- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సామాజికం:పంజాబీల మనసు దోచిన 'జుగ్ను'
సంచలనాత్మక తీర్పుతో పంజాబీలు అసెంబ్లీ ఎన్నికలలో 'చీపురు'కే పట్టం కట్టారు. క్రేజీ కేజ్రీవాల్ నేతృత్వంలో ఓట్లను ఆమ్ ఆద్మీ పార్టీ వైపునకు ఊడ్చేశారు. కాంగ్రెస్ 'హస్త'వ్యస్తం అయ్యింది. శిరోమణి అకాలీదళం చిరునామా గల్లంతైంది. కమలం వాడిపోయింది. ఢిల్లీ తరహా పాలనకే పంజాబీలు ఫిదా అయ్యారు. కమెడియన్ అయిన మిస్టర్ క్లీన్ భగవంత్ మాన్ సీఎం అభ్యర్థిగా విజయబావుటా ఎగురవేశారు. 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో 92 స్థానాలను గెలిచిన 'ఆప్' ఐదేళ్ల పాలనకు అఖండ ప్రజామోదం లభించింది.
నాణ్యమైన ప్రభుత్వ విద్య, డ్రగ్స్ మాఫియా కట్టడి, మహిళా సంక్షేమం, ప్రజావైద్య వసతులు, ఉచిత విద్యుత్తు, గురుగ్రంథ్ సాహిబ్‌ను అవమానపరిచిన వారిని శిక్షించడం, ఉద్యోగ ఉపాధి కల్పన, రైతు ఆత్మహత్యలను అరికట్టడం, అవినీతిరహిత పాలన లాంటి హామీలను మెచ్చిన పంజాబీలు 'ఆప్'కే పట్టం కట్టారు. ఈ అపూర్వ విజయంతో ముఖ్యమంత్రిగా 48 ఏండ్ల భగవంత్‌మాన్ బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు.
హాస్య నట జీవితం
17 అక్టోబర్ 1973న సిక్కు కుటుంబానికి చెందిన 'హర్‌పాల్ కౌల్-మొహిందర్ సింగ్' దంపతులకు సంగ్రూర్ జిల్లా సటోజ్ గ్రామంలో భగవంత్ మాన్ జన్మించారు. 'షహీద్ ఉద్దమ్ సింగ్ ప్రభుత్వ కళాశాల'లో డిగ్రీ పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచే అంతర్ కళాశాల పోటీలలో పాల్గొని హాస్య నటుడిగా గుర్తింపు పొందుతూ బంగారు పతకాలు సాధించారు. రాజకీయ, వ్యాపార, క్రీడా రంగాలకు చెందిన అంశాలను తీసుకొని కామెడీ రచనల పంటను పండించి ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు. 'జగ్తార్ జగ్గీ' హాస్య అల్బమ్, టీవీలో 'జుగ్నూ కెహందా హై' లాంటి పలు కార్యక్రమంతో దశాబ్దకాలం పాటుగా ప్రేక్షకులను అలరించారు. రాణా రణవీర్‌తో జత కట్టి 'జుగ్నూ మస్త్ మస్త్'తో టెలీ సీరియల్ నిర్మించారు.
కెనడా, ఇంగ్లాండ్‌లో పర్యటించి 'నో లైఫ్ విత్ వైఫ్' కామెడీ షోతో ఖ్యాతిగాంచారు. 2008లో స్టార్ ప్లస్ నిర్వహించిన 'ది గ్రేట్ లాఫ్టర్ ఛాలెంజ్' ద్వారా భగవంత్ మాన్ అఖిల భారత ప్రేక్షకులకు దగ్గరైనారు. నేషనల్ ఆవార్డు పొందిన 'మై మా పంజాబ్ దీ' లాంటి సినిమాలలో నటించి మెప్పించారు. 'జుగ్నూ హాజిర్ హై' షోలో నటించిన మాన్ మంచి నటుడిగా సుస్థిర స్థానం పొందారు. కామెడీ రచయితగా, వాలీబాల్ క్రీడాకారుడిగా మంచి గుర్తింపును పొందిన భగవంత్ మాన్ ప్రముఖ 'టి-సీరీస్' సహకారంతో 2013-1992 మధ్య 24 హాస్య ఆల్బమ్‌లు విడుదల చేశారు. దీనితో పాటుగా 4 మ్యూజిక్ ఆల్బమ్‌ల విడుదల, 13 సినిమాలలో నటన, 15 వీడియో ఆల్బమ్‌ల విడుదల లాంటివి చేశారు.
రాజకీయ జీవితం
2011లో భగవంత్ మాన్ 'పీపుల్స్ పార్టీ ఆఫ్ పంజాబ్'లో చేరి తన రాజకీయ జీవితం ప్రారంభించారు. 2012లో లెహ్రా అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో కేజ్రీవాల్ స్థాపించిన 'ఆమ్ ఆద్మీ పార్టీ'లో చేరి సంగ్రూర్ లోక్ సభ సభ్యుడిగా పోటీ చేశారు. నాటి కేంద్ర మంత్రి 'సుఖదేవ్ సింగ్ దిన్డ్‌సా'ను రెండు లక్షలకు పైగా మెజారిటీతో ఓడించారు. 2017లో జలాలాబాద్ అసెంబ్లీ సీటుకు పోటీ పడి ఓడిపోయారు. అల్కాహాల్‌కు బానిసగా మారి పలు విమర్శలు ఎదుర్కొన్న భగవంత్ మాన్ 2019లో మద్యం ముట్టనని ప్రమాణం చేశారు.
16వ లోకసభలో 2014-19 వరకు ఎంపీగా సేవలు అందించిన భగవంత్ మాన్ 2019లో కూడా సంగ్రూర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2022 అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా 'ధూరి' స్థానం నుంచి పోటీ చేసి 58,206 ఓట్ల మెజారిటీతో గెలవడమే కాకుండా ఆప్‌కు 92/117 సీట్ల అఖండ విజయం కట్టబెట్టారు. ముఖ్యమంత్రిగా షహీద్ భగత్ సింగ్ స్వగ్రామం 'కత్‌కర్ కలన్'లో పదవీ ప్రమాణం చేయనున్నారు. ఆమ్ ఆద్మీ పాలనలో డా. బీఆర్ అంబేడ్కర్, షహీద్ భగత్‌సింగ్ ఫొటోలు కార్యాలయాలలో తప్పనిసరిగా అలంకరించాలని ఆదేశించారు.
సమాజ సేవకుడిగా
నిస్వార్థ ప్రజాసేవకుడిగా 'లోక్ లెహర్ ఫౌండేషన్' స్వచ్ఛంధ సంస్థను ప్రారంభించిన భగవంత్ మాన్ నీటి కాలుష్యంతో అంగవైకల్యం పొందిన పిల్లలకు అమూల్య సేవలు అందిస్తున్నారు. రాజకీయవేత్త, సామాజిక సేవకుడు, హాస్య నటుడు, సింగర్, సినీ నటుడు అయిన భగవంత్ మాన్‌ను పంజాబీలు 'జుగ్నూ', 'కామెడీ కింగ్' లాంటి బిరుదులతో సన్మానించారు.
పంజాబ్ ముఖ్యమంత్రిగా ఎన్నికల వాగ్దానాలకు కార్యరూపం ఇస్తూనే అంతర్‌రాష్ట్ర వివాదాలు, ప్రజాభద్రత, ప్రవాసభారతీయులను తమ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములను చేయడం లాంటి పలు సవాళ్లను అంకితభావంతో అధిగమిస్తూ 'ఆమ్ ఆద్మీ' మదిలో సుస్థిర స్థానం సంపాదించుకోవాలని, దేశానికే ఆదర్శవంతమైన సీఎంగా సుపరిపాలనను సుసాధ్యం చేయాలని కోరుకుందాం, మనసారా ఆశీర్వదిద్దాం.
( పంజాబ్ ముఖ్యమంత్రిగా నేడు భగవంత్ మాన్ ప్రమాణం)
డా. బుర్ర మధుసూదన్ రెడ్డి
99497 00037