- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆహార వ్యర్థాలకు పరిష్కారమేదీ?
ఆహారం పరబ్రహ్మ స్వరూపం...! కోటి విద్యలు కూటి కొరకే...! అన్నదానానికి మించిన దానం లేదు....! మన జీవనయానంలో ఆహారానికి ఉన్న విలువేంటో తెలియజేయడానికి ఈ వాక్యాలు చాలు. మానవాళితో సహా సకల జీవరాశుల మనుగడకు ఆహారం తప్పనిసరి. 2022 లో ప్రపంచంలో సుమారు 783 మిలియన్ల ప్రజలు ఆకలిని ఎదుర్కొన్నారు. ఉక్రెయిన్ యుద్ధం ఈ సంఖ్యని మరింత పెంచింది. ఎంతో విలువైన ఆహారం ప్రపంచ వ్యాప్తంగా నిర్లక్ష్యం చేస్తుండటం, నిల్వ చేయడానికి తగిన సాంకేతికత పరిజ్ఞానం లేకపోవడం వంటి కారణాల వలన కలుగుతున్న ఆహార నష్టం, ఆహార వృధా నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద పర్యావరణ, ఆర్థిక సవాల్.
ఈ దేశాలే ఎక్కువ..
తినడానికి పనికిరాని స్థితిలోనున్న లేదా తినే అవకాశం ఉన్నప్పటికీ విస్మరించబడిన దాన్ని ఆహార నష్టం, ఆహార వ్యర్థం అని చెప్పవచ్చు. ఇది భవిష్యత్తులో ప్రపంచ ఆహార సంక్షోభానికి దారి తీసే ప్రమాదం కలిగి ఉండడంతో పాటు ఆహార వ్యవస్థల స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది. వృధా వలన ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే వనరులైన నేల, నీరు, శ్రమ, మూలధనం కూడా వృధా అయినట్టే..! ఇది ఆహార భద్రత, లభ్యతను ప్రతికూలంగా ప్రభావితం చేసి ఆహార ధరలను పెంపునకు దోహదం చేస్తుంది. ఆహార నష్టం అనేది ఆహార పంట కోతకు వచ్చినప్పటి నుండే మొదలవుతుంది. ఆహారం ఉత్పత్తి, ప్రాసెసింగ్, అమ్మకాలు, వినియోగం దశలలో ఆహారం నష్టం జరుగుతుంది. పంట పండే సమయంలో వచ్చే తెగుళ్లు, ప్రకృతి వైపరీత్యాలు, పంట కోత తర్వాత సరైన పద్ధతులలో నిల్వ చేయకపోవడం, రవాణా చేసేటప్పుడు, వంట చేసేటప్పుడు జరిగే వృధా ఈ దశలలో భాగాలే. ఆహార వృధా కేవలం పంటలకే పరిమితం కాదు. పాలు, గుడ్లు, చేపలు, మాంసం వంటి వాటికి కూడా అనువర్తిస్తుంది. ఆహార వ్యర్థాలు సూచిక ఈ వ్యార్థాలను కొలుస్తుంది.
ఇటీవల ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యుఎన్ఈపీ), వరల్డ్‌వైడ్ రెస్పాన్సిబుల్ అక్రెడిటెడ్ ప్రొడక్షన్ (డబ్ల్యు.ఆర్.ఎ.పి) లు సంయుక్తంగా ఆహార వ్యర్థాల సూచిక (ఫుడ్ వేస్ట్ ఇండెక్స్) 2021 నివేదికను విడుదల చేశారు. దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2019 లో దాదాపు 931 మిలియన్ టన్నుల ఆహార వ్యర్థాలు ఉత్పత్తి అయ్యాయని, ఇందులో 61% గృహాలు, 26% ఆహార సేవ, 13% రిటైల్‌ల నుండి వచ్చాయని తెలిపింది. ఒక సంవత్సర కాలంలో తలసరిగా 39 కిలోల అతి తక్కువ ఆహార వ్యర్ధాలను ఉత్పత్తి చేసిన దేశంగా ఆస్ట్రియా, 189 కిలోల అతి ఎక్కువ ఆహార వ్యర్ధాలను ఉత్పత్తి చేసిన దేశంగా నైజీరియా రికార్డులకెక్కాయి. 2023లో అత్యధికంగా ఆహారాన్ని వృధా చేసే దేశాలుగా మొదటి, రెండు స్థానాలలో చైనా, భారతదేశాలు నిలిచాయి.
మన దేశంలోని పరిస్థితి
యు.యన్.ఇ.పి ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్ 2021 ప్రకారం, భారతదేశంలో గృహ ఆహార వ్యర్థాలు ప్రతి వ్యక్తికి సంవత్సరానికి 50 కిలోలు లేదా దేశం మొత్తానికి తీసుకుంటే 68.76 మిలియన్ టన్నులు ఉన్నట్లు అంచనా వేయబడింది. ఇది 50 వేల కోట్ల రూపాయలకు లేదా మన దేశ జి.డి.పి లో 1% కి సమానం. ఇది ఇలా ఉంటే దేశ జనాభాలో 15% మంది ప్రతి రోజూ ఆకలితో అలమటిస్తున్నారు. నలుగురి పిల్లల్లో ఒకరు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ప్రతి రోజు 3000 మంది సరైన ఆహారం లేక అనారోగ్యంతో మృత్యువాత పడుతున్నారు.
వృథాను ఎందుకు తగ్గించాలి?
ఆహారం నష్టం, ఆహార వృధాలో పావు శాతం ఆదా చేస్తే ప్రపంచ వ్యాప్తంగా ఆకలితో జీవిస్తున్న 870 మిలియన్ల మందికి ఆహారాన్ని అందించవచ్చు. ఆహార వ్యర్థాలు కుళ్ళడం వలన విడుదలయ్యే 10% గ్రీన్హౌస్ వాయువులు ఓజోన్ పొరకు హాని కలిగిస్తున్నాయి. ఇంకా కార్బన్ డయాక్సైడ్ కంటే ప్రమాదకరమైన మీథేన్ వాయువు వెలువడే కారణాన్ని మనకు క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు వంటి వ్యాధులు రావడమే కాకుండా అంగ వైకల్యం తో కూడిన పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పర్యావరణ పరంగా మొక్కలు, జంతుజాతుల క్షీణత జరిగి దాదాపు 70 శాతం జీవ వైవిధ్య నష్టానికి ఈ ఆహార వ్యర్థాలు పరోక్షంగా కారణమవుతున్నాయి.
దీనిని తగ్గించడానికి పంటలు, పండ్లు వంటి వాటిని నిల్వ చేయడానికి శీతల గిడ్డంగులను నెలకొల్పడంలో శాస్త్రీయ పద్ధతులను పాటించాలి. పండ్లు, కూరగాయలు, చేపలు, మాంసం వంటి వాటిని వేగంగా రవాణా చేయడానికి మంచి రోడ్ల సదుపాయం కల్పించాలి. ఆహార పదార్థాలు కల్గిన ట్రక్కులు ప్రమాదాలకు గురి కాకుండా వాహన డ్రైవర్లకు శిక్షణ ఇవ్వాలి. ఇంటికి కావలసిన ఆహార పదార్థాలను అవసరం మేరకే కొనుగోలు చేయాలి. వివాహాలు, పార్టీలు, పండగల సందర్భంగా మిగిలిన ఆహార పదార్థాలను ఫుడ్ బ్యాంకులు లేదా ఆకలితో ఉన్నవారికి లేదా అనాధాశ్రమాలకు ఇవ్వాలి. ఆహార వృధా అరికట్టడానికి ప్రతి ఒక్కరం పాటుపడాలి.
(నేడు అంతర్జాతీయ ఆహార నష్టం, వ్యర్థాల అవగాహన దినోత్సవం)
జనక మోహనరావు దుంగ
94404 85824