గోండ్వానా యోధుడు.. వీర్ నారాయణ్ సింగ్

by Ravi |   ( Updated:2024-12-10 00:31:04.0  )
గోండ్వానా యోధుడు.. వీర్ నారాయణ్ సింగ్
X

స్వాతంత్ర అమృత మహోత్సవాల నుండి మరుగున పడిన పోరాట వీరుల చరిత్రలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. అలాంటి ఒక వీరుడే చత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పుర్ ప్రాంతానికి చెందిన వీర్ నారాయణ్ సింగ్. ఈయన ఆ రాష్ట్రంలో రెండవ ఆదివాసీ గోండ్వానా వీరుడు. ఆయన తండ్రి జమీందారీ కావడంతో ఆయన మరణించాక ఆయన జమీందారుగా మారారు. ఆంగ్లేయుల పాలన లో వారి తర్వాత ప్రజలపై అంతటి ఆధిపత్యం చెలాయించింది జమీందార్లే! కానీ ఈ జమీం దార్ మాత్రం అందుకు విరుద్ధం. కేవలం జమీందార్‌గా వ్యవహరించడం ఇష్టంలేక ఎల్లప్పుడూ ప్రజల వద్దకే వెళ్తూ.. సమస్యలను పరిష్కరిస్తుండేవారు. ఈ క్రమంలో 1856లో తీవ్రమైన కరవు ఏర్పడింది. వర్షాలు లేక, పంటలు సాగుచేయక తినడానికి తిండి లేకుండా ప్రజలు ప్రాణాలు కొల్పోతున్నారు. దీంతో నారాయణ్ సింగ్ తన సొంత ధాన్యాగారాన్ని తెరిచి ప్రజలకు ఉన్నదంతా ప్రజలకు పంచిపెట్టారు. అవి సరిపోకపోవడంతో పక్క ప్రాంత జమీందారు మాఖన్ సింగ్‌ను కోరారు.. ఆయన ఒప్పుకోకపోవడంతో అరువు అడిగాడు.. దానికి ఒప్పుకోకపోవడంతో ఆగ్రహించిన నారాయణ్ సింగ్ ఆయన ధాన్యాగారాన్ని పగులగొట్టి ధాన్యాన్ని అంతా ప్రజలకు పంచిపెట్టారు. అయితే తన ధాన్యాగారాన్ని లూటీ చేశాడంటూ బ్రిటిష్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి ఆయనను జైలుకు పంపారు.. సుమారు పది నెలలు జైలులోనే ఉన్నారు. అయితే, కారాగారంలో ఉండగానే ప్రజలు నారాయణ్ సింగ్‌ను తమ 'రాజు' గా ఎన్నుకున్నారు. ఆయన్ను విడుదల చేయాలంటూ బ్రిటిష్ అధికారులపై ఒత్తిడి పెంచారు. అయినా ఆంగ్లేయులు వినిపించుకోలేదు. జైల్లోని కొందరితో కలిసి సొరంగం తవ్వి నారాయణ్ సింగ్ తప్పించుకున్నాడు. కారాగారం నుంచి వచ్చిన తర్వాత ఈ ఆయనలో స్వాతంత్రోద్యమ కాంక్ష బలంగా పెరిగింది. ఆంగ్లేయులను తరిమేస్తేనే భారత ప్రజలు స్వేచ్ఛగా బతుకుతారన్న భావన ఏర్పడింది. సోనాఖాన్ చెందిన 500 మంది రైతులతో 1857 ఆగస్టులో సాయుధ సైన్యాన్ని తయారు చేసి కొండల్లో, అడవుల్లో అజ్ఞాతంగా ఉంటూ తెల్లదొరలపై, వారి స్థావరాలపై సాయుధ సైనికులతో కలిసి గెరిల్లా యుద్ధం ప్రకటించారు. దీంతో ఆగ్రహించిన బ్రిటిష్ సైన్యం ఆయన్ను పట్టించాలని ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. అదే సమయంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడుతున్న నారాయణ్ సింగ్ ప్రజల ఆదరణ పొందుతుండటాన్ని, జనాల్లో తాము చులకన కావడాన్ని జమీందార్లు జీర్ణించుకోలేకపోయారు. నారా యణ్ సింగ్ ను బ్రిటిష్ సైన్యానికి అప్పగించటానికి ఆంగ్లేయులతో చేతులు కలిపి కుట్ర పన్ని నారాయణ్ సింగ్‌ను పట్టుకున్నారు. ఆయనపై రాజ ద్రోహం కేసు మోపి ఆయనను ఉరితీసింది బ్రిటీష్ సర్కార్. అప్పటినుండి ఆ ప్రాంత ప్రజలు 'వీర్ నారాయణ్ సింగ్' అని ఆయన్ని స్మరించుకుంటున్నారు. ఆయన బలిదానం అయిన చోట 'జయస్తంభం' నిర్మించారు. రాయ్ పుర్‌లో నిర్మించిన అంతర్జాతీయ క్రికెట్ మైదానానికి 'షహీద్ వీర్ నారాయణ్ సింగ్' అని నామకరణం చేశారు.

(నేడు వీర్ నారాయణ్ సింగ్ వర్ధంతి)

గుమ్మడి లక్ష్మీనారాయణ

ఆదివాసీ రచయితల వేదిక

94913 18409

Advertisement

Next Story

Most Viewed