- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
రియల్ రిపోర్ట్: ఏపీలో ఏముందని బీజేపీ ఎగుర్లాట?
ఓట్ల రాజకీయాల పరంగా ఆలోచిస్తే బీజేపీ గురించి ఏపీలో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. బీజేపీ ఖచ్చితంగా గెలిచే, కనీసం గట్టిగా పోటీ ఇచ్చే స్థానం (లోక్‌సభ, అసెంబ్లీ) ఇదీ అని చెప్పదగ్గది రాష్ట్రంలోనే లేదు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్‌సభ సీట్లకు అభ్యర్థులను ప్రతిపాదించలేని స్థితి వారిది! దీన్ని మెరుగుపరచుకోవడంపైనే నాయకత్వం దృష్టి పెట్టడం మంచిదని పార్టీ పట్ల ఎంతో కొంత సానుభూతి ఉన్నవారి మాట. 'సొంతంగా ఎదిగే క్రమంలో ఉన్నాం, కనుక ఇప్పుడు పరిస్థితి ఇలాగే ఉంటుంది' అనే వాదనను పార్టీ రాష్ట్ర నాయకత్వం ముందుకు తోయవచ్చు! పొత్తుల గురించి, అందులో వాటాల గురించి, ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటు వంటివి తెరపైకి వచ్చినపుడు ఇవన్నీ చర్చనీయాంశాలే అవుతాయి. ఎన్నికల రాజకీయాల వరకు, ఏపీలో బీజేపీది దయనీయమైన పరిస్థితే! పొత్తులతో వెళ్లినపుడే ఒకటీ, అరా సీట్లు, కాస్తో, కూస్తో ఓట్ల శాతాలు తప్ప సొంతంగా ఒంటరి పోరాటాలు చేసినపుడల్లా వారి రికార్డు దిగదుడుపే!
చివరకు పాకిస్తాన్‌లో అయినా జెండా ఎగరేస్తుందేమో కానీ, బీజేపీ ఎప్పటికీ ఏపీలో గెలవదు' అని ఏ బలమైన సైద్ధాంతిక పునాదితో అన్నాడో తెలియదు గానీ, బీజేపీ సీనియర్ నాయకుడు, సిద్ధాంతకర్తే స్వయంగా కొన్నేళ్ల కింద ఈ మాటలన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నేను, మరో సీనియర్ జర్నలిస్టు ఆయనతో పిచ్చాపాటి మాట్లాడుతున్నప్పుడు, ఉన్నట్టుండి, 'ఏపీ సంగతి వదిలేయండి, నే చెబుతున్నానుగా నా మాటగా మీరు రాసుకోండి' అంటూ పై మాట సెలవిచ్చారాయన. పేరెందుకు గానీ, ఆయన ఇప్పుడో పెద్ద పదవిలో ఉన్నారు. మరి ఈ విషయం ఏపీలో ప్రస్తుత బీజేపీ నాయకులకు తెలియదనుకోవాలా? తెలిసీ ఆత్మ`పర వంచన చేస్తున్నారనుకోవాలా? లేక, ఏమీ లేకపోయినా, ఏనాటికైనా గెలుపు వరించకపోతుందా? అన్న ఓ గుడ్డి ఆశతో పలికే ఇలాంటి మాటలు రాజకీయాలలో మామూలే అని సరిపెట్టుకొని, వినీ విననట్టుండాలా? బీజేపీకి ఏపీలో ఇప్పుడు ఏమీ లేదన్నది చిన్న పిల్లాడికైనా తెలిసే నిజం. కానీ, 'ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందన్నట్టు' రాష్ట్రంలో బీజేపీ నాయకులు చేసే సందడి, ఇచ్చే ప్రకటనలు విస్మయం కలిగిస్తాయి. 'ఏ అస్సాంలోనో, త్రిపురలోనో సాధ్యమైంది, ఇక్కడెందుకు సాధ్యం కాదు. మీరు గట్టిగా ప్రయత్నించండి, మనం సొంతంగానే ఎదుగుదాం, ఎవరితోనూ పొత్తులు వద్దు' అనే లైన్ తీసుకొని బీజేపీ కేంద్ర నాయకత్వం పార్టీ రాష్ట్ర శ్రేణులను నడపిస్తోంది.
ఇది నచ్చినా, నచ్చకపోయినా, తప్పని పరిస్థితులలో రాష్ట్ర బీజేపీ నాయకులూ ఇదే పంథా అనుసరిస్తున్నారు. ఏపీలో ఇప్పుడు పొత్తు రాజకీయాల ప్రస్తావన రాగానే, బీజేపీకి తెలుగుదేశం పార్టీకి నడుమ నలిగేది 'పవన్‌కల్యాణ్' అంటే, జనసేన. బీజేపీ-జనసేన కలిసి ఎన్నికలు ఎదుర్కొంటాయనేది ఒక వాదనయితే, టీడీపీ-జనసేన కలిసి పొత్తులతో పాలకపక్షాన్ని ఎదుర్కొంటాయని మరో వాదన. కాదు, ఈ మూడూ కలిసి పోటీ చేసే ఓ ప్రయత్నం జరుగుతోందన్న ప్రచారమూ ఉంది. దీనికోసం ప్రత్యేకంగా 'దింపుడు కళ్లం' ఆశ'తో ప్రత్యేకంగా కొందరున్నారు. 'టీడీపీతో చేతులు కలిపే ప్రసక్తే లేదు, అయితే గియితే జనసేనతో కలిసి ఎన్నికలకు వెళదాం, అందుకు వారినీ సిద్ధం కమ్మనండి, మనం మాత్రం రాష్ట్రంలో సొంతంగానే ఎదుగుదాం' అనే పంథానే కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకులకు స్పష్టం చేసిందని ప్రచారం. విశాఖపట్నం ఇటీవలి పర్యటనలో ప్రధాని మోదీ కూడా ఇలాంటి సంకేతాలే ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఏది ఎంతవరకు నిజమో కాలం నిర్ణయిస్తుంది. ఈ లోపున బీజేపీ గ్రహించాల్సింది ఏపీలో తన బలమెంత? బలపడటమెలా? అందుకోసం ఏం చేయాలి? అసలింతకు, ఏం చేస్తున్నాం? వాస్తవాలు తెలుసుకొని నడుచుకుంటే పార్టీ నిజంగానే ఎంతో కొంత ఎదగడానికి వీలుంటుంది.
కోవర్టులతో జాగ్రత్త
ప్రజాక్షేత్రంలో పార్టీ ఎంత బలంగా ఉంది, బలహీనంగా ఉంది అన్నదానితో నిమిత్తం లేకుండా వాలిపోయి, వాడేసుకునే రాబందులు కోవర్టులు. ఏపీ బీజేపీలో వారి సంఖ్య బాగానే ఉంది. తిన్నింటి వాసాలు లెక్కించే సదరు నాయకులు, ఇంకే పార్టీ ప్రయోజనాల కోసమో ఇక్కడ మకాం పెట్టి పని చేస్తుంటారు. 'గోతికాడ నక్కల్లా' వారొక అవకాశం కోసం చూస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఎంచక్కా ఎమ్మెల్యే, ఎంపీ వంటి పదవులు (బరిలో నిలిచో, నామినేటెడ్‌గానో) కొట్టేయొచ్చన్నది వారి ఆశ. పొత్తులకున్న అవకాశం, ఓటు బదిలీ ఆస్కారం, దానికి లభించే జనామోదం, ఇట్లాంటివేవీ వారికి పట్టవు. అప్పటి వరకు ఇక్కడే, బీజేపీనే తమ షెల్టర్ జోన్‌గా వాడేసి, ఆఖరు నిమిషంలో పొత్తు కుదరక, పొసగకపోతే, వారే టీడీపీ నుంచి బరిలోకి దిగినా ఆశ్చర్యం లేదు. ఇందులో కొందరు గతంలో టీడీపీ పేరోల్స్‌లో ఉన్నవారైతే, ఇప్పుడు కొందరు వైసీపీ పేరోల్స్‌లో ఉన్నారు. కొందరైతే నాడు, నేడు రెండు పేరొల్స్‌లోనూ 'పేరున్నవారే!' మరోవైపు సుదీర్ఘకాలంగా బీజేపీని అంటిపెట్టుకొని, ఏదో రోజున తనంత తాను కమలం వికసించకపోతుందా? అని ఆశించే నికార్సయిన పార్టీ కార్యకర్తలు మాత్రం టీడీపీతో పొత్తుకు ససేమిరా అంటున్నారు. చూడాలి ఎవరి మాట చెల్లుబాటవుతుందో!
బీజేపీ చరిత్రను చూస్తే... ఢిల్లీ చెప్పినట్టు వినాల్సిందే! 1999 ఉమ్మడి రాష్ట్రంలో, 2014 అవశేష ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీతో పొత్తు ఒద్దని రాష్ట్ర నాయకత్వం తీర్మానాలు చేసింది. కానీ, 'టీడీపీతో వెళ్లాల్సిందే' అని కేంద్ర నాయకత్వం చెప్పాక కిక్కురుమనకుండా పొత్తులతోనే వెళ్లింది. అలా వెళ్లిన ఆ రెండు మార్లూ అది ఫలించిన చరిత్ర, కాదనలేని సత్యం! పొత్తు ఇష్టంలేని ఆనాటి రాష్ట్ర అధ్యక్షుడు భేటీని బహిష్కరించి, పొత్తుల సమావేశానికి వెళ్లకపోయినా, పొత్తు, ఫలితం ఏదీ ఆగలేదు. 2004లో తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు నాటి సీఎల్పీనేత డా.వైఎస్.రాజశేఖరరెడ్డికి ఇష్టం లేకుండే. అయినా, ఢిల్లీ నాయకత్వం నిర్ణయాన్ని అంగీకరించి స్వాగతించడం, అది సానుకూలంగా ఫలించడం కూడా ఇట్లాంటిదే! అటు ఢిల్లీ నాయకత్వం దిశా నిర్దేశం కోసం చూస్తూనే, దాన్ని కోవర్టులు ప్రభావితం చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు రాష్ట్ర బీజేపీ నాయకత్వంపైనే ఉంది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ తరచూ ఒక జోక్ చెబుతుంటారు. ఇక్కడి పాలక, విపక్ష పార్టీలన్నీ ఏదో రకంగా బీజేపీకి లోబడినవే అనే ఉద్దేశ్యంతో 'దేశంలో ఎక్కడా లేనంత బలంగా బీజేపీ ఏపీలో ఉంది.' అని. 'అది నిజమనుకుంటున్నారేమో మావాళ్లు, జోక్ అని గ్రహించి. పార్టీ సంస్థాగత ఎదుగుదలకు కృషి చేయాల'ని పార్టీ సాధారణ కార్యకర్త ఒకరు వ్యాఖ్యానించారు.
Also read: ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు రాదు
పొత్తు ఫలించే యోగముందా?
సమకాలీన రాజకీయాలలో పొత్తులు కుదరడానికైనా, ఫలితాలివ్వడానికైనా ఓ శాస్త్రీయ భూమిక, హేతుబద్ధత అవసరం. పైగా ఒక క్యాడర్ పార్టీ మరో పాపులర్ పార్టీతో కలిస్తే ఎంతో కొంత ఉపయోగం. కానీ, ఒకే రకం పార్టీల పొత్తు కలయిక ఫలించదు. బీజేపీ-జనసేన విషయంలోనూ ఇదే ఇబ్బంది! ఇద్దరికీ, పటిష్టమైన సంస్థాగత నిర్మాణం గానీ, క్షేత్రంలో కార్యకర్తల దన్ను గానీ లేవు. రెండూ పాపులర్ పార్టీలే! 2019 ఎన్నికల తర్వాత ఏపీలో జరిగిన మూడు ఉప ఎన్నికల ఫలితాలు వీరి పరిస్థితికి అద్దం పట్టాయి. తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో జనసేన మద్దతుతో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి రత్నప్రభకు మూడో స్థానం దక్కింది. 5.11 శాతంతో 57 వేల ఓట్లు వచ్చాయి తప్ప డిపాజిట్ దక్కలేదు. టీడీపీ పోటీ చేయని బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలో పోలైన ఓట్లలో 14 శాతంతో 21 వేల ఓట్లు దక్కాయి తప్ప బీజేపీకి ఇక్కడా డిపాజిట్ గల్లంతైంది! సరిగ్గా 14 శాతమే ఓట్లు వచ్చిన ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితం కూడా దాదాపు ఇంతే! ఈ మూడు చోట్లా బీజేపీకి మద్దతున్నప్పటికీ, పవన్‌కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి రాలేదు. తెలుగుదేశంతో పొత్తులోనూ, ఎంతో కొంత వారికి ఉపయోగపడ్డారు తప్ప బీజేపీ తనకు తానుగా బావుకున్నదేమీ లేదు.
2014లో టీడీపీతో పొత్తు పెట్టుకొని రెండు లోక్‌సభ (విశాఖపట్నం, నర్సాపురం), నాలుగు అసెంబ్లీ (విశాఖ నార్త్, రాజమండ్రి అర్బన్, తాడేపల్లిగూడెం, కైకలూరు) స్థానాలలో మాత్రమే బీజేపీ గెలిచింది. స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికలలోనూ పరిస్థితి ఏమీ భిన్నంగా లేదు. సంస్థాగతంగా పార్టీ బలపడింది, ప్రజా సమస్యల పరంగా కార్యక్రమాలు చేపట్టిందీ ఎక్కడా లేదు. వేర్వేరు సర్వేలలో భాగంగా ఉత్తరాన ఇచ్చాపురం నుంచి దక్షిణాన కుప్పం వరకు క్షేత్రంలో 'పీపుల్స్‌పల్స్' సంస్థ ప్రతినిధులు తిరుగుతున్నపుడు, ఏ సందర్భంలో కూడా బీజేపీ గురించి పౌరుల నోట ఒక్క మాటా రాదు. అదీ, ఆ పార్టీకున్న రీకాల్ వ్యాల్యూ! రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం జనాదరణ కోల్పోయి సహజంగా గతిస్తే, 'ఆ ఖాళీని పూరించేది ఇక తామే' అని బీజేపీ భావిస్తే, అంతకన్నా పగటికల మరోటి ఉండదు. అసాధారణంగా పెరిగిన, పెరుగుతూ ఉన్న నిత్యావసరాల ధరల విషయమై ఏపీ ప్రజలు గొంతువరకు కోపంతో ఉన్నారు. రాష్ట్రంపైనే కాకుండా ఆ కోపం వాటా కేంద్ర ప్రభుత్వంపైనా ఉంది. విభజన హామీలు నెరవేర్చకపోవడంతో పాటు పోలవరం, రైల్వేజోన్, స్పెషల్ ప్యాకేజీ, పలు సంస్థల ఏర్పాటు తదితర విషయాల్లో కేంద్రం ఏపీని మోసపుచ్చిందనే భావన ప్రజల్లో బలంగా ఉంది. ఎనిమిదేళ్ల పాలన వల్ల పోగైన (కేంద్ర) ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీకి ప్రతికూలంగా పనిచేసేదే!
Also read: మరోకోణం: బీజేపీకి ప్రత్యామ్నాయమేది?
నోటాతోనేనా పోటీ?
ఓట్ల రాజకీయాల పరంగా ఆలోచిస్తే బీజేపీ గురించి ఏపీలో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. బీజేపీ ఖచ్చితంగా గెలిచే, కనీసం గట్టిగా పోటీ ఇచ్చే స్థానం (లోక్‌సభ, అసెంబ్లీ) ఇదీ అని చెప్పదగ్గది రాష్ట్రంలోనే లేదు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్‌సభ సీట్లకు అభ్యర్థులను ప్రతిపాదించలేని స్థితి వారిది! దీన్ని మెరుగుపరచుకోవడంపైనే నాయకత్వం దృష్టి పెట్టడం మంచిదని పార్టీ పట్ల ఎంతో కొంత సానుభూతి ఉన్న వారి మాట. 'సొంతంగా ఎదిగే క్రమంలో ఉన్నాం, కనుక ఇప్పుడు పరిస్థితి ఇలాగే ఉంటుంది' అనే వాదనను పార్టీ రాష్ట్ర నాయకత్వం ముందుకు తోయవచ్చు! పొత్తుల గురించి, అందులో వాటాల గురించి, ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటు వంటివి తెరపైకి వచ్చినపుడు ఇవన్నీ చర్చనీయాంశాలే అవుతాయి.
ఎన్నికల రాజకీయాల వరకు, ఏపీలో బీజేపీది దయనీయమైన పరిస్థితే! పొత్తులతో వెళ్లినపుడే ఒకటీ, అరా సీట్లు, కాస్తో, కూస్తో ఓట్ల శాతాలు తప్ప సొంతంగా ఒంటరి పోరాటాలు చేసినపుడల్లా వారి రికార్డు దిగదుడుపే! తాజాగా 2019 ఎన్నికలలో బీజేపీకి లభించింది 0.90 శాతం ఓట్లయితే, 'పై అభ్యర్థులెవరికీ కాదు' (నోటా) అంటూ ఓటేసిన వారు 1.50 శాతం ఉన్నారు! అయిదుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి, పదేళ్లు మంత్రిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ (రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగానూ చేశారు) నర్సారావుపేట లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తే 17 వేల ఓట్లు వచ్చాయి. అంతకు ముందరి ఎన్నికలలో ఆయనకు దాదాపు అన్నే ఓట్లు ఒక అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తేనే వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన మద్దతుండీ, 553 జడ్పీటీసీలలో ఒక్కటీ దక్కలేదు. 8063 ఎంపీటీసీలకు గాను, మేజర్ పార్ట్‌నర్‌గా 23 చోట్ల బీజేపీ అభ్యర్థులు గెలిచారు. మైనర్ పార్ట్‌నర్ అయిన జనసేన అభ్యర్థులు 85 చోట్ల నెగ్గారు. ఇక అర్బన్‌లో 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలుండగా 9 చోట్ల కార్పొరేటర్లు, 32 చోట్ల వార్డు సభ్యులు బీజేపీ తరఫున గెలిచారు.
కొసమెరుపు
పునాదులు లేని పేకమేడలు ఎంత ఎత్తు కట్టినా కూలడం ఖాయం. పునాదులు బలోపేతం చేసుకోవడమే రాజకీయ లక్ష్యమైతే ఏపీలో బీజేపీ కాస్త వాస్తవికంగా ఆలోచించడం, అందుకు తగ్గట్టు నడుచుకోవడం తక్షణావసరం!
దిలీప్‌రెడ్డి
పొలిటికల్ అనలిస్ట్
పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ
99490 99802