- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వర్గ పోరాట వైతాళికుడు..త్రిపురనేని మధుసూదన రావు
దోపిడీపై దండయాత్రలా సాగిన నక్సల్బరీ వర్గపోరాట దారిలో తెలుగునేలను ఉర్రూతలూగించిన విలక్షణమైన వ్యక్తులు కొండపల్లి సీతారామయ్య, త్రిపురనేని మధుసూదన రావు, గద్దర్. చారుమంజుదార్ మరణాంతరం భారత విప్లవోద్యమాన్ని కొండపల్లి ప్రజాపునాదిని నిర్మిస్తే, తమ మాట-పాటల ఉరుముల మెరుపులతో విప్లవోద్యమానికి అరుణ కాంతులద్దిన ఉద్దండులు త్రిపురనేని గద్దర్. జీవిత చరమాంకంలో ఈ ముగ్గురు కూడా తాము నేతృత్వం వహించిన సంస్థలకు దూరమై వ్యక్తి మాత్రులుగా మిగిలిపోవడం భారత విప్లవోద్యమానికి తీరని నష్టంగా పరిణమించిదన్నది నిరాకరించలేని సత్యం. వారిని కాపాడుకోలేకపోవడం విప్లవోద్యమాల పరిమితికి, పరిణితికి పెను సవాలే!
ఆర్ఎస్‌రావు దృష్టిలో టీఎంఎస్
ప్రముఖ మార్క్సిస్ట్ మేధావి, సంబల్‌పూర్ విశ్వవిద్యాలయం పూర్వ ప్రొఫెసర్ ఆర్ఎస్ రావు గారు జీవించి ఉండగా ఒకమాట నాతో పదేపదే చెప్పేవారు. భారత విప్లవోద్యమ నేత కొండపల్లి సీతారామయ్య, విప్లవ సాహిత్యోద్యమనేత, విమర్శకులు త్రిపురనేని మధుసూదనరావులను వారి మరణానంతరం ఉద్యమాలు, సంస్థలు సముచితంగా స్మరించుకోకపోగా, విస్మరణకు గురి చేయడం ఆత్మహత్యా సదృశమే. ప్రత్యేకించి విప్లవ సాహిత్యోద్యమంలో వర్గ పోరాటం (క్లాస్ స్ట్రగుల్) పాత్రను, దాని ప్రాధాన్యతను నొక్కి చెబుతూ త్రిపురనేని సమకూర్చిన తాత్విక భూమికపై తానే ఒక వ్యాసం రాసి ఉపన్యసిస్తానని, దానిపై చర్చ జరుపుదామని ఆర్ఎస్ రావు గారు చెప్పేవారు. అది నెరవేరకుండానే ఆయన అకాల మరణానికి గురికావడం బాధాకరం.
రంగరించిన 'రాడికల్' ఇరానీ చాయ్
తిరుపతిలో ఇరాని చాయ్ దొరికే ఏకైక హోటల్ గాంధీ వీధిలో కొలువుదీరిన 'డీలక్స్' పల్లెటూర్ల నుంచి తిరుపతి పట్టణానికి చదువు నిమిత్తం వచ్చిన వందలాది మంది విద్యార్థులకు ఇరాని చాయ్‌తో విప్లవాన్ని రంగరించి రుచిచూపిన విప్లవ రచయిత త్రిపురనేని మధుసూదన రావు మాష్టారు. ప్రతిరోజూ రాడికల్ విద్యార్థులతో సహా రకరకాల భావజాలాలు కలిగిన పరిశోధక విద్యార్థులు, సాహిత్య ప్రేమికులు సాయంత్రం ఆరుగంటల నుంచి తొమ్మిది వరకూ త్రిపురనేనితో ఇష్టాగోష్టిగా గడిపేవారు. ఒక్కొక్క టేబుల్ వద్ద కనీసం 10 నుండి 20మంది దాకా కూర్చొని గంటలకొద్దీ చర్చలు జరిపేవారు. త్రిపురనేని మాష్టారును కలవాలంటే గోవిందరాజులు కాలేజీ కన్నా డీలక్స్ హోటల్ మంచి కూడలిగా మారిపోయింది. అక్కడ టీఎమ్ఎస్‌తో గడిపిన ప్రతి క్షణం ఓ క్లాసును తలపించేది. ఒక పుస్తకాన్ని ఎలా చదవాలి? దానిలోని సారాంశాన్ని ఎన్ని కోణాల్లో విశ్లేషించి సమజాన్ని వర్గపోరాట బాట పట్టించాలన్నది కళ్ళకి కట్టేవారు. మహత్తరమైన తెలంగాణ శ్రీకాకుళ నక్సల్బరీ పోరాటాలను అందులో దాగిన ప్రజల త్యాగాలను ఆయన అనర్గళంగా బోధిస్తుంటే వినేవాళ్ల రోమాలు నిక్కబొడిచి విప్లవబాట పట్టేవారంటే అతిశయోక్తి కాదు.
ఆర్ఎస్‌యు ఎలా ఏర్పడిందంటే!
1972-74 మధ్య కాలంలో తిరుపతిలో విప్లవ భావాలు కలిగిన కొందరు విద్యార్థులు కలిసి 'తిరుపతి రాడికల్ విద్యార్థుల బృందం'గా ఏర్పడి కార్యకలాపాలు సాగించారు. దానికి వెన్నుదన్ను త్రిపురనేని 1974లో హైదరాబాద్‌లో పీడీఎస్‌యు రెండుగా విడిపోయినప్పుడు, కొత్త వేదికకు ఏ పేరు పెట్టాలన్న చర్చలో, తిరుపతి విద్యార్థుల బృందంలోని రాడికల్ అన్న పేరు బాగుందన్న కొండపల్లి సూచనతో ఆంధ్రప్రదేశ్ రాడికల్ విద్యార్థి సంఘం ఆవిర్భవించడం చరిత్ర.
డబ్బు కాదు- విప్లవం జీవన విధానం
మార్క్సిజానికి సంబంధించి ఎక్కడ ఏ పుస్తకం వచ్చినా మాష్టారు వెంటనే తెప్పించేవారు. అధ్యాపకుడిగా తాను సంపాదించే జీతంలో సగానికి పైగా పుస్తకాలకే ఖర్చు పెట్టేవారంటే నమ్మడం కష్టం. కాలేజీ నుంచి ఇంటికి, ఇంటి నుంచి కాలేజీకి మళ్ళీ డీలక్స్ హోటల్‌కి రోజూ రిక్షా ఖర్చులు ఇరవైకి పైగా ఇరాని చాయ్ ఖర్చులు.. రాష్ట్రవ్యాప్తంగా సభలు, సమావేశాలకు తిరుగుడు. అంతా కలిపితే ఖర్చు మోపెడంత. హోటల్ దగ్గర మా ఖర్చు అప్పుడప్పుడైనా మమ్మల్ని పెట్టుకోనివ్వండి మాష్టారు అని మేమంటే వెంటనే ఓ పెద్ద నవ్వుతో డబ్బు మీద త్రిపురనేని వినిపించే తాత్విక వ్యాఖ్య ఓ విప్లవంతో సమానం. డబ్బులు బతకడానికి మాత్రమే అవసరం. డబ్బు మన మాట వినాలే కానీ, డబ్బు మాట మనం వినకూడదు అంటూనే విద్యార్థులుగా మా వద్ద పెద్దగా డబ్బు ఉండదని మా ఖర్చులను ఆయనే భరించేవారు. ఎప్పుడు ఎంతమంది ఇంటికి వెళ్ళినా టీతో పాటు తినుబండారాలు ఉండేవి. మేడం ప్రభల కుమారి గారు తోబుట్టువులా ఆదరించేవారు. మాష్టారుకు జీతం తప్ప మరే ఆదాయ వనరూ లేదు. ఆడంబరాలకు దూరంగా ఉండేవారు. చిరిగిపోయిన చొక్కాతో ఆయన క్లాసుకొచ్చిన సందర్భాలెన్నో.. అందుకే రిటైర్ అయిన తరువాత మాష్టారు పరిస్థితి దుర్భరంగా మారింది. లాబీలుగా మారిన ఉద్యమాల్లో ఇమడలేక సంస్థకు దూరమై ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. ఆ స్థితిలో చివరి రోజుల్లో బతుకు సాగించిన త్రిపురనేని మధుసూధనరావు మాష్టారు ఏమైన తప్పులు చేసుంటే వాటిని మనందరం బాధ్యులమే అన్నది మర్చిపోకూడదు.
భయం కేన్సర్ కన్నా పెద్ద జబ్బు
1980 దశకంలో ఐపీఎస్ అధికారి రావులపాటి సీతారామరావు చిత్తూరు జిల్లా ఎస్పీగా ఉండేవారు. పొలిటికల్ సైన్స్ అధ్యాపకుడిగా రాజీనామా చేసిన గుంటూరు జిల్లాకు చెందిన నర్సయ్య తిరుపతి డీఎస్పీగా ఉండేవారు. కాంగ్రెస్ ఘోర పరాజయం, ఎన్టీఆర్ నేత్రృత్వంలో టీడీపీ అధికార పగ్గాలు చేపట్టడం, రాడికల్ విద్యార్థి ఉద్యమాలతో తెలుగునేల ఎరుపెక్కడం వరంగల్, గుంటూరు, విశాఖ, తిరుపతి వంటి నగరాలు రాడికల్ విద్యార్థి కేంద్రాలుగా రూపొందడం. రాష్ట్రవ్యాప్తంగా పోలీసు నిర్భందం తీవ్రరూపం దాల్చడం ఇదీ క్లుప్తంగా 1980 దశాబ్దం సంతరించుకున్న నేపథ్యం. ముఖ్యమంత్రి రామారావుకు దూరపు బంధువులైన నర్సయ్య సీఎం పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా బదిలీ కావడంతో తిరుపతి కేంద్రంగా విస్తరిస్తున్న రాడికల్ ఉద్యమాన్ని అణచివేయడానికి వరంగల్ డీఎస్పీగా పనిచేస్తున్న రామచంద్రరాజును తిరుపతికి బదిలీ చేయడం అప్పట్లో పెద్ద చర్చగా మారింది. వచ్చిరాగానే తిరుపతిని వరంగల్‌గా మార్చి నా సత్తా చూపుతానని డీఎస్పీ వీరంగం చేసేవాడు.
ఆర్ఎస్‌యూ విద్యార్థులందరినీ తన ముందు హాజరు పరచాలని కింది అధికారులను ఆదేశించడమే కాకుండా త్రిపురనేని ఇంటిమీద పోలీసులతో దాడి చేశాడు. స్వయంగా ఆ దాడిలో పాల్గొన్న రామచంద్రరాజు, టీఎంఎస్ ఇంటిని గాలిస్తూ 'మీరు పీపుల్స్ వార్ సానుభూతిపరులా?' అని అడిగాడు. దాన్ని అవమానంగా భావించిన త్రిపురనేని మాష్టారు 'ఎవరింటికొచ్చి ఏం మాట్లాడుతున్నావ్! నేను సానుభూతి పరుడినేమిటి! నేను పీపుల్స్ వార్ కార్యకర్తను' అనేసరికి వరంగల్ నుంచి వచ్చిన ఆ డీఎస్పీ షాక్‌కి గురై నోరెళ్లబెట్టాడు. అప్పటికే దాడి విషయం తెలిసిన విద్యార్థులు, పత్రికా విలేఖరులు త్రిపురనేని ఇంటికి చేరుకోవడంతో మాష్టారు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా రాడికల్ విద్యార్థులకు ఎంతగానో ఉత్తేజ పరిచిన ఘటన ఇది. అందరూ వెళ్లిపోయిన తరువాత 'అంత షాకిచ్చారేంటి మాష్టారు' అంటే దానికాయన 'బహిరంగ జీవితం గడుపుతూ విప్లవాన్ని బోధిస్తున్న మనలాంటి వాళ్ళం ఏదో జరుగుతుందన్న భయంతో మన భావజాలాన్ని, ఆచరణను దాచుకోకూడదు! నువ్వు నేనూ భయపడితే ఇక జనం మన వెంటెలా వస్తారు భయం కేన్సర్ కన్నా పెద్ద జబ్బు అన్న విషయం మరచిపోవద్దు' అన్నారు. మార్క్సిజం - విప్లవోద్యమాల పట్ల త్రిపురనేని నిబద్ధతకు నిలువెత్తూ సాక్ష్యం ఆ ఉదంతం.
దళిత విద్యార్థుల వెన్ను..దన్ను
1980 దశాబ్దం ప్రారంభంలో దళిత ఉద్యమాలు బలంగా లేని కాలంలో విప్లవ శిబిరానికి డా.బి.ఆర్ అంబేద్కర్‌ని సమగ్రంగా పరిచేయం చేయడమే కాక, దళిత విద్యార్థులకు వెన్నుదన్నుగా నిలవడం త్రిపురనేనికే సాధ్యమైంది. అంబేద్కర్ వజ్రోత్సవాల సందర్భంగా ఎస్వీ యూనివర్సిటీలో ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించారు. ఆనాడు వర్సిటీలో ఆర్ఎస్‌యు నేతగా ఉన్న శేషయ్య ఆ కార్యక్రమానికి ఉపన్యాసకుడిగా త్రిపురనేనిని ఆహ్వానిద్దామని ప్రతిపాదిస్తే, నాటి వీసీ రామశర్మ గారు దాన్ని తిరస్కరించారు. డిగ్రీ కళాశాలలలో తెలుగు అధ్యాపకుడిగా ఉన్న ఆయన్ని ఆహ్వానించడం, ఉపన్యసించమనడం ఏంటి అని చులకనగా మాట్లాడారు. దళిత విద్యార్థులు గట్టిగా పట్టుబట్టడంతో త్రిపురనేనిని ఆహ్వానించక తప్పలేదు.ఆనాటి సభలో అంబేడ్కర్ గురించి గంటపాటు త్రిపురనేని ప్రసంగం ప్రభంజనంలా సాగింది. ఆద్యంతం ఆయన ప్రసంగాన్ని విని కదిలిపోయిన వైస్ చాన్సలర్ రామశర్మ వేదిక మీది నుంచే త్రిపురనేని మాష్టారుకు క్షమాపణలు చెప్పడం, ఆయన అధ్యయనానికి దక్కిన అరుదైన గౌరవం. అది మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ అయినా నగరంలో బహిరంగ సభ అయినా సాహిత్య సభ అయినా త్రిపురనేని ఉపన్యాసకుడిగా వస్తున్నాడంటే కిక్కిరిసిన సభ చప్పట్లతో మారుమోగాల్సిందే. తిరుపతి కేంద్రంగా వివిధ విప్లవ ప్రజాసంఘాలు వెలుపరించిన కరపత్రాలను తదనంతర కాలంలో ‘త్రిపురనేని కరపత్ర సాహిత్యం’గా పేర్కొనడం సరికొత్త ఒరవడిగా ప్రసిద్ధి గాంచింది.
జనమే నిర్ణేతలు
కాంగ్రెస్ పార్టీని ఊచకోత కోసి ఎన్టీఆర్ ప్రభంజనంలా ఏపీ రాజకీయ అధికారంలోకి దూసుకొచ్చిన రోజులవి. ఎన్టీఆర్ విధానాలపై ఒక సభలో త్రిపురనేని తీవ్ర విమర్శలు చేస్తున్న సందర్భంలో ఎన్టీఆర్ అభిమానులు తాగివచ్చి సభలో గొడవ చేయడం మొదలు పెట్టారు. సభ రసాభాస కావద్దని త్రిపురనేని వెంటనే తన ప్రసంగం ఆపేశారు. గోల చేస్తున్న వారిని నేరుగా వేదిక వద్దకు ఆహ్వానిస్తూ... 'ముందుగా ఎన్టీఆర్‌ని సపోర్టు చేస్తూ మీరు మాట్లాడండి. ఆ తర్వాత ఎన్టీఆర్ విధానాలను విమర్శిస్తూ నేను మాట్లాడతాను. జనానికి ఏది కావాలో వాళ్లు నిర్ణయించుకుంటారు. ఇది మీకూ నాకూ సంబంధించిన గొడవ కాదు' అంటూ త్రిపురనేని విసిరిన సవాలుకు తాగుబోతు అభిమానులు తోకముడిచారు. జనం ఈలలేసుకుంటూ వారిని సభనుంచి తరుముకుంటూ ఉరకలెత్తించారు. అదీ త్రిపురనేని ఉపన్యాసానికి ఉన్న తెగువ, శక్తి.
నక్సల్బరీ గానం నా మార్గం!
కొండపల్లి, త్రిపురనేని వంటివారు తాము భాగస్వాములై నిర్మించి నేతృత్వం వహించిన ఉద్యమాలలోనే నిరాదరణకు గురికావడం విప్లవోద్యమాల గమనంలో దాగిన వైచిత్రి! ఉద్యమాల్లో పార్టీలో రెండో వాదమే ఉండకూడదన్న ధోరణికి మూలాలు బహుశా 'సాయుధ పోరాటమే ఏకైక మార్గం' అనే ఆచరణ సాధ్యం కాని నినాదంలోనే దాగుందేమో ఆలోచించాలి. మార్క్సిస్టు సిద్ధాంతం, పని పద్ధతులను (మెథడాలజీ)ని అనుసరించి సమాజ పరిణామ క్రమాన్ని వేగవంతం చేయడమన్నది ఏకైక మార్గానికి భిన్నమైనదీ, పొసగనిది కూడా. 1987లో వెలువడిన 'నక్సల్బరీ గమ్యం-గమనం' పుస్తకాన్ని తీసుకొస్తున్న క్రమంలో రచయిత స్వయంగా త్రిపురనేనిని నక్సల్బరీ ఆచరణలో ముడిపడ్డ విజయాలు, లోటు పాట్లను బేరీజు చేస్తూ విమర్శనాత్మకంగా ఒక వ్యాసం రాయమని అడిగితే దాన్ని ఆయన నిర్ద్వందంగా తోసిపుచ్చారు. 'నేను నక్సల్బరీ గానం చేసేవాడినే కానీ, ఆ మార్గాన్ని ఎన్నటికీ విమర్శించేవాడిని కాదు' అని తేల్చి చెప్పారు. అది కూడా ఆయన నిబద్ధతకూ, నిమగ్నతకూ తిరుగులేని సాక్ష్యం. అందుకే ఆయన నక్సల్బరీ వర్గపోరాట వైతాళికుడు!
(నేడు త్రిపురనేని మధుసూదన రావు మాష్టారు 20వ వర్థంతి సందర్భంగా)
సూరిశెట్టి సుధాకర్
ఆర్ఎస్‌యు మాజీ కార్యదర్శి
92462 16234