సదాగ్రహమే సత్యాగ్రహం

by Ravi |   ( Updated:2025-01-30 01:00:45.0  )
సదాగ్రహమే సత్యాగ్రహం
X

'భారతదేశంలోని మైదానాలు, కొండల్లో మాత్రమే కాకుండా, ప్రపంచమంతా గుర్తుండిపోయే సన్యాసి గాంధీ. ఇతర పురుషులు అధికారం, ఆస్తుల కోసం ప్రయత్నిస్తున్నట్లుగా అతను పరిపూర్ణత కోసం ప్రయత్నించాడు. అతను తప్పు చేసిన వారిపై జాలి పడ్డాడు.. ఇప్పుడు అతను యుగాలకు చెందినవాడు' అంటూ న్యూయార్క్ టైమ్స్ 1948 జనవరి 30న గాంధీజీ అస్తమించినప్పుడు తన సంపాద కీయంలో రాసిన అక్షరాలివి. ఆయన మరణించి 77 సంవత్సరాలు గడిచిపోతున్నా ఆయన నడవడిక, బోధనలు యావత్ ప్రపంచానికి నేటికీ అనుసరణీయం, విశ్వవ్యాప్తం.

ఈ సందర్భంగా ఆయన ఆత్మకథ 'సత్యశోధన దిశగా నా ప్రయోగాలు' (ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్‌పెరిమెంట్ విత్ ట్రూత్) పుస్తకంలోని కొన్ని సందర్భాలను గుర్తుచేసుకొని ప్రేరణ పొందుదాం. నేటికీ ఆ పుస్తకం బెస్ట్ సెల్లర్‌గా వుంటూ దాదాపు ప్రపంచ ప్రముఖ భాషల న్నిం ట్లో అనువాదం పొందింది. బైబిల్ స్థాయి పుస్తకంగా నేటికీ కొంతమంది ప్రపంచ ప్రము ఖులు గాంధీజీ సత్యశోధనను భావిస్తున్నారు.

ఇలాంటి మనిషి భూమ్మీద నడయాడారా?

"Generations to come, it may well be, will scarce believe that such a man as this one ever in flesh and blood walked upon this earth" మహాత్ముడికి విఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ అక్షర శ్రద్దాంజలి ఇది. కాలం పరిణామంలో తరాల ఆలోచనలు మారుతుంటాయి. మరి నా జీవితపు సందేశం ఎంతవరకు కాలాతీతంగా నిలుస్తుంది..? అనుకుని... భావి తరాలు తన ఆత్మకథను ఎందుకు తెలుసుకోవాలనే ప్రశ్నను గాంధీ తనకు తానే వేసుకున్నాడు. అందుకే తన జీవితాన్ని ఓ సైంటిస్ట్‌లా విశ్లేషించి ఇలా ఆరంభించారు. "ఆత్మకథ రాయాలని నేను అనుకోలేదు. నేను అనేక సమయాల్లో ఎన్నో సత్య ప్రయోగాలు చేశాను. ఆ ప్రయోగాల్ని ఆత్మకథగా రూపొందించాలని మాత్రం అనుకున్నాను. నా జీవితం అట్టి పలు సత్య ప్రయోగాలతో నిండి వుంది".

నీ మరణం చరిత్ర సృష్టించాలని..

"I have nothing new to teach the world. Truth and non-violence are as old as the hills." మొదట దైవమే సత్యం అనే దశ నుంచి తన అనుభవాలతో సత్యమే దైవం అనే స్థాయిని పొంది, సత్య మయం కావడానికి అహింసయే ఏకైక మార్గం అంటారు గాంధీజీ. సుమారు పదమూడోయేట నాకు పెండ్లి అయింది. పదమూడేళ్ల వయసులో జరిగిన నా పెళ్లిని సమర్థించుకునేందుకు నైతిక కారణం ఒక్కటి కూడా లేదు అంటూ ఆనాటి బాల్య వివాహాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏ సమయంలో నేను మేల్కొని ఉండాలో ఆ సమయంలో నా మనస్సు భోగవాంఛలకు లోబడింది అంటూ తన తండ్రి మరణించిన సంఘటనను పురస్కరించుకుని చాలా బాధపడ్డారు. నేను ఒక సామాన్య విద్యార్థిగానే ఉండే వాడిని అని రాసుకున్న ఆయన గురించి ప్రపంచంలోని వివిధ రంగాల్లో ప్రముఖులు సైతం పుస్తకాలు రాసేలా చరిత్రను శాసించారు. అందుకే అబ్దుల్ కలాం ‘నీ జననం సాధారణమే కావచ్చు. కానీ నీ మరణం చరిత్ర సృష్టించాలని’ అంటారు..

నిద్రావస్థలో ఉన్న భావాలను మేల్కొలిపి..

భారతీయుల హక్కుల కోసం, అధికారాల కోసం ఎంత గట్టిగా ఉద్యమిస్తానో వారిని సంస్కరించడానికి అంతగా కృషి చేస్తూ వుంటానని బ్రిటిష్ వారికి బాధపడేలా పారిశుద్ధ్య ఉద్యమం నడిపి పర్యావరణపు పరిశుభ్రత పాటించడం గురించి ఆనాడే ఆచ రించి చూపారు మన మహాత్ముడు. మనలో నిద్రావస్థలో ఉన్న మంచి భావాలను, గుణాలను మేల్కొల్ప గల శక్తి కలవాడే కవి అంటూ జాన్ రస్కిన్ రచించిన "Unto the Last" పుస్తకం తనపై చూపించిన ప్రభావాన్ని వివరించారు."సదాగ్రహం"ని సత్యాగ్రహం అని మార్చి భవిష్యత్తు తరాలకు దారి చూపే బలమైన కాంతిజనకాన్ని అందించారు. మన స్వాతంత్ర్య సంగ్రామంలోనే కాదు.. నేటికీ సత్యాగ్రహం అనేది అసమానతలు, అస్పృశ్యత విధానాలు, వివక్షతలు, అమానవీయ ఘట నలు వంటి తదితర అనాగరిక అంశాలపై యుద్ధం చేస్తూనే వుంది..!

వికారాలను జయించడం కష్టసాధ్యం

ప్రజలు నన్ను ఎంత పొగడినా, ఆ పొగడ్త నన్ను ఏమరుపాటులో పడవేయదు. అట్టి పొగడ్త నా మదిలో గుచ్చుకుంటూ ఉంటుంది. మనస్సులో గల వికారాలను జయించడం అనేది ప్రపంచాన్ని శస్త్రాస్త్రాల యుద్ధంలో జయించడం కంటే కష్టమైనదని నాకు కలిగిన అనుభవం. నా మనస్సులో గల వికారాలను చూచి సిగ్గు పడ్డాను. కానీ ధైర్యం మాత్రం సడల నీయలేదు. సత్యశోధన కావించుతూ రసానందం పొందానంటూ తను అందరిలాంటి వాడినేనని, కానీ నిత్యం పరిపూర్ణత్వం కోసం శూన్యం పొందడానికి ప్రయత్నిస్తున్నానని అంటారు పుస్తకం ముగింపులో..!

వెయ్యేళ్ల తర్వాతా కనిపించే వెలుగు

అది 1893 జూన్ 7 రాత్రి. దక్షిణాఫ్రికాలోని పీటర్ మారిట్జ్ బర్గ్ రైల్వేస్టేషన్‌లో 'మహాత్మా గాంధీ' అని ప్రపంచానికి తెలిసిన ఒక యువ భారతీయ న్యాయవాదిని రైలు నుంచి విసిరివేశాడో రైల్వే టీసీ. అతను శ్వేత జాతీయులు మాత్రమే వుండే కంపార్ట్మెంట్ నుండి కదలడానికి నిరాకరించాడు అంటూ ఓ ఒక్క పలుచని వ్యక్తి గురించి రాసిన మాటలు కొన్ని తరా లుగా ప్రభావితం చేస్తున్నాయి. వెయ్యేళ్ల తర్వాత కూడా ఆ వెలుగు ఈ దేశంలో కనిపించి ప్రపంచం చూసి అసంఖ్యాక హృదయాలకు ఓదార్పునిస్తుందంటూ మన ప్రథమ ప్రధాని నెహ్రూ చేసిన చారిత్రాత్మక ప్రసంగం The light has gone out...! అక్షరాల నిరూపితమవుతోంది.

ఇంతటి ప్రాముఖ్యం గల గాంధీ ఆత్మకథ పుస్తకాన్ని గాంధీ జయంతి లేదా వర్థంతిని పురస్కరించుకుని, మన జన్మదినం సందర్భంగానైనా నేటి తరం విద్యార్థులకు, యువకులకు గిఫ్ట్‌గా ఇద్దాం. ఆయన కలల సౌధంలో జీవిస్తూ ఆయన ఆశయాలకు ప్రాణం పోద్దాం. ఎందుకంటే.. Some men changed their times. One man changed the world for all times...!

(నేడు గాంధీ వర్థంతి సందర్భంగా)

- ఫిజిక్స్ అరుణ్ కుమార్

ప్రయివేటు టీచింగ్ ఫ్యాకల్టీ

93947 49536

Next Story

Most Viewed