మీడియా మ్యాపులు, పటాలు మరచిపోయిందా?

by Ravi |   ( Updated:2023-04-29 00:16:16.0  )
మీడియా మ్యాపులు, పటాలు మరచిపోయిందా?
X

ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి- 'ఆంధ్రపత్రిక' వీక్లీలో ఊమన్, 'టైమ్స్ ఆఫ్ ఇండియా'లో ఆర్.కె.లక్ష్మణ్, 'ఆంధ్రజ్యోతి'లో ఇ.వి. రమణ కార్టూన్లు ..! అలా పరికించి చూస్తే పొలిటికల్ కార్టూను కనుమూసిందా లేదా మార్చరికి సిద్ధం కాబోతుందా అనిపిస్తోంది! ఒక్క తెలుగు భాషే కాదు, ఇంగ్లీషులో కూడా తొలి పేజీలో పొలిటికల్ కార్టూన్లు, పాకెట్ కార్టూన్ల అదృశ్యమై ఎంతో కాలమైంది. అంతే కాదు, ఎడిట్ పేజిలో కనబడే 'మిడిల్స్' హాస్య, వ్యంగ్య రచనలు తెలుగులో ఎప్పుడో చెట్టెక్కిపోగా ఇంగ్లీషులో మాత్రం కొన్ని పత్రికల్లో అడపాదడపా కనబడుతున్నాయి.

ఇటివలి దశాబ్దాలలో మీడియా పైకి కనబడకుండా అంతర్గతంగా ఏదో ఒక స్టాండ్ తీసుకుని నడిచిపోతోంది. రాజకీయాలు, పెద్ద పెద్ద పెట్టుబడులు జర్నలిజాన్ని పూర్తిగా ఆక్రమించేయడం వల్ల మొదట పాడెనెక్కింది హాస్యం, వ్యంగ్యం! 'టైమ్స్ ఆఫ్ ఇండియా'లో థర్డ్ ఎడిటోరియల్ అని ప్రత్యేకంగా ఎన్నో ఏళ్ళు సాగింది. విభిన్నమైన అంశంతో, పరిపుష్టమైన శైలితో కొన్ని దశాబ్దాలుగా ఎంతో కాలం అధ్యయనాంశంగా ఉండేది. నండూరి రామ్మోహనరావు 'ఆంధ్రజ్యోతి' దినపత్రికలో ఇలా రాసిన రెండవ సంపాదకీయాలను 'అనుపల్లవి' పేరుతో సంకలనం చేసి ప్రచురించారు. మొదటి సంపాదకీయం పల్లవి అయితే, హాస్యస్ఫోరకంగా వుండే రెండవ సంపాదకీయం అనుపల్లవి అని ఆయన ఆ పుస్తకంలోనే వివరించారు.

తెలుగు పత్రికల్లో, టెలివిజన్ ఛానళ్లలో ఇలా అదృశ్యమైన మరో ముఖ్యమైన విషయం -- పటం లేదా మ్యాప్! నదులు, రోడ్లు, రైల్వే లైన్లు, రాష్ట్రాల మధ్య లేదా జిల్లాల మధ్య విషయాలు అలాగే ప్రపంచ దేశాల మధ్య విశేషాలు ఉన్నప్పుడు సులువుగా బాధపడడానికి సంబంధించిన పటాలను, మ్యాపులను ఇచ్చేవారు. వార్తా శీర్షిక చూసి కొంత విషయం గ్రహించి, పటాన్ని పరిశీలించి వార్తను చదివితే చాలా సులువుగా బోధపడుతుంది. ఇటీవల కాలంలో ఒక తెలుగులోనే కాదు, ఇంగ్లీషులో కూడా ఈ ధోరణి వుంది. 'ది హిందూ' పత్రికలో 30, 40 ఏళ్ళ క్రితం మొదటి పేజీలో మ్యాపులు, గ్రాఫులు తరచు కనబడేవి. నిజానికి అలా మ్యాపు వెయ్యడంలో కొలతల తప్పులు లేకుండా చూడడం ఇదివరకయితే చాలా కష్టంతో కూడిన పని. ఇప్పుడు కంప్యూటర్ రావడంతో పొరపాట్లు చేయడం చాలా సులువు. కానీ, మూకుమ్మడిగా దేశవ్యాప్తంగా పత్రికలు, తద్వారా న్యూస్ టెలివిజన్ ఛానళ్ళు ఈ పోకడను అటకెక్కించాయి! దాంతో పాఠకులు, వీక్షకులు కూడా అలవాటు తప్పి మర్చిపోయే పరిస్థితి ఏర్పడింది. అయితే ఓలా,ఊబర్ టాక్సీలు బుక్ చేసినప్పుడు, ముఖ్యంగా వాటికి వేచి చూస్తున్నప్పుట్టుడు ఈ మ్యాప్ ప్రాధాన్యత ఏమిటో తెలుస్తుంది.

ఏప్రిల్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ వచ్చినప్పుడు వందేభారత్ తోపాటు మరో రెండు ఎమ్.ఎమ్.టి.ఎస్. రైల్వే సర్వీస్ లకు కూడా ప్రారంభోత్సవం చేశారు. ఫలితంగా అదనంగా 41 కిలోమీటర్ల మేర అంటే సికింద్రాబాద్ – మేడ్చల్, ఫలక్ నామా – ఉందానగర్ ఎమ్. ఎమ్.టి.ఎస్ సేవలు కొత్తగా మొదలయ్యాయి. అలాంటప్పుడు ఏఏ ప్రాంతాలు ఈ ఎమ్.ఎమ్.టి.ఎస్ సేవలు పొందుతాయి అదనంగా వచ్చే రైల్వే స్టేషన్లు ఏమిటి అని పది వాక్యాల్లో రాసే విషయాన్ని ఒక చిన్న మ్యాపుతో చెప్పొచ్చు. తెలుగు పత్రికలు ఇలాంటి ప్రయత్నం చెయ్యవచ్చనే, దానిని పాఠకుల సౌలభ్యం కోసం చేయాలని మరచిపోయినట్టున్నాయి. ఇటీవల నాగోలు దగ్గర బ్రిడ్జి వచ్చిందని వార్త ఇస్తూ ఆ రోడ్డు రంగుల ఫొటోను ప్రచురించారు. ఈ ఫోటో ఆకర్షణీయంగా ఉన్నా ప్రయోజనం పెద్దగా కనబడదు. దానికి బదులు మ్యాప్ ద్వారా చెప్పడం సులువు. అర్థం చేసుకోవడం తోపాటు గుర్తు పెట్టుకోవడం కూడా చాలా సులువు.

ప్రధాని శంకుస్థాపన చేసిన ఇతర రైల్వే లైన్ల సమాచారంతోపాటు పత్రికల్లో పూర్తి పేజీ ప్రకటనలు వచ్చాయి. కల్వకుర్తి - కొల్హాపూరు సెక్షన్ (NH-167K) లో టు-లేన్ ను వెడల్పు చేయడం వల్ల హైదరాబాద్ నుంచి తిరుపతి నంద్యాల నుండి చెన్నై మధ్య 80 కిలోమీటర్లు తగ్గుతుందని, అలాగే ప్రయాణం సమయం కూడా తగ్గుతుందని ప్రకటించారు. అంటే ఈ దూరం నంద్యాల తిరుపతి మధ్య తగ్గుతోందని కూడా జాగ్రత్తగా పరిశీలిస్తే బోధపడుతుంది. అయితే దీనిని మ్యాప్ లో కూడా ఇచ్చి ఉండవచ్చు. అలాగే ఖమ్మం-దేవరాపల్లి సెక్షన్ (NH-365 BG) లో రాజమండ్రి – హైదరాబాద్ మధ్య 56 కిలోమీటర్లు తగ్గుతోందని ఫోర్-లేన్ యాక్సెస్ రావడంతో ఇది సాధ్యమైందని తెలుస్తోంది. ఇవన్నీ కూడా మ్యాప్ ఉంటే అర్థం చేసుకోవడం, గుర్తుపెట్టుకోవడం చాలా సులువవుతుంది.

పత్రికల్లో ఈ ధోరణి కొనసాగించడం నామోషీ అని అనుకుంటున్నారేమో తెలియదు! రంగులు, ఆర్భాటాలు లేకుండా మ్యాపులు, పటాలు ఏమిటని కొత్తతరం భావిస్తుందేమో పరిశీలించాలి. అయితే ఇక్కడ రైల్వేవారి ప్రకటనలో కూడా మ్యాప్ లు పొందుపరచి వుండవచ్చు. మ్యాపులు ఎంత ముఖ్యమైనవో రైల్వే వారికి మనం చెప్పనక్కరలేదు. కానీ, రంగుల ప్రచురణ ఉందని పత్రికలు, రంగుల్లో ప్రసారం సాధ్యమవుతోందని టెలివిజన్ న్యూస్ చానెళ్ళు సులువుగా బోధపడే ధోరణికి మంగళం పాడాయి. మీడియాలో లేని ధోరణి తమ పత్రికా ప్రకటనలలో ఎందుకని రైల్వే పి.ఆర్.వో విభాగం కూడా భావిస్తోందేమో తెలియదు. ఏ కారణంతో ఈ విధానాన్ని మనం పూర్వపక్షం చేసినా పాఠకుల అవగాహనకి మాత్రం చాలా అవసరం అన్నది కఠోర వాస్తవం. మీడియా మెడకు మ్యాపుల, పటాల గంటను కట్టేవాళ్ళెవరు

- డా నాగసూరి వేణుగోపాల్

9440732392

Advertisement

Next Story