దళితుల వ్యథలకు అక్షర రూపం..

by Ravi |
దళితుల వ్యథలకు అక్షర రూపం..
X

జీవితం నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. నా గురువులు ఇద్దరు.. పేదరికం, కుల మత భేదం. ఒకటి నాకు సహనాన్ని నేర్పితే, రెండోది నాలో ఎదిరించే శక్తిని పెంపొందించింది. దారిద్ర్యాన్ని, కులభేదాన్ని కూడా చీల్చి నేను మనిషిగా నిరూపించుకోదలచాను. వాటిపై కత్తి కట్టాను. అయితే నా కత్తి కవిత, దానికి సంఘంపై ద్వేషం లేదు. దాని విధానంపై ద్వేషం అంటాడు కవి జాషువా.

ఆయన సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేశారు. ‘నిమ్న’ కులంలో జన్మించినందు వలన అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డారు. ఛీత్కారాలు ఎదు రైన చోటే సత్కారాలు పొందారు. ఒక పక్క కుల మత భేదం ఆయన ఆత్మాభిమానంపై దెబ్బ కొడుతూ ఉంటే మరో పక్క దారిద్రం శారీరక శక్తిని, పెరుగుతున్న కోరికలను అణగదొక్కుతూ ఉండేది. కష్ట సుఖాలు రెండూ నన్ను వశపరచుకోలేదు. ఆ రెంటినీ పక్కకు నెడుతూ నా లక్ష్యం వైపు నడక సాగిస్తున్నాను అన్నారు జాషువా.

జాషువా జీవిత విశేషాలు..

జాషువా అనేక రచనలు చేశారు. ఎక్కడైతే అవమానాలు ఎదుర్కొన్నాడో, అక్కడే ఎన్నో బిరుదులు, పురస్కారాలు అందుకున్నాడు. తిరుపతి వెంకట కవులలో ఒకరైన చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి జాషువా కాలికి గండపెండెరం తొడిగి ఈ కవీశ్వరుని పాదం తాకినా జన్మ ధన్యం చేసుకున్నాను అన్నాడు. అది తనకు లభించిన అత్యున్నత పురస్కారంగా జాషువా భావించారు. మనిషిని ఔన్నత్యం వైపు నడిపించి, అసమానతలు తొలగించి, మానవ సమాజం సౌభాగ్యవంతంగానూ, సుఖశాంతులతోనూ జీవించాలని ఆకాంక్షించారు. అందుకు దోహదపడి కవిత్వాన్ని రచించారు. ఆయన ధనం, ధాన్యం ఒకని పెత్తనం కింద ఉండరాదని కాంక్షించారు. అది ప్రజలందరికీ చెందాలని ఆశించారు. మానవ కళ్యాణాన్ని, శ్రామిక, పీడిత, జనోదరణ కోసం కవిత్వ రూపంలో తపించారు. అట్టడుగు స్థాయి వ్యక్తుల ఆర్తికి, ఆవేదనతోను ఆవేశంతోను అక్షరరూపం ఇచ్చారు. వర్తమాన సాంఘిక రాజకీయ ఆర్థిక పరిస్థితులను చూసి నా మనసు ఘోషిస్తున్నది అన్నాడు జాషువా. ఈయన ఈ దేశంలో కులరక్కసి బారి నుంచి పారదోలాలని కలలుగన్నాడు. ఆ కులరక్కసిని తరిమి కొట్టాలంటే, కులం మనిషివేతకు గురైన వాడు మాత్రమే ఈ తాత్విక పునాదిని రూపొందించుకోగలుగుతాడు. భూమిలేని వ్యవసాయ కూలీ లు, పేద రైతాంగం, గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత అధిక శాతం దళితులు భూమిలేని వ్యవసాయ కూలీలు పేదరైతాంగమే కాబట్టి, ఆర్థిక దోపిడీలతో పాటు ఆర్థికేతర దోపిడీ హింసలకూ, కుల అసమానతలకు వ్యతిరేకంగా నిరంతరం దోపిడీ లేని సమాజం కోసం మనం పోరాడినప్పుడే జాషువాకు నిజమైన నివాళులు అర్పించగలుగుతాం.

(నేడు గుర్రం జాషువా 53 వ వర్ధంతి సందర్భంగా)

Read more...

అణగారిన వర్గాల గొంతుక టీ.ఎన్ సదాలక్ష్మీ


చిన్నం కాళయ్య

96403 55036



Next Story