రాకెట్ టెక్నాలజీకి ఆద్యుడు

by Ravi |   ( Updated:2024-11-10 00:30:40.0  )
రాకెట్ టెక్నాలజీకి ఆద్యుడు
X

17వ శతాబ్దంలో ఒక భారత చక్రవర్తి బ్రిటిషర్లకు కప్పం కట్టాల్సి వచ్చినప్పుడు ఖజానా ఖాళీగా ఉంది. దీంతో ఆయన ప్రజలను మూడున్నర కోట్ల రూపాయలు సహాయం అడగ్గా.. పది కోట్ల రూపాయలు ఖజానాకు చేరాయి. ప్రపంచ చరిత్రలో అంతటి ప్రజాభిమానం సంపాదించుకున్న పరిపాలకుడు న భూతో న భవిష్యత్ అని చెప్పొచ్చేమో! ఆ పరిపాలకుడు... ‘మైసూరు పులి’గా ప్రఖ్యాతి గాంచిన టిపూ సుల్తాన్. కానీ దురదృష్ట‌వశాత్తు ఆయన చరిత్రను కొందరు వక్రీకరించి రాశారు. అదే నిజమని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ సయ్యద్ నసీర్ అహ్మద్ లాంటి కొందరు సామాజిక బాధ్యత గల రచయితలు ఆ ప్రయత్నాలను సమర్థంగా అడ్డుకొన్నారు. సాక్ష్యాధారాలతో టిపూ సుల్తాన్ దేశ భక్తి, పరమత సహనం, సంక్షేమ పాలన గురించి వివరించారు.

వాస్తవ చరిత్రను పరిశీలిస్తే టిపూ సుల్తాన్ అభ్యుదయ భావాలు గల ఆదర్శ పాలకుడని మనకు తెలుస్తుంది. ఆయన తన రాజ్య‌మంత‌టా ఉచిత నిర్భంద విద్య‌ను ప్ర‌వేశ‌పెట్టారు. ఖురాన్ ఆదేశించినట్టు వ్య‌భిచారం, బానిస‌త్వం, మ‌ద్య‌పానాన్ని నిషేధించారు. వ్యవసాయాన్ని, వాణిజ్యాన్ని ప్రోత్సహించారు. భారత్‌లో రాకెట్ టెక్నాలజీకి పునాదులు వేశారు. స్వదేశీ ఉత్పత్తుల వాడకాన్ని ఆచరణలో చూపించారు. సాహిత్యం మొదలుకొని న్యాయ వ్యవస్థ వరకు ప్రజల జీవితాల్లో ముడిపడిన ప్రతి రంగాన్ని సంస్కరించి ప్రజారంజకంగా పాలన అందించారు. బ్రిటిష్ వారితో రాజీ లేని పోరాటం సాగించిన ఆ అసమాన యోధుడి జీవితం నేటి పాలకులకు మార్గదర్శకం.

మైసూరియన్ రాకెట్లు..

బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో విభేదాల క్రమంలో వారిపై టిపూ సుల్తాన్ ప్రయోగించిన మైసూరియన్ రాకెట్లు ప్రపంచంలోనే మొట్టమొదటి ఆయుధాలతో కూడిన మెటల్ రాకెట్లు. ఇందులో ఇనుప కేసింగ్, ప్రొపల్షన్ సిస్టమ్, టెయిల్ రెక్కలను స్థిరీకరించడం వంటివి ఉన్నా యి. ఇవి రెండున్నర కిలోమీటర్ల వరకు ఎగరగలవు. ఇవి వారి కాలానికి ఆశ్చర్యకరంగా అభివృద్ధి చెందాయి. అవి ఆధునిక క్షిపణుల పరిణామాన్ని తెలియజేస్తూ రాకెట్‌ల భవిష్యత్తుకు దూతగా నిలిచాయి. బెంగుళూరులోని సిటీ మార్కెట్, తారామండల్‌పేట పరిసరాల్లోని జుమా మసీదు సమీపంలో ఉన్న రహదారి మొత్తం టిపూ రాకెట్ ప్రాజెక్టుకు కేంద్రంగా పనిచేసింది, అక్కడ అతను ప్రయోగశాలను స్థాపించాడు. టిపూకి శ్రీరంగపట్నం, చిత్రదుర్గ, బిదనూరు, బెంగళూరులో రాకెట్ తయారీ కేంద్రాలు కూడా ఉన్నాయి.

యుద్ధతంత్ర గతిని మార్చిన రాకెట్లు..

మైసూరియన్ రాకెట్ల విస్తరణ యుద్ధ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. వాటిని సురక్షితమైన దూరం నుండి ప్రయోగించవచ్చు, శత్రువు సమర్థవంతంగా స్పందించడం సవాలుగా మారుతుంది. ఇనుముతో నిక్షిప్తం చేయబడిన ఈ రాకెట్లు అత్యంత ప్రాణాంతకమైనవి, ఇవి సైనికులకు వారి కోటలకు నష్టం కలిగించాయి. ఈ విప్లవాత్మక సాంకేతికత టిపూ సుల్తాన్‌కు బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలలో గణనీయమైన ప్రయోజనాన్ని అందించింది. బ్రిటిష్ పదాతిదళం ఈ తెలియని ఆయుధాలను చూసి, వాటిని ఏమి తాకుతుందో తెలియక నిర్ఘాంత పోయారు. టిపూ దార్శనికతలో పుట్టిన ఈ రాకెట్లు ఆధునిక రాకెట్‌ల ఆవిర్భావానికి ముందడుగు వేస్తూ మిలటరీ టెక్నాలజీలో ఒక మలుపునిచ్చాయి. ఈ రాకెట్ల కారణంగా భారీ నష్టాలను చవిచూసిన బ్రిటీష్ వారు, సాంకేతికతను దొంగి లించి, దానిని కాంగ్రేవ్ రాకెట్ అని పిలిచారు. 1812లో ఆంగ్లో- అమెరికన్ యుద్ధంలో అమెరికన్లకు వ్యతిరేకంగా దీనిని మోహరించారు. ఈ రాకెట్లు మైసూరియన్ రాకెట్ల నుండి ప్రేరణ పొందాయి. మైసూరియన్ రాకెట్లు భారతీయ యుద్ధతంత్రంలో ఒక మలుపు మాత్రమే కాదు. అవి శాశ్వత ప్రపంచ ప్రభావాన్ని కలిగించాయి. ఈ భారతీయ ఆవిష్కరణ ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భవిష్యత్తును రూపొందించడంలో కీలకపాత్ర పోషించింది.

(నేడు టిపూ సుల్తాన్ జయంతి సందర్భంగా..)

ముహమ్మద్ ముజాహిద్

96406 22076

Advertisement

Next Story

Most Viewed