కన్నడిగులదే విజయం…

by Ravi |   ( Updated:2023-05-14 01:01:09.0  )
కన్నడిగులదే విజయం…
X

దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తి రేకెత్తించిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయఢంకా మోగించింది. కర్ణాటకలో గత 38 సంవత్సరాలుగా కొనసాగుతున్న ప్రభుత్వ మార్పు సంప్రదాయాన్నే ఇప్పుడు కూడా కొనసాగించిన కన్నడిగులు తమ తీర్పులో తిరుగుండదని తెలియజేస్తూ తమకి తామే విజేతలుగా నిలిచారు. బీజేపీ ఉత్తరాది భావోద్వేగాల ప్రయోగాలకు ఇక్కడ చోటులేదని నిరూపించడంలో కన్నడిగులు విజయం సాధించారు. అయితే కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయం సాధించబోతుందని మా పీపుల్స్‌పల్స్‌ సంస్థ మొదటి నుండి చెబుతూ వచ్చింది. మా సంస్థ నిర్వహించిన మూడు పర్యాయాల సర్వేలో కన్నడిగులు బీజేపీని గద్దెదింపాలనుకుంటున్నారనే విషయం తేటతెల్లమయ్యింది. ఈ తీర్పు ప్రభావం ఈ సంవత్సరం చివరిలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలతోపాటు 2024లో జరిగే పార్లమెంట్‌ ఎన్నికలపై ఉండబోతుంది.

జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలు మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల్లో సంవత్సరాంతంలో ముఖాముఖి తలపడబోతున్నాయి. 2014లో మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక అనేక రాష్ట్రాల్లో ఓటమి పాలవుతున్న కాంగ్రెస్‌ హిమాచల్‌ వంటి చిన్న రాష్ట్రాల్లో విజయం సాధించినా కర్ణాటక వంటి పెద్ద రాష్ట్రాల్లో విజయం ఆ పార్టీకి పార్లమెంట్‌ ఎన్నికల ముందు ఎంతో బలాన్ని చేకూరుస్తుంది. దక్షిణ భారతదేశానికి ముఖద్వారం అయిన కర్ణాటకలో తిరిగి అధికారం చేపట్టి దక్షిణాదిలో బలోపేతం కావాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేసినా కాంగ్రెస్‌ తిప్పికొట్టగలిగింది. ఉత్తరాది వలే దక్షిణాదిలో కూడా హిందూత్వ అంశాలతో బలపడాలని చూస్తున్న బీజేపీ ఆశలు కర్ణాటకలో అడియాశలు అయ్యాయి. యూపీ ప్రయోగాన్ని గతంలో బెంగాలీలు తిప్పి కొట్టినట్టే నేడు కన్నడిగులు కూడా తిప్పికొట్టారు. బీజేపీ రాజకీయ ఎత్తుగడలను పసిగట్టిన కాంగ్రెస్‌ కన్నడిలను ప్రసన్నం చేసుకోవడంలో తనదైన శైలిలో విజయవంతం అయ్యింది.

ప్రజాసమస్యలపై కాంగ్రెస్‌ ఫోకస్

రాష్ట్రంలో గత 38 ఏళ్లుగా ఏ ప్రభుత్వమూ వరుసగా రెండోసారి అధికారం చేపట్టలేదు. ప్రభుత్వ వ్యతిరేకతను ఎప్పటికప్పుడు ఎండగట్టుతూ ప్రభుత్వాలను మారుస్తూ తీర్పు ఇవ్వడం కన్నడిగుల ప్రత్యేకత. ఈ ఎన్నికల్లో కూడా ప్రభుత్వ వ్యతిరేకతతో అధికారంలోకి సునాయాసంగా వస్తామనే విశ్వాసం మొదటి నుండి కాంగ్రెస్‌లో ఉన్నా, ఎక్కడా పొరపాటుకు తావివ్వకుండా లక్ష్యాన్ని చేరుకుంది. రాష్ట్రంలో కుల, మత, ప్రాంత సమీకరణాలను సమతుల్యంలో పాటిస్తూ ఎన్నికల వ్యూహాలను రచించింది. బీజేపీ లేవనెత్తే భావోద్వేగాల అంశాలకు భిన్నంగా బీజేపీ హయాంలో రాష్ట్రంలో కుంటుపడిన అభివృద్ధి, అన్ని రంగాలలో ‘40 శాతం కమీషన్‌’, రైతుల సమస్యలు, ధరల పెరుగుదలతో పేదల ఇబ్బందులు, ప్రభుత్వ ఉద్యోగుల అసంతృప్తి, శాంతి భద్రతలు మొదలగు ప్రభుత్వ వ్యతిరేక అంశాలను ప్రస్తావిస్తూ ప్రజల మధ్యకు వెళ్లింది. ప్రధానంగా దారిద్య్ర రేఖకు దిగువనున్న ప్రజల అవసరాలను గుర్తించి మేనిఫెస్టో, హామీలను ప్రకటించింది. కుటుంబ యజమానురాలికి నెలకు రెండు వేల రూపాయలు, మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణం, ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, ప్రతి కుటుంబానికి నెలకు పది కిలోల ఉచిత బియ్యం, నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి వంటి పథకాలతో పేదలు, మహిళలు, యువత కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపారు.

దెబ్బతీసిన గ్యాస్ సిలిండర్

దీనికి తోడు డబుల్‌ ఇంజిన్‌ అని ప్రచారం చేసుకునే బీజేపీ హయాంలో భారీగా గ్యాస్‌ సిలిండర్ల ధరలు పెరగడంతో మధ్య తరగతి వర్గానికి బీజేపీపై ఉన్న ఆగ్రహాన్ని కాంగ్రెస్‌ సానుకూలంగా మల్చుకుంది. ఎన్నికల ముందు రోజు పీసీసీ చీఫ్‌ డి.కె.శివకుమార్‌ గ్యాస్‌ సిలిండర్‌కు పూజ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో పెద్దఎత్తున వైరల్‌ కావడాన్ని చూస్తే ఈ అంశాన్ని కాంగ్రెస్‌ ఎంత పకడ్బందీగా ప్రజల వద్దకు తీసుకెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. బీజేపీ ప్రభుత్వంలో పంటలకు మద్దతు ధరలు లభించకపోవడం, పంట నష్టానికి పరిహారం సకాలంలో అందకపోవడం, చివరికి పంట బీమా చెల్లింపులో కూడా అవినీతి అంశాలపై రాష్ట్రంలో పలుమార్లు నిరసనలు చేపట్టిన కాంగ్రెస్‌ రైతన్నకు చేరువయ్యింది. పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉండడాన్ని పసిగట్టిన కాంగ్రెస్‌ ఈ అంశాలను సానుకూలంగా మల్చుకోవడంలో విజయవంతం అయ్యింది. కాంగ్రెస్‌ ఎన్నికల్లో ఏ అంశాన్ని కూడా జారవిడుచుకోలేదు. పాడిపరిశ్రమ రంగంలో బీజేపీ ‘అమూల్‌’ పరిశ్రమను ప్రోత్సాహిస్తూ రాష్ట్రానికి చెందిన ‘నందిని’ పరిశ్రమను నిర్లక్ష్యం చేస్తుందని ప్రచారం చేసి లబ్దిపొందింది. అంతేకాక పెరుగుకు సంబంధించి ‘దహి’ ‘మొసరు’ పేర్ల విషయంలో కూడా కాంగ్రెస్‌ ‘కన్నడ ఆత్మగౌరవం’ నినాదాన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్లింది.

పారని బీజేపీ పాచికలు

ఉత్తరాదిన ప్రధానంగా ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రంలో ప్రజల భావోద్వేగాలతో అందలం ఎక్కుతున్న బీజేపీ పాచికలు ఇతర రాష్ట్రాల్లో పారడంలేదు. గతంలో పశ్చిమబెంగాల్‌లో బీజేపీని మమతా బెనర్జీ సమర్థంగా ఎదుర్కొనగా, ఇప్పుడు కన్నడిగులు కూడా తిప్పికొట్టారని చెప్పొచ్చు. ఎన్నికలకు ముందే ఈద్గా, హిజాబ్‌ వంటి సున్నితమైన అంశాలను హిందూ సంస్థలు రెచ్చగొట్టడం, ప్రతి ఏటా టిప్పుసుల్తాన్‌ జయంతిని వివాదాస్పదం చేయడంతో పాటు ఎన్నికల ప్రచారంలో స్వయాన ప్రధాని నరేంద్ర మోడీ మొదలుకొని కిందస్థాయి కార్యకర్త వరకు ‘జై బజరంగ్‌ బలీ’ నినాదాన్ని లేవనెత్తారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పేర్కొన్న పీఎఫ్‌ఐతోపాటు బజరంగ్‌దళ్‌ నిషేధం అంశాన్ని బీజేపీ, హిందూ సంస్థలు కర్ణాటక మొదలుకొని దేశవ్యాప్తంగా వ్యాపించడానికి ప్రయత్నించగా, ప్రమాదాన్ని ముందే పసిగట్టిన కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు వీరప్పమొయిలీ వంటి వారు ఈ అంశంపై వివరణ ఇచ్చి నష్టనివారణకు చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర నాయకత్వంపై ఆశలు సన్నగిల్లడంతో బీజేపీ మోడీపైనే అన్ని ఆశలు పెట్టుకుంది. బొమ్మై ఒక బలహీన ముఖ్యమంత్రి అని గుర్తించిన బీజేపీ లింగాయత్‌లో బలమైన నేత యడియూరప్పకు ప్రాధాన్యత ఇచ్చినా పరిస్థితి చేయిదాటి పోయింది. దీంతో మోడీ స్వయానా చివరి రెండు రోజుల ప్రచారంలో భాగంగా భారీ రోడ్‌షోలు చేపట్టడంతో దీనికి భిన్నంగా కాంగ్రెస్‌ స్థానిక ప్రజా సమస్యలపై గల్లీలలో సమావేశాలను నిర్వహిస్తూ ప్రజలకు చేరవయ్యింది. బీజేపీ జాతీయ అంశాలతో ప్రచారం చేపడితే కాంగ్రెస్‌ స్థానిక సమస్యలతో ప్రచారం నిర్వహించి విజయవంతం అయ్యింది. బీజేపీ యాభైకుపైగా సిట్టింగ్‌ స్థానాలలో అభ్యర్థులను మార్చడంతో దీన్ని అవకాశంగా తీసుకున్న కాంగ్రెస్‌ బీజేపీ రెబల్స్‌ను చేరదీసి లాభపడింది.

ఖర్గే ప్రభావం ఫలించింది...

రాష్ట్రంలో బలమైన లింగాయత్‌లు ఏకపక్షంగా బీజేపీ పంచన చేరకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. లింగాయత్‌లలో ప్రాబల్యం ఉన్న యడియూరప్పను బీజేపీ ఎప్పుడూ పూర్థిస్థాయిలో ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహించకుండా చేసిందని, బీజేపీ అనేకమార్లు యడియూరప్పకు అన్యాయం చేసిందని ప్రచారం చేసి లింగాయత్‌ ఓట్లలో చీలిక తేవడంలో విజయవంతమై వారి ఓట్లు గంపగుత్తగా బీజేపీకి పడకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. జేడీ(ఎస్‌)కు నిత్యం వెన్నుదన్నుగా ఉండే వొక్కలింగలు బీజేపీకి ప్రత్యామ్నాయంగా కుమారస్వామి కంటే కాంగ్రెస్‌ పార్టీయే సరైనదని విశ్వాసం కలిగించడంలో కాంగ్రెస్‌ పార్టీ సఫలమైంది. దీంతో మైసూర్‌ రీజియన్‌లో కూడా కాంగ్రెస్‌ ఆధిపత్యం సాధించింది. ఎన్నికల ప్రచారంలో కూడా బీజేపీలో స్థానిక నాయకుల కంటే జాతీయ నాయకుల హడావుడి ఎక్కువగా కనిపించింది. దీనికి భిన్నంగా కాంగ్రెస్‌ ప్రచారం నడిచింది. గాంధీ కుటుంబంతో సహా కాంగ్రెస్‌ జాతీయ నేతలు కూడా ప్రచారంలో పాల్గొన్నా రాష్ట్ర నాయకత్వానికి ప్రధాన బాధ్యతలు అప్పగించారు. దీనికి తోడు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే సొంత రాష్ట్రం కావడంతో ఆయన కర్ణాటక ఎన్నికలను సవాలుగా తీసుకొని ప్రత్యేక దృష్టి పెట్టారు. దీని ఫలితంగా ఆయన సొంత ప్రాంతం అయిన హైదరాబాద్‌ కర్ణాటక రీజియన్‌లో కాంగ్రెస్‌ భారీ ఆధిపత్యం సాధించింది. అంతేకాక ఆయన సామాజిక వర్గం అయిన ఎస్సీలు కాంగ్రెస్‌కు అనుకూలంగా మారారు.

సమిష్టిగా నాయకత్వం

ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లోని వర్గపోరుతో మళ్లీ అధికారం ఖాయం అనే ఊహల్లో ఉన్న బీజేపీని కాంగ్రెస్‌ ఖంగుతినిపించింది. బీజేపీలో యడియూరప్ప, బొమ్మై వర్గాలతో పాటు పార్టీ అధిష్టానం ప్రయోగంతో టికెట్ల కేటాయింపులు బీజేపీని గందరగోళంలో పడేశాయి. దీంతో పలు నియోజకవర్గాల్లో బీజేపీ రెబల్స్‌తో ఇబ్బందులు ఎదుర్కొంది. దీనికి భిన్నంగా మొదటి నుండి కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలపై అనేక ప్రచారాలున్నా ఎన్నికల సమయంనాటికి అగ్రనేతలైన సిద్దరామయ్య, డి.కె.శివకుమార్‌ ఒక్కటై సమిష్టిగా ప్రచార బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయాన్ని పక్కనపెట్టి విజయమే లక్ష్యంగా ముందుకు సాగడంతో పార్టీ శ్రేణులకు సానుకూలమైన సంకేతాలు అందాయి. బీజేపీతో వారి అనుకూల మీడియా, ఇతర ప్రత్యర్థులు వీరి మధ్య విభేదాల సృష్టికి ఎంత ప్రయత్నించినా ఈ ఇద్దరు నేతలు వాటిని పట్టించుకోకుండా పార్టీని విజయతీరానికి చేర్చారు.

బీజేపీ అధికారంలోకి వస్తే ప్రస్తుత సీఎం బొమ్మై మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తారా అంటే అది సందేహంగానే ఉండేది. అదే కాంగ్రెస్‌ పార్టీలో చూస్తే సిద్ధరామయ్య రాష్ట్ర ప్రజలకు ఒక ఆశాజనకంగా కనిపించారు. అందుకే ఎన్నికల ముందు పీపుల్‌పల్స్‌ సహా పలు సంస్థలు నిర్వహించిన సర్వేల్లో సిద్దరామయ్యకు 40 శాతానికి పైగా మద్దతు లభించింది. కాంగ్రెస్‌ పార్టీ విజయంలో సిద్ధరామయ్య పాత్ర ఎంతో కీలకం. ఇవే నాకు చివరి ఎన్నికలని ఆయన ఇచ్చిన పిలుపు పట్ల కూడా ప్రజలు సానుకూలంగా స్పందించి కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటు వేశారు. మరోవైపు రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రధానంగా మతపరమైన అంశాలు సమస్యాత్మకంగా ఏర్పడుతుండడంతో పలు సామాజిక సంఘాలు, మేధావులు బీజేపీకి వ్యతిరేకంగా ‘వేకప్‌ కర్ణాటక’ అని పిలుపునివ్వడంతో అది కూడా పరోక్షంగా కాంగ్రెస్‌కు మేలు చేసింది.

2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఆధిపత్యానికి సంకెళ్లు వేయాలని చూస్తున్న కాంగ్రెస్‌కు కన్నడిగులు అందించిన ఈ విజయం ఒక సదవకాశం. కేంద్రంలో బీజేపీని ఎదుర్కోవాలంటే సమిష్టి కృషి అవసరమని అన్ని పార్టీలు చెబుతున్నా ఆ కూటమికి నేతృత్వం వహించే విషయంలో భేదాభిప్రాయాలున్నాయి. కూటమిలో కాంగ్రెస్‌ నాయకత్వాన్ని అంగీకరించడానికి ప్రాంతీయ పార్టీలు సిద్దంగా లేవు. ఇప్పుడు కర్ణాటకలో విజయంతో బీజేపీకి ప్రత్యామ్నాయంగా మరో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ పార్టీ పెద్దన్న పాత్ర పోషించడానికి ఎదురవుతున్న అడ్డంకులు తొలుగుతాయి. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీని కట్టడిచేయాలంటే కాంగ్రెస్‌ భాగస్వామ్యం తప్పనిసరని కర్ణాటక విజయంతో ఆ పార్టీ ఇతర పార్టీలకు బలమైన సందేశాన్ని పంపగలిగింది.

- ఐ.వి.మురళీ కృష్ణ శర్మ

రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌సంస్థ,

9949372280

Advertisement

Next Story

Most Viewed