తపాలా శాఖ సేవలు పెంచాలి

by Ravi |   ( Updated:2023-02-24 01:36:06.0  )
తపాలా శాఖ సేవలు పెంచాలి
X

తోకలేని పిట్ట తొంభై ఆమడలు తిరిగిందనే పొడుపు కథ వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది 'ఉత్తరం'. ఈ ఉత్తరాన్ని పురాతన కాలం నుండి ఆధునిక కాలం వరకు అనేక మార్పులు చేసుకుంటూ వివిధ రూపాల్లో ఉపయోగిస్తూనే ఉన్నారు. అయితే మానవ నాగరికత పరిణామంలో విప్లవాత్మక మార్పులు చెంది కొన్ని అదృశ్యం అయి కొత్తవి ఆవిష్కృతం కావడం సహజం. అలాంటి వాటిలో అదృశ్యమైంది ఉత్తరం.

ఉత్తరానికి నాటి తరానికి ఎంతో అవినాభావ సంబంధం ఉండేది. మానవ సంబంధాలను బలోపేతం చేయడానికి ఉత్తరం ఎంతో ఉపయోగపడేది. నాటి తరంలో తమ బంధువుల యోగక్షేమాలు తెలుసుకునేందుకు ఉత్తరం కోసం ఎదురుచూసిన క్షణాలు మాధురానుభూతిని పంచేవి. వచ్చిన ఉత్తరాన్ని ఇంట్లోనున్న పొడవాటి ఇనుప కమ్మీకి గుచ్చి భద్రపరిచేవారు. అవసరమైనప్పుడు వాటిని తిరిగి చదివేవారు. ఆ తర్వాత అత్యవసర పరిస్థితిలో టెలిగ్రామ్ ద్వారా మెసేజ్ పంపే వ్యవస్థ వచ్చింది. ఈ ఆధునిక కాలంలో సాంకేతికత పెరిగి ఈ మెయిల్స్, వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల వలన తపాలా సంస్థ సేవలు గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం ప్రభుత్వ సంస్థలు, బ్యాంకు, సివిల్ కోర్టులకు సంబంధించిన లేఖలు మాత్రమే వాడుకలో ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఈ తపాలా సంస్థను కాపాడుకునేందుకు వివిధ రూపాల్లో ప్రజలకు సేవలందించడం గర్వించదగిన విషయం.

తపాలా శాఖ చరిత్ర

దేశంలో మొదటి సారిగా తపాలా శాఖ ముంబై, చెన్నై, కలకత్తా నగరాల మధ్య ఉత్తరాలను చేరవేసే ప్రక్రియను చేపట్టింది. ఇందులో అప్పటి గవర్నర్ వారెన్ హేస్టింగ్స్ కృషి ఎంతో ఉంది. ఈ తరువాత లార్డ్ డల్హౌసీ గవర్నర్ గా ఉన్న సమయంలో దేశవ్యాప్త పోస్టల్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు చట్టం చేశాడు. ఈ చట్టం ద్వారా 1854లో తపాలా శాఖ ఏర్పడింది. 1914 నాటికి దేశంలో అన్ని నగరాలకు పోస్టల్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. 1947లో భారత ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చింది తపాలా శాఖ. 1972 ఆగస్టు 15 న పోస్టల్ ఇండెక్స్ నంబర్‌ను ప్రవేశపెట్టి దేశం మొత్తంలో 9 పిన్‌కోడ్ జోన్లుగా, 23 పోస్టల్ సర్కిల్స్‌గా విడగొట్టారు. ఈ పోస్టల్ ఇండెక్స్ నంబర్‌లో మెుదటి అంకె జోన్, రెండవది సబ్‌జోన్, మూడోది జిల్లా, చివరి మూడు అంకెలు డెలివరీ పోస్టాఫీసును సూచిస్తాయి. గణాంకాల ప్రకారం స్వతంత్ర సమయంలో 23 వేల పోస్టాఫీసుతపాలా శాఖ సేవలు పెంచాలిలు ఉంటే ఇప్పుడు 1,55,333 పోస్టాఫీసులు ఉన్నాయి. ఇలా ఎన్నో సేవలు అందించిన తపాలా శాఖ ప్రస్తుతం నూతన సాంకేతికత వినియోగించుకుంటూ కొత్త కొత్త సేవల ద్వారా ప్రజలకు సేవలందిస్తుంది.

ఇలా ఎన్నో సేవలు అందించిన అందిస్తున్న తపాలా శాఖకు మీసేవా కేంద్రాల్లో అందిస్తున్న సేవలను ప్రవేశపెట్టాలి. అలాగే అగ్రిమెంట్ పేపర్లు పోస్టాఫీసు ద్వారా అందించేలా చేయాలి. అలాగే ప్రైవేటు కొరియర్ సంస్థలు అందించినట్టు తపాలా శాఖ కొరియర్లను అందించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. అలాగే పోస్టల్ శాఖలో అందించే సేవల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు తగిన ప్రచారం చేయాలి. అప్పుడే పోస్టల్ డిపార్ట్‌మెంట్ పునర్వైభవం సంతరించుకునే అవకాశముంటుంది. దీనికై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటునందించాలి.

కోట దామోదర్

93914 80475

Also Read...

ఏజెన్సీలోని మాదిగలను ఆదుకోవాలి


Advertisement

Next Story