రాష్ట్రం నుంచి పారిపోతున్న పారిశ్రామికవేత్తలు

by Ravi |   ( Updated:2023-03-01 19:16:11.0  )
రాష్ట్రం నుంచి పారిపోతున్న పారిశ్రామికవేత్తలు
X



ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ మార్చి 3,4 తేదీల్లో విశాఖలో జరగనుంది. ప్రచార ఆర్భాటం తప్ప ఒక్క పరిశ్రమగాని, ఒక్క కంపెనీ గాని వచ్చే దాఖలాలు కనిపించడం లేదు. సదస్సు ముసుగులో కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధులను ప్రచారం కోసం మంచినీళ్లప్రాయంగా ఖర్చుపెడుతున్నారు. దేశ, విదేశాల నుంచి పెట్టుబడిదారులు వస్తున్నారని ఊదరగొడుతున్నారు. వీరిని నమ్మి ఒక్కరు కూడా వచ్చే అవకాశం లేదు. రాష్ట్రంలో పాలకపక్ష నేతలు పారిశ్రామికవేత్తలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ఒకవైపు కక్ష సాధింపు చర్యలు మరోవైపు ముడుపుల కోసం బెదిరింపులు. దీనివల్ల రాష్ట్రానికి కొత్తగా పారిశ్రామికవేత్తలు రావాలంటే జంకుతున్నారు. పారిశ్రామికవేత్తల్లో ఉన్న భయాందోళనలు తొలగించి ప్రభుత్వం పట్ల భరోసా కలిగించాలి.

రిశ్రమలు తరలిపోతున్నాయి, పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు. రాష్ట్రంలో పాలకపక్ష నేతలు పారిశ్రామికవేత్తలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్న పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. ఒకవైపు కక్ష సాధింపు చర్యలు మరోవైపు ముడుపుల కోసం బెదిరింపులు. దీనివల్ల రాష్ట్రానికి కొత్తగా పారిశ్రామికవేత్తలు రావాలంటే జంకుతున్నారు. గత ముఖ్యమంత్రి దేశ, విదేశాల్లో తిరిగి పెట్టుబడులు తీసుకువచ్చారు. నమ్మకం, విశ్వసనీయత పునాదులపై నిర్మితమైన రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను ఈ ప్రభుత్వం కూల్చివేసింది. ముఖ్యమంత్రి అనాలోచిత, అవినీతి, లోపభూయిష్ట విధానాల వల్ల పారిశ్రామిక రంగం పడకేసింది. కోడి గుడ్డు పెట్టేదెప్పుడు, అది పొదిగి పిల్లలను ఎప్పుడు చేస్తుందో పరిశ్రమల శాఖ మంత్రి సెలవిస్తే బాగుంటుంది.

రాజధానిని అందుకే ప్రకటించారు

ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ మార్చి 3,4 తేదీల్లో విశాఖలో జరగనుంది. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌కు వెళ్లి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సును కాస్తా రాష్ట్ర స్థాయి సదస్సుగా మార్చారు. గతేడాది పరిశ్రమలకు ఇవ్వవలసిన రాయితీలు ఇప్పటివరకు చెల్లించలేదు. నష్టాల్లో ఉన్న స్పిన్నింగ్ మిల్లులకు విద్యుత్ సబ్సిడీల బకాయిలు అంతే ఉన్నాయి. ఒక్క ఏడాది మాత్రం కమీషన్లు పుచ్చుకుని సర్దుబాటు చేశారు. పోర్టుల నుంచి పవర్ ప్లాంట్ల వరకు అదానీకి ధారాదత్తం చేశారు. మధురవాడలో డేటా సెంటర్‌కు రూ. 4వేల కోట్ల విలువైన 130 ఎకరాల భూమిని నామమాత్రపు ధరకు కట్టబెట్టారు. ఈ సదస్సు సందర్భంగా డేటా సెంటర్ కు శంకుస్థాపన చేస్తామని అన్నారు. కానీ ఆ ఛాయలు ఎక్కడా కనిపించడం లేదు. అదానీ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో రాష్ట్ర పరిస్థితి అంతకంటే అద్వానంగా తయారైంది. ప్రచార ఆర్భాటం తప్ప ఒక్క పరిశ్రమ గాని, ఒక్క కంపెనీ గాని వచ్చే దాఖలాలు కనిపించడం లేదు. సదస్సు ముసుగులో కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధులను ప్రచారం కోసం మంచినీళ్లప్రాయంగా ఖర్చుపెడుతున్నారు. దేశ, విదేశాల నుంచి పెట్టుబడిదారులు వస్తున్నారని ఊదరగొడుతున్నారు. వీరిని నమ్మి ఒక్కరు కూడా వచ్చే అవకాశం లేదు. రాష్ట్రంలో ఉన్న రహదారుల దుస్థితి, విద్యుత్ కోతలు, నీరు, ఇసుక కొరత చూసి భయపడుతున్నారు. రాజధాని లేని రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రారనే అనుమానంతో ముఖ్యమంత్రి విశాఖ ఒక్కటే రాజధాని అని హడావుడిగా ప్రకటించారు.

తరలిపోయిన పరిశ్రమలు

విశాఖను ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేయడానికి 50 వేల చదరపు అడుగులతో ఏపీ సన్ రైజ్ స్టార్టప్ విలేజ్‌ను ఏపీఐఐసీ నిర్మించింది. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోత్సహకాలు, రాయితీల వల్ల కొన్ని ఐటీ కంపెనీలు వచ్చాయి. ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న దివాలాకోరు పాలనా విధానాలతో కొన్ని తరలిపోయాయి, మరికొన్ని మూతబడ్డాయి. పారిశ్రామిక అభివృద్ధిలో దేశంలో మూడో స్థానంలో ఉన్న రాష్ట్రం ఈనాడు అట్టడుగు స్థానానికి చేరింది. స్థానిక శాసనసభ్యుడు ముడుపుల కోసం జాకీ పరిశ్రమ యాజమాన్యాన్ని బెదిరించడంతో హైదరాబాద్‌కు పరారైంది. కియా పరిశ్రమపై స్థానిక ఎంపీ నేరుగా బెదిరింపులకు దిగడంతో రూ.2,500 కోట్ల విలువైన కియా అనుబంధ పరిశ్రమలు ఇక్కడకు రాకుండా పోయాయి. సింగపూర్ అంకుర ప్రాజెక్ట్ రద్దయింది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, మెడ్ టెక్ జోన్, హెచ్ సీఎల్, లులూ కంపెనీ, బీఆర్ షెట్టి సంస్థలు, రేణిగుంటలో రిలయన్స్, ఒంగోలు నుంచి ఏపీపీ పేపర్ కంపెనీ వెనక్కి వెళ్లాయి. విశాఖ రుషికొండలోని ఐటి సెజ్‌లో 14 కంపెనీలు పరారయ్యాయి. మిలీనియం టవర్స్ ఖాళీ అయింది. గన్నవరంలోని మేధా టవర్స్ నుంచి 8 కంపెనీలు వెళ్లిపోయాయి. కడపలో భారతీ సిమెంట్స్‌కు పోటీగా ఉందని జువారీ సిమెంట్స్‌ను మూసేయించారు. చిత్తూరు జిల్లాలో అమర్ రాజా బ్యాటరీ యూనిట్లను ప్రభుత్వం మూయించడంతో హైదరాబాద్‌కు తరలిపోయాయి. సామర్లకోటలో 56 దేశాలకు టైల్స్ ఎగుమతి చేసే రాక్ సిరామిక్స్‌ను చౌకధరలకు టైల్స్ తమకే ఇవ్వాలంటూ సిఎం పేషీ ద్వారా బెదిరింపులకు దిగారు. కొరియాకు చెందిన లాజిస్టిక్స్ కంపెనీ స్టాక్ పాయింట్ కోసం రాజధాని అమరావతిలో స్థలం కేటాయింపు కోసం దరఖాస్తు చేస్తే కమీషన్ల కోసం కక్కుర్తి పడటంతో ఆ సంస్థ తెలంగాణాకు తరలిపోయింది. 2వేల మందికి బిపిఓ ఉద్యోగాలు కల్పించిన హెచ్ఎస్‌బిసి కూడా ప్రభుత్వ చర్యలతో విశాఖలో కాల్ సెంటర్‌ను మూసివేసింది. 20 వేల మంది ప్రత్యక్షంగా, మరో 20వేల మంది పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న స్టీల్ ప్లాంట్ ను అదానీకి కానీ, పోస్కో కంపెనీకి కానీ కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఆ అవకాశాన్ని చేజార్చుకొని

నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. రెండంకెల్లో ఉన్న వృద్ధిరేటు 2.58కు చేరుకుంది. 2020లో రాష్ట్రంలో కొత్తగా 1200 కంపెనీలు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ లో నమోదుకాగా.. అందులో 500 కంపెనీలు స్వచ్ఛందంగా తమ రిజిస్ట్రేషన్ ను రద్దుచేసుకున్నాయి. సుదీర్ఘ తీరప్రాంతం కలిగి, వాతావరణ పరంగా అన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించలేకపోతున్నాం. ఈ మధ్యకాలంలో కేవలం రూ.1,975 కోట్ల ఎఫ్‌డీఐలు మాత్రమే వచ్చాయి. దేశవ్యాప్తంగా వచ్చిన ఎఫ్‌డీఐల్లో రాష్ట్రానికి వచ్చింది కేవలం 0.37 శాతం మాత్రమే. దొరికిన చోటల్లా అప్పులు తీసుకువచ్చి రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారు. అప్రకటిత కరెంట్ కోతలు, శాంతిభద్రతలు, ప్రజాప్రతినిధుల కమీషన్లు, అధికారుల వేధింపులు తదితర కారణాలతో పారిశ్రామిక ప్రగతి తిరోగమనంలో ఉంది.

ప్రతి ఏడాది జనవరి మాసంలో దావోస్‌లో అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో సుమారు 130 దేశాలు, 3వేల మంది ప్రతినిధులు పాల్గొంటారు. అనేక కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకుంటారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సులో భారత్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలు ఆయా ప్రభుత్వాలు సదస్సులో ప్రకటిస్తాయి.. అంతటి ప్రాధాన్యత ఉన్న సదస్సుకు మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం లేకపోవడం విడ్డూరంగా ఉంది. వెళ్లకపోవడానికి ప్రభుత్వం చెప్పిన కారణాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. గతేడాది ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, కొందరు అధికారులు, రాష్ట్రానికి చెందిన మరికొంతమంది పారిశ్రామికవేత్తలు దావోస్ సదస్సుకు వెళ్లారు. రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. ఇక్కడి పారిశ్రామికవేత్తలే అక్కడ వరకు వెళ్లి ఒప్పందాలు చేసుకున్నారు. కానీ ఏడాది గడిచినా అవి కార్యరూపం దాల్చలేదు. ఆర్థిక మాంద్యంలో చిక్కి ప్రపంచం విలవిలలాడుతున్న సమయంలో వ్యాపార, వాణిజ్య ఒప్పందాలు జరగడం ద్వారా రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. కానీ ఇలాంటి అవకాశాలను ఈ ప్రభుత్వం చేజార్చుకుంటోంది.

ప్రభుత్వ విధానాలు సమీక్షించుకోవాలి

ప్రపంచవ్యాప్తంగా ఆర్థికాభివృద్ధి మందగమనంలో ఉంది. ఒకవైపు ఉక్రెయిన్, రష్యా యుద్ధం, మరోవైపు కరోనా మహమ్మారితో అంతర్జాతీయంగా గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో నిరుద్యోగం, పేదరికం పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితికి మన రాష్ట్రంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. దీంతో ఉద్యోగాలు, ఉపాధి లేక ఇతర రాష్ట్రాలకు వలసవెళ్లే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ప్రకటించాల్సిన అవసరం ఉంది. మెరుగైన మౌలిక వసతులపై దృష్టిపెట్టాలి. అస్తవ్యస్తంగా ఉన్న రహదారులు, విద్యుత్, నీరు లాంటి కనీస సౌకర్యాలను కల్పించాలి. పారిశ్రామికవేత్తల్లో ఉన్న భయాందోళనలు తొలగించి ప్రభుత్వం పట్ల భరోసా కలిగించాలి. రాష్ట్ర రాజధాని అంశంలో పిల్లిమొగ్గలు వేయకుండా స్పష్టత తీసుకురావాలి. రాష్ట్రంలో ఉన్న సహజ వనరులు, తీర ప్రాంతాన్ని మరింత వినియోగంలోకి తీసుకురావాలి. లోపభూయిష్టమైన ప్రభుత్వ విధానాలను సమీక్షించుకోవాలి. ఆచరణాత్మకమైన, ఆమోదయోగ్యమైన నూతన పారిశ్రామిక విధానం తీసుకురావడం ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

మన్నవ సుబ్బారావు

గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్

99497 77727

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Advertisement

Next Story

Most Viewed