల వర్గీకరణకు కూడా వర్తిస్తుందని, సజాతి సమూహానికి చెందని వారికి, అవకాశాలు అందించే సమున్నత లక్ష్యంతో వర్గీకరించడం ఆర్టికల్ 14 లో నిర్ణయించిన సమానత్వ సూత్రానికి విరుద్ధం ఎంతమాత్రం కాదని విస్పష్టంగా చెప్పడం జరిగింది. చారిత్రక నేపధ్యాన్ని పరిశీలిస్తే షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చబడిన కులాలు సామాజికంగా విభిన్న తరగతులకు చెందినవి. వారందరికీ సరైన అవకాశాలను అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టికల్ 15 (4), 16 (4) అధికరణ కింద అధికారాలను వినియోగించుకోవడం రాజ్యాంగ బద్ధమే అంటూ. “ E.V. చిన్నయ్య vs స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్“ కేసులో నాటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాజ్యాంగ ధర్మాసనం ఇప్పుడు కొట్టివేసింది. దీంతో షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ ప్రస్థానంలో ఒక కొత్త అధ్యాయం మొదలయ్యిందనే చెప్పాలి.

-చందుపట్ల రమణ కుమార్ రెడ్డి.

న్యాయవాది.

94404 49392

Advertisement

Next Story

Most Viewed