తెలంగాణ సినిమాను ప్రోత్సహించండి!

by Ravi |   ( Updated:2024-07-13 00:45:47.0  )
తెలంగాణ సినిమాను ప్రోత్సహించండి!
X

గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి,

తెలంగాణా ఏర్పడిన గత పదేళ్లుగా అత్యంత నిరాదరణకు నిర్లక్ష్యానికి గురైన సాంస్కృతిక రంగం గురించి, సృజనాత్మకమైన రంగం గురించి కొన్ని సూచనలతో కూడిన విజ్ఞాపన ఇది. సహృదయంతో గమనిస్తారని, ప్రోత్సాహకరమైన నిర్ణయాలను తీసుకుంటారని ఆశిస్తాను. సాంస్కృతిక రంగంలో ముఖ్యంగా అత్యంత ప్రభావవంతం, జనాకర్షక రంగం అయిన సినిమా గురించి ఈ విజ్ఞాపన.

సినిమా సర్వకళా సమ్మిళితమనీ, అది సమాజానికి అద్దం పడుతుందనే భావన దాదాపు అంతరించిపోయిన కాలమిది. సినిమా, వ్యాపారమా? పరిశ్రమా లేక రెంటి సమన్వయ రూపమా అన్నది ఇవాళ వెయ్యి డాలర్ల ప్రశ్న. అందుకే సినిమాను వ్యాపారం, పరిశ్రమ రెండూ కలగలిసిన హైబ్రిడ్ రూపమనే అనవచ్చునేమో.. అయితే కోట్లు పెట్టు.. కొల్లగొట్టు.. తగ్గేదే లే.. ఇది ఇవాల్టి సినిమా నినాదం. ఒక రకంగా తెలుగు సినిమాకు అది బజ్ వర్డ్.

ఇవన్నీ అట్లా ఉంచితే ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ తర్వాత దృశ్య మాధ్యమం చేసిన సేవల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత అర్థవంతమైన సినిమా తెలంగాణ సినిమా లాంటి మాటలకు కూడా స్థానం లేని పరిస్థితిని చూసాం. హైదరాబాద్‌లో సినిమా రంగ ఎదుగుదలకు గాని లేదా యువతకు సినిమా రంగానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అందించే ప్రయత్నాలు గానీ జరగలేదు. ప్రభుత్వ పరంగా ఆ దిశలో తీవ్రమైన నిరాదరణ నిర్లక్ష్యం కనిపించింది. నిజానికి ఎంతోమంది యువతీయువకులు సినిమా రంగంలో కాలు మోపేందుకు ఎంతో కష్టపడుతున్న సమయమిది. షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ తమ ప్రతిభను బయట పెడుతున్నారు. కానీ గత ప్రభుత్వం చలనచిత్రాభివృద్ధి సంస్థకు చైర్మన్లను నియమించి చేతులు దులుపుకుంది. మరొక్క అడుగు కూడా వేయలేదు. ఈ సందర్భంగా మిమ్మల్ని చిన్న కోరికల్ని కోరుతున్నాను.

1985లో ఫిల్మ్ కౌన్సిల్ భావనను స్ఫూర్తిగా తీసుకుని బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం కోల్ కత్తా‌లో నందన్ సినిమా కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేసింది. అందులో పలు థియేటర్లు ఏర్పాటు చేసింది. కోల్‌కత్తా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్ని కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నది. తర్వాత 1998లో కేరళ రాష్ట్ర ప్రభుత్వం, 2009లో కర్ణాటక ప్రభుత్వం చలన చిత్ర అకాడెమీలను ఏర్పాటు చేశాయి. ఈ రెండు రాష్ట్రాలూ ప్రధాన స్రవంతి సినిమాకు సమాంతరంగా అర్థవంతమైన సినిమాకు ఇతోధికంగా ప్రోత్సాహమిస్తున్నాయి. కేరళ ఫిల్మ్ అకాడెమీ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహణతో పాటు రాష్ట్రంలో పలు చోట్ల వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ మలయాళీ సినిమా ఎదుగుదలకు మలయాళీ సినీ కళాకారుల ప్రతిభ మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నది. కర్ణాటక చలనచిత్ర అకాడెమీ కూడా కన్నడ సినిమాకూ అంతర్జాతీయ సినిమాకు వారధిగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. అదే రీతిలో తెలంగాణ ప్రభుత్వం కూడా తెలంగాణ ఫిల్మ్ అకాడెమీ ఏర్పాటు చేస్తే యువతకు శిక్షణ ఇచ్చే పని జరుగుతుంది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తెలంగాణ సినిమాకు ఎంతో ప్రోత్సాహంగా వుంటుంది.

సినిమా రంగం పట్ల అభిమానంతోనూ ఆసక్తితోనూ వున్న యువతీ యువకులకు గొప్ప అవకాశాలు వచ్చే అవకాశం మెరుగుపడుతుంది. ఇంకా అకాడెమీ నేతృత్వంలో ఇన్‌స్టిట్యూట్, ఆర్కైవ్స్ లాంటివి ఏర్పాటైతే తెలంగాణ టాలెంట్‌కు కొత్త ఊపు వస్తుంది. అలాగే గతంలో హైదరాబాద్‌లో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు, బాలల కోసం ప్రత్యేక చిత్రోత్సవాలు జరిగేవి. అవన్నీ తెలంగాణ ఏర్పడిన తర్వాత అదృశ్యమైపోయాయి. వాటిని తిరిగి నిర్వహించడం వలన మంచి సినిమా సంస్కృతి ఇతోధిక ప్రోత్సాహం లభించి మన వాళ్ల దృష్టికోణం విస్తారమవుతుంది. అలాగే గతంలో మంచి సినిమాలకు ఇస్తూ వచ్చిన నంది అవార్డులను గత ప్రభుత్వం రద్దు చేసింది. దీనిని పునరుద్ధరించండి. కళాకారుల ప్రతిభను ప్రోత్సహించండి. అలాగే ఇవ్వాళ కేంద్రం ఆధ్వర్యంలో పూనా, కోల్‌కత్తాలలో మాత్రమె ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లు పని చేస్తున్నాయి. హైదరాబాద్‌లో కూడా ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేస్తే కొత్త తరానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారు. ఇలాంటి కొన్ని అంశాల మీద దృష్టి పెట్టాలని సరైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

- వారాల ఆనంద్

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత,

94405 01281

Advertisement

Next Story

Most Viewed