- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరోకోణం: రాహుల్‌జీ.. పహ్‌లే కాంగ్రెస్ జోడో!
నెహ్రూ కుటుంబ వారసుడు, కాంగ్రెస్ యువనేత, ఎంపీ రాహుల్‌గాంధీ సారథ్యంలో గత బుధవారం 'భారత్ జోడో' యాత్ర ప్రారంభమైంది. కుల, మత, ప్రాంత, భాష, ఆహార, ఆహార్య విచక్షణ లేకుండా భారతావనిని ఏకం చేయడమే ఈ యాత్ర లక్ష్యం. కన్యాకుమారిలో మొదలై 12 రాష్ట్రాల గుండా 150 రోజులలో 3570 కి.మీ. ప్రయాణించి జమ్మూలో 2023 ఫిబ్రవరి 3న ముగియనుంది. ప్రతిరోజూ 25కి.మీ. చొప్పున నడవనున్నారు. భారత్ జోడో అధికారిక వెబ్‌సైట్ ప్రకారం ఈ యాత్రలో 52 సంవత్సరాల రాహుల్‌తో పాటు మొదటి నుంచి చివరి వరకూ 25 రాష్ట్రాలకు చెందిన 115 మంది కాంగ్రెస్ నేతలు, సామాజిక కార్యకర్తలు, మేధావులు, రచయితలు, కళాకారులు పాల్గొంటున్నారు.
యాత్ర చేస్తున్న వారిలో మహారాష్ట్రకు చెందిన వైష్ణవి భరద్వాజ్ (26) అతి పిన్న వయస్కురాలు కాగా, జమ్మూకు చెందిన విజయ్‌కుమార్ శాస్త్రి (56) అందరి కంటే పెద్దవారు. కాంగ్రెస్ పార్టీ నేషనల్ మీడియా సెల్ ఇన్‌చార్జి పవన్ ఖేరా, విద్యార్థి నేత కన్హయ్యకుమార్, పంజాబ్ మాజీ మంత్రి విజయ్ ఇందర్ సింగ్లా, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కుమారుడు చాందీ ఊమెన్, పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ యాత్రలో పాల్గొనే ప్రముఖులు.
తెలంగాణలో ఇలా
మన తెలంగాణ నుంచి వెళ్లిన వారిలో బెల్లయ్య నాయక్, కత్తి కార్తీక, డా. కేతూరి వెంకటేశ్, సంతోష్ కోల్కుంద, వెంకట్‌రెడ్డి, ఎన్ఎస్‌యూఐ జాతీయ కార్యదర్శి 27 సంవత్సరాల అను లేఖ బూస ఉన్నారు. ఈ యాత్ర మన రాష్ట్రంలో అక్టోబర్ 24న మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌లో ప్రవేశించి మహబూబ్‌నగర్, చేవెళ్ల, జహీరాబాద్ / మెదక్, నిజామాబాద్ లోక్‌సభ, మక్తల్, దేవరకద్ర, మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్, రాజేంద్రనగర్, పటాన్‌చెరు, సంగారెడ్డి, అందోల్, జుక్కల్, బాన్స్‌వాడ / ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గాల గుండా 366కి.మీ. సాగి నిజామాబాద్ జిల్లా మద్నూర్‌లో ముగిసి మహారాష్ట్రకు వెళ్లనుంది.
ఇందుకోసం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని పీసీసీ భారీ సన్నాహాలు చేపట్టింది. ఈ యాత్ర తెలంగాణ కన్వీనర్‌గా సీనియర్ నేత బలరాంనాయక్‌ను నియమించారు. ప్రతిరోజూ 20-30 వేల మంది ప్రజలను సమీకరించాలని, కనీసం ఒక చోట బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు.
క్రమంగా బలహీనపడి
అయితే, భారత్ జోడో కోసం నడుం బిగించిన రాహుల్ మొదట కకావికలమై ఉన్న తన సొంత పార్టీ కాంగ్రెస్ జోడో కేంపెయిన్ తీసుకుంటే బాగుండేదన్న వ్యాఖ్యలు,విమర్శలు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. కారణం, ఆ పార్టీ ప్రస్తుత పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. 75 యేళ్ల స్వతంత్ర భారతంలో 54 యేళ్లకు పైగా దేశాన్నేలిన కాంగ్రెస్ ఇప్పుడు ముక్కుతూ మూల్గుతూ 2014, 2019 సాధారణ ఎన్నికలలో వరసగా 44, 52 ఎంపీ సీట్లు మాత్రమే సాధించి లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షం హోదాను కోల్పోయింది. రాజీవ్‌గాంధీ హయాం వరకూ తమిళనాడు, కేరళ, బెంగాల్, జమ్మూ-కాశ్మీర్ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉండేవి. కాగా, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ మాత్రమే ఇప్పుడు ఆ పార్టీ చేతులలో ఉన్నాయి. గత ఎనిమిదేళ్లలో ఆ పార్టీని అనేక మంది ప్రముఖ నేతలు విడిచి వెళ్లారు.
గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, జ్యోతిరాదిత్య సింధియా, జయంతీ నటరాజన్, అమరీందర్ సింగ్, జితిన్ ప్రసాద, హార్ధిక్ పటేల్, హిమంత బిస్వశర్మ, నారాయణ్ రాణె, రావ్ ఇందర్‌సిత్ సింగ్, లూజినో ఫెలీరో, గిరిధర్ గొమాంగో వంటి ప్రముఖులు పలు కారణాలతో రాజీనామా చేసి బీజేపీ సహా ఇతర పార్టీలలో చేరిపోయారు. ఏడీఆర్ నివేదిక ప్రకారం 2014 ఎన్నికల తర్వాత నుంచి 2021 వరకు కాంగ్రెస్ తరఫున ఎంపీ అభ్యర్థులుగా బరిలో నిలిచిన 222 మంది ఇతర పార్టీలకు ఫిరాయించారు. ఇదే కాలంలో 177 మంది ఎంపీలు, వివిధ రాష్ట్రాల ఎమ్మెల్యేలు సంస్థకు గుడ్‌బై చెప్పారు. 2016-20 కాలంలో ఇలా ఫిరాయించిన ఎమ్మెల్యేలలో 45శాతం మంది బీజేపీలోనే చేరడం గమనార్హం.
విశ్వాసం కోల్పోయి
పార్టీని వదిలివెళ్లిన చాలామంది సీనియర్ నేతలు రాహుల్ అసమర్థత, అశక్తతలను వేలెత్తి చూపారు. ఆయన వల్లే పార్టీ నిర్వీర్యమై పోతోందని ఆరోపించారు. పార్టీ తిరిగి నూతన జవసత్వాలు సంతరించుకోవాలంటే నెహ్రూ-గాంధీ కుటుంబం నుంచి కాకుండా బయటి వ్యక్తులకు అధ్యక్ష స్థానాన్ని అప్పగించాలని డిమాండ్ చేశారు. గత చరిత్రను పరిశీలిస్తే, వాళ్లు చేసిన విమర్శలలో వంద శాతం నిజముందని అర్థమవుతుంది. రాజకీయాలలోకి రాహుల్ ఇష్టపడి రాలేదు. వారసత్వంగా మాత్రమే వచ్చారు. తండ్రి రాజీవ్ మరణించినప్పటికీ ఆయన వయస్సు 21 యేళ్లు. అయినా ప్రత్యక్ష రాజకీయాలలోకి రావడానికి 13 యేళ్ల సుదీర్ఘ సమయం తీసుకున్నారు.
2004లో అమేథీ నుంచి గెలిచి 2007లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, 2013లో ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. 2014 ఎన్నికలలో ఘోర ఓటమి అనంతరం తప్పని పరిస్థితులలో ఆయన పార్టీకి సారథ్యం వహించాల్సి వచ్చింది. అయితే, ప్రధాన స్రవంతి రాజకీయాలకు అవసరమైన వ్యవహారశైలిని ఏ దశలోనూ రాహుల్ అలవర్చుకోలేదు. పాలిటిక్స్ ట్రిక్స్ పైనే నడుస్తాయని, గడుసుదనం, జాణతనం, అవకాశవాదం అక్కడ సమర్థతలుగా లెక్కించబడతాయని గుర్తించలేదు. అందుకే, సామాజికాంశాలలో తెలివైన, పరిపక్వత ఉన్న నేతలా కనిపించినా, పార్టీని నడిపించడంలో అమాయకత్వంతో కూడిన అసమర్థతను ప్రదర్శించి అభాసుపాలయ్యారు. 2019 ఓటమి తర్వాత యుద్ధరంగానికి వెన్ను చూపి ఘోర తప్పిదానికి పాల్పడ్డారు. దేశ ప్రజల విశ్వాసం కోల్పోయారు.
ఇంతకీ అధ్యక్షుడెవరో?
కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడెవరో ఇప్పటికీ తేలలేదు. ఆ బాధ్యతలను తాత్కాలికంగా అనారోగ్యంతో ఉన్న సోనియా మోస్తున్నారు. కొత్త అధ్యక్షుడెవరనే విషయంలో గత మూడేళ్లుగా పార్టీలో ఎడతెగని చర్చ జరుగుతూనే వుంది. ఈ క్రమంలోనే అసంతృప్తివాదుల వేదిక జీ-3 ఆవిర్భవించింది. తాను అధ్యక్షుడిగా ఉండనని స్వయంగా రాహుల్ పదే పదే స్పష్టం చేయడం, గాంధీ కుటుంబ వీరవిధేయులు ఆయనే ఉండాలని బతిమిలాడడం చర్వితచరణంగా జరుగుతూనే ఉంది. గత మేలో నిర్వహించిన ఉదయ్‌పూర్ చింతన్ శిబిర్‌లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదనలపై చర్చ జరిగింది.
నాయకత్వ సంక్షోభాన్ని వెంటనే పరిష్కరించుకోవాలన్న మొదటి సలహా మినహా పీకే ప్రతిపాదనలన్నింటినీ శిబిర్ ఆమోదించింది. ఆ సమావేశ నిర్ణయాలలో భాగంగానే భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. మిగతా నిర్ణయాలన్నీ అమలు కావాల్సివుంది. వచ్చే అక్టోబర్ 17న అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందని ఈమధ్యే సీడబ్ల్యూసీ ప్రకటించింది. అప్పటికి రాహుల్ భారత్ జోడో యాత్రలోనే నిమగ్నమై ఉంటారు. మరోసారి ఆయనకే పగ్గాలు అప్పగిస్తారా? లేక పార్లమెంటరీ పార్టీ నేతగా ప్రకటించి గాంధీ కుటుంబేతర వ్యక్తిని అధ్యక్షుడిని చేస్తారా? అన్న విషయం ఇంకా స్పష్టం కాలేదు.
కొన ఊపిరితో
137 యేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉంది. అంతర్గత కుమ్ములాటలు, క్రమశిక్షణలేమి మునుపెన్నడూ లేని స్థాయికి చేరింది. అధికారంలో ఉన్న, లేని రాష్ట్రాలలో సీనియర్, జూనియర్ నేతలు 'ఎవరికి వారే యమునా తీరే' అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. హైకమాండ్ అంటే వారిలో భయమో, భక్తో బొత్తిగా లేవు.
ఎండ్రికాయల కొట్లాటలకు ఫేమస్ అయిన తెలంగాణ పీసీసీ లాగే మిగతా రాష్ట్రాల యూనిట్లూ ప్రజలలో అభాసుపాలవుతున్నాయి. రేవంత్‌లాగే ఏ పీసీసీ అధ్యక్షుడికీ రాష్ట్ర శాఖపై కమాండ్ లేదు. గ్రౌండ్ లెవెల్ కాంగ్రెస్ శ్రేణులు నిరాశ, నిస్పృహలలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ కారణాల మూలంగానే ఫిరాయింపులతో మధ్యప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, గోవా, కర్ణాటక, మణిపూర్, పుదుచ్చేరిలో కాంగ్రెస్ తన ప్రభుత్వాలను కోల్పోయింది.
ఇంటిని చక్కదిద్దుకుంటే
ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో రాహుల్ మొదట తన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుని ఆ తర్వాత 'భారత్ జోడో' యాత్ర చేపట్టి వుంటే బాగుండేది. తానే అధ్యక్షుడిగా ఉండడమో లేదంటే మరొక సమర్థ నేతకు ఆ బాధ్యతలు అప్పగించి, పార్లమెంటరీ పార్టీ నేతగా, పార్టీ కమాండర్-ఇన్ చీఫ్‌గా వ్యవహరిస్తూ ఎన్నికల కురుక్షేత్రంలో శ్రేణులను ముందుకు ఉరికించాల్సి వుండింది. కింది నుంచి పైవరకూ పార్టీని ప్రక్షాళన చేయాల్సి వుండింది. ఆ తర్వాత జోడో యాత్రను చేసివుంటే కన్యాకుమారి నుంచి జమ్మూ వరకు ప్రజలతో మమేకం అయిన ఫలితాలు 2024 ఎన్నికలలో పార్టీకి ఎంతగానో ఉపయోగపడేవి.
స్థానిక నేతలు ఎక్కడికక్కడ సమైక్య స్ఫూర్తిని చూపి ప్రజలను పెద్దయెత్తున సమీకరించి వుండేవారు. పాదయాత్రలో భాగంగా నిర్వహించే ప్రతి చిన్నా పెద్దా సభ సక్సెస్ అయి కార్యకర్తలలో ఉత్తేజాన్ని నింపేది. జాతీయస్థాయిలో ఎదురులేకుండా దూకుడుగా వ్యవహరిస్తున్న బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశం ఉండేది. అలా కాకుండా సంస్థాగత సమస్యలను పక్కకు పెట్టి, ముందు ప్రజల్లోకి వెళదామని కాంగ్రెస్ అగ్రనాయకత్వం భారత్ జోడో యాత్ర చేపట్టింది. ఈ వ్యూహం ఫలిస్తుందా? లేక బెడిసి కొడుతుందా? చూడాలి.
డి. మార్కండేయ