అమ్మది.. ఆత్మగౌరవ పోరాటం!

by Ravi |   ( Updated:2024-09-26 00:45:04.0  )
అమ్మది.. ఆత్మగౌరవ పోరాటం!
X

2012 సెప్టెంబర్ మొదటివారం. వీరనారి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఒక ఆర్టికల్ రాయాలని ఐలమ్మ వారసులని కలిసే ప్రయత్నం చేశాను. ఐలమ్మ పెద్ద కొడుకు చిట్యాల సోమయ్య పెద్ద కొడుకు లక్ష్మీ నరసయ్య ఇంటికి వెళ్లాను. సుమారు 70 ఏళ్ల వయసు కలిగి ఉన్న ఆయన ఇంటి ముందు అరుగుపై కూర్చొని ఉన్నాడు.

నేనూ యోగక్షేమాలు తెలుసుకుని ఐలమ్మ అమ్మ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఒక వ్యాసం రాయాలనుకుంటున్నాను. నీకు తెలిసిన విషయాలు చెప్పాలని.. అడగడంతో ఎట్లా చెప్పాలి అని మామ బదులిచ్చాడు. అప్పటికే పదేళ్లుగా వారితో నాకు అనుబంధం ఉంది. పార్టీ కార్యక్రమాలు ఉన్నాయని సమాచారం ఇస్తే చాలు, ఎన్ని పనులున్నా వదిలేసి వచ్చేవాడు. కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు. ఆ సమయంలో నేను అడిగిన కొన్ని ప్రశ్నలకు లక్ష్మీ నరసయ్య సమాధానం ఇస్తూ చాలా సేపు కబుర్లు చెప్పాడు. వాటిలో కొన్ని మాటలు ఇవి..

ఎర్రజెండా పేరు చెబితే చాలు కరిగిపోయేది!

మా గురించి ఎట్లా చెప్పుకుంట. నలుగురు చెప్పాలె. అమ్మ ఏంటో నాయకులు సెబుతుంటే విన్నం. అమ్మతో కలిసి బతికినప్పుడు ఆ గొప్పతనం మాకు అర్థం కాలే. సోది పెడుతుందని, అప్పటి ముచ్చట్లు చెబుతుంటే పట్టించుకోలే. అమ్మ ఎట్లా బతికిందో.. ఎన్ని కష్టాలు పడిందో.. ఎన్ని కన్నీళ్లను దిగ మింగిందో. ఎన్ని కడుపులో దాచుకుందో అమ్మకే తెలుసు. పురిటి నొప్పుల బాధ వాళ్లకే తెలుస్తది. గుమ్మిలో తిండి గింజలు లేకపోతే ఆకలి బాధ తెలుస్తుంది. అమ్మది ఆకలి పోరాటం, ఆత్మగౌరవ పోరాటం. మేము చిన్నతనంలో ఉన్నప్పుడు కమ్యూనిస్టు నాయకులు నలుగురు ఇంటికొచ్చి పోయే టోల్లు. ఎర్ర జెండా అంటే అమ్మకి ప్రాణం. ఆ ముచ్చట్లు చెబితే కోపంగా ఉన్న అమ్మ మనసు చల్లబడేది. కుదురుగా ఉండేది.

దొరల బెదిరింపునకూ తలొగ్గలే..!

బట్టలుతికిన, ఎద్దు ఎవసాయం చేసిన ఐదు వేళ్ళు నోట్లోకి పోయేది కాదు. చాంతాడంత కుటుం బం. అందరూ ఏదో పనిచేస్తేనే కాలం గడిచింది. అమ్మ పోరాటం చేసిందంట. ఎర్ర జెండాను ఇంటికి తీసుకువచ్చి సంఘం పెట్టిందంట. విసునూరు దొరోడికి తెలిసి కోపగించుకున్నడు. ఏమే.. ఐలమ్మ. ఆడదానివి. ఎట్ల బతుకుతావో.. చూస్తా, ఏమి చేస్తావో చూస్త అని బెదిరింపులు చేసిండట. భూమి పంచాయతీ పెట్టి బాధలు పెట్టిండు. అమ్మ నల్లగొండ కమ్యూనిస్టు నాయకుల దగ్గరికెళ్లి కడుపులోని బాధను సెప్పుకుని వొచ్చింది. వాళ్లు ఉకోలే.. మేమున్నామని ధైర్యం చెప్పిండ్రు. భరోసా ఇచ్చిండ్రు. సంఘం చిట్టి రాసిస్తే కొంగులో కట్టుకొని వచ్చింది ఐలమ్మ. అట్లా సాహసం చేసింది. మల్లంపల్లి దొర కుటుంబంకు పాలకుర్తిలో ఉన్న భూమిని కౌలుకు తీసుకుంది. నాలుగెకరాల్లో అమ్మ వరి పంటేసింది. గొప్పగా బతకాలె. నలుగుట్లో మంచిగా ఉండాలి అనే అమ్మ ఆలోచనలకు పాలకుర్తి పోలీస్ పటేల్ శేషగిరిరావు అడ్డుపడ్డడు. తన ఊరిలో తాను ఉండంగా ఈ ఎర్రజెండా పెట్టుడేంది. తనకు అవమానంగా భావించిండు. విసునూరు దొరోడి దగ్గరికెళ్లి ఐలమ్మపై తొండి మాటలు చెప్పి వొచ్చిండు.

మా భూమి కావల్సి వొచ్చిందా దొరా…?

పోలీసు పటేలు మాటలు నమ్మిన విసునూరు దేశ్‌ముఖ్ రామచంద్ర రెడ్డి సంఘం నడవకుండా ముకుతాడు వేయాలనుకున్నడు. కుట్ర చేసిండ్రు. కుటుంబాన్ని ఇబ్బందులపాలు చేసిండ్రు. గీ దొరలకి మా భూమి కావల్సి వచ్చిందా? అయితే కారణం మరోటి ఉంది. ఇక్కడ అమ్మ సంఘం పెట్టింది. పాలకుర్తిలో దొరలను వ్యతిరేకించినోళ్లు ఒక కట్టు కట్టిండ్రు. దొరతనం పోవాలని.. రాకాసి పీడ పోవాలని.. ఎర్ర జెండా అందుకున్నరు. ఏకమై సాగిపోతున్నరు. అందుకే దొరలకు కడుపు మంట. సంఘం ఎదగకుండా ఉండాలని దొరలు, భూస్వాములు కోరుకున్నరు. జనగాం ఏరియాలో ఆంధ్ర మహాసభ సంఘం మొదటిది. ఈ మాట భీమిరెడ్డి నరసింహారెడ్డి ఐలమ్మతో అన్నడు. ఆయన కూడా దొరే. ప్రజల కోసం పని చేసిండు. ఎంపీగా కూడా గెలిచిండు.

కుటుంబమంతా జైల్లోనే..

భూమి విషయంలో దొర తప్పుడు కేసులు పెట్టించిండు. పార్టీ బహిరంగ సభపై తన గుండాలచే దాడి చేసి కేసులు కూడా పెట్టిం చిండు. ఐలమ్మ భర్త నరసయ్య, ఇద్దరు కొడుకులు సోమయ్య, లచ్చయ్యలు నాయకులతోపాటు జైలు జీవితం గడిపిండ్రు. ఐలమ్మ బిడ్డ సోమ నరసమ్మ జీవితాన్ని దొర గుండాలు ఆగం చేసిండ్రు. ఆమె చనిపోయే వరకు నరకం అనుభవించింది. సాయుధ పోరాటం కంటే ముందు ఈ పోరాటం జరిగింది. అందుకే పెద్ద గుర్తింపొచ్చింది. ఐలమ్మ మహిళ కావడం.. దొరలను ఎదిరించడం మామూలు విషయం కాదు. అందుకే ఎక్కడ పోయినా అమ్మను యాది చేస్తుండ్రు. ఐలమ్మ పోరాటాన్ని, త్యాగాన్ని ప్రభు త్వాలు గుర్తించకపోయినా.. ప్రజల గుర్తింపు ఉంది. మాకు అది చాలు, ఐలమ్మ మనవలుగా మమ్మల్ని ఆదరిస్తున్నరు. గౌరవిస్తున్నరు. ఇంత కంటే మా జీవితాలకి ఇంకేం కావాలి అన్నడు.

ఎర్రజెండా నిలబడాలె..!

ఆయనతో మాట్లాడినంతసేపు ముఖంలో సంతోషం తొణికిసలాడింది. ఉద్యమ స్ఫూర్తి ఆయన మాటల్లో కనిపించింది. పాలకుర్తి ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమం బలహీనపడిన విషయంపై ఆందోళన వ్యక్తం చేశాడు. మీలాంటి యువతరం బాగా పనిచేయాలని కోరుకున్నారు. ఉద్యమాల పురిటి గడ్డపై ఎర్రజెండా నిలబడాలని ఆకాంక్షించారు. ఏదో ఒక సందర్భంలో కనిపించినప్పుడు మామ, అల్లుడు అంటూ ఆప్యాయంగా పలకరించిన లక్ష్మీ నరసయ్య మన నుండి 2021 మార్చి 02న భౌతికంగా దూరమయ్యాడు.

( ఐలమ్మ మనవడు చిట్యాల లక్ష్మీనరసయ్య జ్ఞాపకాలు..)

మామిండ్ల రమేష్ రాజా

విప్లవ మూర్తి ఐలమ్మ పుస్తక రచయిత

78932 30218

Advertisement

Next Story

Most Viewed