- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నివాళి:గర్జించిన మల్లు స్వరాజ్యం
ఆమె పెద్ద భూస్వామి కూతురు. కోరుకున్న వైభోగం ఆమె చెంతనే ఉంది. కానీ, పేద ప్రజల కష్టాలు ఆమెను కలచివేశాయి. తనకున్న ఆస్తిపాస్తులను వదిలేసి పోరుబాట పట్టారు. 'భూమికోసం, భుక్తి కోసం, జమీందారుల బానిసత్వం నుంచి విముక్తి కోసం' అంటూ ఎర్ర జెండా ఎగరేశారు. నిజాం నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాలను కదిలించారు. నిస్సహాయులకు సహాయం చేసేందుకు ఆయుధం పట్టారు. తెలంగాణ సాయుధ పోరాటంలో చురుకుగా పాల్గొన్న వీరవనిత ఆమె. జీవితాంతం పేద ప్రజలకు న్యాయం కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధురాలు. గొప్ప మానవతావాది, ఆదర్శ కమ్యూనిస్టు నాయకురాలు మల్లు స్వరాజ్యం.
11 సంవత్సరాల వయస్సులోనే
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో భీమిరెడ్డి రామిరెడ్డి, చొక్కమ్మ దంపతులకు 1931లో మల్లు స్వరాజ్యం జన్మించారు. అపుడు నల్గొండ జిల్లా నిజాం పాలనలో హైదరాబాద్ స్టేట్‌లో భాగంగా ఉండేది. అదే సమయంలో బ్రిటిష్‌వారి నుండి స్వరాజ్యం కావాలని భారతదేశంలో మహాత్మాగాంధీ నేతృత్వంలో సత్యాగ్రహం ఉద్యమం నడుస్తోంది. మల్లు స్వరాజ్యం పది సంవత్సరాల వయస్సులోనే మాగ్జిమ్ గోర్కీ రచన 'మదర్' చదివారు. అది ఆమెకు పీడిత ప్రజల సమస్యల కోసం ఉద్యమించేలా ప్రేరణ కలిగించింది. నిజాం ప్రభుత్వంలోని రజాకార్ల అకృత్యాలకు వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టిన ఆమె ఉద్యమ నాయకురాలిగా మారిపోయారు.
11 సంవత్సరాల వయస్సులో ఆమె ప్రజల కోసం తన జీవితాన్ని పోరాటాన్ని ప్రారంభించారు. ఆంధ్ర మహాసభ పిలుపు మేరకు ఆమె కుటుంబం కట్టుబాట్లను కూడా ఉల్లంఘించి అనేక కులాలు, వర్గాల నుండి వచ్చిన పీడిత ప్రజలకు కార్మికులకు సహాయ సహకారాలు అందించేవారు. 'దున్నేవాడికే భూమి దక్కాలని' జమీందార్ల నుండి భూమిని తీసుకుని పేద ప్రజలకు పంచేవారు. మల్లు స్వరాజ్యం జమీందార్లకు, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఒక సాయుధ దళానికి నాయకురాలు అయ్యారు. ఆమెను పట్టించిన వారికి నిజాం ప్రభుత్వం పదివేల రూపాయల బహుమతిని ప్రకటించింది. సాయుధ రైతాంగ పోరాటాలతో నిజాం సర్కారుకు ముచ్చెమటలు పట్టించి, రజాకార్ల పాలిట సింహస్వప్నమై నిలిచారు మల్లు స్వరాజ్యం.
వామపక్ష భావజాలంతో
1945-1948 సంవత్సరాల మధ్యలో సాయుధ పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించి నైజాం సర్కారును గడగడలాడించారు మల్లు స్వరాజ్యం. ఆమె పోరాటాల ధాటికి తట్టుకోలేక 1947-48 లో ఆమె ఇంటిని పూర్తిగా దగ్ధం చేశారు. అయినా మనోధైర్యాన్ని కోల్పోకుండా వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలోని పేద ప్రజలకు, గిరిజనులను తన పాటలతో, ప్రసంగాలతో మేల్కొలిపారు. 1954లో మల్లు వెంకట నరసింహారెడ్డిని వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు గౌతమ్, నాగార్జున, కుమార్తె కరుణ ఉన్నారు. మల్లు స్వరాజ్యం జానపద బాణీలలో పాటలు కట్టి స్వయంగా పాడి గ్రామాలలోని ప్రజలకు సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేసి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కొరేవారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభకు నల్గొండ జిల్లా తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1978-1983, 1983-1984 సంవత్సరాలలో రెండు పర్యాయాలు సీపీఎం తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నల్లగొండకు చెందిన ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణా యోధుడు, పార్లమెంటేరియన్ భీమిరెడ్డి నరసింహారెడ్డి ఈమెకు సోదరుడు. వామపక్ష భావాలతో మహిళల ఆధ్వర్యంలో మొదలైన పత్రిక 'చైతన్య మానవి' సంపాదకవర్గంలో ఈమె ఒకరు. మల్లు స్వరాజ్యం ఆత్మకథ 'నా మాటే తుపాకీ తూటా' 2019లో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ద్వారా ప్రచురించబడింది. తన జీవితకాలం మొత్తం పీడిత ప్రజల విముక్తి కోసం వారి సమస్యల పరిష్కారం కోసం జీవించిన మల్లు స్వరాజ్యం వయోభారంతో పాటు ఊపిరితిత్తుల సమస్యతో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో 2022 మార్చి 19న మరణించారు. వారి జీవితం తెలంగాణ ప్రజలందరికీ స్పూర్తి.
వంకా వరాల బాబు
పరిశోధక విద్యార్థి
మద్రాసు యూనివర్సిటీ
99488 98639